దృక్కోణం - అచ్చంగా తెలుగు
దృక్కోణం  
  ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్

వనజ ఆ కాలనీలో  మహిళా సంఘానికి అధ్యక్షురాలు .పురుష అహంకారానికి వ్యతిరేకిని అని ,దీన  స్త్రీలను ఉద్ధరించడంలో తానే అన్నీ అయి వాళ్ళకి సహాయ పడతానని  , ఆడవాళ్ళని బాధలపెట్టే మగవాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఎప్పుడూ ముందు ఉంటానని చెప్పుకుంటూ ఉంటుంది.   ఆవిడ ఒక వ్యక్తిని గత నెల రోజులుగా గమనిస్తోంది .అతని గురించి కాలనీలో అమ్మలక్కల ద్వారా వివరాలు సేకరించింది.అతని గురించి విషయాలు తెలిసే కొద్దీ వనజకి అతని మీద కోపం ,అసహ్యం ఎక్కువ అయిపోతున్నాయి.
అతని పేరు  విశ్వనాధ్ .వనజ ఉండే కాలనీలోనే ఉంటాడు.వయస్సు  అరవై  పైనే.దేశం వివిధ ప్రాంతాల్లో ఏదో  పెద్ద ఉద్యోగం చేసి , రిటైర్ అయ్యి , ఈ మధ్యనే కాలనీ లో ఉన్న తన సొంత ఇంటికి వచ్చాడు .భార్య లేదు. ఒక కూతురు ,ఒక కొడుకు .కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేసాడు .
అవన్నీ బాగానే ఉన్నా వనజకి నచ్చనిది ఏమిటంటే కాటికి కళ్ళు చాపుకున్న అతను అమ్మాయిల వెంట పడడం !!??
విశ్వనాధ్ ని ఎన్నో సార్లు రోడ్డు మీద చూసింది .ఎప్పుతూ అతని చూపులు చుట్టూ పక్కల ఉన్న అందమైన అమ్మాయిల పైనే!!??వాళ్ళని తినివేసేట్టు చూస్తాడు.కూతురు,ఇంకా చెప్పాలంటే  మనవరాళ్ళ వయసు ఉన్న వాళ్ళని విశ్వనాధ్ చూసే ఆకలి చూపులు వనజకి కంపరం పుట్టిస్తున్నాయి.అలాగే వాళ్ళతో ఏదో రకంగా మాటలు కలిపి మాట్లాడడం .ఆ అమ్మాయిలు కూడా ఏదో పెద్దవాడు కదా అని గౌరవంగా మాట్లాడి ఊరుకుంటున్నట్లున్నారు  .ఎప్పుడూ అతను హద్దులు మీరినట్టు ఎవ్వరూ పిర్యాదు  చెయ్యకపోవడంతో  ఇన్నాళ్ళు  ఏమీ చేయలేకపోయింది వనజ . 
కానీ ఇప్పుడు ఒక ఆయుధం దొరికింది .అంతకు ముందు రోజు కాలనీలో బస్సుస్టాప్ లో స్రవంతి అనే అమ్మాయిని గంట సేపు కూచోపెట్టి యక్ష ప్రశ్నలతో విసిగించాడని వింది.స్రవంతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తోంది .అమ్మాయి ఎంతో అందంగా ,ఆకర్షణీయంగా ఉంటుంది .ఎంతో నెమ్మదైన అమ్మాయిగా కాలనీలో పేరు తెచ్చుకుంది.తల్లి తండ్రులు ఇద్దరూ  గవర్నమెంట్ కాలేజీలలో టీచింగ్ పోస్టులలో ఉన్నారు.వాళ్ళ కుటుంబం ఎంతో గౌరవమైన కుటుంబం . ’అటువంటి కుటుంబంలో అమ్మాయి మీదే కన్నేసాడు ఆ ముసలి నక్క ‘ అనుకుంది వనజ .
స్రవంతిని పిలిచి అడిగితే ఆ అమ్మాయి కూడా విశ్వనాధ్ తనతో చాలాసేపు మాట్లాడాడని చెప్పింది.అయితే ఎక్కడా మాటలలో కానీ చేతలలో కానీ అసభ్యత లేదనే విషయం చెప్పింది స్రవంతి .
