బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-06 (హంస వాహనము) - అచ్చంగా తెలుగు

బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-06 (హంస వాహనము)

Share This
బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-06 (హంస వాహనము)
వివరణ: డా.తాడేపల్లి పతంజలి 

దిబ్బలు వెట్టుచుదేలిన దిదివో
ఉబ్బు నీటిపై నొక హంసా॥పల్లవి॥

1.అనువున గమలవిహారమై నెలవై
వొనరి వున్నదిదె వొక హంసా
మనియెడి జీవుల మానససరసుల-
వునికి నున్న దిదె వొక హంసా॥దిబ్బలు॥

2.పాలునీరు నేర్పరిచి పాలలో-
నోలనాడె నిదె వొక హంసా
పాలుపడిన యీ పరమహంసముల-
వోలి నున్నదిదె వొక హంసా॥దిబ్బలు॥

3.తడవి రోమరంధ్రంబుల గుడ్ల-
నుడుగక పొదిగీ నొక హంసా
కడువేడుక వేంకటగిరి మీదట-
నొడలు వెంచెనిదె యొక హంసా॥దిబ్బలు॥

భావం:
మానస సరోవరంలో విహరించే హంస అనే పక్షిని, భక్తుల మానస సరోవరాలలో విహరించే పరమాత్మ అనేహంసను ఈ కీర్తనలో అన్నమయ్య కలిపి వర్ణించాడు.

నీటిమీద వాలిన హంస పైకి ఎగిరేటప్పుడు నీరు కూడా పైకి ఎత్తుగా ఎగురుతుంది.అలా నీటి మీదఎత్తులు పెడుతూ- పొంగుతున్న నీరు గల - మానస సరోవరంలో ఒక హంస ఉంది. ప్రళయకాలంలో అంతటా నీరు పొంగు తున్నప్పుడు మర్రాకు మీద తేలుతూ పరమాత్మ అనే ఇంకొక హంస (బాల కృష్ణుడు) కొండలుమొదలైన ఎత్తులు కల్పిస్తూ మళ్ళీ సృష్టి ప్రారంభిస్తూ ఉంది. 
ఒక హంస కమలాలతో నిండిన సరోవరంలో విహారంచేస్తోంది.పరమాత్మ అనే ఇంకో హంస-కమలతో అంటే లక్ష్మితో సంచారం చేస్తోంది.
ఒక హంస పాలు నీరు వేరుపరచి, పాలలో జలక్రీడ చేస్తోంది .శ్రేయస్సు ,ప్రేయస్సు అను రెండుసుఖాలలో శ్రేయస్సు (మోక్ష సుఖం) పాలులాంటిది. ప్రేయస్సు(ఇంద్రియ సుఖం)నీళ్ళవంటిది.పరమాత్మ అనేఇంకోహంస ఈ రెండింటిని వేరుపరచే జ్ఞానాన్ని పెంచి తనను నమ్ముకొన్న భక్తులకు ఇంద్రియ సుఖాలనుంచి దృష్టి మరల్చి ,మోక్ష సుఖం వైపు ఆసక్తిని పెంచుతుంది.(పాలు నీళ్ళు పాప పుణ్యాలకు సంకేతాలన్నారు రాళ్ళపల్లివారు.) 
ఒక హంస రెక్కలతో గుడ్లను పొదిగి పిల్లలకు జన్మ ఇస్తోంది.పరమాత్మ అనే హంస బ్రహ్మాండాలనే గుడ్లను
పొదిగి లోకాలను సృష్టిస్తోంది.ఈ పరమాత్మ అనే హంస కలియుగంలో వేంకటాద్రి మీద పొడవైన ,విశాలమైన
రూపంతో కనువిందు చేస్తోంది.
విశేషాలు
కంఠానికి కింద,బొడ్డుకు జానెడు మీద తామర మొగ్గలా బొటన వేలంత పరిమాణంతో ఒక మాంసపుముద్ద ఉంటుందని సంప్రదాయం.దీనినే హృదయ పద్మ కోశం అంటారు. దీంట్లో బొటన వేలి పరిమాణం గలపురుషుడు ఉన్నాడని,అతడు భూత భవిష్యత్తులకు ప్రభువని కఠోపనిషత్తు.ఈ ప్రభువుకోసమే జీవుడు సోహం-అంటూ ఆరాటపడుతుంటాడు.ఆ "సోహం''తిరగవేస్తే హంసో -అయింది. మన ఉచ్ఛ్వాసం సోహం.మననిశ్శ్వాసం హంసోహమ్మన్నారు గణపతి సచ్చిదానంద స్వామిజీ.ఆ హంస కోసం తదేక కవితా దీక్షతో అన్నమయ్య
చేసిన హంస గాయత్రి ఈ కీర్తన. 
కృష్ణా! నీ పాదమనే పంజరంలో నా మనస్సనే రాజ హంసను బంధిస్తాననిముకుందమాలలో కులశేఖరాళ్వారు భావించారు. అన్నమయ్య జీవుల మానస సరస్సులలో భగవంతుడనేరాజహంస ఉన్నాడని స్వామినే రాజ హంసగా మార్చాడు.
కొన్ని కొంగలు,ఒక రాజహంస మాట్లాడుకుంటున్నాయి.-"కాళ్లు ,మొగం ఎర్రగా ఉన్నాయి. ఎవరునువ్వు?''"హంసని''"ఎక్కడుంటావో?''"ఇక్కడే మానస సరోవరంలో'' "అక్కడి విశేషాలేమిటి?''"మంచిమంచి బంగారు పద్మాలు,ముత్యాలు ఉంటాయి''"మరి నత్తలుండవా?'' "అవినాకు తెలియదు''-హంసనత్తలగురించి తెలియదు అని జవాబిచ్చేసరికి కొంగలన్నీ హంసని ఎగతాళి చేస్తూ పకపకా నవ్వాయని ఒకఅందమైన చాటు పద్య భావం.
రాజహంస చూపు బంగారు పద్మాల మీద ,ముత్యాల మీద ఉంది.కొంగల చూపునత్తల మీద ఉంది.ఉన్నతమైన విషయాల మీద మన దృష్టి ఉండాలి. మన చూపు అలా ఉండాలనే కాబోలు-వేంకటేశుడనే హంస అలా ఉన్నతమైన కొండల మీద ఉన్నాడు. అందుకే అన్నమయ్యకీర్తన కూడా ఉన్నతమైనహంస చుట్టూ ప్రదక్షిణ చేసింది.
కమల (లక్ష్మి)ఎప్పుడూ మన దగ్గర విహరించాలని జీవహింసలకైనా -వెనుకాడకుండా మనబోటి జీవ హంసలు కోరుకొంటుంటాయి.కమల ఏరికోరి -వేంకటేశుడనే పరమ హంస వక్షస్థలంలో విహరిస్తోంది."ఒరేయ్--పిచ్చోళ్ళారా- మీరు కోరుకుంటున్న లక్ష్మి నన్ను కోరుకొని నాదగ్గర ఉంది చూడండిరా ''అని ఒడలు పెంచి వేంకటేశుడు ఉన్నాడని,ఆయన్ని ఆశ్రయించమని అన్నమయ్య ఈ కీర్తనలో సందేశమిస్తున్నాడు.
వృక్షాలు,ఓషధులు భగవంతుని రోమాలుగా భాగవతంచెబితే , రోమాలలో గుడ్లను ఉంచి వాటిని బ్రహ్మాండాలకు సంకేతాలుగా ఈ కీర్తనలో అన్నమయ్య వర్ణించాడు. దేవుని దయ ప్రసరిస్తే జీవుడికి ,ఆయనను స్మరించే యోగ్యత కలుగుతుంది. దేవుని స్మరించే అన్నమయ్య కీర్తనలు చదివే యోగ్యత లభించిందంటేనే స్వామి
దయ మన మీద ఉన్నట్టే. మనం ఎంత అదృష్ట వంతులం ! 
రెండవరోజు రాత్రి స్వామి వారు హంస వాహనంపై ఊరేగుతారు.
భావించితే హంసగతి పాదాలజిక్కీ(29-141)అంగజు రథమున హంసలు నిలిపీ(26-293) అని  నాయికను వర్ణించిన ఊహాశక్తితోనే  “హంసచేతి పాలునీరునట్లాయ బ్రదుకు(2-6) అని బ్రతుకును కూడా హంస గీతిగా చేసిన మహాకవికి జోహారు. హంసవాహనునికి జేజేలు.
***

No comments:

Post a Comment

Pages