మళ్ళీ... అమ్మ ఒడి - అచ్చంగా తెలుగు
​మళ్లీ…. అమ్మ ఒడి
- పోడూరి శ్రీనివాసరావు

అమ్మ మనసేమో…. చందమామంత చల్లన! 
అమ్మఒడేమో....ఉదయభానుని కీరనాలంత వెచ్చన!!
అమ్మ ఒడి సౌఖ్యాన్ని.... 
ఆ వెచ్చదనాన్ని.... 
పొత్తిళ్ల నుంఛీ  
అనుభవిస్తూనే ఉన్నాను. 
అరవై ఏళ్ల వయసు వచ్చినా కూడా... 
అమ్మఒడి లాంటి సౌఖ్యం నేనింత
వరకు అనుభవించలేదు –
చివరకు నేనెంతగానో ప్రేమించిన 
నాభార్య కౌగిలిలో కూడా.... 
ఒక్కసారిగా కాలచక్రం 
ఆగిపోతే ఎంత బాగుండును? 
ఆగిపోవడమే కాదు...
వెనక్కు తిరిగితే ఎంత బాగుంటుంది?
నేను మళ్ళీ చిన్న పిల్లవాడినైపోవచ్చు.
అమ్మచేతి గోరుముద్దలు...
అమ్మ నోట లాలి పాటలు...
అమ్మస్తన్యపు అమృతధారలు... 
మాతృత్వపు గారాబాలూ...  
అల్లిబిల్లి ఆటపాటలు...
లోకం తెలియని పోకడలు...
ఊహకందని మధురానుభూతులు...
మళ్లీ నేను చిన్నపిల్లవాణ్ణైపోతే  
స్కూలుకు వెళ్ళనని మారాములు... 
పాలు తాగనని విదిలింపులు...
అమ్మ చేతినుంచి విదిలించుకుని... 
బుజ్జితువ్వాయిలా పరుగులు...
స్కూలుకు వెళ్లే టైమయి, 
బస్ వాడు హారన్ మ్రోగిస్తుంటే  
అమ్మ చేతికందకుండా,
పెరటి చెట్ల మధ్య పరుగులు తీస్తుంటే....
నన్ను పట్టుకోలేక అవస్థపడుతూ.... 
ఆపసోపాలతో అలసిన 
అమ్మ ముఖం చూసి 
జాలితో నేను దొరికిపోతే....
విజయగర్వంతో....
నన్ను తొందరగా తయారుచేసి 
స్కూలుకు పంపే అమ్మ తిప్పలు... 
తలుచుకుంటేనే చాలు 
ఒడలు పులకరించే 
చిన్ననాటి, చిలిపి, చిన్నారి చేష్టలు....
ఈనాడు... పెద్దవాణ్ణయ్యాక 
నామనుమలు ఇవన్నీ చేస్తుంటే....
చిన్ననాడు నేనీపనులు అన్నీ 
చేశానని...అవే.. నామనుమలు 
నేడు చేస్తున్నారని....
అహంతో.... అంగీకరించలేని 
నా మనస్సు –
వెధవ అల్లరి చేస్తున్నారని 
వాళ్లను కేకలు వేస్తుంది 
సృష్టి విచిత్రం కదూ!!!
పైగా... ఇప్పుడు నాఆలోచనలు లెలా ఉన్నాయి?
కాలచక్రం వెనక్కు తిరిగిపోతే బాగుండును.
నేను మళ్ళీ... చిన్నపిల్లవాడినైపోతే బాగుండును.
నేను చిన్నపిల్లవాడినైపోయి 
చిన్నతనంలో నేను చేసిన 
అల్లరి అంతా... మళ్ళీ చేయవచ్చు!
కానీ... అదే అల్లరి మామనవాళ్లు 
చేస్తే...కోతి వెధవలు!
పెద్ద తరహాలేదు!!
కానీ.. నా...ఆలోచనలు నాకే నవ్వు తెప్పిస్తాయి.
నిజమే....
నేను చిన్నవాడినైపోతే! 
మళ్ళీ చిన్నవాడినైపోతే!! 
పెన్షన్ గురించి టెన్షన్ లేదు. 
రేపు ఎలాగడుస్తుందన్న 
ఆలోచన లేదు.
ఈ బిజీ యాంత్రికజీవితంలో 
దిన దినగండం నూరేళ్ల ఆయుష్షులా  
బతకాల్సిన అవసరం లేదు.
ఈ అనారోగ్య జీవితం...
లెక్కలేకుండా మింగే మందుబిళ్లలు...
నిత్యం బిపి..షుగర్ చెక్కింగులు...
ఎప్పుడు గుండాగి పోతుందో అనే బెంగ...
యాంత్రిక వాకింగ్ లు...
వీటన్నిటికీ ‘గుడ్ బై’ చెప్పేయచ్చు...
నేనొక్కసారి మళ్ళీ చిన్న పిల్లవాడినైపోతే! 
మళ్ళీ అమ్మ ఒడిలోచేరి 
అమ్మ లాలి పాటలు వింటూ....
అమ్మస్తన్యపు అమృత ధారలు గ్రోలుతూ...
నాలోకంలో నేను విహరిస్తూ…. 
నా ఊహల్లో....
భగవంతునితో ఊసులాడుతూ.... 
ఈ లౌకిక ప్రపంచంతో 
సంబంధం లేకుండా.... 
అలౌకిక ఆనందాన్ని పొందుతూ! 
అమ్మ చెంగులాగుతూ.... 
పొత్తిళ్లలో,కొంగు చాటు 
చేసుకుని,స్తన్యమిస్తున్న....
ఆనందాన్ని అనుభవిస్తున్న...
అమ్మ... మొఖం  వంక ఓరచూపులు 
చూస్తూ - పమిట చాటు నుంచి 
ముఖాన్ని బయటకు చూపిస్తూ.... 
బోసినవ్వులు కురిపిస్తూ....
అమ్మ ముఖంలోని ఆనందాన్ని.... 
అమ్మ ఒడిలో నేను పొందిన 
అలౌకిక ఆనందాన్ని....
మరవలేని నామనస్సు....  
మరోమారు.... 
నన్ను చిన్నపిల్లవాడిగా 
మారిపోయి....
అమ్మ ఒడిలోని మాధుర్యాన్ని,
చవి చూడ మంటున్నాయి. 
మరోమారు నన్ను 
అమ్మ ఒడి చేరమంటున్నాయి.
***

No comments:

Post a Comment

Pages