దీపం‌ పరబ్రహ్మ స్వరూపం - అచ్చంగా తెలుగు

దీపం‌ పరబ్రహ్మ స్వరూపం

Share This
దీపం పరబ్రహ్మ స్వరూపం
-సుజాత. పి.వి. ఎల్ 


* మన సంసృతి లో దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజిస్తుంటాం. ' దీపం 'జ్ఞానానికి, సద్గుణ సంపత్తికి, ఆనంద వికాసానికి ప్రతీక. దీపం అంటే సమస్త అజ్ఞానాంధకారాలను పారద్రోలేదని అర్థం.

దీపారాధన, దీపదానం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయనేది అగ్నిపురాణంలోని లలిత కథ విశదపరుస్తుంది.

విదర్భ రాజు కూతురు లలిత. దీపదాన పుణ్యం వల్ల చారుధర్మ మహారాజుకు భార్య అయింది. ఆమె ఒకసారి విష్ణ్యాలయంలో సహస్ర దీపాలను దానం చేసింది. ఆలా ఎందుకు దీప దానం చేస్తున్నావ్?.. అందువల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయ''ని అడిగిన వారికి ..రాణి లలిత తన పూర్వ జన్మ కథను చెప్పింది.

పూర్వం సౌవీర రాజు దగ్గర మైత్రేయుడనే పురోహితుడుండేవాడు. అతడు దేవికా నదీతీరంలో శ్రీ మహా విష్ణువుకు ఆలయాన్ని కట్టించాడు. మైత్రేయుడు కార్తీకమాసంలో ఒక రోజు దీప దానాన్ని చేయడం జరిగింది. సరిగ్గా ఆ సమయంలో పిల్లిని చూసి భయపడిన ఒక ఆడ ఎలుక అకస్మాత్తుగా తన ముట్టెతో ఒక ప్రమిదలోని దీపపు వత్తిని పైకి తోసింది. అలా చేయడం వల్ల ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ దీపం బాగా ప్రజ్వరిల్లింది. మరణానంతరం ఆ ఆడ ఎలుక ఒక రాజుకు జన్మించింది. ఆ ఎలుకను తానేనని చెప్పింది లలిత. దీపదాన ప్రభావం వలన తనకు ఉత్తమ జన్మ, పూర్వ జన్మ స్మృతి లభించాయని లలిత చెప్పింది. ఇలా దీపం మహత్యం పలు విధాలు. అందుకే మన ఆలయాలలో కూడా దీపపు స్తంభాలు, దీపహారతులు దర్శనమిస్తూ నయనానందాన్ని కలుగజేస్తుంటాయి.

దీపంలో నూనెను కర్మ ఫలంగా, వత్తిని శరీరంగా జ్వాలను ప్రాణంగా మన పూర్వీకులు చెప్పారు. కర్మ ఫలం అనే 'నూనె' ఉన్నంతవరకే 'వత్తి' అనే శరీరంలో 'జ్వాల' అనే ప్రాణం ఉంటుంది. కర్మ ఫలం పూర్తవ్వగానే శరీరాన్ని ప్రాణం వదిలి పోతుంది .

అందుకే దీపాన్ని 'పరబ్రహ్మ స్వరూపం' అంటారు .

*****


No comments:

Post a Comment

Pages