సుజాత మళ్ళీ పుట్టినూరుకు... - అచ్చంగా తెలుగు

సుజాత మళ్ళీ పుట్టినూరుకు...

Share This
 సుజాత మళ్లీ పుట్టినూరుకు..
ప్రతాప వేంకట సుబ్బారాయుడు


సుజాత న్యూజెర్సీ నుంచి ఫ్లైట్లో హైద్రాబాదుకు వచ్చి..హోటల్ రూం లో ఫ్రెషప్ అయ్యి రాత్రి క్యాబ్ లో సి బి ఎస్ కి చేరుకుని భీమవరం వెళ్లే బస్ ఎక్కి కూర్చుంది. ఇక్కడి భూమిమీద దిగినప్పటినుంచి మనసులో ఏదో తెలీని మధుర భావన.
పదిహేను నిముషాల తర్వాత బస్ బయల్దేరింది. కొద్దిదూరం ప్రయాణించాక డ్రైవర్ బస్సులోని లైట్లు ఆర్పేశాడు. ఎల్ సీ డీ టీ వీ లో ఏదో కొత్త సినిమా నడుస్తోంది. సౌండ్ అస్సలు వినిపించడం లేదు. కేవలం బొమ్మలు కదులుతున్నాయంతే!
సుజాత కిటీకీలోంచి బయటకు చూపు సారించింది. ధగధ్ధగాయమానంగా వెలిగిపోతున్న మాల్స్, చాలావరకు మిణుకు మిణుకులతో సరిపెట్టుకుంటున్నషాపులు, గుళ్లూ..గోపురాలు..అక్కడక్కడా ఇళ్లూ..హోటల్లూ వెనక్కి వెళ్లిపోతున్నాయి. ‘తన జీవితంలో ఎన్నో సంవత్సరాలూ గతంలోకి ఇలాగే జారిపోయాయికదా!’ అన్న ఆలోచన తటాలున మనసులో మెదిలి ఆమె పెదాలపై చిరునవ్వు నిలిచింది.
అనుకోకుండా గతం ఆమె స్మృతి పథంలో కదలాడసాగింది.
***
సుజాతను చూసుకోడానికి పెళ్లివారొచ్చారు. అబ్బాయి రఘు వాళ్లమ్మనాన్నలకు ఒక్కగానొక్కడు. అందగాడు. హైద్రాబాదులోని సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం. అప్పటికి సుజాత కూడా బి టెక్ పూర్తి చేసి, సంజీవరెడ్డీ నగర్లో సాఫ్ట్ వేర్ కోర్స్ చేస్తోంది. తల్లిదండ్రులకు ఆమె కూడా ఒక్కతే సంతానం. మగపెళ్లివారు కట్నకానుకలు అడగనందుకు, మరే రకమైన అడ్డంకులూ లేనందుకు వాళ్లిద్దరి పెళ్లి శీఘ్రంగానే జరిగిపోయింది.
రెండు సంవత్సరాల కాలం సునాయాసంగా సాగిపోయింది. ఈ మధ్య కాలంలో సుజాత కోర్స్ పూర్తి చేయడం, ఆమెకీ మాదాపూర్లో మంచి ఉద్యోగం రావడం జరిగిపోయింది.
ఇద్దరి సంపాదన నెత్తికి నేలకు. హాయిగా ఆనందంగా ఉంటున్నారు. వాళ్లిద్దరి మధ్యకీ ముద్దులొలికే ఒక పాపకూడా వచ్చింది.
అంతలో ఒక చిన్న అపశ్రుతి. 
సుజాతకు అమెరికాకెళ్లే అవకాశం వచ్చింది. 
ఆ వార్తను ఎంతో సంతోషంతో, ఉద్వేగంతో రఘుకు చెప్పాలని ఆఘమేఘాలమీద ఆఫీసు నుంచి ఇంటికొచ్చింది.
రఘు, ఆమె అనుకున్నంత ఎగ్జైటెడ్ గా వార్తను రిసీవ్ చేసుకోలేదు. పైనుంచి నిర్లిప్తంగా ఉన్నాడు. ఆమె తన సంబరం మీద నీళ్లు చిలకరించినట్టుగా ఫీల్ అయింది.
"ఈ అవకాశం కోసం మా ఆఫీసులో ఎంతమంది కాచుక్కూర్చున్నారో, ఎంతమంది అందరి కాళ్లూ పట్టుకున్నారో నాకు తెల్సు, కాని మేనేజ్ మెంట్ నా ప్రతిభను గుర్తించి నాకు మాత్రమే ఈ అవకాశం ఇచ్చింది. విదేశానికి వెళ్లడమే కాదు, రెండు చేతులా..కాదు కాదు ఎన్నో చేతులా సంపాదించుకునే మంచి అవకాశం. మనదేశంలో ఎంతోమంది యువత ఉద్యోగం కోసం అల్లాడుతున్నారు. అలాంటిది నాకు ఉద్యోగం రావడమే కాకుండా, విదేశానికి ప్రయాణించే అవకాశం అతి తక్కువ సమయంలో రావడం..ఓహ్! ఏ జన్మలోనో ఏ దేవుడికో గొప్ప పూజ చేసుంటా..అందుకే ఈ వరం. నాతో పాటూ నువ్వూ వచ్చేయ్. అక్కడ జాబ్ చూసుకుందువుగాని. అయినా ఈ వార్తకు నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నావని నేననుకోవట్లేదు. ఎందుకంటే అది నీ మనస్తత్వం కాదు. మరెందుకు అలా డల్ గా ఉన్నావో మాత్రం తెలీడం లేదు" అంది.
