డబ్బుదేముంది - అచ్చంగా తెలుగు

డబ్బుదేముంది

Share This
 ‘డబ్బుదేముంది...?’
సామర్ల రమేష్ బాబు

   

మన్మోహనరావ్ మాష్టారు ఇంటిని నెమ్మది నెమ్మదిగా సమీపిస్తున్న వికాస్ లో ఉద్వేగం క్రమక్రమంగా ఎక్కువవుతోంది. చాలా కాలం తర్వాత మాష్టార్ని కలవబోతున్నాడు. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న వికాస్ మన్మోహనరావుని యింటికెళ్లి కలవాలనుకోవడానికి కారణం......
                        ... వికాస్ రాసిన ..’ డబ్బుదేముంది..?’ అనే కధకి ప్రముఖ తెలుగు వెబ్ మ్యాగజైన్ నిర్వహించిన కధల పోటీలో పాతిక వేల ఫస్ట్ ప్రైజ్ రావడం… ఆ కధ మన్మోహనరావు మాష్టారు కధే..
ఎం.ఏ లో గోల్డ్ మెడలిస్ట్ అయిన మన్మోహనరావు లెక్చరర్ గా పోస్టింగ్ వచ్చినా వదిలేసుకుని తన లక్ష్యం కోసం హైస్కూలు టీచర్ గానే కంటిన్యూ అయ్యాడు. హైస్కూలు స్టేజిలో అయితే పిల్లల యాటిట్యూడ్ ని ఎటాక్ చేసి, వాళ్ళని ట్యూన్ చేసి, మంచి పౌరులుగా తీర్చి దిద్దడం తేలిక. అది ఈ ప్రపంచాన్ని, సమాజాన్ని అర్ధం చేసుకోవడం ఆరంభించే వయస్సు. స్వంతంగా ఆలోచించే..అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం ప్రారంభించే ప్రాయం.
అలాంటి మన్మోహనరావు మాష్టారంటే ఆ ఊళ్ళో అందరికీ ఎంతో యిష్టం. ఆయన్ని చాలామంది ‘మన’మోహన రావు మాష్టారు అని పిలుస్తారు.అలాంటి వ్యక్తి గురించి వికాస్ రాసిన కధకి బంపర్ ప్రైజ్ రావడంతో ఆ కధని ఆయనకి చూపించడం కోసం ప్రత్యేకంగా స్వంతూరొచ్చాడు.
మాష్టారు యింటి గేటుని సమీపిస్తుండగా లోపలి నుండి అరుపులు వినిపించచాయి. అవి ట్యూషన్ పిల్లలకి మన్మోహనరావు యిస్తున్న వార్నింగ్ లు.
కొటేషన్లు చదివి బాగు పడిన వాళ్ళకంటే...కొట్టే ట్యూషన్లో చదివి పైకొచ్చిన వాళ్ళే ఎక్కువ...
గేటు తీసుకుని వరండా దగ్గరకెళ్శాక , అక్కడి దృశ్యాన్ని చూసి నమ్మశక్యం కాక నిలబడిపోయాడు వికాస్.
వికాస్ కి అర్ధమైందేమంటే... మాష్టారు పిల్లలకి వార్నింగ్ యిస్తోంది , పిల్లల్ని పైకి తేవడం కోసం కాదు..పిల్లలు పైకం తేలేదని...ట్యూషన్ ఫీజు కట్టలేదని...
ఏ వయస్సు పిల్లల్ని భావిభారత పౌరులుగా తీర్చి దిద్దడం కోసం డబ్బుని, లెక్చరర్ ఉద్యోగాన్ని వదులు కున్నాడో...అదే డబ్బు కోసం, అదే వయస్సు పిల్లల్ని తిడుతున్నాడు..
అప్పట్లో ‘ డబ్బుదేముంది...’ అని వాదించిన వాడు.... ఇప్పుడు ‘డబ్బు...తే...ముందు..’ అని గద్ధిస్తున్నాడు.
వికాస్ ని చూసి గుర్తు పట్టిన మన్మోహనరావు, తిట్టడం ఆపేసి... పిల్లల్ని పంపించేసి ..వికాస్ ని లోపలికి ఆహ్వానించాడు.
“..ఇతను వికాస్ ..బెస్ట్ స్టూడెంట్...చాలా బాగా చదివేవాడు...”భార్యకి పరిచయం చేశాడు. వికాస్ కి ఆ షాక్ నుండి తేరుకోవడం కష్టంగా వుంది. ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదు.
మాష్టారు భార్య యిచ్చిన టీ త్రాగడం అయిపోయింది.తన కధ గురించి, దానికి వచ్చిన ప్రైజ్ గురించి చెప్పాల్సిన అవసరం, అవకాశం కనిపించక అక్కడినుండి బయలు దేరడానికి లేస్తుంటే ...అప్రయత్నంగా అతని నోటి నుండి ఒక ప్రశ్న బయటికొచ్చింది.
“...మాష్టారూ ‘మన’ మోహన రావుఅని అందరూ పిలిచుకునే మీరు కూడా.. ‘మనీ’ మోహన రావు లా మారి పోయారన్న మాట...?”
ఆ ప్రశ్నకి మాష్టారి ముఖంలో ఎన్నో రంగులు మారాయి… ఆయన భార్య అక్కడ ఉండలేక లోపలికెళ్ళి పోయింది. క్షణాలు నిమిషాలుగా మారకముందే మన్మోహనరావు నోరు నిప్పాడు.
“...అవును వికాస్..ఆదర్శాల అడుగున వున్న వాస్తవాలు నన్ను మార్చేశాయి..మానవ సంభంధాలన్నీ ఆర్ధిక సంభంధాలు కాదని నిరూపించాలనుకున్నాను...కానీ, ఆర్ధిక సంపాదన తోనే మానవ సంభంధాలను నిర్మించు కోవాలని జీనితం నేర్పింది.....
మనం సంపాదించుకుంటూ అందులో కొంత ఇంకొకరి ఎదుగుదల కోసం ఇవ్వాలే తప్ప... మన ఎదుగు దలని, సంపాదనని వదులుకుని ఇంకొకరిని ఉద్ధరించాలనుకోవఢం ఉత్త భ్రమ.... అలాంటి పొరపాటు నువ్వు చెయ్యొద్దు...” 
ఆయన మరిక మాట్లాడ లేక పోయాడు.
‘డబ్బుదేముంది ..?’..అనే కధ గురించి ....’డబ్బులేనిదే ఏముంది..?’…అనే అభిప్రాయానికొచ్చిన మాష్టారుకి చెప్పకుండానే అక్కడ్నుండి వచ్చేశాడు వర్ధమాన రచయిత..వికాస్...
***

No comments:

Post a Comment

Pages