ఏకాభిప్రాయం - అచ్చంగా తెలుగు
ఏకాభిప్రాయం  
సుసర్ల కామేశ్వరి 

(జంధ్యాల పికెల్స్, అచ్చంగా తెలుగు సంయుక్తంగా నిర్వహించిన ఉగాది కధల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కధ )

                     రామ్మూర్తి, సావిత్రి దంపతుల వివాహ స్వర్ణోత్సవ వేడుక జరుగుతోంది. ఆచల్లని సాయంకాలం ఆరుబయట లాన్ లో ఏర్పాటయిందివేదిక. రంగు రంగుల పూలతో విద్యుద్దీపాలతో కళకళ లాడుతోంది వేదిక .నేపధ్యం లో మంద్రంగా వీణా నాదం వినిపిస్తోంది. కేటరింగ్ కాంట్రక్టర్ తాలూకు సిబ్బంది అతిధి మర్యాదలు యధావిధిగా సాగిస్తున్నారు.  వృధ్ధ దంపతుల ముస్తాబింకా ముగియలేదో, మరి అతిధులంతా వచ్చేదాకా ఆగాలనుకున్నారోగాని, కార్యక్రమం ప్రకటించినదానికన్న గంటన్నర ఆలస్యం గా మొదలయ్యింది.                                                                           
                                 దంపతులిద్దరూ వేదిక పైకి వచ్చి, దండలు మార్చుకున్నారు..  యిద్దరూ డభ్భై యేళ్ళకి పైపడినవాళ్ళే అయినా,ధృడంగా , ఆరోగ్యం గానే కనిపిస్తున్నారు. రామ్మూర్తిగారు ఆజానుబాహుడు. చామనచాయ.నెరిసిన మీసం తోపాటు సమానంగా బట్టతల మెరుస్తోంది. గచ్చకాయ రంగు సూటు, గోల్డ్ ఫ్రేం కళ్ళజోడు,ముఖాన చిరునవ్వు ధరించాడు. హుందాగా, టివి టవర్ లానిటారుగా నుంచున్నాడు. సావిత్రి గారు సుమారయిన పొడవు. ఓపాటి స్థూల కాయం. పచ్చని పసిమి చాయ. చిలకపచ్చ రంగు కంచి పట్టుచీర, కాసులపేరు, వడ్డాణం, వంకీలు, రవ్వల గాజులు  ధరించి, బంతిపూల రధంలా వుంది. ఇద్దరి ముఖాలూ ఆనందం తో వెలిగి పోతున్నాయి.

                                    వేదపండితుల ఆశీర్వచనం తో కార్యక్రమం మొదలయ్యింది. యాభై యేళ్ళక్రితం వాళ్ళ పెళ్ళి  జరిపించిన పురోహితుడే ఈ ఆశీర్వచనం నిర్వహించడం ఈవేడుకలో ఒక విశేషమని, వేదిక పై నుంచి ప్రకటించారు. తరువాత  ముత్తయిదువలు మంగళం పాడి, దంపతులకు హారతిచ్చారు. వారి యిద్దరు కొడుకులూ, యిద్దరుకోడళ్ళూ  కూతురూ, అల్లుడూ, ఆదంపతులకు నూతన వస్త్రాలు సమర్పించి,నమస్కరించారు , మనుమలూ, మనుమరాళ్ళూ దంపతులకు నమస్కరించి వారి వెనుకగా నిలబడ్డారు.            

                                         ఆవేడుకకి హాజరయిన అతిధుల్లో,  పార్వతి,కృష్ణ మూర్తి ఒకజంట. ఆ యిద్దరూ ప్రభుత్వోద్యోగాలు చేసి, ఉన్నత పదవులలో రెటైర్ అయినవాళ్ళే. పార్వతి జరుగుతున్న కార్యక్రమాన్ని ఎంతో శ్రధ్ధగా, ముచ్చటగా చూస్తోంది.  కృష్ణమూర్తి మాత్రం కొంచం దూరంగా నిలబడి స్నేహితులతో ముచ్చటిస్తున్నాడు.  పార్వతికి ఆసెలబ్రేషన్ ఎంతో నచ్చింది. “50 ఏళ్ళు కలసి మెలసి జీవించి, కష్టం సుఖం కలబోసుకుని, పిల్లల్ని కని, పెంచి, ప్రయోజకుల్ని చేసి, కృతార్ధులై జీవిత సాఫల్యానికి గుర్తుగా చేసుకుంటున్న  పండుగ ఇది.” అని భావించింది.  అదేమాట భర్తతో అంటే అతను కొట్టి పారేసాడు.

"అది పూర్తిగా వ్యక్తిగతం. ఇలా ప్రకటించి, ప్రదర్శించుకో నక్కరలేదు" అంటూ.

                            అసలు పార్వతికీ, కృష్ణ మూర్తికీ ఏ విషయం లోనూ,ఏకాభిప్రాయం కుదరదు. స్వభావాలు కూడా భిన్నమే. కృ ష్ణమూర్తిది కాస్త దుడుకు స్వభావం. మనసుకి ఏది తోస్తే అది అనేస్తాడు. ఎదుటి వారి ఫీలింగ్తోపని లేదు.. పార్వతి అలాకాదు. ఆచి తూచి మాట్లాడుతుంది. సౌమ్యురాలు. స్నేహశీలి. పరిచయస్తులదరి మన్నన పొందుతుంది.ఆహార విహారాల్లోకానీ, యితర అభిరుచుల విషయం లోకాని యిద్దరూ భిన్న ధృవాలే.  పార్వతి భావుకురాలు. కృష్ణమూర్తి ప్రాక్టికల్ మనిషి. సంతానం తప్ప యిద్దరికీ కామన్ ఇంటెరెస్ట్ మరేమీ లేదు. అలాగే నలభై సవత్సరాల  వైవాహిక జీవితం గడిచిపోయింది. కొన్ని జీవితాలంతే. సోయగముండీ సుఖం నోచవు. యిద్దరివీ బలమయిన వ్యక్తిత్వాలే. అందుకే అన్నాళ్ళ  సాహచర్యం లోనూ ఏ ఒక్కరూ రెండవ వారి దారికి మళ్ళ లేదు.

