మౌనరా(రో)గం - అచ్చంగా తెలుగు

మౌనరా(రో)గం

Share This
మౌనరా(రో)గం
 - జైదాస్.

"ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్లే.కానీ కొందరు మంచివాళ్లుగా ఉండిపోవడానికి కారణం వారికి చెడిపోవడం చేతకాకపోవడమే."
 ఇదిగో ఇలా చెడిపోవడం చేతకాక మంచిగా మిగిలిపోయినోడే గోవిందం. అలాంటి గోవిందం ప్రస్తుతం ఆలోచనల్లో తేలకుండా మునిగిపోతూ, తెమల్లేక తంటాలు పడుతున్నాడు. అతని ఆలోచనల్లా 'చెడిపోవడం ఎలా?' అని మీరనుకుంటే 'తుప్పు'లో కాలేసినట్టే. ఎందుకంటే అతనాలోచించేది 'ప్రేమించడం  ఎలా?' అని. గోవిందం ఆన్నిటిలోనూ బుద్ధిమంతుడే. సందేహం లేదు.కాకపోతే ఈరోజుల్లో పుట్టాల్సినవాడు మాత్రం కానేకాదు.యువతంతా  'నెట్లు', 'పబ్బులు' అంటూ ఆధునికత పేరుతోఎంజాయ్ చేస్తున్నా,తనుమాత్రం పాతకాలపు పద్దతులూ, సాంప్రదాయాలు అంటూ మడిగట్టుకునే వున్నాడు.గోవిందాన్ని 'బాగా చూస్తే తప్ప బాగుంటాడ'నేది తెలీదు.ముక్కు కొద్దిగా పొడవైనా ఓకే.తెల్లటి తెలుపు కాకపోయినా నల్లటి నలుపు మాత్రం కాదు.కొద్దిగా 'పీల'గా ఉన్నా 'గెడకర్ర' మాత్రం కాదు. మొత్తంమీద 'ఏవరేజ్ హ్యాండ్సమ్మ'న్నమాట.అలాంటి గోవిందం ఇప్పుడిలా ఫుడ్డు, బెడ్డు మాని తెడ్డులేని పడవలో ఒడ్డు చేరడానికి ప్రయత్నించే వాడిలా ఘోరంగా ప్రేమ నామ జపం చేయడానికి కారణం అతని ఫ్రెండ్ సన్యాసిరావు అన్న మాటలే.సన్యాసిరావు పేరుకి సన్యాసి అయినా పక్కా ప్రేమసంసారి.పైగా సరసుడు,జల్సారాయుడూను. ఆశ్రమం పెట్టలేదన్నమాటే గానీ అచ్చం 'ఈ-'కాలపు సన్యాసుల్లాగే ప్రవర్తిస్తుంటాడు.దొరికినచోట దొరికినంత ఎంజాయ్ చేయాలనే రకం.కానీ గోవిందం ఇందుకు పూర్తిగా విరుద్ధం.అందరిలోలా వయసులోవుండే దురలవాట్లేమీ లేవు.క్యారెక్టర్ అడవాళ్లకేకాదు మగాళ్లక్కూడా ముఖ్యమనేది అతని అభిప్రాయం.'ఆడదంటే అణువణువు అందం, ఆ అందాన్ని ఆస్వాదించడమే  నాకానందం' అని సన్యాసిరావంటే, గోవిందం, 'ఆడదంటే అణువణువు అనురాగం, ఆప్యాయతలనీ, వాటిని ఆస్వాదించడమే తనకానందమ'నీ అంటాడు."చూడు గోవిందం మనిషన్నాక కూసింత కాకపోయినా 'కాసంత'న్నా కళాపోసనుండాలి. కాలానికి తగినట్టు మారాలి. ఈరోజుల్లో కూడా 'నిజమైనప్రేమ, కల్మషం లేనిమనసు' లాంటి 'తొక్క'లో ఆశయాలవల్ల నీ జీవితమే'దిక్కు' లేకుండా పోతోంది. అలాంటి లక్షణాలుండేవారెవరూ 'గూగుల్లో  గోజారినా' దొరకరు. గనక దొరికినంత దోచేయ్,ఎంజాయ్ చేసేయ్" అంటూ సలహా ఇచ్చేడు సన్యాసిరావ్. కానీ గోవిందం గుంభనంగా నవ్వి "మనసున్నచోట మార్గం తప్పకవుంటుంది.