దారిమధ్యలో... - అచ్చంగా తెలుగు
దారిమధ్యలో...
శ్రీవల్లీ రాధిక 


తెలియని దిగులూ నిరాశా మనసును ఊపేస్తూండగా కొంచెం ఆలస్యంగా ఆఫీసులో అడుగుపెట్టాను. అందరూ నిశ్శబ్దంగా పనిచేసుకుంటున్నారు. నా మనసులో మెదుల్తున్న ఆలోచన తెలిస్తే వీళ్ళంతా ఏం చేస్తారో! అనిపించింది.

సత్యనారాయణ కూడా తలవంచుకుని ఏదో వ్రాసుకుంటున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి “ఇవాళ రాత్రికి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోబోతున్నాను.” అని చెప్పేస్తే!

లేదు, చెప్పకూడదు. ఎవరికీ చెప్పకూడదు. సహోద్యోగులకీ, సరోజకీ, పిల్లలకీ అందరికీ హటాత్తుగా తెలియాలి రేపు పొద్దున. అంతటి షాక్ కలిగిస్తేనన్నా నా విలువనేమైనా గుర్తిస్తారా వీళ్ళు!

ఏమో నాకిప్పుడు ఎలాంటి నమ్మకాలూ లేవు. నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఇంట్లో వాళ్ళూ బయటి వాళ్ళూ కూడా. నా మంచితనం, నిజాయితీ, సరళత, క్రమశిక్షణ... ఇలాంటి లక్షణాలన్నీ నాకు అవతలి వారి నుండి అభిమానాన్ని తెచ్చిపెట్టడానికి బదులుగా అవమానాలని తెచ్చిపెడుతున్నాయి.

ఏ లక్షణాలని నేను  ముఖ్యమైనవిగా విలువైనవిగా భావిస్తానో వాటిని నా చుట్టూ వున్న వాళ్ళు  నిరుపయోగమైనవని అనుకుంటే అనుకోవచ్చు. అందుకు నాకు బాధ లేదు. కానీ ఆ లక్షణాలుండటాన్ని అసమర్థతగా భావించడమూ.. అలాంటి లక్షణాలున్నందుకు.. కేవలం అలాంటి లక్షణాలున్నందుకు నన్ను అవకాశం దొరికినపుడల్లా ఆటపట్టించడమూ నన్ను బాధపెడుతున్నాయి.

ఆఫీసులో వారికి ఒకరకం పరిహాసమయితే ఇంట్లోవారికి మరొకరకం అసహనం. నిన్న రాత్రి ఇంటికి వెళ్ళేసరికి ఏడు దాటింది. జోరున వర్షం కురుస్తోంది. ఇంట్లో అడుగు పెట్టగానే “శ్రీదేవి ఇంకా రాలేదండీ” అంది సరోజ.

శ్రీదేవి కాలేజ్ మరీ దూరం కాదు. వస్తూ వస్తూ దారిలో ఏదో ప్రోగ్రామింగ్ కోర్సుకు వెళ్ళి వస్తుంది. అయినా కూడా మామూలుగా అయితే ఏడయ్యేసరికి ఇల్లు చేరాలి మరి! వర్షం వలన ఆలస్యం అయిందేమో!  

నేను గొడుగు తీసుకుని మళ్ళీ వీధిలోకి వచ్చాను. కనీసం కాఫీ అయినా త్రాగలేదు.

శ్రీదేవి నా పెద్దకూతురు. దానిని నేనెంత గారాబంగా పెంచానో నాకు తెలుసు. కానీ దానికి ఆ విలువేమీ ఉన్నట్లు కనబడదు.

బస్ స్టాపుకి వచ్చి అరగంట పైనే  నిలబడ్డాను.

చివరికి ఎనిమిది గంటలపుడు అది బస్ దిగాక ఆ చీకట్లో వర్షంలో నేను సగం తడిసిపోతూ దానికి గొడుగు పట్టి మెల్లగా ఇంటికి తీసుకు వెళ్తుంటే అడిగింది అది.

