మూడో కన్ను - అచ్చంగా తెలుగు
మూడో కన్ను
పూర్ణిమ సుధ 

ఈ పొద్దు రాటల్లేదమా..! ఏటో బద్ధకంగా ఉంది. మరేటనుకోక, రేణుకమ్మకి కూడా ఓ పాలి సెప్పెయ్ వా..! అని రంగి ఫోన్ చేసింది. హ... మళ్ళీ నాగాలు మొదలు... మొన్నేగా రెండ్రోజులు, పిన్ని కూతురి, వేలిడిచిన బామ్మర్ది అత్తగారి మూడో అన్న పెద్దకూతురి సీమంతానికి సెలవు పెట్టింది. మనమేమో అయినవాళ్ళ ఫంక్షన్లకి కూడా, వెళ్ళకపోవడానికి, వంకలెతుక్కుంటాం. వీళ్ళేమో దూరపు చుట్టాలని కూడా దూరం కాకుండా చూసుకుంటారు... ఎవరు రైటు ? అని ఆలోచించి, ఏమైంది నాకు ? అని మళ్ళీ పనుల్లో పడ్డాను. నాపేరు చెప్పలేదు కదూ..! లత. ఈలోపే పక్కింటి రేణుక, ఏంటి లతా ? రంగి ఇవాళ నాగా పెడుతోందా ? అంటూ బాల్కనీ లోంచి పలకరించింది. అవును... ఏం చేస్తాం ? అన్నట్టూ నీకెలా తెలుసు ? అన్నాను. ఏముంది ? నీ మొహం చూస్తే ఎవ్వరైనా ఇట్టే చెప్పేయొచ్చు. అన్నట్టు, మన సెకండ్ ఫ్లోర్లో ఉన్న దీప వాళ్ళు తెలుసుగా ? అంది, ఏదో బ్రేకింగ్ న్యూస్ చెప్పేదానిలా..! అన్యమనస్కంగానే గుర్తు రాకపోయినా, ఆ... అనేసా..! కానీ నా ముఖ కవళికని ఇట్టే పసిగట్టి, నువ్వొకదానివి, ప్రపంచం పట్టదు కదా..! కాస్త మన చుట్టూ ఏం జరుగుతోందో, ఓ కన్నేయాలి. మరీ నన్నంటుకోకు... అన్నట్టుంటే ఎట్టా చెప్పు ? అని క్లాసు మొదలెట్టబోయింది. అబ్బ... మనది మనం సరిగా ఏడిస్తే చాలు, పక్కింటి విషయాలు ఎందుకు చెప్పు ? అయినా, గుర్తొచ్చిందిలే, ఇంతకీ విషయం ఏంటో చెప్పు, అవతల బోలెడు పని నాకోసం ఎదురుచూస్తోంది, అన్నాను కొంచెం విసుగ్గానే..! అదే చెబుతుంటా..! దీప వాళ్ళ ఆయన, వాళ్ళ అమ్మగారిని ఇంటికి తీసుకొచ్చారట. ఆవిడేమో, ప్రతీ పనికీ నేనున్నానంటూ రావడం, దీపకేమో అది నచ్చక, ఓ చోట కూర్చోండి, నేనే అన్నీ అమరుస్తాను, అని దురుసుగా చెప్పడం, దానితో ఆవిడ బాధ పడి, నా ఇంట్లో నేనే పరాయిదానిలా ఉండాలా ? అని కొడుకుని నిలదీయడం, ఈయనేమో నాకు క్యాంప్ ఉంది, నాల్రోజులు రానని నిన్ననే బెంగళూరెళ్ళడం... చెప్పుకుని, పాపం ఆ ముసలావిడ ఎంత బాధ పడిందని ? అయినా, మనం పెద్దవాళ్ళం కామా ? మనకి అవసరాలుండవా ? మరీనూ..! ఆవిడలా బాధపడుతుంటే, బోలెడంత జాలి పడిపోయాను అంటూ చెప్పుకుపోతోంది. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ, అన్నట్టూ, మీ మావగారు, ఇప్పుడెక్కడుంటున్నారు అని అడిగా... అంతే రుసరుసలాడుతూ వెంటనే - హు... ఏదో మాడుతున్నట్టుంది... ఆ గుర్తొచ్చింది వెధవ కుక్కరు, ఆరు విజిల్స్ వచ్చాయి. పప్పు మాడిపోతోంది, నే వెళుతున్నా... అంటూ పరుగందుకుంది.
పప్పు కాదులే నీ మొహమే...! నాకు వాసనొచ్చింది, అనుకుని నేను లోపలికొచ్చేసా..! 