                                "మేమిద్దరం ఒకే ఒరలో యిరుక్కున్న రెండు కత్తులం. ఒకే గూటినున్నా వేర్వేరు దారుల్లో పయనించే రెందు పిట్టలం. ఇందులో ఎవర్నీ తప్పు పట్టడానికి లేదు. బ్ర హ్మ దేవుడు చేసిన పొరపాట్లలో మమ్మల్ని జత చేయడం ఒకటి" అనుకుంటూ వుంటుంది పార్వతి ఎప్పుడూ.

                           వయసులో ఉన్నప్పుడు,, బరువు బాధ్యతలు నెరవేర్చేక్రమంలో కాలం ఎలా గడిచి పోతుందో తెలియదు. పిల్లలు పెద్దవాళ్ళయి వాళ్ళ పెళ్ళిళ్ళు, పేరంటాలూ జరిగి రెక్కలొచ్చి దూరంగా వెళ్ళిపోయాక, ఉద్యోగ విరమణ కూడా చేసి, దంపతులిద్దరే యిం ట్లోమిగిలాక తెలుస్తుంది వెలితి. ఆజీవన సంధ్యా కాలం లోనే కావాలి జీవిత భాగస్వామి చెలిమి, సాహచర్యం. ఆమధ్య వచ్చిన మిధునం సినిమా లో ఆవృధ్ధ దంపతుల అనుబంధాన్ని ఎంత బాగా చిత్రించారో. పార్వతికి అది బాగానచ్చి అందరి దగ్గరా పదే పదే అదే విషయం ప్రస్తావించేది.

కష్ణమూర్తికి మాత్రం ఈ ధోరణి ససేమిరా నచ్చలేదు. " అంతా ఓవర్ ఏక్షన్. అలాంటి అనుబంధాలు సినిమాల్లోనే ఉంటాయి నిజ జీవితాల్లో ఉండవు. " అని తేల్చి పారేసాడు.

                        వేదిక మీద కార్యక్రమం సాగుతోంది. పెద్దలు కొందరు ప్రసంగిస్తున్నారు.  ఒక కవిగారు ఆశీర్వాద   పూర్వకంగా పంచరత్నాలు సమర్పించాడు.  ముఖ్యులైన  బంధువులు కొందరు  ఆ దంపతులతోతమకున్నఅనుబంధాన్నీ, వారి దాంపత్యం తాలూకు ఔన్నత్యాన్నీ కొనియాడుతూ ప్రసంగించారు.                   

                                     చివరిగా రామ్మూర్తిగారు మాట్లాడుతూ, అతిధులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆ సందర్భంగా, తన భార్య సౌశీల్యతనూ ఆమె తనకందించిన సహకారాన్నీ, సంసారం నడపడంలో ఆమె చాకచక్యాన్నీ ప్రస్తావించారు. "నేను నామ మాత్రానికే రాముణ్ణి. కాని ఆవిడ మటుకు సహజ సిధ్ధమయిన సీత." అనిభార్యకుకితాబిచ్చాడు.ఆయన మంచిమాటకారి. ప్రసంగం అంతా చలోక్తులతో నిండి అందరినీ అలరించింది. నవ్వులతో, చప్పట్లతో ప్రాంగణం దద్దరిల్లింది.

                               సావిత్రి గారు కూడా ముక్తసరిగా ప్రసంగించి,ఈకార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ పిల్లలకూ, విచ్చేసి, అభినందనలూ,ఆశీస్సులూ అందించిన అతిధులకూ ధన్యవాదాలు చెప్పి, తమకింతటి సౌభాగ్యాన్నిచ్చిన అమ్మవారికి  శిరసాభివందనం చెస్తూ ముగించారు. అలా కార్యక్రమం ముగియగా భోజనాలకు పిలుపు నిచ్చారు.

                                                భోజనాల దగ్గిర అందరినీ పలకరిస్తూ హడావిడిగా తిరుగుతూ, సందడి చేస్తున్న ఒక నడివయస్కురాలు పార్వతి దృష్టి నాకర్షించింది. . ఎప్పుడో, ఎక్కడో చూసినట్టుంది గాని, గుర్తురావడం  లేదు. అదేమాట భర్త తో అంది.

"అయ్యో!గుర్తుపట్టలేదా? మావిస్సు మామయ్య కూథురు. సరోజ" సమాధానం యిచ్చాడు కృష్ణమూర్తి.

విస్సు మామయ్య కౄష్ణమూర్తి కి వేలు విడిచిన మేనమామ . సరోజను కృష్ణమూర్తి కివ్వాలని అనుకున్నారు. చాలాకాలం.  తరవాత  ఇరు కుటుంబాలకూ ఏవో అభిప్రాయ బేధాలు రావడం వల్ల ఆ సంబంధం చెడింది. ఆసంగతి కృష్ణ మూర్తే చెప్పాడు పార్వతికి గతంలో.

 " ఈవయసులో కూడా ఎంత చలాకీగా, నాజూగ్గా వుందో" మనసులోని మాట పైకనేసింది పార్వతి.

" తనని చేసుకుంటే నా లైఫ్ చాలా హేపీ గా వుండేది" కృష్ణమూర్తి జవాబు.

“అవును. నాది కూడా." ఏకీభవించింది పార్వతి.  


 ***

No comments:

Post a Comment

Pages