“ఎంత సేపట్నుంచి నిల్చున్నారు!” అని.

నేను చెప్పబోయాను.

అంతలోనే “నాకు చచ్చేంత ఆకలేస్తోంది. ఆ బస్సుల్లో నిల్చుని వచ్చేసరికి నా ప్రాణం పోయింది” అంది విసురుగా.

ఇంక నేనేం మాట్లాడలేదు. కోపాన్ని దిగమింగి విసురుగా అడుగులు వేస్తూ గబగబా ఇంటికి తీసుకు వెళ్ళిపోయాను.

అంత చులకన దానికి నేనంటే. అవును అది చులకనే. కాకపోతే అంత విసురుగా ఏ పిల్ల అయినా తండ్రితో మాట్లాడుతుందా?

నిజమే. నేను అందరు తండ్రులలా లేను. ఇంకా ఏవో పద్ధతులూ పాడూ అంటూ ప్రాకులాడుతున్నాను. నేను పెరిగినంత ప్రశాంతంగా నా పిల్లల్నీ పెంచాలని తాపత్రయ పడుతున్నాను.

పిల్లలిద్దరూ ఇంజనీరింగ్ చదువులలోకి వచ్చినా ఇంతవరకూ వాళ్ళిద్దరికీ ఫోన్ కొనిపెట్టలేదు. కాలేజ్ లో ఫోన్ లేని పిల్లలెవరూ లేరట. “అందరి దగ్గరా ఫోన్ ఉంది, మా దగ్గర తప్ప” అంటారు నాపిల్లలు.

అది అబద్ధం కాదు, నేనూ చూస్తూనే ఉంటాను. ఇప్పుడు పిల్లలందరి దగ్గరా ఎంతో ఖరీదైన ఫోన్లు ఉంటున్నాయి. అవి లేకపోతే అసలు చదవడమే కుదరదన్న ధోరణిగా ఉంది ప్రస్తుతం.

ఎందుకు కుదరదో  చూద్దాం అని ఇప్పటివరకూ నేను పంతంగా ఉన్నాను కానీ ఆ అభిప్రాయాన్ని  మార్చుకోక తప్పడం లేదు. కాలేజ్ వాళ్ళు నోట్సులూ అవీ కూడా ఫోన్ ద్వారానే పంపుతున్నారు.

అందుకే ఈ నెలలో పిల్లలిద్దరికీ ఫోన్లు కొనేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆమాట వాళ్ళతో ఇంకా చెప్పలేదు. ఫోనొక్కటే కాదు. అన్ని విషయాలూ ఇంతే.  మరీ తప్పనిసరి పరిస్థితి వచ్చేవరకూ ఇప్పటి పద్ధతులని దూరంగా పెడదామని ప్రయత్నిస్తూంటాను నేను. వాటి దుష్ప్రభావాలకి వీలయినంతవరకూ గురికాకుండా ఉందామని అనుకుంటాను.

ఈ లక్షణమే బహుశా అటు ఆఫీసులోనూ ఇటు ఇంట్లోనూ కూడా నేనంటే ఒకరకమైన చులకన భావాన్ని కలిగిస్తోంది. నన్ను అపహాస్యం చేయడానికి కారణమవుతోంది.

రాత్రి అది అలా విసుక్కున్న తర్వాత ఇద్దరం మరోమాట లేకుండా మౌనంగా ఇంటిదాకా వచ్చేశాం. నాకు ఏమీ తినాలని కూడా అనిపించలేదు. సరోజ కాస్త మజ్జిగన్నా త్రాగండి అంటూ తెచ్చిస్తే అవి త్రాగి పడుకున్నాను.