డబ్బనేది అవసరానికి, డబ్బే అవసరం కాదు. నువ్వు అక్కడికెళ్లి అక్కడి ఆడంబరాలకి అలవాటుపడిపోతే, మళ్లీ ఇటు రాలేవు. ఇక్కడి అనుబంధాలు, ఆప్యాయతలు అన్నీ మనసులోతుల్లో మరుగున పడిపోతాయి. నాకూ ఒకప్పుడు ఇలాంటి అవకాశమే వచ్చింది. నేను తిరస్కరించాను, కాబట్టే నిన్ను పొందగలిగాను. నా మాట విను సుజీ, ఆ ప్రొపోజల్ ను రెఫ్యూజ్ చేయి. అందరం కలసి ఇక్కడ హాయిగా ఉందాం"అన్నాడు.
"ఏంటి రఘు ఆ నెగటీవ్ ఆలోచనలు? మన బంధువుల్లో విదేశాలకు వెళ్లినవాళ్లు ఉన్నారా? డబ్బు విలువ నీకు తెలీదని నేననుకోను. అది ఎంత సంపాదిస్తే అంత గొప్ప. జీవిత చరమాంకంలో సుఖంగా ఉండొచ్చు. మా నాన్నగారు నన్ను చదివించడానికి ఎంత ఇబ్బంది పడ్డారో, పెన్షన్ డబ్బులతో ఇంటిని గడపడానికి ఎంత అవస్త పడ్డారో నేను కళ్లారా చూశాను. మన జీవితాల్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సింది డబ్బుకే! డబ్బుకే!! తర్వాతే బంధాలకు" అంది నిర్ద్వందంగా.
ఆ రోజు నుంచి సుజాత వెళ్లేవరకు చిన్న చిన్న వాగ్వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇరువైపుల పెద్దలూ సర్ది చెప్పడానికి చూశారు. సుజాత తనిక్కడ ఉండడానికి, రఘు ఆమె వెంట విదేశానికి వెళ్లడానికి అంగీకరించలేదు.
పాప రఘు దగ్గరే ఉండేట్టు నిర్ణయం జరిగిపోయింది. ఎందుకంటే ఇక్కడ రఘుతో పాటు బంధువర్గం ఉంటుంది కాబట్టి, అవసరానికి సహాయపడతారు కాబట్టి.
సుజాత ఫ్లైట్ ఎక్కి గగనతలానికి ఎగిరింది. రఘు కింద నేలమీద ఉండిపోయాడు.
***
పదేళ్లు గడిచిపోయాయి.
అసలు ఎలా గడిచిపోయాయో తెలీదు. బహుశా మనదేశంలో కన్నా విదేశాల్లో కాల చక్రం గిర్రున తిరుగుతుందేమో?
ఈ మధ్యలో రఘు, పాప తనకు గుర్తొచ్చినా బాధ్యతలు ఆమె మనసును తమవైపు మొగ్గేలా చేశాయి.
పాపకు హైందవి అని పేరు పెట్టారట. రఘు పంపిన ఫోటోల్లో పాప ఎంత బావుందో.
ఇక్కడ రఘు జాబ్ కు రిజైన్ చేసి సొంత ఊళ్లో పిల్లలకి ట్యీషన్స్ చెబుతూ, తన తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.
ఎందుకో ఆమెకు ఈమధ్య తరచూ తన ఊరు, తనవాళ్లూ గుర్తు రావడం మొదలెట్టారు. 
సుజాత ఇహ తన ఊరు వెళ్లిపోదామని నిర్ణయం తీసుకుని స్వదేశానికి బయల్దేరింది.
*** 
బస్ భీమవరం చేరుకుంది.
బస్ దిగిన ఆమెని రిసీవ్ చేసుకోడానికి రఘు బస్టాప్ కు వచ్చాడు.
రఘులో అప్పటికి ఇప్పటికీ మార్పేం లేదు. పక్కన ఉన్న తమ పాప పరికిణీ ఓణీలో అందాల బొమ్మలా ఉంది. ఆమెని చూడగానే సుజాతలో మాతృత్వం పొంగిపొరలింది. పాపను కౌగలించుకుని కళ్ల నుంచి స్రవిస్తున్న నీళ్లతో తడిపేసింది.