వాళ్ళ మామగారు రంగారావు గారని, రిటైర్డ్ తహశిల్దార్. బాగా సంపాదించారు. ఇద్దరు కొడుకులు. ఈవిడ పెద్ద కోడలు. రెండేళ్ళ క్రితం వరకు ఇక్కడే ఉండేవారు... ప్రతీ రోజూ పొద్దున్నే 5 గంటలకి లేచి, ముందురోజు, ఉంచిన డికాషన్, పాలతో కాఫీ కలుపుకుని, తాగి, ఇంటికి సెంట్రల్ లాక్ వేసి, వాకింగ్ కి వెళ్ళొస్తూ, తాజా కూరగాయలు, పాలప్యాకెట్లు తీసుకొచ్చేవారు. ఎందుకంటే, కొడుక్కీ కోడలికీ ముందురోజు పాలతో కాఫీ తాగితే తాగినట్టుండదని. ఆరింటికి, వచ్చి, అవి గ్యాస్ గట్టు మీద పెట్టి, మనవణ్ణి, మనవరాలిని లేపి, ఈయన నడుం వాల్చేవారు... ఎందుకంటే, వాళ్ళు లేస్తేనే ఈయన సౌకర్యంగా పడుకోగలరు మరి. ఇద్దరినీ ఈయన సింగిల్ కాట్ మంచం మీదకి షిఫ్ట్ చేసారుట. ఇక పిల్లల్ని రెడీ చేసే మిషతో రేణుక అరిచే అరుపులకి నిద్దరట్టక, ఏదో వంకతో రూమ్ లోకి తలుపు వేస్తూ తీస్తూ పిల్లలు తిరగాడుతూ ఉంటే, లేచి ముందుగదిలో పేపర్ పట్టుక్కూర్చునేవారు ఆయన.  మా బాబీగాడు, వాళ్ళ పిల్లలు ఒకే స్కూల్. ఏ రోజూ బస్సు ఫీసు కట్టడమే కానీ అందులో వెళ్ళిన దాఖలా లేదు. లేట్ గా రెడీ అయి, తాతయ్యా దింపవా అనడం... ఈయన ఆ స్కూటీ మీద ఇద్దరినీ దింపి తీసుకురావడం... నాకు గుర్తే..! తొమ్మిదింటికి, టిఫెన్ చేసేవారు. పన్నెండున్నరకల్లా భోజనం పెట్టేస్తాను, తినెయ్యండని పిలిచేది, ఇందాకే తిన్నట్టుందమ్మా..! కాసేపాగి తింటానంటే, మీకోసం నేను మెలకువగా ఉండాలా ఏంటీ ? సీరియల్స్ మిస్ అవుతాయి, నిద్ర పోలేను - షెడ్యూలంతా పాడవుతుందని కసిరేసరికి, సరే అని తినేసేవారు. అప్పుడెక్కువ తినలేక, తరువాత ఏ నాలుగింటికో ఆకలేస్తే, కష్టం మీద ఆపుకుని, అప్పుడప్పుడూ, వంటింట్లో ఏ బిస్కెట్ ప్యాకెటయినా దొరుకుతుందేమో అని చూడడం, ఈవిడ కసరడం మా ఇంట్లో మాట్లాడుకున్నంత స్పష్ఠంగా వినబడేవి..! సాయంత్రం అలా బయటకి వెళ్ళొస్తాననగానే - ఇక్కడ తిన్నది సరిపోలేదా ? బయట ఇంకేం తినాలో ? అన్నదని, పౌరుషంతో తినకుండా మానిన ఆయన, ఒకరోజు బాబీ గాణ్ణి స్కూలు నించీ తీసుకొస్తూ, రోడ్డు మీద పడి ఉండడం గమనించి, బాబాయ్ గారూ, ఏమైంది అని పక్కకి తీసుకొచ్చి, ఒక ఇంటి బయట బెంచి లాంటిది ఉంటే కూర్చోబెట్టా..! అప్పుడు చెప్పారు ఈయన. ఈ విషయాలన్నీ..! కొన్ని సార్లు పిల్లలకి, కొడుక్కి లంచ్ కూడా ఈయనే ఇచ్చేవారుట. మీ పెన్షన్ వస్తుందిగా ? ఎందుకు మీకు ఈ సమస్య అంటే, పెన్షన్ బదులు పీయెఫ్ ఆప్షన్ పెట్టుకోవడం వల్ల, ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి ఖర్చయిపోయాయన్నారు. కంట్లో నీరు చూసి, ఏదో చెప్పబోయేలోపే, వెధవ దుమ్ము కళ్ళజోడు కూడా ఆపలేకపోతోందని ఆయనే తమాయించుకున్నారు... మీ కూతుర్ననుకుని, ఈ డబ్బు ఉంచండని, ఇంటి వరకూ ఆటోలో మాతో పాటే తీసుకొచ్చా..! ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలీదు కానీ, చిన్న కొడుకింటికి వెళ్ళాడని మాత్రం రేణుక చెప్పింది. ఎందుకు ఏమిటీ లాంటి వివరాలేవీ చెప్పకుండా...! 

