ఏమండీ ఒక్కసారి కనిపించారూ? - అచ్చంగా తెలుగు

ఏమండీ ఒక్కసారి కనిపించారూ?

Share This
 ఏమండీ ఒక్కసారి కనిపించరూ?
 కృష్ణ దువ్వూరి  


కౌశల్య సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ….రేడియోలో సుప్రభాతం వస్తోంది. పిల్లాడు ఆడుతూ రేడియోని తన్నేసాడు. అంతే, స్టేషన్ ఆగిపోయి కరకర సౌండ్ రాసాగింది.
“ఒరేయ్! అమ్మమ్మకోసం రేడియో పెడితే దాన్నిఅలా తన్నచ్చా” అంటూ యసోద పిల్లాడిని  వాయించబోతుంటే జానకమ్మ అడ్డుకొని పొనీలేవే వాడిని ఆడుకోనీ! “నేను సరిచేసి పెట్టుకుంటాలే నీకు ఆఫీసుకి టైం అవుతున్నట్లు ఉంది తొందరగా వెళ్ళమ్మ” అంటూ జానకమ్మ పడిపోయిన రేడియోని ఒళ్ళోకి తీసుకొని తిరిగి సుప్రభాతం స్టేషన్ కోసం వెతుకుతుంటే మనవడు దగ్గరకు వచ్చి అమ్మమ్మ సారీ అంటూ బుంగమూతి పెట్టి నేను మళ్ళి పెత్తనా అంటూ తన ముద్దు ముద్దు మాటలతో వాడి బుల్లి వేళ్ళతో తిప్పుతుంటే జానకమ్మ ఆలోచనలు  జ్ఞాపకాల తెరలలోకి వెళ్ళిపోయాయి …
“ఏమోయ్ స్నానం చేసేసా నీకు తులసమ్మ దగ్గర పూజకోసం అన్ని రెడీ చేసా, మరి ఈలోపుల నేను పూజగదిలో దీపం పెట్టి నీకోసం వేచి ఉంటా తొందరగా రా” అంటూ రామయ్య ధవళం కట్టుకొని పూలతో పూజా గదిలోకి వెళ్ళాడు.  “అబ్బబ్బ మీ తొందర మీదే! ఇక్కడ నేను మీకోసం ఉప్మా చేసి మీకు ఆఫీసుకి బాక్స్ రెడీ చేస్తున్నా...ముందర మీరు దండంపెట్టుకొని వెళ్ళండి తరువాత తీరిగ్గా నేను దీపం పెట్టుకుంటాగా తులసమ్మ దగ్గర” అంటున్న మాటలకి రామయ్య పూజగదిలోంచి "అదేం కాదు మనం కలిసి పూజ చేసుకోవాలి! అసలే ఈ రోజు శనివారం కూడాను, అన్నట్టు ఆ రేడియో ఇలా తీసుకురా సుప్రభాతం వచ్చే సమయం” అంటుంటే ...”అబ్బబ్బ ఏదీ వినరు కదా లేచి తీసుకొవచ్చు కదా? అయినా కాని రేడియోలోనే వినాలా ఏమిటీ మీ మూడోవాడు మీకు అదేదో పాటల పెట్టి ఇచ్చాడు కదా అందులో అన్ని దేవుడి పాటలే సుప్రభాతం కూడా ఉంది” అంటున్న జానకితో “ఆ ఇచ్చాడులే వెధవ పెట్టి నాకు నేను కొనుక్కొన్న నా రేడియోలోనే వింటాను అంటూ రేడియోతో సహా పూజగదిలోకి వెళ్ళి సుప్రభాతం వచ్చే స్టేషన్ పెట్టుకొని దీపం వెలిగించాడు రామయ్య. 