నా ప్రేమలో నిజాయితీని గుర్తించిన, మనసున్న అమ్మాయినే ప్రేమించి, పెళ్లాడి మరీ చూపిస్తా"నంటూ ఛాలెంజ్ చేసాడు. ఛాలెంజ్ అయితే చేసాడు. కానీ....అందరిలా అమ్మాయిల వెంటబడి వారి 'కరుణా కటాక్ష వీక్షణల' కోసం పడిగాపులు కాయడం,గడ్డాలు పెంచి,కళ్ళను లోతుకు దించి,విలపించి, విరహగీతాలు అలపించి, కాగితాలుచించి, కవితలు రచించి, వగైరా వగైరా గావించి వలపింపజేసుకోవడం లాంటి పనులు తను చస్తే చేయడు.ఆన్ లైన్ 'చా(చీ)టింగ్' లసలే చేయలేడు. మరలాంటపుడు, తనకునచ్చే, తన మనసును మెచ్చే మనసున్నమారాణి ఇప్పుడు దొరికేదెలా? అసలు  'ఈ-జనరేషన్' లో అది సాధ్యమేనా? ఇదిగో ఇక్కడే గోవిందం గుండె గాభరాకి గురవుతోంది.అయితే ఊహించని విధంగా ఆ మర్నాడే గోవిందానికి 'గు(బ్యా)డ్ లక్' తగలనే తగిలింది.
*   *   *
              ఆరోజు 'గీతగోవిందం' సినిమా రిలీజ్. 'పెళ్లిచూపులు'నాటి తన 'ఫేవరెట్' హీరో 'గోవిందం' పేరుతోనే సిన్మా తీయడంతో  ఫస్ట్ డే, ఫస్ట్ షో'కే బయలుదేరాడు. ఆన్లైన్ బుకింగ్ మొరాయించడం తో బ్లాక్ లో నైనా టికెట్స్ దొరుకుతాయేమోనని వచ్చాడు గోవిందం.కానీ అవీ దొరకలేదు. నిరాశతో  వెనుతిరగబోతున్న గోవిందం దృష్టి నాకర్షించిందో యువతి .'చక్కగా నాజూగ్గా చాలా బావుంది' అనుకున్నాడప్రయత్నంగానే. క్యూ దగ్గర నిలబడి 'క్యూట్' గావున్న ఆమె ఎందుకనో తలతిప్పి చూసింది. తనవైపే చూస్తున్న గోవిందం కనిపించాడామెకు.ఓ క్షణం ఇద్దరికళ్ళూ కలుసుకున్నాయి.ఆమె అసహనంగా ఓసారి వాచీవంక చూసుకుంది.ఓరకంట ఆమెనే గమనిస్తున్న గోవిందం అప్రయత్నంగా తన వాచీ చూసుకున్నాడు.షో ప్రారంభం కావడానికి పదినిమిషాలు మాత్రమే ఉంది. ఇంతలో ఆమె నేరుగా గోవిందం వైపే రాసాగింది. గోవిందానికి గుబులుపుట్టి గుండె వేగం పెరిగిపోయింది."ఎక్సూజ్ మి.మా ఫ్రెండ్ వస్తానని ఎందుకనో మిస్ అయింది. మీకెలాగూ టిక్కెట్ లేదుకదా! మీకభ్యంతరం లేకపోతే.. " అంటూ మాట పూర్తి చేయకుండానే ఓ టిక్కెట్ అతని చేతిలో పెట్టింది. గోవిందానికిదంతా కలలావుంది. ఎందుకైనా మంచిదని తన్నోసారి గిల్లుకున్నాడు.ఒళ్ళు చిల్లయిందే కానీ చిత్రంలో మార్పేమి లేదు. వెంటనే తేరుకొని కర్తవ్యం గుర్తొచ్చినవాడిలా థా.. థా.. థ్యాంక్స్.. అంటూ ఓ ఫైవ్ హండ్రెడ్ నోట్ ఆమె చేతిలో పెట్టేడు.