అటక మీది మర్మం - 24 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం - 24

Share This
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) - 24
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)

(కనిపించకుండా పోయిన తన కుమారుడి సాహిత్యాన్ని వెతికి పెట్టమని నాన్సీ తండ్రిని సాయమడుగుతాడు ముసలి మిలిటరీ ఉద్యోగి మార్చ్.  తండ్రి కోరికపై ఆ కేసును చేపడుతుంది  నాన్సీ. ఆగంతకుడెవరో ఆ భవనంలో తిరుగుతున్నాడని అక్కడ పని చేసే ఎఫీ ద్వారా తెలుసుకొంటుంది.  ఒకసారి తన స్నేహితురాళ్ళతో కలిసి అతన్ని పట్టుకొనే ప్రయత్నం చేసి విఫలమవుతుంది.  అటక మీద రహస్యమార్గం ఉందేమో అని వెతుకుతున్న సమయంలో అస్తిపంజరం తమకేదో సైగ చేస్తోందని బెస్ అంటుంది.  వెంటనే అస్తిపంజరం ఉన్న బీరువాలో గాలించిన యువగూఢచారికి పాత ఉత్తరాలతో పాటు కొన్ని పాటలు దొరుకుతాయి.  తన తండ్రి క్లయింట్ కు అమ్మించి పెడతానని వాటిని నాన్సీ యింటికి తీసుకొస్తుంది. అంతకు మునుపు నాన్సీ తండ్రి అప్పగించిన మరొక కేసులో సీసాలను అమ్మే వంకతో డైట్ కంపెనీ లాబ్ లో దూరి, అక్కడ ఉన్న రసాయనికాల నమూనాలను తెచ్చి తండ్రికి యిస్తుంది.  మాటల మధ్యలో తండ్రి లాబ్ లో ఆమె లైట్ వేసి వదిలేసిన దానిపై డైట్ కంపెనీలో విచారణ జరుగుతోందని చూచాయగా తెలియపరుస్తాడు.  అందువల్ల డైట్ కంపెనీకి తిరిగి వెళ్ళి ఆ పరిసరాల్లో తెలిసిన వ్యక్తి కనపడటం వల్ల తాను అకస్మాత్తుగా వెళ్ళిపోయానని, తిరిగి అక్కడ వదిలి వెళ్ళిన సీసాల అమ్మకం మాట్లాడటానికి వచ్చానని నమ్మబలుకుతుంది.  డైట్ తో సీసాల అమ్మకానికి బేరం కుదరక సీసాలను తీసుకొచ్చేసి ఫేబర్ దుకాణంలో అమ్ముతుంది.  ఒకరాత్రి ఆగంతకుణ్ణి పట్టుకోవటానికి ఆమె చీకట్లో మాటువేయగా, ఆకస్మికంగా మార్చ్ రావటంతో ఆ ఆగంతకుడు తప్పించుకొని పారిపోతాడు.  మరునాడు రేడియోలో వినబడే పాటలో కొన్ని పదాలు మార్చ్ కుమారుడు అతని భార్యకు వ్రాసిన ఉత్తరంలో ఉన్నాయని ఆమెకు గుర్తుకొస్తుంది.   వాటిని వెతకటానికి యింటికి వెళ్దామనుకొంటూండగా, ఫాన్సీ డ్రస్సు వేసిన సుశాన్  ప్రమాదవశాత్తూ మెట్లమీద నుంచి కిందకు దొర్లిపోతుంది.  అదే సమయంలో మెట్లకు పక్కనున్న గోడపై వ్రాసి ఉన్న సంగీత స్వరాలు బయటపడతాయి.  ఆమె తన స్నేహితురాళ్ళతో కలిసి జెన్నర్ ఆఫీసుకి వెడుతుంది.   తరువాత . . . .)