జానకి రామయ్యలది చక్కని కుటుంబం 3 అబ్బాయులు 1 అమ్మాయి.  అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరికి వారు స్థిరపడిపోయారు. అయితే, ఎంత బ్రతిమాలినా పిల్లల దగ్గరకు వెళ్ళక ఒంటరిగా రామయ్య సొంతూరులో ఉండిపోయారు.  రామయ్య పిల్లల డబ్బులు పంపుతామన్న ఒప్పుకోక ఆ ఊరిలో ఒక గ్రంధాలయం పెట్టి రోజు అక్కడకు వచ్చే పిల్లలకు మంచి చెడు చెబుతూ ఒక ఆఫీసు రూంలా చేసుకొని ఆ ఊరి వాళ్ళకు ఒక పెద్ద దిక్కుగా ఉంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు.
“వచ్చావా నాకు టైం అవుతోంది కేకలు పెడుతున్న రామయ్యతో "ఏమిటండీ? చిన్నపిల్లాడిలా! వస్తున్న అని అన్నానుగా!  నన్ను వదలరు, నేను పిల్లల దగ్గరకు వెళతానంటే పంపించరు" అంటూ తులసికోట పూజ ముగించి పూజగదిలోకి అడుగెట్టింది..
జానకి “ఎందుకే పిల్లలు...వాళ్ళ బ్రతుకేదో వారు బ్రతకనీ ఎలాగూ వెళ్ళే రోజొస్తుంది” అంటున్న రామయ్య నోటిని తన పైటతో అడ్డుపెట్టి "ఏమిటా పాడు మాటలు" అందుకే నేను మీతో ఇలా కూర్చొని పూజ చెయ్యను..
కోప్పడకే! నువ్వు ఇలా తడిచెంగుతో వస్తే నాకు భలే ఇష్టం అన్న రామయ్యతో "మీకు ఈ రాముడి పేరు ఎవరు పెట్టారో అన్ని క్రిష్ణుడు పోలికలు ఇకచాలు ఇటివ్వండి ఆ చెంగును” అంటున్న జానకి కేసి చూసి పక పక నవ్వి “అవును నీకు కూడా సత్యభామ అని పేరు పెడితే సరిపోయేది” అంటూ చెంగు వదిలి పూజ అందుకున్నాడు.
ఏమండీ ...ఊ చెప్పు
ఇలా ఒక్క క్షణం వదిలి ఉండలేరే మరి నాకు నా పిల్లల దగ్గర అలాగే ఉండాలి అని అనిపించదా?
“జానకి నిన్ను కట్టడి చేయాలని కాదు ...ఎందుకో 50 సంవత్సరాల మన వివాహ జీవితం తరవాత కూడా నువ్వు క్షణం కనిపించకపోతే నాకు ఈ ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్టుంటుంది...నీ సాన్నిహిత్యంలో ఒక కవిలా సాహిత్యపు పరిమళాలు ఏరుకుంటూ నన్ను నేను మరచిపోతాను ...నీ కనుసన్నలలో నా ఉనికినే మరచిపోతాను ..నీ అడుగుజాడలు నీ పాద పట్టీల మువ్వల సవ్వడులు వినిపించక పోతే ఈ ప్రపంచంలో నేను మాయమయాననిపిస్తుంది”
“అయితే ఒక పని చేయండి నా పట్టీలు ఇస్తా వాటిని దండలా చేసుకొని మెళ్ళో వేసుకొని నేను మీతో ఉన్నాననుకోండి” నవ్వుతూ అంటున్న జానకి మాటలకి ఉడుకుమోత్తనంతో "సరే వెళ్ళు రేెపే నిన్ను విమానం ఎక్కిస్త "
“ అంత భాధ ఎందుకు? మీరూ నాతోపాటే రావచ్చుగా” అడుగుతున్న జానకి మాటలకి అడ్దువస్తూ "పంపిస్తానన్నానుగా" అప్పటికే రామయ్య కళ్ళలో ఎగసివస్తున్న నీళ్ళు….జానకి అది చూసి చలించిపోయి “వెళ్ళనండీ  ఏదో సరదాగా అన్నా…..నాకు, రోజూ మీకు వంటచేసి మీతో పూజ చేసుకుంటూ మీ కిష్టమైన తడికోకతోనే సుమా!” నవ్వుతూ అంటుంటే రామయ్య  కళ్ళలో గిర్రున తిరుగున్న కన్నీళ్ళు కాస్తా రాలి జానకి చేతులపై పడ్డాయి ..”ఎందుకూ నీళ్ళు ఇప్పుడు నా కోక ఇంకా ఆరలేదు బాబు తడిగానే ఉంది” అన్న మాటలకి ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు.