టిక్కెట్ రేటు మాత్రమే తీసుకొని మిగతావి తిరిగిచ్చేసి 'పర్లేదు ఉంచుకో'మన్నా వినకుండా లోపలికెళ్లి పోయిందామె.తనూ కదిలాడు అమె వెనుకే.జీవితంలో మొదటిసారిగా ఓ టీనేజ్ యువతి ప్రక్కన కూర్చోని సినిమా చూస్తున్న గోవిందానికి చాలా గమ్మత్తుగానూ, థ్రిల్లింగ్ గానూ ఉంది.సినిమా స్టార్టయ్యాక క్యాజువల్ గా.. ఊహు.. కావాలనే ఒకటి రెండుసార్లు తనచేతిని తాకించాడామెకు. ఆమె ఏమీ అభ్యంతరం చెప్పకపోవడంతో ఎక్కడలేని ధైర్యమొచ్చిందతనికి. "మీ..మీమ్...పేరు... తె..తె..లుసుకోవచ్చా..?"అడిగేడు అప్పటిదాకా కూడగట్టుకున్న ధైర్యంతో కూడబలుక్కుని. "గీత.." చెప్పిందామె. తమపేర్లు సిన్మాపేరు అన్నీ కలవడం 'వండర్'గా ఫీలైన గోవిందం ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలీక నీళ్లు నమలసాగేడు.ఇంతలో ఆమే అడిగింది. "మీపేరు చెప్పనేలేదు?""గోవిందం యస్ గోవిందం" అన్నాడు తడబడుతూ.ఆమె ఆశ్చర్య పోయి"వాటే లక్కీ నేమ్స్. గుడ్ ఫ్రెండ్ షిప్.మీరుకాస్త రంగుంటే అచ్చు 'విజయ్ దేవరకొండ'లా ఉండేవారేమో"అంది అతడ్ని పరీక్షగా చూస్తూ.అంతే రివ్వున దూసుకుపోయాడు గోవిందం మునగచెట్టు చిటారు కొమ్మకు.

కానీ అంతలోనే విజయ్ దేవరకొండలో తనకి సరిపడని 'రౌడీ' అనే బ్రాండ్ గుర్తొచ్చి అంతెత్తునుంచి అమాంతం క్రిందికి దూకేశాడు."అబ్బెబ్బే ఏంకాదు.ఇంకా మీరే రశ్మికమండన్న లాగున్నారు" అన్నాడు మాటలతోనే 'ప్రేమ మంట'రాజేస్తూ.  ఆ మాటకి సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి.(సిన్మాహాల్లో బుగ్గలపై ఎరుపెలా కనిపిస్తుందని అడక్కండి)తన డైలాగ్ కు రెస్పాన్స్ అమెబుగ్గల్లో  చూసిన గోవిందం హుషారుగా ఈలవేశాడు. సిన్మాలో డైలాగ్స్ కు అలా చేశాడుకాబోలనుకున్నా రంతా.అలా కలుసుకున్న 'గీతగోవిందం'లు ఆ తర్వాత ఎక్కడా ఆగలేదు.తమ ప్రేమ విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపుతూ చెట్టాపట్టాలేసుకుని తిరగసాగేరు.అయితే గోవిందం ఎప్పుడూ తొందరపడలేదు.ప్రేమ కేవలం శారీరక సంబంధం ద్వారానే ఎక్కువగా బలపడుతుందనే విషయంలో నమ్మకం లేదతనికి.తాము మానసికంగా బాగా దగ్గరైన ఒకర్నొకరు పూర్తిగా అర్ధం చేసుకోవాలి.తన ప్రేమపరీక్షలో ఆమె నెగ్గాలి.అతర్వాతే పెళ్లి వగైరా."అవసరానికి ఆడవాళ్లు అందంగా నటిస్తార"ని తెలీని గోవిందానికి 'ప్రేమ-పెళ్లి' పై ఉన్న మాచెడ్డ మంచి అభిప్రాయాలివి. గీత అన్నింటిలో నెగ్గడమేగాక, అతనికి మరింత దగ్గరకావడంతో పెళ్లికి సిద్ధమైపోయాడు గోవిందం.