 యువగూఢచారి తన స్నేహితురాళ్ళతో లోనికి ప్రవేశించింది. 
వారు ప్రవేశించిన గది అపరిశుభ్రంగా ఉన్న చిన్నగది.  అక్కడ ఒక బల్లపై కాగితాలు, పుస్తకాలు, సంగీతానికి చెందిన సామగ్రి గుట్టలుగా పడి ఉన్నాయి.  పక్కనే ఒక అమ్మాయి టైపురైటర్ ముందు కూర్చుని ఉంది.  ఆమె టైపింగ్ శబ్దం లయకు అనుగుణంగా దౌడలు కదుపుతూ చూయింగ్ గం నములుతోంది.  చాలాసేపటివరకూ ఆమె వాళ్ళను గమనించలేదు.
చివరకు వాళ్ళను గమనించి "చెప్పండి" అంది.
"మిస్టర్ జెన్నర్ ని మేము కలవాలి" నాన్సీ నమ్రతగా చెప్పింది.
ఆ అమ్మాయి ఆమెను పైనుంచి కిందవరకూ చూసింది
"మీరు సంగీతాన్ని అమ్మదలుచుకొంటే, రాకూడని చోటికి వచ్చారు.  మిస్టర్ జెన్నర్ కొత్తవాళ్ళ దగ్గర సంగీతం కొనరు" చెప్పిందామె.
"నేను అమ్మటానికి రాలేదు" నాన్సీ బదులిచ్చింది.  "మీ యజమానికి నా పేరు చెప్పండి చాలు" అంటూ హాండ్ బేగ్ లోంచి ఒక కార్డును బయటకు తీసింది.
ఉద్యోగి భుజాలెగరేస్తూ కార్డు తీసుకొని పక్కనే ఉన్న మరొక గదిలోకి మాయమైంది.  కొద్ది నిమిషాలవరకూ ఆమె బయటకు రాలేదు.  తరువాత ఆమె తెచ్చిన సందేశం స్పష్టంగాను, సూటిగాను ఉంది.
"మిస్టర్ జెన్నర్ ఒక్క తన స్వరకర్తలనే తప్ప ఈ రోజు యింకెవ్వరినీ కలవనన్నారు.  మరొకసారి తనని కలవటానికి వస్తే మీకు మంచిది కాదని కూడా చెప్పమన్నారు."
"చూస్తాను" ఎరుపెక్కిన మొహంతో అని, నాన్సీ కోపంగా వెనక్కి తిరిగింది.
"ఇలా జరుగుతుందని ముందే భయపడ్డాను" హాలు మధ్యనుంచి వెడుతూండగా నాన్సీ తన స్నేహితురాళ్ళతో అంది.
"వెనక్కి వెళ్ళి ఇంటర్వ్యూ కోసం అతనిపై ఒత్తిడి చెయ్యాలని నాకు అనిపిస్తోంది" జార్జ్ చెప్పింది.
"ఈ దుర్మార్గుణ్ణి మీ నాన్నగారే ఆడించగలరు" బెస్ సలహా యిచ్చింది.