ఆ మర్నాడు నిజంగానే జానకి కోసం కొడుకుతో మాటాడి విమానం టికెట్ కొని ఇంటికొచ్చాడు.  “జానకి నీకో శుభవార్త ఏమిటో  చెప్పుకో!”
ఆ ఏముంది? నా పూజకోసం ఏ వత్తులో, కర్పూరమో తెచ్చి ఉంటారు..
కాదు!
మొక్కలకు  మందు తెమ్మన్నా కదా అది అయ్యిఉంటుంది.. 
కాదు!
అబ్బబ్బ చెప్పండి అని నిర్లిప్తంగా ఉన్న జానకి కళ్ళెదుట విమానం టికెట్ పెట్టి “జానకి నీ కోరిక నెరవేరిందిలే హిహిహి “ అంటూ విమానం ఎలా ఎక్కాలి కొడుకు వచ్చేదాక ఎలా వేచి ఉండాలి ఎమేమో మాటాడుతున్న రామయ్యని ఆశ్చర్యంతో, కొడుకు మనవడిని కలుసుకుంటున్నానన్న ఆనందంతో మరికొంత విచిత్రంగా చూస్తూ ..
“రెండో టికెట్ ఏది?”
“నీకే తెచ్చా”
“అంటే మీ పట్టు వదలరా?”
“కాదు జానకి నేను ఈ ఇల్లు వదిలి ఉండలేను” …
“నన్ను కూడ వదిలి ఉండలేరుగా?” ప్రశ్నించింది జానకి
“నిజమే కాని నా బెట్టుతో నీ ఆనందాన్ని ఎందుకు వద్దనాలి?” హాయిగా వెళ్ళిరా ...నీ కోసం నేను వేచి ఉంటా… సమాధానమిచ్చాడు.
“నిజంగా అంటున్నారా?”
“అబద్దమెపుడైన చెప్పానా?” నవ్వుతూ ఆమె కళ్ళలోకి చూస్తూ
“మరి నన్ను వదిలి ఉండలేను అన్నది నిజమైతే ఇప్పుడు ఎలా ఒక్కదాన్ని పంపిస్తున్నారు?”
“పిచ్చి జానకి నిన్ను వదిలి ఉండలేనన్న మాట నిజమే కాని నీ ప్రతి కదలికను ముద్దాడిన, నీ అడుగుల ప్రతిద్వనిని వినిపించే ఈ నేల నాకుండగా నేనెలా ఒంటరి అవుతాను?
“మరి నా తడికోక ఇంక తగలదుగా మీ పూజవేళలో?”
ఊ “ఏడిపించమాక! నీ కోకలలో ఒకటి రోజూ తడిపి మడిబట్టగా పక్కనే పెట్టుకుంటా” అంటున్న రామయ్య మాటలకి జానకి పడి పడి నవ్వుతూ " అయితే అంతా సిద్దమయ్యే చేసారన్నమాట!"
“అవును పెద్దాడికి అన్నీ వివరంగా చెప్పా జానకి, ఎమీ ఆలోచించక హాయిగా వెళ్ళిరా!
రాత్రి అంతా నిద్రపట్టలేదు ఇద్దరికి ఆ మరుసటి ఉదయమే ప్రయాణం!
జానకమ్మ బట్టలన్ని సర్దుకొని రెడీగా ఉంది ..బయట కారుకోసం రామయ్య నిలబడి ఎదురుచూస్తున్న సమయంలో ఉన్నట్టుండి రామయ్యకి గుండెనొప్పి వచ్చి “జానకీ అని అరుస్తూ గేటుదగ్గరే కుప్పకూలిపోయాడు.