* *  *
  ఆరోజు 'నీవెవరో..' సినిమాకెళ్ళొస్తున్నారు.గీత గోవిందంలు.థియేటర్ లోంచి బయటకురాగానే ఎవరో వీపుమీద గట్టిగా చరవడంతో ఉలిక్కిపడి వెనుదిరిగాడు గోవిందం.ఎదురుగా 'అచ్చోసిన సన్యాసిలా' సన్యాసిరావ్. గోవిందం పక్కన అమ్మాయిని చూసి ఆశ్చ్యర్యపోయిన సన్యాసిరావ్ "ఒరేయ్ గోవిందా..! నీగురించి నే విన్నది నిజమేనన్నమాట. నువ్వూ దారికొస్తున్నావ్. మామంచిపిట్టే. ఎందుకైనా మంచిది ముందుముందు నీ పీకలకు చుట్టుకునే ప్రమాదంరాకుండా తెలివిగా డీల్ చేయి.లేకపోతే నీపని గో..విందా! నువ్వసలే ఒట్టి పప్పుగాడివి.మాటలు నమ్మి ఈజీగా ట్రాప్ లోపడిపోతావ్ జాగ్రత్త"అన్నాడు హెచ్చరిస్తున్నట్టుగా."ఒరేయ్ సన్యాసి ఆమెవరను కుంటున్నావ్.. నాక్కా బోయే బెటర్ హాఫ్.పిచ్చిపిచ్చిగా వాగకు." కాస్త కోపం,ఒకింత గర్వం కలగలిసిన స్వరంతో అన్నాడు గోవిందం. సన్యాసిరావు ఆదిరిపడ్డాడు.వెంటనే గోవిందాన్ని  పక్కకులాగి "గురూ అంతపని చేయకు. ఆమె నువ్వనుకునేంత మంచిదికాదు. ఫ్రీబర్ద్. ఫుల్ ఎంజాయ్ టైపు.నాలాంటి వాళ్ళు చాలామంది తెలుసామెకు.అసలే రోజులు మంచిగా లేవు. కావాలంటే వివరాలు నువ్వే కనుక్కో.నీలాంటి వాడు మోసపోకూడదనే,నీ బాగుకోరి చెపుతున్నాను.ఇకవస్తా" అంటూ వెళ్ళిపోయాడు సన్యాసి రావు.గోవిందానికి గ్లోబు గిర్రున తిరుగుతున్నట్ట నిపించింది. కాదుకాదు సన్యాసిరావు మాటలకు తలతిరిగినందువల్ల అలా భ్రమ కలిగింది. అయినా తమాయించుకున్నాడు. సన్యాసిరావ్ ఇలాంటివాటిలో బాగా అరితేరినవాడనే సంగతి తనకి తెలుసు.

'హార్డ్ డిస్క్' లాంటి అతని 'హాట్' బుర్రలోఎంతోమంది  అమ్మాయిల జాతకాలు భద్రంగా ఉంటాయి.అలాంటివాడు చెప్పాడంటే నమ్మకుండా ఉండడమెలా?అయినా తను నిజానిజాలు తెలుసుకోకుండా గీతను అనుమానించడం భావ్యం కాదనుకున్నాడు.ఆ మర్నాడే  వివరాలన్నీ సేకరించేడు. గీత మొదటినుండి విచ్చలవిడిగా తిరిగే రకమే.కానీ కొంతకాలానికి ఆ రకమైన లైఫ్ మీద విసుగుపుట్టింది.తన లైఫ్ కి       సెక్యూరిటీ కావాలంటే పెళ్లిచేసుకోక తప్పుదు.కానీతన 'ఫ్రీ లైఫ్' కు ఇబ్బందిలేకుండా, హాయిగా బ్రతకడానికి 'అన్నిరకాలుగా'తగిన తోడు అవసరమనుకుంది.అలాంటి వాడికోసమే వేట ప్రారంభించింది.సరిగ్గా అప్పుడే గోవిందం ఆమె అందాన్ని చూసి ట్రాప్ లో పడిపోయాడు. గోవిందానికి మనసంతా వికలమై పోయింది.ఇదంతా నిజం కాకపోతే బావుణ్ణనిపిస్తోందతనికి. తను ఒకవిధంగా అదృష్టవంతుడే.ఈ ఊబిలో పూర్తిగా కూరుకుపోకముందే అన్నీ తెలిశాయి.