విషయాన్ని తేల్చుకోకుండా యింటికి వెళ్ళటం యిష్టంలేక నాన్సీ ఆగింది.  తరువాత మెట్లు దిగి నాన్సీ కనిపించిన వరండాలో నడుస్తూ, తాను జెన్నర్ వ్యక్తిగత కార్యాలయంగా అనుమానిస్తున్న గది వద్దకొచ్చింది.  ఆ గది తలుపు పైన చట్రంలో అమర్చిన గాజుపలకలు కొద్దిగా తెరుచుకొని ఉన్నాయి.  అక్కడనుంచి గదిలోని మాటలు చిన్నగా వినిపిస్తున్నాయి.
"బెన్! మనం యిరుక్కొన్నాం" జెన్నర్ గొంతు వినిపించింది.  " ఆ డ్రూ అనే అమ్మాయి యిప్పుడే వచ్చి వెళ్ళింది.  బహుశా ఆమె సాక్ష్యాన్ని సేకరించి ఉంటుంది" అతని గొంతులో కంగారు ధ్వనిస్తోంది. 
"అసాధ్యం" మరొక గొంతు బదులిచ్చింది.
"అదే అనుకొందాం.  కానీ నువ్వు ఏర్పాటుచేసుకొన్న ప్రజాప్రదర్శనలను కొన్నాళ్ళపాటు రద్దు చేసుకొంటే మంచింది.  ప్రస్తుత పరిస్థితుల్లో మనం తగ్గి ఉండటమే మంచిదని నాకు అనిపిస్తోంది.  మనం అవకాశాల్ని తీసుకోలేం" జెన్నర్ అంటున్నాడు.
నాన్సీ, ఆమె స్నేహితురాళ్ళు అంతకన్నా ఎక్కువ వినలేకపోయారు.  లోపలివాళ్ళు గొంతులు బాగా తగ్గించటం వల్ల, అంతకు మించి మరొక ముక్క వినబడలేదు.
"మిస్టర్ జెన్నర్ వచ్చి బెన్ బాంక్స్ తో మాట్లాడుతున్నాడు.  ఓ!  ఈ బెన్ గురించి మనమింకా ఎంతో తెలుసుకోవాల్సి ఉంది" నాన్సీ గుసగుసలాడింది.
"తెలుసుకోవచ్చు" జార్జ్ తన స్నేహితురాలి చెవిలో చెప్పింది.  "అతను ఆఫీసునుంచి బయటకొచ్చేవరకూ మనమిక్కడే ఎందుకు కాయగూడదు?"
"అతన్ని వెంబడించొచ్చు!" నాన్సీ జోడించింది.  "మీరు ఈ యింటి బయట ఎదురుచూడండి.  నేను ఈ తలుపు దగ్గర కాస్తాను."
బెస్, జార్జ్ మునివేళ్ళపై నడుస్తూ హాలునుంచి తప్పుకొన్నారు.  యువ గూఢచారి దాక్కోవటానికి అనువైన స్థలం కోసం చుట్టూచూసింది.  అందుకు మెట్ల కింద ఉన్న గూడు అనువైన ప్రదేశంగా ఆమె గుర్తించింది.
ఇరవై నిమిషాలు గడిచాయి.  జెన్నర్ ఆఫీసు తలుపు తెరుచుకొంది.  లోపలినుంచి జులపాల జుట్టు గల సన్నటి ఆసామి బయటకొచ్చాడు.  మధ్యవయస్కుడిలా కనిపించే అతని చంకలో సంగీతానికి చెందిన పేపరు చుట్ట ఉంది.  అతడే బెన్ బాంక్స్ అని నాన్సీ సమాధానపడింది.
అతను మలుపు తిరిగేవరకు ఆగి, నాన్సీ అతన్ని అనుసరించింది.  ఆమె దూరంగా వీధి మొదట్లో తలుపు నీడలో నిలబడ్డ స్నేహితురాళ్ళను గమనించింది.  తన తలనూపుతూ ఆమె వారికి సైగ చేసింది.
వాళ్ళిద్దరూ బెన్ బాంక్స్ వెనుక అనుసరించటం మొదలెట్టారు.  పాటల రచయిత తన కదలికలను అనుమానించకుండా ఉండేవరకూ నాన్సీ ఆగింది.  తరువాత నడక వేగం పెంచి తన స్నేహితురాళ్ళను కలుసుకొంది.
ఆ వ్యక్తి వేగంగా నడుస్తున్నాడు.  అతన్ని గమనిస్తున్న నాన్సీకి ఒకటి మాత్రం అర్ధమైంది.  మార్చ్ యింట్లో చొరబడిన ఆగంతకుడు యీ సన్నని మనిషి కాదు.  అతనిది భారీ ఆకారం.
బాంక్స్ ఒక్కమారైనా వెనక్కి చూడకుండా ఒక చిన్న హోటలుకి చేరుకొన్నాడు.  దాని పేరు మిల్లెట్.  దాని లోనికెళ్ళగానే అతను తిన్నగా కౌంటరు దగ్గరకెళ్ళాడు.  ముగ్గురమ్మాయిలు హోటలు బయట ముంగిట్లో నిలబడ్డారు.
"తాళం" అంటూ ఆ వ్యక్తి కౌంటర్లో గుమాస్తాని అడగటం వారికి వినిపించింది.
"అలాగే మిస్టర్ డైట్" గుమాస్తా బదులిస్తూ అతనికి తాళాన్ని యిచ్చాడు.
"డైట్!" యువగూఢచారి దాదాపుగా అరిచింది.
వాళ్ళు ముగ్గురు తాము సరిగానే విన్నామా? అంటూ ఆశ్చర్యపోయారు.
బెన్ బాంక్స్ గా చెప్పుకొంటున్న వ్యక్తి అసలు పేరు డైట్ అన్నమాట!  తాళం తీసుకొన్న వ్యక్తి లిఫ్ట్ ఎక్కి పై అంతస్తుకి వెళ్ళిపోయాడు.  ముగ్గురమ్మాయిలు తాము విన్న విషయాన్ని నిర్ధారించుకొందుకు కౌంటర్ దగ్గరకొచ్చారు. 
(తరువాయి భాగం వచ్చే సంచికలో)

No comments:

Post a Comment

Pages