ఈ హటాత్ పరిణామానికి బిత్తరపోయిన జానకి పక్కింటి వారి సహాయంతో 108 పిలిచి ఆసుపత్రికి తీసుకెల్లింది. కొడుకు కోడలు మనమడితో సహా అందరూ వచ్చారు.
డాక్టర్ " ఏమీ ప్రమాదం లేదు కదా" పెద్ద కొడుకు ఆరా.. “ఒక్కసారి మీ అమ్మగారిని లోపలికి పంపండి” అన్నాడు డాక్టర్.
గుండె దడదడ లాడుతుండగా లోపలికి వెల్లింది జానకి  "ఏమండీ" ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చింది ….
"అన్నిటికి సిద్దమయే నిన్ను పంపుతున్నా అన్న మాటలకి ఇదే అర్థమా?
“నేను ఒంటరి అవుతానని కాదు జానకి, నిన్ను ఒంటరిగా పంపుతున్న అవేదన ఎక్కువై గుండెపోటు వచ్చింది” ఇప్పుడు ప్రశాంతంగా ఉంది...నా పెద్దకొడుకు తోడుగా హాయిగా వెళ్ళు!
ఏమండీ "వెళ్ళు కాదు, వెళ్ళిరా అనాలి!" అయినా ఇంక ఎక్కడికీ వెళ్ళేది లేదు ..అని కళ్ళ నీళ్ళు తుడుచుకొని కళ్ళు తిప్పి చూసే సరికి జానకి చేతిలో నున్న రామయ్య చెయ్యి బిగుసుకుపోయింది …
ఎవరో తన చెయ్యి పట్టుకుని లాగినట్టు అనిపించడంతో చూస్తే "అమ్మమ్మ ఆడుకుందాం రా!" అంటున్న మనవడి మాటలతో ఈ లోకం లోకి వచ్చి..
"ఏమండీ ఒక్కసారి కనిపించరా ఆఖరిసారిగా మీతో మీకిస్టమైన నా తడికోకతో పూజ చేసుకోవాలని ఉంది?" అంటున్న అమ్మమ్మ మాటలకి అర్థం తెలియక మనవడు "పూజ అయ్యాకా ఆడతావా ఇప్పుడు కాదా?" అని అలిగిన మనవడిని దగ్గరికి తీసుకొని, ఆడతానురా ...పాటలాగ నా జీవితం సాగిన మీ తాత దగ్గిరికి వెళ్ళేదాకా ఈ జీవితమనే ఆట ఆడుతూనే ఉంటారా! అన్న అమ్మమ్మ మాటలు మళ్ళీ అర్థం కాలేదు ఆ చిన్ని హృదయానికి… 
మళ్ళీ శనివారం వచ్చింది...కౌశల్య సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ….రేడియోలో సుప్రభాతం వస్తోంది...జానకమ్మ ప్రతీ ప్రభాతంలో రామయ్య మాటలే మంత్రాలుగా మానసపూజలో రామయ్యకిష్టమైన సుప్రభాతం వింటూ శేషజీవితం సాగిస్తోంది.
జీవితంలో తోడు దూరమైనపుడు దుఃఖం తెరలు తెరలుగా, బాధ క్షోభతో భయపెడుతూ ఉంటుంది.  నిజమే! అది సత్యం కూడా!! అయితే గుండె ధైర్యంతో జీవన యాత్ర మీతో ఉన్నవారికి సంతోషాన్ని ఇస్తుంది... బాధను పంచుకుందుకు ఎప్పుడూ మేం ఉన్నాము అనే ధైర్యాన్ని  మనతో ఉన్నవారు ఇవ్వాలి అప్పుడే ఆటుపోటులను తట్టుకొని జీవితం సాగిపోతుంది.
అవును జీవితం ఒక ఆట!
అందుకే అది కావాలి ఒక పాట,
వృధా చేసుకోకు క్షణాలు ఏ పూట!
***

No comments:

Post a Comment

Pages