నాకు నచ్చిన నా కథ--నోము పండింది!--(ఈ కధలో ముఖ్యపాత్రధారిని నేనే) - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కథ--నోము పండింది!--(ఈ కధలో ముఖ్యపాత్రధారిని నేనే)

Share This
నాకు నచ్చిన నా కథ--నోము పండింది!--(ఈ కధలో ముఖ్యపాత్రధారిని నేనే)
శారదాప్రసాద్ 


వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ,అందరికీ ఖాళీగా కనిపించటం పెద్ద బాధే !ఆఖరికి దాంపత్య సమస్యలు కూడా నన్నే అడుగుతున్నారు!మా పక్క ఫ్లాట్ లోకి ఒక కొత్తగా పెళ్ళైన జంట చేరారు!ఇద్దరూ ముచ్చటగా వున్నారు!నన్ను చాలా గౌరవంగా చూసుకునే వారు!  పక్కింటి పిన్నిగారికి క్షణం తీరికుండదు.ఎప్పుడూ ఇంటినిండా ముత్తైదువులు ముచ్చటగా కనబడుతుంటారు. పిన్నిగారంటే ,ఆమె నాకన్నా పెద్దదని అనుకుంటారేమో! అదేమీ కాదు. మరైతే పిన్నిగారని ఎందుకని అంటున్నారని కదూ  మీ సందేహం!ఏమి లేదు ఆమె 30 లో 60 వయసున్నామెలాగా కనిపిస్తుంది. ఆమె వయసు సరిగ్గా మా అమ్మాయి వయసే!అయితే లక్షణాలను బట్టి  ఆమెను పిన్నిగారని ముద్దుగా పిలుస్తుంటాను. ఆ అమ్మడు నన్ను అబ్బాయి అని పిలుస్తుంది. కారణం,అమ్మడికి సంతానం లేకపోవటమే! అమ్మడి భర్త ఒక బ్యాంకు లో ఆఫీసర్. పొద్దున్నే గుక్కెడు కాఫీ నీళ్ళను గొంతులోపోసుకొని హడావుడిగా బ్యాంకుకు వెళతాడు. ఉదయం తిండీ, తిప్పలుండవు. అంటే, అమ్మడు భర్త పట్ల అవిధేయతగా ఉంటుందని మీరనుకుంటే ,పప్పులో కాలేసినట్లే! అమ్మడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తుంది. లేవగానే భర్త పాదాలకు నమస్కరించి, మాంగల్యాన్ని కళ్ళకద్దుకొని ఇంక నిత్యకృత్యంలో దిగుతుంది. అప్పుడెప్పుడో 'సతీ సుమతి' సినిమా చూసిందట! పతివ్రత అంటే అలా ఉండాలని ఆమె మనసులో నాటుకుపోయింది.
నిద్రలేవగానే, కాలకృత్యాలను తీర్చుకొని చన్నీళ్ళతో అభ్యంగన స్నానం చేసి ,కాళ్ళనిండా పసుపు పూసుకొని, ముఖాన రూపాయి బిళ్ళంత (ఇప్పటి రూపాయి బిళ్ళ కాదు!) కుంకుమ బొట్టును పెట్టుకొని, ఇక సర్వ దేవతలను, దేవుళ్ళను సుప్రభాతాలతో మేల్కొల్పుతుంది. భర్తను నిద్రపోనివ్వదు, దేవుళ్ళను నిద్రపోనివ్వదు. పూజాపునస్కారాలయ్యేటప్పటికి ఉదయం 9 గంటలవుతుంది. ఆ తరువాత స్టవ్ ని కడిగి వంట చేయటానికి ఉపక్రమిస్తుంది. అతనికి బ్యాంకుకు టైం కావటంచేత, దేవుడికి నైవేద్యం పెట్టిన రెండు అరటిపండ్లను  తింటూనే బ్యాంకుకు వెళ్ళుతాడు. ఇక అమ్మడికి పని ఏముందని అనుకుంటారేమో! అసలు పని అంతా ఇప్పటినుండే