చికిత్స - అచ్చంగా తెలుగు
 చికిత్స
బి.ఎన్.వి.పార్ధసారధి 


విష్ణు వర్ధన్ తన మిత్రుడు మానసిక వ్యాధి తో హాస్పిటల్ లో చేరాడని తెలిసి అతనిని చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళాడు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత విష్ణు వర్ధన్ మానసిక చికిత్స హాస్పిటల్ కి మరలా ఈ విధంగా వెళ్ళాడు. తొలిసారి ఐదు దశాబ్దాల క్రితం అతని అమ్మమ్మ మనోవ్యాధి తో వున్నప్పుడు ఆమెని మద్రాసులోని కీల్పాక్ హాస్పిటల్ లో చేర్చారు.  ఆమెకి రోజూ భోజనం ఇంట్లోంచి తెసుకుని వెళ్ళే డ్యూటీ  విష్ణువర్ధన్ కి అప్పగించారు. అప్పుడు అతని వయస్సు పదహారేళ్ళు. హాస్పిటల్ లో వివిధ రకాలైన పేషంట్లు, వాళ్ళ ప్రవర్తన ,వాళ్ళ పరిస్థితి చూసి  విష్ణు వర్ధన్ కి బాధ కలిగేది.  ముఖ్యంగా ఆ పేషంట్ల బంధువులు ఎంత కలత చెందుతారో అని అతను తలపోసే వాడు. ఒకరోజు విష్ణు వర్ధన్ కి కీల్పాక్ హాస్పిటల్ లో ఒక వింత అనుభవం ఎదురయ్యింది. ఒక  డాక్టర్ మెడలో స్టెతస్కోప్ పెట్టుకొని హడావిడిగా అటూఇటూ తిరుగుతున్నాడు. అతను చూడటానికి చైనా లేదా జపాన్ దేశానికి చెందిన  వాడిలా కనిపించాడు. ఇంతలో ఇద్దరు నర్సులు వచ్చి అతనిని రెక్కపుచ్చుకుని లోపలి తెసుకుని వెళ్లారు. ఆ వ్యక్తి నిజంగానే ఒకప్పుడు మానసిక వ్యాధుల నిపుణుడు అని దురదృష్టవశాత్తు అతనికి మనోవ్యాధి సంక్రమించిందని హాస్పిటల్లోని వ్యక్తులు చెప్పగా  నిర్ఘాంత పోయాడు విష్ణు వర్ధన్.
విష్ణు వర్ధన్ మిత్రుడిని రెండు వారాల తరవాత హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుని వచ్చారు. అతనిని డిశ్చార్జ్ చేసే రోజున విష్ణు వర్ధన్ హాస్పిటల్ కి వెళ్ళాడు. డాక్టర్ చేత డిశ్చార్జ్ సమ్మరీ రాయించు కోవడానికి ఒక గంట సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. పేషంట్లు చాలామంది డాక్టర్ రూమ్ బయట వున్నారు. వారిలో వృద్ధులు కొంత మంది  అయితే, మరికొంత మంది యువకులు, ముఖ్యంగా కాలేజీ పిల్లలు వున్నారు. కొంతమంది చిన్నపిల్లలు కూడా కనిపించడంతో ఆశ్చర్యపోయాడు విష్ణు వర్ధన్. వృద్ధులు ఒంటరి తనం వల్ల, యువకులు, కాలేజీ పిల్లలు ఉద్యోగాలు రాక, లేదా పరీక్షల ఒత్తిడి వల్ల డిప్రెషన్ కి లోను కావడం ఈ రోజుల్లో మామూలు విషయం గా చెప్పవచ్చు. కానీ నాలుగు ఐదు ఏళ్ళ నుంచి పది పన్నెండు ఏళ్ళ  వయసు వున్న చిన్నపిల్లలు కూడా కనిపించడంతో ఆ పిల్లలని నిశితంగా పరిశీలించసాగాడు విష్ణు వర్ధన్. ఇద్దరు  పిల్లల చేతిలో స్మార్ట్ ఫోనులు వుండటం అతను గమనించాడు. వారి తల్లిదండ్రులు కూడా తలా ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకుని వాటిని నొక్కుతూ బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా విస్మరించినట్టు కనిపించారు. అప్పుడు విష్ణు వర్ధన్ కి  ఆరు నెలల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తుకి వచ్చింది.