తన ఆదర్శాలు,కూడా తనకు మేలే చేశాయి.ఇన్ని తెలిశాకకూడా ఆమెను పెళ్లి చేసుకునేందుకు అతని     మనసంగీకరించలేదు.ఆదే చెప్పాడామెకు. "నీవునన్ను నమ్మించి మోసగించావని  నిందించదలచుకోలేదు. ఇంతజరిగాక కూడా మనం పెళ్లిచేసుకొని జీవితాంతం బాధపడేకన్నా విడిపోవడమే మంచిది.దయచేసి నాకు దూరంగా వెళ్లిపో జీవితంలో మరెవరినీ ఇలాచేయడానికి ప్రయయత్నించకు.ఎందుకంటే నీలాంటి వారు చేసే పనులవల్ల నిజమైన బాధితులు కూడా అన్యాయమైపోతారు"అన్నాడు చేతులు జోడించి.గోవిందం చెప్పినట్లు గీత తనదారిన తాను పోయుంటే కధ కంచికి మనం ఇంటికి పోయుండేవాళ్ళం.కానీ కధనేరుగా గోవిందం కొంపమీదికెళ్ళింది.నోటిదాకా వచ్చినపండును జారవిడవడం ఇష్టంలేని గీత వెళ్లిపోలేదు. సరికదా గోవిందాన్నే తన దారిలోకి తేవాలనుకుంది.'నమ్మినోడినే మోసగించగలం.కానీ నమ్మనోడినేమీచేయలేమ'ని నమ్మే ఆమె మర్నాడే  తన ఫ్రెండ్స్ సాయంతో గోవిందం ఇంటిముందు 'మౌనపోరాటం' ప్రారంభించింది.కొద్దిగంటల్లోనే ఈవార్త ఊరంతా గుప్పుమంది. తోటి ఆడది బాగుపడుతుంటేనే చూసి ఓర్వలేని మహిళా సంఘాలవారంతా 'సాటి అడకూతురుకన్యాయం జరిగిందని' గుండెలు బాదుకుంటూ రంగంలో దిగేరు. తమ చీరల, నగల చర్చలు,సమస్యలు కాసేపు పక్కనపెట్టి గోవిందం గొడవలో తలదూర్చేరు.సమస్యను స్వచ్చందంగా స్వీకరించి ఛానెళ్లలో చర్చలులేవదిశారు. గోవిందం లాంటి 'కామాంధులకు'(?)బుద్ధిచెప్పాలంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచేరు.అధికారులకు నాయకులకు వినతిపత్రాలిచ్చేరు.ఆ మర్నాడే ఎమ్మార్వో కలెక్టర్ లు తమ దైనందిన కార్యక్రమాలన్నీ రద్దుచేసుకోని వచ్చి గీతను పరామర్శించి తమ మద్దతు ప్రకటించేరు.ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మంత్రులవరకూ వెళ్ళిడంతో పోలీసులు రంగంలోదిగి ఇంటరాగేట్ చేయడం ప్రారంభించారు. గోవిందానికి ఇవన్నీ చూసేసరికి తల తిరిగిపోయింది.ఇన్స్పెక్టర్ కు జరిగిందంతా వివరించి నచ్చచెప్ప బోయాడు.కానీ అతని మాటలెవరూ నమ్మలేదు.నమ్మే స్థితిలోనూలేరు.గీతగోవిందాలు కలసితిరుగుతుండగా చూసినవాళ్ళు చాలామందే వున్నారు మరి.తాను ఏ తప్పూ చేయడంలేదని,తాము పెళ్లి చేసుకుంటామనే ధీమాతోగోవిందం నిర్భయంగా గీతతో కలసి తిరిగేడు. అదే ఇప్పుడతని కొంపమీదకు తెచ్చింది.