మొదలవుతుంది. పనిమనిషి వచ్చి ఇల్లు తుడిచి, అంట్లుతోమి, బట్టలుతికి వెళ్ళిపోయిన తరువాత, అమ్మడు మళ్ళీ స్నానంచేసి పూజకుపక్రమిస్తుంది. రోజుకో నైవేద్యం రుచికరంగా తయారుచేస్తుంది. పూజ అంతా అయిపోయింతర్వాత, కొద్దిగా ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని భక్తిగా తింటుంది. అప్పుడు నన్ను అబ్బాయీ అని ప్రేమగా పిలుస్తుంది. పిన్ని పిలిచిన వెంటనే రివ్వున వాలుతాను నేను. ప్లేట్ నిండా ప్రసాదాన్ని పెడుతుంది. మొత్తం తిని, ఒక త్రేణుపు తేల్పి, ఒక చెంబెడు నీళ్ళు తాగి హాయిగా కూర్చుంటాను. అన్నట్లు ఈమధ్య బాగా వళ్ళు కూడా చేసాను. అమ్మడు పగలంతా ఏమీ తినదు. భర్త తినకుండా తినకూడదట! సొమ్మసిల్లి అట్లే పడుకుంటుంది.
అతనికి అసలే బ్యాంక్ లో ఉద్యోగం. ఎన్నింటికి వస్తాడో అతనికే తెలియదు. వచ్చేటప్పటికి బాగా అలసిపోయుంటాడు. అమ్మడు వంటచేసి అతనికి పెట్టి, తను తినేటప్పటికి రాత్రి 12 అవుతుంది. బ్యాంకులో పని వలన అలసిపోయి అతను నిద్రపోతాడు, పూజలు చేసి అలసిపోవటం వలన అమ్మడు నిద్రపోతుంది. ఇదీ ఆ భార్యాభర్తల దినచర్య. వారికి పెళ్లి అయి ఏడు సంవత్సరాలు అయింది. కడుపున  ఒక నలుసు కూడా పడలేదని అమ్మడి అత్తగారు తీర్థయాత్రలకు వెళ్ళారు. ఆదివారం సెలవు కదా, ఏదైనా సినిమాకు పోదామని అతనంటే, అమ్మడు అతనితో "పరాయి స్త్రీలను అర్ధ నగ్నంగా చూడటానికి సిగ్గెక్కడలేదండి?" అని బుగ్గలు నొక్కుకుంటూ మొగుడికి నాలుగు వడ్డిస్తుంది. భార్యాభర్తలిద్దరూ కాసేపు గొడవపడుతారు. అమ్మడిని మార్చటం కన్నా తనే మారటం మేలని అతను మౌనంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఒక రోజు అమ్మడు నన్ను హడావుడిగా పిలిచి, "అబ్బాయీ! ఆయన పూర్తిగా మారిపోయాడు, మునుపటిలాగా లేడు.
భార్యాభార్తలన్న తరువాత  గొడవలు పడకపోతే అది సంసారం ఎలా అవుతుంది? ఇదివరకు గొడవపడేవాడు, ఇప్పుడు గంగిరెద్దులాగా ప్రతిదానికి తలూపుతున్నాడు! ఈ వరుస నాకేమీ నచ్చలేదు. అతనిలో మార్పు రావటానికి ఏదైనా 'నోము' ఉందేమో చెప్పు!" అంది. అమ్మడికి నోములపిచ్చి. ఎవరే నోము చెబితే దానిని పడుతుంది.  (నోము పడుతుంది అనే మాట వింటుంటే పగ పడుతుంది అన్నట్లుగా నాకనిపిస్తుంది.చక్కగా నోము నోచుకుంది అనవచ్చుగా!)ఇప్పటికే చాలా నోములను పట్టిందట!పుట్టింటి వాళ్ళు మొన్నీమధ్యనే 36 ఫలాల నోమును పట్టించారు. ముత్తైదువులకు పనసపండ్లు ఇచ్చింది. ఒక లారీ నిండా పనసపండ్లు తెప్పించారు. పేరంటానికి వచ్చిన ముత్తైదువలు ఆ పనస పండ్లను మోసుకుపోలేక చాలా ఇబ్బంది పడ్డారు.