జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 18 - అచ్చంగా తెలుగు

జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 18

Share This
జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 18
చెన్నూరి సుదర్శన్

(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.) 
 “మాణిక్యం.. నీ ధైర్యానికి నా జోహార్లు.. ఇదే కసితో చదివి గ్రూప్ పరిక్షలు రాసావంటే ఉద్యోగం రాక మానదు” అంటూ కర్రలు మాణిక్యానికి సపోర్టుగా అందించి వీపు తట్టాను.

“చూడు మాణిక్యం దేశంలో ఎందరో నీకంటే ఎక్కువ శాతం  అవిటి తనంతో బాధ పడే వారున్నారు. అంతెందుకు నా పెద్ద కొడుకూ పోలియో వ్యాధీగ్రస్తుడే.. ఛాలెంజ్‍గా తీసుకున్నాను. అహర్నిశలు శ్రమపడ్డాను. వానికే లోటూ రానివ్వలేదు. వానికి చిరంజీవి సినిమాలన్నా.. ఫైటింగ్ సినిమాలన్నా చాలా ఇష్టం. ఎత్తుకుని వెళ్లి చూపించే వాణ్ణి.  ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమాల్లాంటివి  చూస్తూ వాడు కేరింతలు కొడ్తూ ఉంటే.. నా శ్రమనంతా మర్చిపోయే వాణ్ణి.
వాన్ని మెడలుపై కూర్చో బెట్టుకొని గోల్కొండ ఎక్కి రామదాసు చెఱసాల చూపిస్తూ కథలు చెప్పాను.  జూకు తీసుకెళ్తే వాని సంతోషం పట్టపగ్గాలు లేకుండా పోయింది. వాని కాళ్ళను నేనయ్యాను.
నిత్యం రెండు పూటలా వ్యాయామాలు చేయించాను. నా శ్రీమతి పూజలు ఫలించాయి. దేవుడు కరుణించాడు. వాడు మళ్ళీ తప్పటడుగులతో నడవడం ప్రారంభించాడు. ఇప్పుడు సిక్స్త్ క్లాసు. చదువుతున్నాడు. స్కూల్ కు సైకిలుపై వెళ్ళి రావడం ప్రాక్టీసు చేయించాను.
సెలవుల్లో నిన్ను ఒక దగ్గరికి తీసుకెళ్తాను.. వస్తావా? ఎక్కడికని మాత్రం అడుగొద్దు” అంటూ చిన్న పిల్లాడిలా అడిగాను.
“మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా వస్తా సార్” అంటూ చిన్నగా నవ్వాడు మాణిక్యం. అతడలా నవ్వుతూ ఉంటే మోములో అమాయకత్వం వెల్లువిరిసింది.    
ఫణీంద్ర గాని హిమజ గాని దీర్ఘ కాలిక సెలవు పెట్టి వెళ్లి పోతారనుకున్నాను. గాని ఫణీంద్ర ఆ మరునాడు చిరునవ్వుతోనే దర్శనమిచ్చాడు. నాకు ఆశ్చర్యమేసింది. హిమజ సైతం ఏమీ జరగనట్లే ఉంది. రామనాథం అసలు విషయమే మర్చిపోయినట్లుగా తన పనిలో తానున్నాడు.
సెలవుల్లో  మాణిక్యాన్ని ఖైరతాబాదు వద్ద ఆనంద్‍నగర్లో ఉన్న పి.బి.శెట్టి ఫిజియో తెరపిస్ట్  వద్దకు తీసుకెళ్ళాను. అతడు నా బాబుకు కాలిపర్స్ చేస్తూంటాడు.
మాణిక్యాన్ని పరీక్షించి సంతృప్తి వ్యక్తపర్చాడు. కాలిపర్స్ కు కావాల్సిన కొలతలు తీసుకున్నాడు.
శెట్టిగారు  చెప్పినట్లుగా మరో రెండు రోజుల్లో తిరిగి వెళ్లాం.
మాణిక్యం కుడి కాలు, ఎడం కాలు కంటే ఒక అంగుళం ఎత్తు తక్కువుంది. కాళ్ళకు సరిపడేలా తయారు చేసిన షూస్.. కాలిపర్స్ కట్టి వాకరిచ్చి నాలుగడుగులు నడిపించాడు. మాణిక్యం ముఖంలో కోటి దీపాల కాంతి.. అది చూసి చాలా సంతోషించాను.
“పది రోజుల పాటు ప్రాక్టీసు చేస్తే నడవడం సులభమవుతుంది కాని మాణిక్యం వయసుకు మించిన బరువున్నాడు.. ఇదివరలా పెద్ద కర్రలు గాకుండా చిన్న  చేతి కర్రల సాయం తీసుకుంటే మంచిది. లేకుంటే కాలిపర్స్ పై బరువెక్కువ పడి.. అవి విరిగి పడిపోయే ప్రమాదముంది”  అంటూ సలహా ఇచ్చాడు.
శెట్టి గారికి డబ్బులు చెల్లించి మాణిక్యాన్ని తీసుకొని బయలుదేరాను. దారిలో వాకర్ కొన్నాను.
మాణిక్యాన్ని అతడి ఇంటిలో దింపి జాగ్రత్తలు చెప్పాను. పట్టుదలతో నడిచి విజయం సాధించాలని ప్రోత్సహిస్తుంటే మాణిక్యం నాన్న గారు వచ్చి “సార్.. మీ ఋణం ఏమిచ్చినా తీరదు. కనీసం వీటి ఖర్చు చెబితే ఇచ్చుకుంటాను” అన్నాడు.
“ఖర్చు విషయం మర్చిపొండి.. ముందుగా మాణిక్యం మనసుకు బాధ కలుగకుండా చూసుకొండి.. దగ్గరుండి.. నడిపించండి..ఉత్సాహపరచండి ప్రేమగా మాట్లాడండి.. అదే పదివేలు” అంటూ నమస్కరించాను. మాణిక్యం తల్లిదండ్రుల ఆర్ధిక స్థితిగతులను చూస్తుంటే బాధ కలిగింది. వెనుతిరిగి వచ్చేసాను.
 దాదాపు ప్రతీ రోజు మాణిక్యం దగ్గరికి వెళ్ళేవాణ్ణి. పురోగతిని చూస్తూ తృప్తి పడేవాణ్ణి.  
 సెలవులు అయిపోయాయి. కాలేజీకి మాణిక్యం రెండు రోజులు ఆలస్యంగా వచ్చాడు గాని షూస్..  కాలిపర్స్ కట్టుకొని చేతికర్రల సాయంతో నడుచుకుంటూ.. కాలేజీ యావత్తు చప్పట్లతో ఆహ్వానించింది.. అందరికంటే ఎక్కువ ఆనందించింది నేను.. ఎదురుగా పరుగెత్తుకుంటూ వెళ్లి హత్తుకున్నాను. అప్పుడందరికీ అర్థమయ్యింది.. మాణిక్యం నడక వెనుక నేనున్నానని. ప్రిన్సిపాల్, స్టాఫ్,  విద్యార్థులు నన్నభినందించారు.

No comments:

Post a Comment

Pages