ఉయ్యాల - అచ్చంగా తెలుగు
ఉయ్యాల
బి.ఎన్.వి.పార్థసారథి


ఉమాపతి కి వెదురు ఉయ్యాల కొనాలనిపించింది. తీరిక వేళల్లో  ఇంట్లో హాయి గా కూర్చొని ఉయ్యాల ఊగుతూ చాయ్ తాగుతూ వుంటే ఆ ఆనందం మాటల్లో వర్ణించ అలవి కానిది. మొత్తానికి ఉమాపతి ఉయ్యాల కొన్నాడు. పెరట్లో బాల్కనీ లో ఉయ్యాలని  వెళ్ళాడ దీసాడు. ఉయ్యాల కొన్న రోజునే విపరీతంగా వాన పడింది. కొత్త ఉయ్యాల వర్షం నీరు తగిలి పాడవుతుందని ఆ ఉయ్యాలని తీసి ఇంట్లోపల పెట్టాడు. అలా మూల పడిన ఉయ్యాల దాదాపు మూడు నెలల వరకూ మూలానే వుంది. ఒకరోజు ఇల్లు  సర్దుతున్నప్పుడు  ఉమాపతి భార్య పార్వతి కసురుకుంది. “వద్దంటే వినకుండా ఈ ఉయ్యాలని కొన్నారు. ఇంట్లో వున్న సామాన్లు చాలవన్నట్టు వాటికి ఈ ఉయ్యాల తోడైంది.” అలా మాటా మాటా పెరిగి చిలికిచిలికి గాలి వాన గా మారి ఆ రోజు వాన పడకపోయినప్పటికీ ఇంట్లో మాత్రం తుఫాను వచ్చింది. నాలుగు రోజులు భార్యా భర్తలు ఎడమొహం పెడమొహం పెట్టారు. 

ఈ సంఘటన జరిగిన వారం రోజులకి ఉమాపతి ఒక శనివారం నాడు ఉయ్యాలని తీసి దుమ్ము దులిపి మరలా పెరట్లో బాల్కని లో కుర్చీ ఎక్కి కొక్కానికి పెట్టబోతుండగా  కుర్చీ మీంచి కింద పడ్డాడు. కాలు విరిగి దాదాపు నెలరోజుల పైగా ఆఫీసు కి శలవు పెట్టి ఉమాపతి ఉయ్యాల ఊగక పోయినా మంచం మాత్రం ఎక్కాడు.  ఇలా ఏడాది గడిచింది. పట్టు వదలని విక్రమార్కుడిలా ఉమాపతి ఒకరోజు ఉదయం మరలా ఉయ్యాలని తీసి బాల్కనీ లో పెట్టాడు. ఆ రోజు ఆదివారం. మధ్యాహ్నం మూడింటికి ప్రశాంతంగా ఉయ్యాల లో కుర్చుని చాయ్ తాగుదామని నిర్ణయించుకున్నాడు ఉమాపతి. ఇంతలో తన బాస్ కి తీవ్ర అస్వస్థత చేసి హాస్పిటల్ లో చేరాడని కబురు రావటంతో హాస్పిటల్ కి వెళ్ళాడు. బాస్ కి హార్ట్ సర్జరీ జరిగింది. ఆ రోజు రాత్రంతా ఉమాపతి హాస్పిటల్ లో వున్నాడు. మర్నాడు ఉదయం ఇంటికి వచ్చేసరికి పెరట్లో బాల్కనీ లో ఖాళీ గా వున్న ఉయ్యాల అతనిని వెక్కిరించినట్టు అనిపించింది. మరలా ఉయ్యాలని తీసి ఇంట్లోపల పెట్టాడు.
ఆ తరువాత ఆరు నెలలకి ఒక ఆదివారం నాడు  మరలా ధృఢ నిశ్చయంతో ఉయ్యాల బూజు దులిపి పెరట్లో బాల్కనీ లో తగిలించాడు. ఇంతలో.” ఏవండీ . మీకు ఫోన్” అంటూ మొబైల్ అందించింది భార్య పార్వతి. ఉమాపతి బాస్ దగ్గరనుంచి ఆ ఫోన్ కాల్. వున్నపళంగా బయల్దేరి బెంగళూరు వెళ్ళాలని ఆజ్ఞ. బెంగళూరులో ఆఫీసు మేనేజర్ కి సుస్తీ చేసి హాస్పిటల్ లో వున్నాడని  అందువల్ల అతనికి ఆరోగ్యం కుదుటపడే వరకూ ఉమాపతి బెంగళూరు ఆఫీసు లో పని చేయాలని ఆ ఫోన్ సారాంశం. 

ఇలా మరో నాలుగు నెలలు గడిచాయి. ఉమాపతి ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు. ఉమాపతి కి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు ఢిల్లీ లో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురికి వివాహం చెయ్యాలి. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన మరునాడే  కూతురి పెళ్లి సంబంధాల వేటలో పడ్డాడు ఉమాపతి. పనిలో పనిగా స్వగ్రామం లో వున్న ఇల్లు, పొలం అమ్మకానికి పెట్టాడు. ఆ ఇల్లు, పొలం అమ్ముడు పోయాయి. ఇంతలో కూతురి పెళ్లి నిశ్చయం అయింది. వెంటనే ముహూర్తాలు కుదరటం తో పెళ్లి అయింది. 

జీవితంలో ప్రధాన మైన బాధ్యతలు అయిపోయాయని, ఇంక కొడుకు పెళ్లి మాత్రం చెయ్యాలని తలపోశాడు ఉమాపతి. అతనికి ఇంట్లో మూల పడిన ఉయ్యాల గుర్తుకి వచ్చింది. అప్పటికే సమయం రాత్రి పది గంటలు అయింది. భార్య పార్వతి వారిస్తున్నా వినకుండా ఉయ్యాలని తీసి బూజు దులిపి పెరట్లో బాల్కనీలో పైన హుక్ కి తగిలిస్తుండగా ఒక్కసారిగా విరుచుకు పడిపోయాడు ఉమాపతి. వెంటనే హాస్పిటల్ కి అంబులెన్స్ లో తీసుకెళ్ళారు. తీవ్రమైన హార్ట్ అట్టాక్ వచ్చిందని హాస్పిటల్ చేరేసరికే ఉమాపతి ప్రాణాలు పోయాయని నిర్ధారించారు హాస్పిటల్ లోని డాక్టర్లు. 
 ***

No comments:

Post a Comment

Pages