ముక్కుపుడక - అచ్చంగా తెలుగు
 ముక్కుపుడక 
– డా. లక్ష్మి రాఘవ.

పదారేళ్ళ కొత్త పెళ్ళికూతురు స్వర్ణ అత్తారింట అడుగుపెట్టింది.
“అబ్బో ఎంత అందమో!”అని ముక్కున వేలేసుకున్నారు ఆ ఊరివారు. 
“పార్వతమ్మ గారు ఒక్కగానొక్క కొడుకుకు  ఎంత సుందరమైన పెళ్ళాన్ని తెచ్చిందో” అంటూ గుసగుసలు పోయిన వారూ వున్నారు.
“ఆపాటికి కన్నడ దేశం నుండీ వెదికి తీసుకురావాల్సి వచ్చిందా? మన ఆంధ్రా లోదొరక లేదా...”అంటూ అక్కసు వెలిబుచ్చిన వారూ వున్నారు.
ఏమైతేనేమి పుత్తడి బొమ్మలాటి స్వర్ణ ఆఇంట అడుగుపెట్టగానే ఆ ఇంటికే ఒక అందం వచ్చింది. 
వచ్చిన వెంటనే పార్వతమ్మ స్వర్ణను పూజ గదిలోకి రమ్మనమని పీటమీద కూర్చోబెట్టి చేతిలోని పాత ఇత్తడి డబ్బీని తీసి మూత తెరుస్తూ “స్వర్ణా, ఇది మనింట వ౦శపారంపర్యంగా వస్తున్న వజ్రపు ముక్కుపుడక. కొన్ని తరాలనాటిది.చూడటానికి పాత కట్టడం కావచ్చు కానీ దాని అందం దానిదే. ఇది మా అత్తగారు నేను ఈ ఇంట అడుగుపెట్టిన నాడు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఇంటికి వచ్చిన కోడలిగా నీకు ఇస్తున్నాను. నీ తరువాత నీ కోడలిది.” అంటూ చూపి స్వర్ణ చేతిలో పెడుతూ 
“ఇక్కడే పెట్టుకుని దేముడికి దండం పెట్టుకో” అని చెప్పగానే ఆ డబ్బీ లోనుండీ వజ్రపు ముక్కుపుడకను చేతిలో పట్టుకుంది స్వర్ణ. అంతవరకూ వజ్రం చూడని స్వర్ణ కు దాని మెరుపు మైమరపించింది. సుతారంగా ముక్కున వున్న పాత ముక్కుపుడకతీసి దీనిని పెట్టుకుని దేవుడి కి దండం పెట్టుకుంది.
అత్త గారి కాళ్ళకు మొక్కబోతే “నట్టింటి లోని మీ మామగారి ఫొటోకు నమస్కరించు”అని ఆదేశించింది.
స్వర్ణ అలాగేనని హాలులో వున్న మామగారు కీ.శే. చంద్రశేఖరయ్య గారికి నమస్కారం చేసి తరువాత అత్తగారికి దండం పెట్టుకుంది..
అసలే అందంగా వున్న స్వర్ణ కు వజ్రం ముక్కుపుడక మరింత అందాన్ని జోడించింది.
******
ముక్కు పుడక కు ఆనందంగా వుంది. గత కొద్దిరోజులుగా ఇత్తడి డబ్బీలో వుండిపోయి ఊపిరాడక “నాకు మోక్షం ఎప్పుడు?” అని నిట్టూర్స్తూనే వుంది. 
ఇప్పుడు కొత్త కోడలు రాకతో ముక్కున చేరి వయ్యారాలు పోయింది.
“స్వర్ణా, ముక్కుపుడక నీకు మరీ బాగుంది సుమా “అని రాత్రి భర్త కేశవ అన్నప్పుడు స్వర్ణ కంటే ముక్కుపుడకనే ఎక్కువ ఆనంద పడింది. 
స్వర్ణ ఏ పెళ్ళికో, పేరంటానికో వెళ్ళినా అందరూ మరోసారి చూసేవారు.ఆ అందం అంతా తన వల్లే అని పొగరు వచ్చింది ముక్కుపుడకకు.
*****
కాలగర్భం లో రోజులు నెలలుగా సంవత్సరాలుగా మారి పోతూనే వున్నాయి. స్వర్ణ ఇద్దరు ఆడపిల్లల తల్లి అయింది. మూడవసారి గర్భం దాల్చగానే పార్వతమ్మ కాలం చేసింది.
చనిపోయేముందు ముక్కుపుడకను రాబోయే కోడలికి ఇవ్వాలని హెచ్చరించింది. మొదట ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో పార్వతమ్మ కాస్త బెంగ పడినా మూడోసారి వంశాంకురం పుడతాడని గట్టిగా నమ్మింది ఆవిడ. కానీ దురదృష్ట వశాస్తూ కానుపు కాకనే మరణించింది.
పార్వతమ్మ పోయాకస్వర్ణ కు కానుపు అయి మరో ఆడపిల్ల పుట్టింది. కేశవకి  కూడా కాస్త మనసు కు కష్టం అనిపించింది.
వంశాంకురం కావాలి అనుకుంటే ఇంకో సారి చూసినా పుడతాడని నమ్మకం ఏమిటి? అయినా మరోసారి ప్రయత్నిద్దాం అనుకోవవడానికి ముందుటి కాలం కాదు. అందుకే మరోసారి కడుపు రాకుండా జాగ్రత్త పడ్డాడు  కేశవ.
ముగ్గురు ఆడపిల్లలూ ముచ్చటగా పెరుగుతున్నారు ఆఇంట..
