బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు-09 ( కల్పవృక్ష వాహనము) 20-07-2019 - అచ్చంగా తెలుగు

బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు-09 ( కల్పవృక్ష వాహనము) 20-07-2019

Share This
బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-09 ( కల్పవృక్షవాహనము)
డా.తాడేపల్లి పతంజలి 


బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజు పగలు కల్పవృక్ష వాహన సేవ జరుగుతుంది .శ్రీదేవి భూదేవిలతో కలిసి మలయప్ప స్వామి(తిరుమలలోని  శ్రీ వేంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ మూర్తిని మలయప్ప స్వామి అంటారు) విహరిస్తాడు. అప్పుడప్పుడు రూపం మారుతుంటుంది గాని సాధారణంగా ఆవులను కాపాడుతున్నగోపాలుని రూపం లో శ్రీ వేంకటేశ్వర స్వామి  వారు ఈ కల్పవృక్ష వాహన సేవలో  భక్తులకు ఆనందం కలిగిస్తారు. అన్నమయ్య స్వామి వారిని కల్పవృక్షంతో పోలుస్తూ వ్రాసిన ఈ గీతం చాలా ప్రసిద్ధమైనది.

కామధేనువిదే కల్పవృక్షమిదే
ప్రామాణ్యముగల ప్రపన్నులకు        ॥పల్లవి॥
హరినామజపమే ఆభరణంబులు
పరమాత్ముని నుతి పరిమళము
ధరణిధరు పాదసేవే భోగము
పరమంబెరఁగిన ప్రపన్నులకు         ॥కామ॥
దేవుని ధ్యానము దివ్యాన్నంబులు
శ్రీవిభు భక్తే జీవనము
ఆ విష్ణుకైంకర్యమే సంసారము
పావనులగు యీప్రపన్నులకు        ॥కామ॥
యేపున శ్రీవేంకటేశుఁడే సర్వము
దాపై యితని వందనమే విధి
కాపుగ శరణాగతులే చుట్టాలు
పైపయి గెలిచిన ప్రపన్నులకు       ॥కామ॥

తాత్పర్యం
ప్రామాణ్యము(సాక్ష్యము ) కలిగిన  ప్రపన్నులకు (శరణాగతులకు)  శ్రీ వేంకటేశ్వర స్వామి  కామధేనువు. 
కల్పవృక్షము. సాక్ష్యము అంటే ప్రత్యక్షముగా చూడడము, ప్రత్యక్షముగా చూచిన దాన్ని చెప్పడము.జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న భక్తులు తమ కష్టాలు తొలిగిపోవటానికి స్వామిని ప్రార్థిస్తారు. స్వామి నమ్ముకొన్న భక్తుల కష్టాలను తొలగిస్తారు. ప్రతి భక్తుడు తన జీవితంలో పొందిన అనుభవమే దీనికి సాక్ష్యం. కనుక ఇటువంటి ప్రామాణికమైన అనుభవాలు కలిగిన భక్తులు స్వామివారిని కోరిన కోరికలు తీర్చే కామధేనువుగా, కల్పవృక్షముగా కొలుస్తుంటారు.
1.గొప్పదేదో తెలిసిన శరణాగతులు-స్వామివారి పేరును కీర్తించటమే- గోవిందా- గోవిందా అని జపించటమే నిజమైన  ఆభరణాలుగా భావిస్తారు.  స్వామిని పొగుడుటయే పరిమళసేవగా తలుస్తారు.భూమిని మోసిన ఆ స్వామివారి యొక్క పాద సేవను తమ భోగముగా తలుస్తారు.
2.స్వామిని శరణుకోరిన శ్రేష్ఠులైన భక్తులు దేవుని ధ్యానమును  దివ్యాన్నములుగా తలుస్తారు.ఆ లక్ష్మీ భర్త పై భక్తి కలిగి ఉండటమే తమ జీవితంగా భావిస్తారు. విష్ణుదేవునికి చేయు కైంకర్యమును (భగవంతునికి భగవద్భక్తులకు చేయు ఊడిగము)  సంసారముగా భావిస్తారు.
3. పై పై కనిపించే లౌకిక ఆకర్షణలను గెలిచిన -స్వామి వారి శరణాగతులు-  ఆయననే  తమ సర్వస్వముగా భావిస్తారు.రక్షించే అతనికి నమస్కారము చేయుటయే తమ విధిగా తలుస్తారు.  తమవంటి శరణాగతులను చుట్టాలుగా భావిస్తారు.
విశేషాలు
1.పోతన కల్పవృక్షము ఆవిర్భవించిన సందర్భంలో ఇలా వ్రాసారు.
ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై
యింద్రువిరులతోఁట కేపు దెచ్చి
కోరి వచ్చు వారి కోర్కుల నీనెడు
వేల్పు మ్రాను పాలవెల్లిఁ బుట్టె.(8-261-)
పాలసముద్రాన్ని చిలుకుతుండగా  అందులోనుండి కల్పవృక్షం పుట్టింది. ఆ కల్పవృక్షం సకల ఋతువులలోనూ రాలిపోని పూలు కలది. చక్కగా  విరబూసి, ఇంద్రుని నందనవనానికి అందాన్ని ఇస్తుంది. తనను ఆశ్రయించిన వారి కోరికలను తీర్చుతుంది.ఆ కల్పవృక్షము ఈఎదురుగా కనిపించే స్వామి అని అన్నమయ్య భక్తి పారవశ్యాలతో ఈ కీర్తనలో కీర్తించాడు.
“2. ఒక గృహస్థుని వర్ణిస్తూ మనుచరిత్రలో  పెద్దన “పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండుదొడ్డి బెట్టిన వేల్పుగిడ్డి కాపుకడ లేని యమృతంపు నడబావి” అంటాడు.(  ఇంటివెనక పెరటిలో ఉండిపండిన కల్పవృక్షం, కామధేనువు , అమృతపుబావి, ప్రథమాశ్వాసము-66) ఆ  పండిన పెరటి కల్పకము అన్నమయ్య కీర్తనలో విరబూసింది. స్వస్తి.
***

No comments:

Post a Comment

Pages