పైగా ఇన్స్పెక్టర్ ఈమధ్య పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న పెళ్లిళ్లు,అవిజరిపించినవారికి పత్రికలు,టీవీలు,సోషల్ మీడియా లోనూ వస్తున్న పబ్లిసిటీ చూసి,చూసి క్రేజీతో తానూ అలాంటి కేసోకటి తగిలించుకుని తద్వారా మీడియాకెక్కి మంచిపేరు సంపాదించాలనీ, అందరి దృష్టిలోపడాలనీ తెగఉవ్విళ్లూరుతూ 'మహాఇది'గా వున్నాడు.దాంతో గోవిందం చెప్పేవేవీ అతని బుర్రకెక్కడం లేదు.అక్కడున్నవారిలో ఏఒక్కరికికూడా నిజానిజాలతో పనిలేదు.అతనికిదంతా అన్యాయంగాను అమానుషంగాను ఉంది.కానీ తానేమీ చేయలేని నిస్సహాయుడు.ఆప్రయత్నంగా గీతవంక చూసేడుగోవిందం. ఏమీతెలియని ముగ్దలా చాలా అమాయకంగా,చాలా,చాలా బాగాకూడా వుందామె. అతనిప్రమేయం లేకుండానే రెండుకన్నీటిబొట్లు రాలి క్రిందపడ్డాయి.ఇన్నాళ్ళూ స్త్రీలపట్ల తాను పెంచుకున్న గౌరవాభిమానాలకు, ఉన్నతాభి ప్రాయాలకు ప్రతీకలవి. మనసులోనే మౌనంగా రోదించేడతడు.స్త్రీ మగవాడిచేత వంచింప బడినపుడు ఇలాంటి మౌనపోరాటాల్ని తానూ సమర్ధిస్తాడు.కానీ సానుభూతిని అడ్డం పెట్టుకొని రక్షణాయుధాలను మారణాయుధాలుగా మార్చి,అమాయకుల్ని  లొంగదీయడానికి,ప్రేమలో కూడా "హై'టెక్కు' పద్ధతులు వాడుతూ తమ గొంతెమ్మ కోర్కెలు తీర్చుకోవాలనుకోవడం, అమాయకుల్ని బలి తీసుకోవడం ఎంత శోచనీయం. గీతలాంటి స్వార్ధపరులవల్ల న్యాయంగా చేసేవాళ్లకుకూడా విలువ లేకుండా పోతోంది. ప్రేమలో కూడా ఇంత స్వార్ధం ఉంటుందని తనకి తెలీదు. తనూహించుకున్న ప్రపంచమే వేరు.ప్రేమంటే పవిత్రమైనదని, ప్రేమికులు త్యాగానికి, అనురాగానికి మారుపేర్లుగా ఉంటారని భావించేడు.కానీ కాలం మారి నీతి, నిజాయితీలు నిలువ నీడలేక  ప్రేమకూడా 'రోగాల రొంపి'గా మారిపోయిందని తెలుసుకోలేకపోయాడు.జీవితంలో ఘోరంగా ఓడిపోయాడు. కాలంతోపాటు మారాలని పెద్దలంటారు ఇందుకేనేమో! తను మారక తప్పదా? తనలాంటి వారికి మనుగడ కష్టమేనా? 'ఊహు.. తను మారడుగాక మారడు.' తను 'చెడిపోవడం చేతకాని వాడుకదా!'

'కసాయికత్తి సంచిలోదాచుకుని మాటువేసి కసిదీరా కుత్తుకను కోయలేడు.యాసిడ్ తో కాల్చి కోపం చల్లార్చుకోనూలేడు. ప్రేమించి మోసపోయిన తానే ప్రేమించలేదని దాడిచేసిన ప్రేమ హంతకుడిగా లోకం దృష్టిలో ముద్రపడలేడు.'మసాలా ముచ్చట్లకోసం మిడిసి పడుతోన్న మీడియా'కు 'ముడిసరుకు' కాలేడు.వాస్తవాలకన్నా వార్తల తోనే నడిచే టీవీల చర్చలు,డిబేట్ల మాటున అసలునిజాన్ని సమాధి చేయలేడు.ఎవరెన్ని ఇబ్బందులకు గురిచేసినా అన్నీ మౌనంగానే భరిస్తాడు తప్ప కేవలం గీతలాంటి వారివల్ల ఆడవాళ్లపై తనకున్న అభిప్రాయాల్నిమార్చుకోడు.