అలాంటి రేణుక ఇపుడు దీప అత్తగారి విషయంలో జాలి పడిందనగానే నవ్వుగాక ఏం వస్తుంది ? సర్లెండి, మీకివన్నీ చెప్పే హడావిడిలో నా పని అక్కడే ఆగిపోయింది. అన్నట్టూ, అసలు విషయం చెప్పనే లేదు. నాకు పని చేసుకుంటూ పాటలు వినడం అలవాటు. ఈ మధ్య నా స్పీకర్ మూగవోయింది. ఎందుకంటే, రేణుక వాళ్ళు, హోం థియేటర్ కొన్నారు. ఈ ’ఎపార్ట్’మెంటాలిటీలో గొడవలైనా, మాటలైనా ఆఖరికి ఏవైనా మనింట్లోనే అన్నట్టు వినబడతాయిగా ? ఆవిడ సీరియల్సన్నీ నేను ఫాలో అవకూడదనుకున్నా, అయిపోవాల్సొస్తోంది. మా బ్లూటూత్ స్పీకర్ సౌండ్ ని అధిగమించేలా వస్తోంది మరి. ఇక రాత్రయితే మరీ దారుణం... పదకొండింటి దాకా, ఏ రోజు ఏ రియాలిటీ షో అయితే అది... విని తీరాల్సిందే..! ఈ మధ్య కొత్తగా బిగ్ బాస్ అని మొదలయింది... రేణుకకే కాదు, మా రంగికి కూడా మహా ఇష్టం... అమ్మగోరూ, హేమ వెళ్ళిపోయుండకూడదేం ? ఎన్ని సినిమాల్లో ఎంత నవ్వించిందని ? అలగెలగా ? ఆ తమన్నా ఎవరమ్మా ? ట్రాన్స్జెండరంటే అదేగా ? ఇలా రోజూ భేతాళుల్లా ప్రశ్నలతో పనిచేస్తుంది...! నా మౌనం దానికి చిరాకు తెప్పించి, ఎప్పటిలాగే మెరుపుతీగలా పన్లన్నీ అయినాయనిపించి, రేణుకింట్లో రెండు గంటలు ఉంటుంది. ఎందుకంటే, అక్కడ దానిక్కావాల్సిన అన్ని వివరాలు దొరుకుతాయి... ఆ మాటలూ నాకే..! ఎందుకంటే, ఎక్కువ పని చేసేది, బాల్కనీలోనేగా ? అమ్మగోరూ, అసలా బిగ్ బాసెవరంటారు ? ఏమైనా ఎన్టీఆర్ చేసినంత బాగా, నాని గానీ నాగార్జున గానీ చెయ్యట్లేదనిపిస్తోందే ? ఈళ్ళెవ్వరూ అసలు సరిగ్గా ఆడట్లా..! అదేటో, ప్రద్దానికీ గొడవాడేస్కుంటారు. ఆ వరుణ్ సందేశ్ అయితే అసలు, అలగెలగా ? వాళ్ళవిడని కాకుండా ఎవర్నో సమర్థిస్తాడు ? బాబోయ్... ఇక నావల్లకాదని, పనులన్నీ మానేసి, బెడ్రూంలోకి వెళ్ళి, కాసేపు నడుం వాల్చాను... ఆలోచనలు... ఎడతెగకుండా వస్తూనే ఉన్నాయి. అలల్లాగా..!

మన చిన్నప్పుడు, పక్కింట్లో ఏం జరుగుతోందా? అని ఒక చెవి, కన్ను అటు పడేసి ఉండే వాళ్ళని తిట్టుకునేవారు... మరిప్పుడో ? అందరూ పనులు మానుకుని మరీ ఇలాంటి షోలని చూసి, హిట్ చేస్తున్నారు... ఏంటో ? ఈ మాయ. మన తరువాతి తరం వాళ్ళకి ఏం నేర్పుతున్నాం మనం ? మా బామ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, నలుగురికీ తల్లో నాలుకలా ఉండాలి అని... మా అమ్మమ్మేమో, ఇంటికి జ్యేష్ఠ, పొరుక్కి లక్ష్మిలా ఉండక్కర్లా..! ఊళ్ళు ఉద్ధరించక్కర్లా..! మన కుటుంబం బాగోగులు బాగా చూసుకుంటే, ఆటోమేటిగ్గా, సమాజం అదే బావుంటుంది అనేది... ఎవరు కరెక్ట్...!? స్వాతిముత్యంలో కమల్ హాసన్ - నిజం చెప్పాలా ? అబద్ధం చెప్పాలా ? అని అడిగినట్టు, నాకెప్పుడూ, ఈ సంఘర్షణ మామూలే...! మన రెండుకళ్ళు సవ్యంగా పని చేసి, మంచిని చూస్తే చాలదూ ? మూడో కన్ను (కెమెరా సర్వైలెన్స్) ఎటూ మన ప్రైవెసీని చాలా చోట్ల హరిస్తోంది. మనం ఎందుకు ఇంకా దాన్ని పెంచి పోషించడం..? ఏమంటారు ?
***

No comments:

Post a Comment

Pages