“మేకవన్నె పులులు అలాగే ఉంటారు .మనం పేపర్లలో ఎన్ని చదవడం లేదు .న్యూస్ లో ఎన్ని చూడడం లేదు .అసలు అంతసేపు నీతో మాట్లాడాడు అంటేనే అందులో ఏదో దురుద్దేశ్యం దాగి ఉంది .అతని వయస్సు ఏమిటి? నీ వయస్సు ఏమిటి? అందరూ చూస్తుండగా బస్సుస్టాప్ లోనే వ్యవహారం అలా  ఉందంటే ఎప్పుడో తన ఇంటికి రమ్మంటాడు ,లేకపోతే హోటల్ కి రమ్మంటాడు.నువ్వు కంప్లైంట్  చెయ్యి “ అంది వనజ .
“అయన చాల మంచివారులా ఉన్నారు ఆంటీ .”అంది స్రవంతి. 
“పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని నీకు తెలయదమ్మా.నిన్ను అలా గంట సేపు విసిగించాడని ఒక లెటర్ రెడీ చేశాను.సంతకం పెట్టు .అతని అంతు చూద్దాం .”అంది వనజ.ఆవిడకి తన పాపులారిటీ పెంచుకోడానికి  మంచి అవకాశం దొరికింది .
“ఆంటీ అమ్మ ,నాన్న గారికి ఓ మాట చెప్పి ....” అంది స్రవంతి.
“ వాళ్ళకు చెప్పడం దేనికి?నువ్వు చిన్న పిల్లవి కాదు కదా ?”అంది వనజ.
“నేను వాళ్ళకి చెప్పి పది నిమషాల్లో వస్తాను “అంటూ వనజ రియాక్షన్ కోసం చూడకుండా వడివడిగా నడిచి వెళ్లిపోయింది స్రవంతి .
వనజ తనుకూడా వేగంగా నడుస్తూ స్రవంతి ఇంటికి వెళ్ళి ,ఆ అమ్మాయి తల్లి తండ్రులని కలిసింది .కానీ 
ఆమెకి నిరాశే ఎదురయ్యింది.అసలు ఏమీ లేనిదానికి ఏదో అర్థంలేని కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళు ససేమిరా అన్నారు .అటువంటి తల్లితండ్రుల వల్లే పిల్లలు ఇబ్బందుల్లో పడుతున్నారు అని ,అది గ్రహించి వాళ్ళు ముందుకు రావాలని వనజ నచ్చచెప్పబోయింది .వాళ్ళు వినలేదు.తమ కుటుంబం రోడ్డుపాలు కావడం ఇష్టం లేదనీ,అదికాక ఏమీ లేని దానికి ఒక మంచి వ్యక్తి మీద అభాండాలు వెయ్యడం తప్పు అనీ అన్నారు.స్రవంతి కూడా అదే మాట అంది .వనజ చిరాకుగా ,అసహనంగా ,నిరాశతో స్రవంతి ఇంటినుంచి బయటకు వచ్చింది.ఆవిడ మనసు కుతకుత ఉడికి పోయింది.
‘స్త్రీలు ఇంత పిరికి వాళ్ళు కనుకనే మృగాళ్ళు అలా బరితెగించి పోతున్నారు’ అనుకుంటూ తన ఇంటికి చేరింది వనజ .
*  *  *
రెండురోజుల తరువాత వనజకి  మళ్ళీ ఒక అవకాశం  వచ్చింది .ఆ రోజు మరలా విశ్వనాధ్ బస్సుస్టాప్ లో  స్రవంతితో మాట్లాడుతున్నాడు.
వెంటనే కాలనీలోని మహిళా మండలి సభ్యులందరికీ ఫోన్లు చేసి,అందరినీ బస్సు స్టాప్ కి రమ్మని చెప్పింది.పది నిమషాల్లో బిలబిలమంటూ జనం బస్సు స్టాప్ లో చేరిపోయారు.వాళ్ళని చూసి విశ్వనాధ్,స్రవంతి ఆశ్చర్యపోయారు .కొంచం కంగారు పడ్డారు.