  * * *
 ఓ ఏడాది గడిచింది.గీతగోవిందం లు కేవలం పేరుకు మాత్రమే భార్యాభర్తలుగా వుంటున్నారు.ఒక్క భర్తగా తప్పిస్తే మిగతావిషయాల్లో ఏలోటూ లేకుండా చూసుకున్నాడు గీతను.  అతని వ్యక్తిత్వాన్ని ప్రేమలోని నిజాయితీని అంత దగ్గరగాచూసిన గీతలో పశ్చాత్తాపం మొదలైంది.ఎంతో ఉత్తముడైనగోవిందం జీవితం తనవల్ల ఎడారికావడం అమెను బాధిస్తోందిప్పుడు.తను తొందరపడ్డనేమోనని తనలోతానే కుమిలిపోతోంది.తెలిసీ తెలియని వయసులో ప్రేమపేరుతో కలిగే ఆకర్షణ ఎన్నో అనర్ధాలకు దారితీస్తుందనేందుకు గీత జీవితమే ఓ ఉదాహరణ. ఎంతో ఉన్నత కుటుంబానికి చెందిన ఆమె చదువుకునేటపుడే  'ప్రేమరూపు దాల్చిన ఓ కామాంధుడి' మాయమాటలు నమ్మి ఇల్లువదిలి వస్తే నమ్మక ద్రోహంతో ఆమె జీవితాన్ని వీధిపాలు చేసి వెళ్లిపోగా, దిక్కులేక,తిరిగి ఇంటికెళ్లడానికి ముఖం చెల్లక తనీ స్థితికొచ్చిందని ఎవరికీ తెలియదు.ఆ వంచన తాలూకు బాధ 'మగవాళ్లపై కసి'గామారి అలా తయారయిందామె.తన జీవితం ఎలాగూ నాశనమైంది. కానీ ఇప్పుడు తానూ మరొకరి జీవితాన్ని అలాగేచేస్తున్నందుకు లోలోపలే కుమిలి పోతోందామె. అందుకే ఓ రోజు అర్ధరాత్రి ఎవరికీ తెలీకుండా తన దారిన తాను వెళ్ళిపోయింది.స్వచ్ఛమైన ప్రేమకు ఏ కాలంలోనైనా చావులేదని నిరూపిస్తూ.గీత కనిపించకపోవడంతో గాభరా పడుతోన్న గోవిందానికి సన్యాసిరావ్ ఫోన్ చేసి తాను 'తీవ్ర అనారోగ్యం'తో హాస్పిటల్ లో వున్నానని ఒక్కసారి వస్తే గీత గురించి చెపుతాననడంతో కంగారుగా హాస్పిటల్ కెళ్ళాడు."సారీరా గోవిందా! నన్ను క్షమించు.నీ మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుని నిన్ను మార్చబోయాను.కానీ గట్టి మనసుతో నువ్వేగెలిచావ్ గోవిందం.నీతి నిజాయితీలకు, మంచిమనసుకు ఓటమి వుండదనేది నిజం.నాలాంటి వారికి ఎప్పటికైనా పతనం తప్పదనీ, నీలాంటి ఉన్నతుడికి అదేవుడు కూడా హానిచేయలేడని ఇప్పుడర్ధమైంది నాకు.కానీ అంతామించిపోయాక ఇప్పుడు చేసేదేమీ లేదు.గీత మనం అనుకున్నంత దుర్మార్గురాలు కాదు.పరిస్థితులవల్లే అలా దిగజారిందని ఆమె చెప్పేవరకూ ఎవరికీ తెలీదు.నీవు అర్ధం చేసుకోగలవని ఎంత చెప్పినా వినకుండా 'నీలాంటి పవిత్రుడికి నేనుతగనం'టూ వెళ్ళిపోయింది.గీత ఇక తిరిగిరాదు.ఇకనైనా నువ్వు పెళ్ళి చేసుకుని స్థిరపడు"అంటూ గీత తనను కలసి చెప్పిన వన్నీ చెప్పి చేతులుపట్టుకున్నాడు సన్యాసిరావ్.అంతా విన్న గోవిందం "నేను మంచిగా వున్నాను.కాబట్టి అందరూ నాతో మంచిగానే వుండాల'నే భ్రమతో బ్రతుకుతూ వచ్చాను.అది అసాధ్యమనిఅర్ధం చేసుకోలేకపోయాను.తెలియక నిన్ను బాధించాను.నన్ను క్షమించు గీతా" అంటూ కుప్పకూలిపోయాడు. అప్పటినుంచి 'గీత' ఆనవాలుకోసం అన్వేషిస్తూనే వున్నాడు 'గోవిందం.'
   ***
                                                                                  

No comments:

Post a Comment

Pages