విష్ణు వర్ధన్ తన రెండేళ్ళ మనవడిని బేబీ కేర్ సెంటర్ లో చేర్పించటానికి వెళ్ళాడు. అప్పుడు ఒక వృద్దురాలు తన మూడేళ్ళ మనవడిని ఇంటికి తీసుకుని వెళ్ళటానికి వచ్చింది. ఆ అబ్బాయి చుట్టూ వున్న వస్తువులని బొమ్మలని బాగా గుర్తు పడతాడని , కానీ తనతో పాటే వున్న మిగతా పిల్లలతో అంటీ అంటనట్టు ముభావంగా ఉంటాడని ఆ పిల్లవాడి మీద ఆవిడకి ఫిర్యాదు చేస్తున్నారు  బేబీ కేర్ సెంటర్ సిబ్బంది. ఆ అబ్బాయి తల్లిదండ్రులు అమెరికా లో 
ఉంటారని, అమ్మమ్మ అమెరికా వెళ్ళినప్పుడు తనతో పాటు మనవడిని ఇండియా కి తెచ్చుకుందని గ్రహించాడు విష్ణు వర్ధన్. ఆ అబ్బాయికి తల్లిదండ్రులు  చిన్నప్పటినుంచి టీవీ , మొబైల్ ఫోన్ లో గేమ్స్ అలవాటు చేసారని వాటి ప్రభావంతో ఆ పిల్లవాడు ఎక్కువగా వాటినే ఇష్టపడతాడని, మిగతా పిల్లలతో ఆడుకోవటమన్నా, లేదా ఎవరైనా బంధు మిత్రులు వస్తే వారిని పలకరించాలన్నా అయిష్టంగా ప్రవర్తిస్తాడని తెలిసింది. బహుశా హాస్పిటల్ లో కనిపించిన నాలుగు ఐదు ఏళ్ళ పిల్లల లో కొంత మంది ఈ కోవకి చెందిన వాళ్ళు గా ఉండవచ్చని అనుకున్నాడు విష్ణు వర్ధన్.  పది పన్నెండు ఏళ్ళ పిల్లలు అయితే చాలా దురుసుగా అనిపించారు విష్ణు వర్ధన్ కి. అతి గారాబం, అడిగిందల్లా ఇవ్వటం వల్ల బహుశా ఆ పిల్లలు మొండిగా, దురుసుగా అయి ఉంటారని తలపోసాడు విష్ణు వర్ధన్. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు కావటం, ఇంట్లో పిల్లల ఆలనా పాలనా చూసేవారు  లేకపోవటం వల్ల చిన్నప్పుడే పిల్లలని బేబీ కేర్ సెంటర్ లో చేర్పించటం, ఆ పిల్లలు ఏది అడిగితే అది కొనివ్వటం, తల్లిదండ్రులు పిల్లలతో కలిసి సరదాగాగడపటానికి సమయం లేకపోవడం , కారణాలు  ఏమైతే నేమి కుటుంబ  వ్యవస్థ  చిన్నాభిన్నం అవుతోంది అని అనుకున్నాడు విష్ణు వర్ధన్. వీటి అన్నిటి ప్రభావం చిన్న పిల్లల మీద తీవ్రంగా పడుతోందని లోలోన కాస్త బాధ పడ్డాడు అతను.
 హాస్పిటల్ నుంచి తన మిత్రుడిని వాళ్ళ ఇంటివద్ద విడిచిపెట్టి బయలుదేరేముందు , “ వీలైనంత వరకు అతనిని ఒంటరిగా విడిచి పెట్టకండి. ముఖ్యంగా టీవీ , సెల్ ఫోన్ లు మీరందరూ కూడా వీలైనంత తక్కువగా వాడండి. సమయం దొరికినప్పుడల్లా అందరూ కలిసి కూర్చొని సరదాగా ఖబుర్లు చెప్పుకోండి. మనోవ్యాధి తగ్గడానికి ఇంతకన్నా మించిన వేరే మంచి చికిత్స లేదు. “ అని తన మిత్రుడి కుటుంబానికి హితోపదేశం చేసాడు విష్ణు వర్ధన్.
 ఆ మర్నాటినుంచి విష్ణు వర్ధన్ టీవీ చూడటం బాగా తగ్గించేసాడు. మరో వారానికి విష్ణు వర్ధన్  ఎక్స్చేంజి ఆఫర్ లో తన స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి మామూలు మొబైల్ ఫోన్ తీసుకున్నాడు. ఎవరితో నైనా  మాట్లాడినప్పుడు తప్ప  విష్ణు వర్ధన్ క్రమేపీ  ఆ మొబైల్ ఫోన్ ముట్టుకోవడం కూడా మానేసాడు.      
 ***

No comments:

Post a Comment

Pages