సుబ్బుమామయ్య కబుర్లు! - అచ్చంగా తెలుగు
భావాలు 
సుబ్బుమామయ్య కబుర్లు!
ప్రతాప వేంకట సుబ్బారాయుడు పిల్లలూ ఎలా ఉన్నారర్రా! బావున్నారా?
మన మనసులో రోజూ రకరకాల భావాలు కలుగుతూ ఉంటాయి. కోపం, బాధ, దుఃఖం, ఆనందం, సంతోషం ఇలా అన్నమాట.
మన మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి. దేని గురించీ ఎక్కువగా ఆలోచించకూడదు. ఉదాహరణకు టీచర్ ఏదో విషయంలో తిట్టిందనుకోండి. ఏడ్చి, బాధపడిపోకుండా..కారణం ఆలోచించుకోవాలి. మీవల్ల ఏం తప్పు జరగకపోతే, వదిలెయ్యాలి. తప్పు జరిగితే సరిదిద్దుకోవాలి. అంతేకాని టీచరు కొట్టిందని, ఫ్రెండ్స్ నవ్వారని బాధపడిపోతే ఉపయోగం ఉండదు.
ఇంకో విషయం మనం ఏదైనా ఆట ఆడామనుకోండి. మనం ఓడనూ వచ్చు, గెలవనూ వచ్చు. గెలిస్తే ఎగిరి గంతులేసి, ఓడితే కుంగిపోకూడదు. గెలిచిన వారిపట్ల మన మనసులో అసూయ చోటుచేసుకోకూడదు. వాళ్లను అభినందించి, మనం మరింత ప్రాక్టీస్ చేసి గెలిచే ప్రయత్నం చేయాలి.
ఇప్పుడు పెద్ద పెద్ద స్థానాల్లో (పొజిషన్స్) ఉన్న వాళ్లందరూ తమ మనసులను తాజాగా (ఫ్రెష్) గా ఉంచుకునేవాళ్లే! ప్రశాంతంగా ఉన్న మనసుకే ఏకాగ్రత సాధ్యమవుతుంది. ఏకాగ్రత ఉంటేనే విజయం (సక్సెస్) వరిస్తుంది.
అప్పుడప్పుడు ఇంట్లో్వాళ్లనుంచో, బయటివాళ్ల నుంచో సమస్యలు ఎదురవుతాయి, అంతమాత్రం చేత దిగులు, విచారం మనసులో కలగకూడదు. అవి మనకు చెరుపు చేస్తాయి. ఎదగనివ్వవు.
ఎదుటివాళ్లపైగాని, శత్రువులపై గాని ఎంతటి ద్వేష భావం ఉంటే మనం అంతగా పతనమయిపోతాం. ఇది గుర్తుంచుకోవాలి.
దేవుడు మనకిచ్చిన జీవితం ఒక వరం. ఆనందంగా గడిపెయ్యాలి.
మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అంత సులువు కాదు. మీరు చిన్నప్పటి నుంచే అభ్యాసం చేయాలి. అప్పుడే పెద్దయితే మీరు నలుగురిలో గౌరవించబడతారు. ఉత్తమ స్థాయికి చేరతారు.
మరి మీరు మీ మనసును స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ఉంచుకుంతారు కదూ!

ఉంటానర్రా! 
మీ సుబ్బుమామయ్య.

No comments:

Post a Comment

Pages