ఒక పట్టాన నిద్రపట్టలేదు. చాలా విరక్తిగా అనిపించింది. కానీ ఎవరితోనూ ఏమీ అనలేదు. చర్చలు పెట్టుకోలేదు. నాకు మొదటినుంచీ ఉన్న మరొక ముఖ్య లక్షణమది. మౌనం. ఎంతో అవసరమయితే తప్ప మాట్లాడను.

మౌనం చాలా మంచి లక్షణం అంటారు. కానీ నాకది చేస్తున్న మేలు ఏమిటో  అర్థం కావడం లేదు. నిజానికి అది నాకు మేలు చేయకపోగా కీడు చేస్తోందా అని కూడా అనిపిస్తోందీమధ్య.

నన్ను ఎవరైనా బాధపెడితే వెంటనే నేనూ వాళ్ళు బాధ పడేలా ఏదో ఒకటి అనలేను. అలాంటపుడు అసలు ఏమనాలో నాకు తోచదు కూడా.  ఎంతసేపటికీ మనసులో మధన పడడమే కానీ దురుసుగా ఒక మాట మాత్రం బయటికి రాదు.

పిల్లలు విసుక్కున్నట్లుగా మాట్లాడినపుడు కూడా అంతే. వాళ్ళని ఏమీ అనను. అనలేను. ఇలా ఏళ్ళ తరబడి నా బాధలన్నీ మనసులోనే  దాచిపెట్టుకున్న ఫలితమేనా ఈరోజు నేనిలా అయిపోవడం! ఈ క్రుంగుబాటు! ఈ నిరాశ! రాత్రి అలా పడుకుని ఆలోచిస్తున్నపుడే వచ్చింది “ఇంకెన్నాళ్ళు ఇలాంటి జీవితం! చాలిస్తే పోదా?” అన్న ఆలోచన.

ఆ ఆలోచనకే ఉలిక్కిపడ్డాను. ఆత్మహత్య మహాపాపం. నాకు తెలుసా విషయం.

చనిపోవడం ఎప్పుడూ సమస్యకి పరిష్కారం కాదు. మనకి వచ్చే కష్టసుఖాలు మన ప్రారబ్ధం వలనే వస్తాయి. అవన్నీ ఒకప్పుడు మనం చేసిన కర్మల ఫలితాలే. ఆ ఫలితాలు మనకి వద్దనుకుని ప్రాణం తీసుకున్నా ప్రయోజనం లేదు. వాటితో పాటు ఆత్మహత్య అనే కొత్త పాపపు ఫలం కూడా కలుపుకుని మరొక జన్మలో అనుభవించాల్సిందే.

ఇలాంటి విషయాలన్నీ చిన్నప్పటినుంచీ తెలుసుకున్నవే. పెద్దలు చెప్పగా వినీ వినీ జీర్ణించుకున్నవే. అవి నన్ను ఆత్మహత్య లాంటి పనులు చేయనీయవు.

మరేం చేయాలి?  ఇలాంటి జీవితం ఎన్నాళ్ళు గడపాలి? ఎవరికీ నావల్ల చిన్న ఆనందం లేదు. నాపట్ల వారికి గౌరవమూ లేదు.

బహుశా లోపం నాలోనే ఉంది. అందుకే అందరూ నన్నిలా అసమర్ధుడిలా చూస్తున్నారు. చాలా సార్లు ఆ మాట నా మొహం మీదే చెప్తున్నారు! చిత్రమేమిటంటే కనీసం అలా చెప్తున్న వాళ్ళని కూడా తిరిగి నేనేమీ అనలేకపోతున్నాను.

రాత్రి చాలాసేపు అలా మధన పడ్డాక వీటన్నిటికీ వీరందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపించింది. శాశ్వతంగా కాకపోయినా కనీసం కొన్నాళ్ళు.. కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి.

ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా ఉండేటన్ని రోజులు ఎక్కడన్నా అజ్ఞాతంగా గడిపి రావాలి.  ఆఫీసులో చెప్పి వెళ్ళడం, సెలవు పెట్టడం లాంటివేవీ చేయకూడదు. ఆఫీసులో ఎవరితోనన్నా ఒక్కరితో.. కనీసం  సత్యనారాయణతో చెప్తే మంచిదేమో అని మొదట అనిపించింది కానీ మళ్ళీ ఆ ఆలోచన సరికాదనిపించింది.

ఇప్పుడు కాదు.. ఎక్కడికన్నా వెళ్ళి ఒక పదిహేను రోజులో నెలో అయ్యాక సత్యనారాయణకి ఫోన్ చేసి మనసు బాగాలేక తీర్ధయాత్రలకి వెళ్ళాననీ అక్కడ జబ్బు పడ్డాననీ చెప్పాలి. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆఫీసులో మాత్రం ఏదోలా వ్యవహారం నడపాలి.

ఇదంతా ఎవరి కోసమూ కాదు. ఎవరినో సాధించడానికి కాదు. నాకోసమే. నాలో ఉన్న లోపమేమిటో నేను తెలుసుకోవడానికే. నేను గొప్పవని నమ్మిన విలువలూ లక్షణాలూ నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నాయి? ఎందుకు బాధపెడుతున్నాయి?

నేను ప్రయాణిస్తున్న మార్గంలో నా ప్రవర్తనలో ఉన్న లోపమేమిటో పరిశీలించుకోవడానికీ విశ్లేషించుకోవడానికీ నాకు కొన్నాళ్ళు ఏకాంతం అవసరం.

నేనిలా రకరకాల ఆలోచనలలో కొట్టుకు పోతూండగా కబురొచ్చింది. నాలుగు గంటలకి పార్టీ వుందట. ప్రదీప్ ఉద్యోగం వదిలి వెళ్ళిపోతున్నాడు. ఇవాళ చివరి రోజు. ఆ సందర్భంగా పార్టీ.

ప్రదీప్ ఈ ఉద్యోగం మానేస్తున్న సంగతి పదిరోజుల క్రితమే తెలిసింది. కొత్త ఉద్యోగం ఎక్కడో జీతం ఎంత పెరుగుతోందో తెలియదు. నిజం చెప్పాలంటే నాకు తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. ముప్పై శాతం దాకా పెరిగి ఉండవచ్చు, లేకపోతే ఈ ఉద్యోగం వదలడు. ఆ విషయం నేను ఊహించగలను. కానీ నా ఉద్దేశంలో ముప్పై శాతం పెరిగినా ఈ ఉద్యోగం వదలడం తెలివితక్కువ పని. నేనైతే ఆ పని చేయను. ఎందుకంటే ఈ కంపెనీ ఇచ్చే భద్రతా ఇక్కడ ఉండే క్రమశిక్షణా వేరు.

ప్రదీప్ ఉద్యోగం మారుతున్నానని చెప్పినపుడు ఇద్దరం కాంటీన్లో ఉన్నాము. చెప్పాను కదా నాకసలు అతను ఎక్కడికి వెళ్తున్నాడు అదనంగా ఎంత సంపాదించబోతున్నాడన్న మీద ఆసక్తి కానీ అసూయ కానీ లేవు. నేను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం పట్ల అసంతృప్తి లేదు. అవసరమయితే మరొక ఉద్యోగం సంపాదించుకోలేని అసమర్ధతా లేదు.

కానీ అతనావార్త చెప్పగానే ఏమీ అడగకపోతే బాగుండదని “ఎక్కడికి వెళ్తున్నావు?” అన్నాను. అదొకరకంగా నవ్వి ఊరుకున్నాడు. సమాధానం చెప్పలేదు.