కాలం పరుగులు తీసింది.
ముగ్గురు ఆడపిల్లలకీ పెళ్ళిళ్ళు అయ్యాయి. చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు.
స్వర్ణ వయసు మీరి స్వర్ణమ్మ అయ్యింది.
****
తన వల్లనే స్వర్ణ కు అందం అని విర్రవీగిన ముక్కుపుడకకు కొద్దిరోజులుగా బెంగ పట్టుకుంది.
ఆ ఇంటికీ కోడలు వచ్చేప్రశక్తే లేనప్పుడు తన గతి ఏమి? అని.
ఆ బెంగ కు తోడుగా కేశవ హటాత్తుగా గుండెపోటు తో మరణించాడు. స్వర్ణమ్మ కు అనారోగ్యం! 
ఈ మార్పులతో కేశవ చనిపోగానే స్వర్ణమ్మ ముక్కుపుడక తీసి మళ్ళీ ఇత్తడి డబ్బీలో పెట్టి దేవుడి గదిలో పెట్టింది.
ఇక తన భవిష్యత్తు ఏమిటో ముక్కుపుడక కు అగమ్యగోచరంగా వుంది. ఎవరు తనను ధరిస్తారు?? అన్న ప్రశ్న కు సమాధానమే లేదు.
ఇన్ని తరాలలో  ఈ ఇంట మగ సంతానం లేకపోవడం ఇప్పుడే! ఇక తన గతి ఏమి? ఆలోచనలతో సతమత మవుతూంది ముక్కుపుడక.
*****
స్వర్ణమ్మ మరణం ఎవరినీ ఆశ్చర్య పరచలేదు.
చావు కబురు విని కూతుర్లు అందరూ వచ్చారు. అన్ని కార్యక్రమాలూ యధావిధిగా జరిగాయి..
ఆఇంటికి సలహా దారు అయిన చలపతి రావు ఒక సమావేశం ఏర్పాటు చేసి ముగ్గురు అమ్మాయిలకూ సమానంగా ఆస్తి పంచబడి నట్టు తెలిపారు.  అలాగే స్వర్నమ్మ గారి ఆభరణాలు కూడా...ఒకటే నిర్ణయించాల్సి  వుంది.అది ఒంటి గా వున్న వజ్రపు ముక్కు పుడక!
 “ఈ ఇంట కోడలు లేదు కాబట్టి పెద్దపిల్లగా అది నాకు చెందుతుంద”’ న్నది పెద్దమ్మాయి.
“అలాగ ఏమీ రూలు లేదు చిన్నపిల్లగా నాకూ రావచ్చు” అన్నది మూడో అమ్మాయి.
“మధ్యలో నేనేమి చేశాను? మధ్య పిల్లగా పుట్టడం నా తప్పా? నాకూ రావచ్చు“అని వాదించింది మధ్య అమ్మాయి.
ఇది ఎటూ తేలక చలపతి రావుగారు “అమ్మా, ఇలా ముగ్గురికీ ఇవ్వలేము కనుక ఒకపని చేద్దాం. పాతదిమరియు వజ్రం కనుక దీని విలువ బాగానే వుంటుంది. ఇది అమ్మి డబ్బులు ముగ్గురికీ పంచుకుంటే ఎలా వుంటుంది? ఆలోచించండి.” అన్నారు.
“సరే విలువ కట్టించండి.అది నేనే కొనుక్కుంటా...” అంది రెండో అమ్మాయి.
“ఇది మరీ బాగుంది. నీదగ్గర డబ్బులు వున్నాయని అలా చేస్తే వస్తువు మీ ఇల్లు చేరుతుంది. ఇది నేను ఒప్పుకోను. నేను కూడా డబ్బుకోసం ప్రయత్నం చేసి కొనుక్కుంటాను” అని వాదనకు దిగింది పెద్దమ్మాయి.
“అమ్మా ఇది ఇలా తెగదు. మూడో మనిషికి అమ్మే విషయం గురించి  మీరు ముగ్గురూ ఒక నిర్ణయానికి రండి. అంతవరకూ వేచి చూద్దాం ....” అన్నారు చలపతి రావు.
దేవుడి గది లో కి వినిపిస్తున్న ఈ వాద ప్రతివాదనలు విని ఏడుపు వచ్చింది ముక్కు పుడకకు.
“నన్ను రక్షించు దేవుడా”అని భగవంతుడికి మొక్కుకుంది.
****
మరురోజు వచ్చిన చలపతి రావు తో అది అమ్మి వాటాలు తీసుకునే నిర్ణయాన్ని తెలియజేశారు ముగ్గురు అమ్మాయిలూ.
ఆ వూరి లోని బంగారు షాపులో ముక్కు పుడకను చూపారు...
దాన్ని చూసి మంచి విలువ ఇచ్చాడు షాపు వాడు.
అమ్మాయిల సంవాదం ముగిసింది.
****
ముక్కుపుడక ఏడుస్తూ ఇల్లు దాటింది.
కానీ బంగారు షాపు ఆయన దాన్ని అపురూపంగా మెరుగు పెట్టించాడు. అతి పాతదైనా దాని విలువ తెలిసినవాడు కావున దాన్ని కాపాడు కోవాలనిపించి భార్యకు కానుకగా ఇచ్చాడు.
భార్య ధరించి మురిసి పోతే ముక్కుపుడక వగలు పోయింది కొత్త అందం తో...
“తాను ముక్కున వుండటం వల్లే ఆమెకు అందం”అన్న గర్వం తో విర్రవీగ సాగింది మళ్ళీ!!!!
****

No comments:

Post a Comment

Pages