వనజ మొహంలో విజయ గర్వం తొణికిసలాడసాగింది .
“విశ్వనాధ్ గారు .మీ వయస్సు ఏమిటి ?ఆ అమ్మాయి వయస్సు ఏమిటి ?ఆ అమ్మాయిని ఎందుకు అలా వెంబడిస్తున్నారు ?ఎందుకు అలా హరాస్  చేస్తున్నారు? ”అని అందరి ముందు బిగ్గరగా అడిగింది వనజ .
“మేడం ,మీరు ఎవరో తెలియదు . ఏం మాటలడుతున్నారో అంతకంటే తెలియడం లేదు .”అన్నాడు విశ్వనాథ్ మెల్లగా .
“మరీ అంత నటించకండి .కనిపించిన అమ్మయినల్లా  వల్లో వేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు .అది నిజం కాదా?”అంది వనజ .
“మీరు ఏమిటి మాట్లాడుతున్నారో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు “అన్నాడు విశ్వనాధ్.
“మదపిచ్చి పట్టిన వాళ్ళకి నా మాటలు అర్థం కావులెండి ....” అంటూ ఇంక ఏదో అనబోయిన వనజ ని ‘ఇక మాట్లాడకు’ అని చేతితోనే వారించింది స్రవంతి .
“మా తాతగారు అంటూ ఉండేవారు .పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట .మీరు అలాంటి వాళ్ళు ఏమో అందుకని ఆ మహానుభావుని గురించి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు .”అంది స్రవంతి  కోపంగా.
“ఓహో నువ్వు ఆయనని వెనక వేసుకునే వరకు వ్యవహారం వచ్చిందంటే  అయన నిన్ను బాగానే వల్లో వేసుకున్నాడు .......” అంటూ ఇంక ఏదో అనబోయింది వనజ .
“నా కాబోయే మామగారిని ఇంకా ఒక్క మాట అన్నారు అంటే సహించను “అంది స్రవంతి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ .
“ఏమిటి నీ కాబోయే మమగారా !!??”అంది కంగుతిన్న వనజ .
“అవును .అయన అమ్మాయిల వెంటబడుతున్నారు ,అమ్మాయిలను అసభ్యంగా చూస్తున్నారు ,వాళ్ళని వల్లో వేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు లాంటి పిచ్చి మాటలు మాట్లాడారంటే  ఊరుకోను.అయన జీవితంలో ఎంతో కష్టపడ్డారు.ఇంకా కష్టపడుతున్నారు.అయన తన కొడుకుకి తగిన అమ్మాయి కోసం స్వయంగా వెతకడం మొదలు పెట్టారు.అందుకే కనిపించే ప్రతి అమ్మాయిని పరిశీలనగా చూడడం, వివరాలు కనుక్కోవడం,అబ్బాయికి సరిపోతుందా ,ఒక వేళ సరిపోతే అబ్బాయి అమ్మాయికి ఇష్టమేనా లాంటి వివరాలు అడగడం చేసేవారు.మీరు దానికి మీ వక్ర దృష్టి తో పూర్తిగా వేరే రంగు ఇచ్చి,గొడవలు పెట్టి చీప్ పాపులారిటీ సంపాదిద్దామని  ప్రయత్నించారు.అయన దృక్కోణం మహోన్నతమయ్యింది. మీ నీచమైన దృష్టి వేరు.అసలు మీలాంటి వాళ్ళే మన సమాజానికి డేంజరస్.......మీమీ పనులు మానుకుని వచ్చిన వాళ్ళందరూ ముందు మీ ఇళ్ళని బాగు చేసుకోండి .తరువాత సమాజాన్ని ఉద్ధరిద్దురుగాని.”అని అందరి వైపు అసహ్యంగా చూసింది స్రవంతి.అక్కడ ఒక్కరి మొహాల్లో కూడా కత్తివాటుకు నెత్తురు చుక్క లేదు. సహజం.
***

No comments:

Post a Comment

Pages