“ఇంటికి దూరం అవదా?” అన్నాను. అతను ఈ మధ్యే ఈ కంపెనీకి దగ్గర్లో అపార్ట్‌మెంట్ కొనుక్కున్నాడు. ఆ విషయం గుర్తొచ్చి ఇపుడు మళ్ళీ దూరంగా వెళ్ళిపోతున్నాడు కదా అనిపించి అదే మాట పైకి అనేశాను తప్ప అలా అడగడం వెనక నాకు ఇంకే ఉద్దేశమూ లేదు.

కానీ ప్రదీప్ దానికి వేరే భాష్యం చెప్పాడు. అతను ఏ కంపెనీకి వెళ్ళబోతున్నాడో తెలుసుకునేందుకు నేను వేసిన ఎత్తుగా భావించాడు. పెద్దగా నవ్వి “నీకు చేతకాదులే. ఇదే విషయాన్ని అమిత్ ఎంత తెలివైన ప్రశ్నలు వేసి నాచేత చెప్పించాడో తెలుసా!” అన్నాడు.

నాకు చిరాకుగా అనిపించింది. మొట్టమొదట వీళ్ళకు నా స్థితి ఏమిటో నా ఆలోచనలు ఎలాంటివో అవగాహన లేదు.    అది చాలదన్నట్లు నేనేదో మాలోకాన్ని అన్నట్లు నన్ను అపహాస్యం చేస్తారు.

నా సంతృప్తిని అర్థం చేసుకోక పోగా నేను వాళ్ళకన్నా అసంతృప్తిలో ఉన్నానని భావించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఇదే ఇదే నాకు చిరాకు కలిగిస్తున్న విషయం. నా వయసువాళ్ళూ విద్యాధికులూ ఉన్న ఆఫీసులోనే నన్ను అర్థం చేసుకునేవారు లేకపోతే ఇక ఇంట్లో పిల్లలూ భార్యా అర్థం చేసుకోవాలనీ చేసుకుంటారనీ ఆశించడం అనవసరం కదా!

నాలుగింటికి అందరం సమావేశం అయ్యాం.  ప్రదీప్ గురించి మంచిగా నాలుగు మాటలు చెప్పడం.. అతనికో బహుమతి ఇవ్వడం అన్నీ యధాప్రకారంగా జరిగాయి.

ఆతర్వాత ఫలాహారాలు కాఫీ టీలు సేవిస్తూ ఉన్నపుడు సత్యనారాయణ నా దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. అందరూ ప్రదీప్ ని అభినందిస్తూ ఉండడం దానికి అతడు స్పందిస్తూ ఉండడం కనబడుతోంది. మాటలు వినబడుతున్నాయి.

“నిన్న సాయంత్రం ఒక సాహిత్య సభకి వెళ్ళానోయ్, అక్కడొక మంచి ఉపన్యాసం విన్నాను” అన్నాడు సత్యనారాయణ. ఏం చెప్తాడా అని నేను కాఫీ చప్పరిస్తూనే వింటున్నాను.

“త్రిగుణాల గురించి చెప్పారు. మూడురకాల మనుషులలోనూ రజోగుణ ప్రధానులైన వాళ్ళని సులభంగా గుర్తుపట్టచ్చునని చెప్పారు ఆ ఉపన్యాసంలో. ఇప్పుడు ప్రదీప్ ని చూస్తుంటే ఆ విషయం బాగా అర్థమవుతోంది నాకు” అన్నాడు.

ఆ మాట విని నేను ఆశ్చర్యంగా ఒకింత ఆసక్తిగా చూస్తుంటే మళ్ళీ చెప్పాడు “సత్వ గుణ ప్రధానులకీ తమోగుణ ప్రధానులకీ మధ్య ఉన్న తేడాని అందరూ సులభంగా గుర్తించలేరట. ఇద్దరూ పైకి ఒకేలా కనిపిస్తూ ఉంటారు కాబట్టి తికమక పడ్తారట. అసంతృప్తులు ఉన్నా వాటిని  తీర్చుకోవడం చేతకాని అసమర్థుడై చతికిలబడేవాడు ఒకడు. ఏదైనా సాధించగల సమర్థత ఉన్నా నాకున్నది చాలన్న సంతృప్తితో ఆరాటపోరాటాలకి దూరంగా నిలబడే వాడొకడు. ఈ ఇద్దరికీ వ్యత్యాసం తెలుసుకోలేక జనం సత్వగుణ ప్రధానులని అపహాస్యం చేస్తూ ఉంటారట. నిన్న సభలో వక్త చెప్తూ  ఉంటే నిజమే కదా అనిపించింది నాకు.”