ముత్తైదువులకు పనసపండ్లు ఇస్తే పనసపండులాంటి కొడుకు పుడతారని అమ్మడికి చెప్పారట! అమ్మడికి సంతానం లేదని కూడా దిగులు!దానికోసం ఏదైనా నోముపట్టాలని కూడా వాళ్ళ అమ్మగారితో సంప్రదించింది. అమ్మడు తల్లితండ్రులకు ఒక్కతే కూతురు.అమ్మా, నాన్నలకు పెళ్ళైన 10 ఏళ్ళకు అమ్మడు పుట్టింది.
అమ్మడు పుట్టటానికి కారణం,' సంతాన వేణుగోపాలస్వామి వ్రతం ' చేసుకోవటమే కారణమని అమ్మడి అమ్మగారి నమ్మకం.అమ్మడి చేత కూడా ఆ వ్రతాన్ని చేయించటానికి,అమ్మడి అమ్మగారు వచ్చింది.అమ్మడు నన్ను పిలిచి ఆ నోము నోచుకుంటే ఎలా ఉంటుందని సలహా అడిగింది . అప్పుడు నేను,"పిన్నీ!' సంతాన వేణుగోపాలస్వామి వ్రతం' చేసుకున్నంత మాత్రాన సంతానం కలగదు,భర్తతో సంసారం కూడా చెయ్యాలని" సిగ్గువిడిచి చెప్పాను. అమ్మడికి కొద్దిగా అర్ధం అయ్యింది,అతనికి పూర్తిగా అర్ధమయ్యింది!నేను చెప్పే మాటల మీద అతనికి ఉత్సాహం కలిగి,పక్కనే ఉన్న నన్ను గిల్లి అమ్మడికి నచ్చేటట్లు చెప్పమన్నట్లుగా చూస్తున్నాడు.ఆఖరికి అమ్మడు, "అయితే అబ్బాయి! ఇప్పుడు నన్నేమి చెయ్యమంటావు?" అని అమాయకంగా అడిగింది. పిన్ని చేతిలో నాలుగు విమానం టిక్కెట్లను (పోను రెండు, రాను రెండు) పెట్టి "హాయిగా ఈ వేసవిలో ఒక పదిహేను రోజులు కులూమనాలీ వెళ్లి రండి, వచ్చే ఏటికల్లా నాకు తమ్ముడు పుడతాడు" అని చెప్పాను. అమ్మడు సిగ్గుతో ముద్దులొలుకుతుంది. అమ్మడు ఏమనుకుందో ఏమో కులూ మనాలీ వెళ్ళటానికి నిశ్చయించుకుంది. "మరి వ్రతం సంగతి ఏమిటి?" అని అమ్మడి అమ్మగారడిగితే,--వచ్చే నెలలో నోచుకుంటానని చెప్పింది. నా పని అయిపోయింది గదా అని నేను వెళ్ళుతుంటే, అతను"అబ్బాయీ! నేనూ అందాక వస్తాను" అని నాతోటి బయటకు వచ్చి, సంతోషంతో నాతో కరచాలనం చేసి LFC లో వెళ్ళటానికి అప్లై చేసి తెచ్చుకున్న టిక్కెట్లను అంతకు ముందురోజు నాకు ఇచ్చి నా చేత ఈ నాటకాన్ని ఆడించాడు.నాటకం సుఖాంతం అయినందుకు నాకు నమస్కరించాడు.
అతను,అమ్మడు కులూమనాలీ వెళ్ళారు.వెళ్ళేటప్పుడు ఇద్దరూ నాకు నమస్కరించారు."సుపుత్ర ప్రాప్తి రస్తు!"అని మనసారా ఆ చిలకా గోరింకలను ఆశీర్వదించాను.  ఆ తర్వాత కొద్ది రోజులుకే అమ్మడు నీళ్ళోసుకుంది. మరికొన్ని రోజులకు పనసపండంటి బాబు పుట్టాడు.ఇదంతా 36 ఫలాల నోము ఫలితమే అని అమ్మడి అమ్మగారి నమ్మకం. అయితే !సంతానం కావాలంటే ఏ నోము పట్టాలో అమ్మడికి అర్ధమయింది!

***

1 comment:

Pages