"ఊర్కో సుజాతా, పద ఇంటికెళదాం"అన్నాడు రఘు ఆమె చేతిలోంచి బ్యాగ్ అందుకుని.
అతని చేయి ఆమె, ఆమె చేయి పాప పట్టుకుని ఇంటిదారి పట్టి వెళుతుంటే చూడ ముచ్చటైన కుటుంబానికి ప్రతీకలా ఉన్నారు.
పెంకుటింట్లోని తమ ఇంటికి ఆమెని తీసుకొచ్చాడు. 
అందులోకి అడుగు పెడుతుంటే అన్నాళ్లూ తను కంఫర్ట్ అనుకుని ఉన్న స్టార్ హోటల్ రూమ్స్ కూడా దానిముందు బలాదూర్ అనిపించింది.
స్నానం చేసి కాస్సేపు రెస్ట్ తీసుకునే సరికి రఘు తల్లి కనకమ్మ ఆమెని భోజనానికి లేపింది.
అప్పటికే అందరూ అరిటాకులేసుకుని కూర్చున్నారు. 
వేడి వేడి అన్నం, ఆవకాయ, పప్పు, పేరిన నేయి, దొండకాయ వేపుడు, ఆవపెట్టిన వంకాయ కూర, ముక్కల పులుసు, మునక్కడల చారు, గడ్ద పెరుగు..ఓహ్ ఒక్కటనేమిటి? పొట్ట తనిక సరిపోనని మొరాయిస్తున్నా, నోరు కట్టుకోలేకపోయింది. భుక్తాయాసంతో లేచి నాలుగు వక్కపలుకులేసుకుని కుర్చీలో కూర్చుంది. అక్కడికి వచ్చి కొద్ది దూరంలో గోడకానుకుని నుంచున్నాడు రఘు.
"ఏవండి..మీరన్నట్టు మనిషికి డబ్బు అవసరమే కానీ డబ్బే అవసరం కాదు. మీరు ఇక్కడ అందరి సమక్షంలో గడిపిన విలువైన జీవితం ముందు, విదేశంలో నేను గడిపిన ఒంటరి జీవితం వెలతెలపోయింది. నేను వెళుతున్నప్పుడు అరచేతుల్లో ఒదిగిన పిల్ల, నేను అచ్చటాముచ్చటా చూడకుండానే నా భుజాలదాకా ఎదిగింది. ఇల్లాలిగా, తల్లిగా నేను చాలా కోల్పోయాను. నా మూలంగా మీ జీవితంలోనూ సుఖమూ శాంతమూ లేకుండా పోయాయి. ఇప్పుడు నేను సంపాదించిన డబ్బు నేను కోల్పోయిన కాలాన్ని నాకు ఇవ్వలేదు"అని ఏడ్చేసింది.
"జరిగిందేదో జరిగిపోయింది సుజీ. ఇప్పటికైనా వచ్చావు. ఎప్పటికీ మార్పురాక అక్కడే అతుక్కుపోయిన ఎంతోమంది కన్నా నువ్వు నయం. జననీ జన్మ భూమి అని ఎందుకంటారో తెలుశా సుజీ! మనల్ని కడుపులో పెట్టుకుంటుంది కాబట్టి. మనుషుల అనుబంధలే కాదు ఇక్కడి పరిసరాలు రుచులూ మనలను కట్టిపడేస్తాయి. ఈ జన్మకు ఇవి చాలనిపిస్తూంది. నేను హైద్రాబాదులో ఉన్నప్పుడు జ్వరం వస్తే, జిహ్వకు రుచిగా కాస్త నిమ్మకాయ ముక్క నాలుక్కి తగిలితే బాగుండుననుకునేవాణ్ని. ఫ్రెండ్సందరం హోటల్కెళ్లి బిర్యానీ తింటే, మళ్లీ ఇంటికొచ్చి మా అమ్మ పెట్టిచ్చిన ఆవకాయ వేడన్నంలో తిని పడుకునేవాణ్ని. అమ్మ ఒళ్లో ఆదమరిచే సుఖం, ఎంత మెత్తటి పరుపులున్న మంచం మీదన్నా పొందగలమా? డబ్బుతో అనుభూతులు కొనలేం సుజీ!
రోజూ అమ్మనాన్నలతో, తెలిసిన నలుగురితో నాలుగు మాటలు మాట్లాడితే గాని మనసు ఉండబట్టేది కాదు. నువ్వెళ్లాక ఇక అక్కడ ఉండలేక ఈ ఊరు వచ్చేశాను. స్వర్గం అనేది చనిపోయాక మనం చేరాలనుకునేది కాదు. బతికుండగా ఇక్కడ అనుభవించేది.
సాయంత్రం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్దాం. ఇకముందన్నా మనకు ఎటువంటి కష్టాలు, ఎడబాట్లు కలగకూడదని మనసారా స్వామిని కోరుకుందాం సరేనా?" అన్నాడు.
‘సరే’ అన్నట్టుగా ఒక్క ఉదుటున లేచి అతని గుండెల మీద గువ్వలా ఒదిగిపోయింది.
***

No comments:

Post a Comment

Pages