నేను నిర్విణ్ణుడ్నయ్యాను. ఏమిటీ మాటలు? సరిగ్గా ఇపుడే ఇవాళే సత్యనారాయణ  ఈ మాటలు చెప్పడం ఏమిటి? ఎవరో నాతో చెప్పమని పంపించినట్లుగా!

ఆలోచిస్తూనే ఇంటికి వచ్చాను. నేను లోపలికి అడుగు పెడుతూంటే శ్రీదేవి అంటోంది చెల్లెలితో. “ఇవాళ చాలా హాయిగా వచ్చేశాను, నిన్నయితే ప్రాణం పోయింది. వర్షంలో ఇంటిదాకా ఎలా నడవాలా అని భయపడుతూ  బస్ దిగేసరికి నాన్న గొడుగుతో నిల్చుని ఉన్నారు. ఆకలేస్తోంది నాన్నా అనగానే అప్పటివరకూ నీరసంగా అలసటగా నడుస్తున్న నాన్న ఎంత కంగారుగా వేగంగా ఇంటికి తీసుకువచ్చారో తెలుసా! నేను ఇంటికి వచ్చి అన్నం తినేదాకా నాన్న మనసు మనసులో లేదనిపించింది నాకు.”

వింటున్న నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. దాని మాటల్లో నామీద ధ్వనించిన ఆదరణకి కాదు.

అవును, అవతలివారు చూపించే ఆదరాలకీ అగౌరవాలకీ ప్రామాణికత ఏమీ లేదని  ఇందాక సత్యనారాయణ మోసుకొచ్చిన మాటలు వింటున్నపుడే అర్థమయింది. గొప్ప విలువల కోసం చేసే సాధనలో.. మంచి లక్ష్యం వైపు సాగే ప్రయాణంలో మానావమానాల గురించి ఆలోచించకూడదనీ వాటికి చలించకూడదనీ ఆ మొదటి పాఠమే తెలియజేసింది.

ఇపుడిది రెండో పాఠం! నేను గొప్పవని నమ్మి ఆచరిస్తున్న లక్షణాల గొప్పతనాన్నీ విలువనీ నా కళ్ళముందుంచుతున్న పాఠం!

మనసు కలవరపడినా మాటలో ఆ కల్లోలాన్ని  ప్రకటించకుండా ఉన్నపుడు కనిపించగల ప్రయోజనాన్ని నాకు స్పష్టం చేస్తున్న  పాఠం!

నాకు అర్థమై పోయింది.  నా ప్రయాణం సరిగా వుందా లేదా అని విశ్లేషించుకోవడానికి నేను ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రయాణిస్తున్నట్లే ప్రయాణిస్తే చాలు. నాకు చేరవలసిన  పాఠాలన్నీ ఎప్పటికప్పుడు నాకు చేరతాయి. దారిమధ్యలో నిల్చుని కలవరబడడానికి నేను ఒంటరిని కాను.

ఆ సత్యం స్పష్టం కాగానే ఎదురుగా చావడి గుమ్మం మీద చిరునవ్వులు చిందిస్తున్న రామపట్టాభిషేక చిత్రాన్ని చూస్తూ ధైర్యంగా ఉత్సాహంగా ఇంట్లోకి ప్రవేశించాను. 
***

No comments:

Post a Comment

Pages