నెత్తుటి పువ్వు - 12 - అచ్చంగా తెలుగు

నెత్తుటి పువ్వు - 12

Share This
 నెత్తుటి పువ్వు - 12
                                                                               మహీధర శేషారత్నం
(జరిగిన కధ :రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వస్తానని కబురు పెడుతుంది.) 

లైన్ కి కిందపెట్టావు కాయిన్, హాఫ్ సర్కిల్ పెట్టావు, పేర్చి పెట్టావు. తొండి ఆడేవు అంటూ వసంత ఒకటే గోల చేస్తుంది. ఆ సమయంలో ఆవిడకి తన వయసు గుర్తురాదు. మురళి కూడా తల్లితో సమానంగా పోట్లాడతాడు. ఇదే సమయంలో బుజ్జిగాడు, రాజుకొడుకు,వాడిపేరు సుధీర్ అయినా వాడిపేరుతో ఎవరూ పిలవరు. అందరూ బుజ్జిగాడే - వాడు అందరి కాయిన్స్ కలిపేసాడు. మురళి ఒకటే ఏడుపు, చూడుమామయ్యా! అంటూ, సరే మళ్ళీ ఆడదాం, ఏడవకు అంటూ ఓదార్చాడు నాగరాజు.
          “బుజ్జిగాడు కదమ్మా! వాడికి తెలియదు.” అంటూ వసంత కూడా ఓదార్చింది మురళిని.
          మళ్ళీ ఆట మొదలెట్టారు. నాగరాజు సరిగా ఆడలేదు. తొందరగా ముగించి పడుక్కోవాలని. నాగరాజు,మురళీ టీం ఓడిపోయింది. వాడు మళ్ళీ ఏడుపు మొదలెట్టాడు. ఇంక లాభంలేదని నాగరాజు వాడికి ప్రామిస్ చేసాడు.
          “ఒరేయ్! మురళీ! మనమే గెలుస్తాం రా! ఏడవకు”అన్నాడు. “అబద్ధాలు మావయ్యా! నువ్వు బాగా ఆడటం లేదు” వాడు గారాం చేసాడు.
          “ఒరేయ్! రాజు మాటంటే మాటేరా! చూడు. ఈసారి గెలుపు మనదే” ప్రామిస్ చేసాడునాగరాజు. వాళ్ళే గెలిచారు.
          “హేయ్! అంటూ మురళీ వాళ్ళమ్మనీ, అత్తనీ ఉడికించాడు. లక్ష్మి నవ్వి “టీ పెడతాను” అంటూ లోపలికి వెళ్ళిపోయింది. వసంత మాత్రం ఊరుకోలేదు.
          “మొదటి ఆట బుజ్జిగాడు కాయిన్స్ కలిపేసాడు. కనుక ఎవరిదీ కాదు రెండోది, మేం గెలిచాం. మూడు మీరు గెలిచారు. కనుక డ్రా!” అంది.
          మురళి ఉడుక్కున్నాడు.
          నాగరాజు చేయిచాటు చేసుకుని “ఉత్తుత్తినే” అని వెక్కిరించాడు.    
          "గెలుపు మనదేరా!” అంటూ వాణ్ణి ఎత్తుకుని గిర్రున తిప్పాడు.
          “ఇదుగో! ఇంక పడక సీను వెయ్యకు టీ పెట్టాను”లోపల్నుంచి లక్ష్మి అరిచింది.
          ఇదుగో! అనే పిలుపు వినగానే నాగరాజు ఉలిక్కి పడ్డాడు. చటుక్కున అతని కళ్ళముందు సరోజ కనపడింది. పాపం ఒకత్తే ఉంది. అనవసరంగా తెచ్చాను. మంచో, చెడో నలుగురిలో ఉండేది అనిపించిందాక క్షణం. అతను డిస్టర్బ్ అయ్యేడు ఒక్కక్షణం. మరు నిముషం సర్దుకున్నాడు. మరునాడు ప్రొద్దునే వసంత వెళ్ళిపోయింది కొడుకుని తీసుకుని.
          పొద్దునే ఏదో గోల గోలగా ఏడుపులు వినిపిస్తుంటే మెలుకువ వచ్చింది నాగరాజుకి. లక్ష్మి అప్పటికే తలుపుతీసి గుమ్మంలో నుంచుంది. కళ్ళు నులుముకుంటూ బయటికి వచ్చాడు. ఎదురింట్లో ముసలమ్మ గుండెలు బాదుకుంటూ వీధి అరుగుమీద కూర్చుని ఏడుస్తోంది. ఏడేళ్ళ అబ్బాయి, ఐదేళ్ళ అమ్మాయి ఏడుస్తూ నుంచున్నారు.
          ఆ ముసలావిడ తెలుసు నాగరాజుకి. ఆ పిల్ల లెవరో తెలియలేదు.
          “ఏమిటి లక్ష్మి! ఏమయింది?” అన్నాడు.
          “ఆ పిల్లలు కాశింబీ మనవలు. కొడుకు సెంట్రింగ్ పనిచేస్తాడుట. చెబుతూ ఉంటుంది. కాని ఎప్పుడూ చూడలేదు. కొడుకూ, కోడలు ఎక్కువరారు ఇక్కడికి. ఆవిడ ఒక్కతే ఉంటుంది. కొడుకూ, కోడలూ పురుగుమందు తాగిపోయారుట, ఎవరో ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు.”
          “అయ్యో!” అన్నాడు.
  “ముసలావిడే దిక్కులేక పడి ఉంటే ఈ పసివాళ్ళనేం చూడగలదు.” అన్నాడు మళ్ళీతనే.
          “ఏం చేస్తామమ్మా! ఊరుకో! అంతా ఒకప్పుడు పోవలసిన వాళ్ళమే కదా! ఒకాయన ఓదారుస్తున్నాడు.      
          “అబ్బో! ఎవరికీ తెలియని ఓ గొప్ప విషయం చెప్పాడు.” కసిగా విసుగ్గా అన్నాడు నాగరాజు, “ఏమిటి,అందులో తప్పేముంది? అంత విసుగెందుకు?”
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages