నానమ్మ గారి వడియాల వ్యాపారం - అచ్చంగా తెలుగు

నానమ్మ గారి వడియాల వ్యాపారం

Share This
నానమ్మ గారి వడియాల వ్యాపారం 
శశిరేఖా లక్ష్మణన్ 

"మా నానమ్మ ఊరు వెళ్ళాలి..??"
సూటిగా అన్నాను రామదాసుతో.
"ఎందుకు..?? ఆవిడ చనిపోయి పాతికేళ్ళవుతోంది..!!
ఇప్పుడెళ్ళి ఏం చేద్దామని..!"
విసుక్కున్నాడు రామదాసు.
రామదాసు మా నమ్మినబంటు.నాన్నగారి దగ్గర పన్జేస్తాడు.
అరవైఏళ్ళుంటాయి.చిన్నప్పటి నుండి పన్జేస్తుండడంతో వయసైపోయినా మా పంచనే ఉంటాడు.
అప్పుడప్పుడు చనువుగా సలహాలిస్తుంటాడు.
"అక్కడ నానమ్మ పెంకుటిల్లుంది.అది అమ్మి పారేద్దామనుకుంటున్నాను.
నేను బాగా సంపాదిస్తున్నాను.లోను తీసుకుని స్వయంగా వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. కారు తయారీకి ఒక పార్టు నా ఫాక్టరీలో తయారవుతుంది. ఆ పార్ట్ కొనేందుకు కారు తయారు చేసే కంపెనీలు పోటీలు పడతాయి.ఆ విధంగా నా వ్యాపారం ఆరంభిద్దామనుకుంటున్నాను.
నీకు చెప్పినా అర్థం కాదు.కొంచెం డబ్బు తక్కువైంది.నానమ్మ పెంకుటిల్లు అమ్మితే ఐదో పదో లక్షలు వస్తాయి.
అది అమ్మేద్దామనుకుంటున్నాను.నాన్నను అడిగాను.అయిష్టంగానే ఒప్పుకున్నారు.ఊరికి రేపే ప్రయాణం." హడావుడిగా చెప్పాను.
రామదాసు మిన్నకుండిపోయాడు.
"ఒక్కసారి ఆలోచించండి శరత్ బాబు..!!"
బ్రతిమలాడుతూ అన్నాడు.
"ఠాత్ ..!!అదంతా కుదర్దు..!!
నాకు డబ్బు అవసరం.ఎక్కడైనా అప్పు తీసుకుంటే వడ్డీ కట్టలేను."స్థిరంగా అన్నాను.
"మీ ఇష్టం.అయితే ఆఖరుసారిగా ఊరిని చూడాలని ఉంది.
నేనూ వస్తాను."రామదాసు అన్నాడు వేడుకోలుగా.
"సరే..!!"
చేసేదేమీ లేక ఒప్పుకున్నాను.ఈ ముసలాడిని బాధపెట్టడం ఎందుకు.
పైగా ఊరి ప్రజలతో మాటామంతికి ఉపయోగపడతాడు.
ఆ ఇల్లు ఒక గుడ్డివాడైన భర్త గల ఇల్లాలికి రెండేళ్ళ ముందు అద్దెకి ఇచ్చాం.
నెలనెలా పాపం అయిదువేలు బ్యాంకులో వేస్తుంది.
పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు చేసిన యాభై ఏళ్ళావిడ.
ఆమెకు ఎలా సర్ది చెప్పాలనో అని పరిపరి విధాలా ఆలోచిస్తూ మా ఊరు రామవరం మరుసటి రోజే బయల్దేరాము. 
****** 
ఊరు చేరాము.రామదాసుని అందరూ గుర్తుపట్టారు.
ఊరి జనం ఆప్యాయంగా పలకరించారు.
దారంటా అందరికీ రాధమ్మ మనవడు అంటూ గొప్పగా పరిచయం చేసాడు.
మా నాన్నమ్మ పేరు వినగానే అందరి కళ్ళల్లో మెరుపు మెరిసింది.
ముఖ్యంగా యాభై దాటినవారు నాన్నమ్మను గుర్తు చేసుకున్నారు.
"మీ నాన్నమ్మ గారు వడియాలు బాగా చేసేవారు.
మీ తాతగారు దుర్వ్యసనాలతో ఆస్థినంతా హారతి కర్పూరం చేయడంతో పాపం ఆ మహా ఇల్లాలు మీ నాన్న,బాబాయిల పోషణార్థం వడియాలు పెట్టి అమ్మేది.
నేను తెలిసినవారందరికీ అమ్మి పెట్టేవాడిని,
తృణమో పణమో ఇస్తే అదే జీతంగా భావించి ఉన్న కొద్దిపాటి మీ తాతయ్య పొలం చూసుకునేవాడిని.
తాతయ్య నాకు మీ పొలం కౌలుకు ఇచ్చాడు."
దార్లో అలసట మరువడానికై చెప్తూ పోతున్నాడు రామదాసు.
"కౌలు అంటే పొలం అద్దెకిస్తే కొన్ని బస్తాల ధాన్యం,కొంత డబ్బు ఇంటి అద్దెలాగా ఇవ్వడం అవునా..!!"ఆసక్తిగా అడిగాను.
"అవును.నేను పంటపొలం చేతికి రాగానే పది బస్తాల ధాన్యం కొంత రొక్కం ఆ సంవత్సరాదాయంలో ఇచ్చేవాడిని.
నమ్మకస్థుడిని కావడంతో నానమ్మ వేరే ఎవ్వరికీ పొలం కౌలుకు ఇచ్చేది కాదు.
నన్ను స్వంత తమ్ముడిలా చూసుకునేది.వెళ్ళినప్పుడల్లా వేడి వేడి అన్నం,కూర,పప్పుతో చేసిన వంటలు!ఊర్మిండి(చట్నీ లాంటిది)పెట్టేది.
నేను అక్కా!అనే పిలిచేవాడిని."
గతం గుర్తు చేసుకుంటూ చెమర్చిన కళ్ళు తుడుచుకున్నాడు.
చూస్తుండంగానే మాటల మధ్య మా నాన్నమ్మ పెంకుటిల్లు దగ్గర కొచ్చేసాం.
నాకు చాలా ఆనందమేసింది.
ఇల్లు చాలా పాతది.1920లో కట్టిందనుకుంటాను.
ఇంట్లోకి అడుగుపెట్టబోతుండగా ఒక యాభైఏళ్ళావిడ మా ఇద్దరినీ ఎగాదిగా చూసి "ఎవరూ ..?"అన్నది.
నేను,రామదాసు వివరాలు చెప్పాం.
"క్షమించండి! సుందరం కొడుకు మీరేనా!మీ నాన్నగారి పోలికలు కనబడుతున్నాయి." 
మా నాన్నగారిని పేరెట్టి పిలవడం నాకు చిరాకనిపించింది.
అది గమనించిందేమో తను,
"నేనూ సుందరం ఒకే బళ్ళో అయిదో తరగతి వరకు చదివాం.అందుకే పేరెట్టి పిలిచాను.ఏం అనుకోవద్దు శరత్ ..!!" 
సౌమ్యమైన గొంతుతో అంది.
"అలాగే..!" అంటూ ఆ హాల్   పరికించాను.
చిన్నా పెద్దా కాని హాలు.రెండు గదులు.పెరట్లో బాత్రుములు,రెస్ట్ రూములు.
పెంకుటిల్లు అయినా, కడప రాళ్ళ ఫ్లోరింగ్ అయినా చల్లగా బాగుంది ఇల్లు.
సీలింగు ఆ కాలం రంగూన్ టేకుతో చేసిందంట.
మమ్మల్ని సేద తీరమని చెప్పి మంచినీళ్ళందించి,స్టీలు గళాసులో చల్లటి మజ్డిగ అందించింది.
గటగటా త్రాగేసాను నేను.
రామదాసు నింపాదిగా త్రాగుతున్నాడు.
కొద్దిసేపు మాకు తినడానికి తను చేసిన ఫలహారాలందించింది.
కారప్పూస,జంతికలు,మైసూర్ పాకులు.
ఎటెళ్ళిందో ఏమో మేం తినేలోగా ఆ హాలు నుండి ద్వారం కనబడుతున్న గది నుండి బయటకి వచ్చింది.
"మీరు విశ్రాంతి తీసుకునేదానికి ఆ గది తాళం తీసి  శుభ్రం చేసాను.అసలు ఆ గది మేము అస్సలు వాడము.ఏవో పాత సామాన్లుండడంతో ఆ గదిలో పడేసి స్టోర్ రూమ్ లా ఉంచేసాం.
ఒక్క హాలు,పడక గది,వంటగది మాత్రమే వాడతాము.కొంత వరకు సామాన్లు గది మూలగా పెట్టి గదిని ఊడ్చి,తడిగుడ్దతో తుడిచాను.మీరు విశ్రాంతి తీసుకోండి.
ఈ లోగా నేను వంట చేస్తాను."
అంటూ హుషారుగా  పెరటికి దగ్గరగా నున్న చిన్న వంటగది దగ్గరికెళ్ళింది.
"ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు.వంటిల్లు ఆగ్నేయంలో ఉంది."
నాకు తెలిసిన వాస్తు ఉబుసుపోక రామదాసుకు చెప్పాను.
"అవునా బాబు!ఆగ్నేయంలో వంట గది చాలా మంచిదంట కదా!అందుకే అప్పట్లో వంటింట్లో తినుబండరాలు,వడియాలు,అరిసెలు!బూరెలు మీ నాన్నమ్మ పండుగ పబ్బాలకు చేసేది.
ఆర్థిక ఇబ్బందులు మీ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తే తను ఈ వంటలు దండిగా చేసి నన్ను అమ్మి పెట్టమనేది.
నేను పాపం కష్టాలలో ఉన్న స్త్రీ అని అమ్మి పెట్టేవాడిని.
ఒక్క నయాపైసా వెనకేయలేదు బాబు!
అందుకే మీ నాన్నమ్మకు నేనంటే అమిత అభిమానం." రామదాసు అప్పుడప్పుడు ఇలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాడు.
నేను ఆ సోదంతా వింటాను.
నేను మంచోడినే కానీ ఒక్కోసారి మాటల మధ్యలో రామదాసు గానీ మా నాన్నగానీ అమ్మ గానీ గతంలోకి వెళ్ళి తమ స్వగతం చెబుతుంటే అసలే బద్ధకస్తుడిని విసుక్కుంటాను.
ఎందుకంటే నా బాల్యమే నేను తలచుకోను.
అసలు ఈ ఊరులోనే నేను పెరగలేదు,నేను పెరిగిందంతా హైదరాబాదు లోనే.
నాన్నమ్మ చనిపోయాక ఈ ఊరు వదిలి నాన్న హైదరాబాదులో ఉద్యోగం చూసుకుని మమ్మల్ని ఇంజనీరింగు చదువులు చదివించారు.
నేను కంప్యూటర్ ఇంజనీరైతే అక్క ఐటి లో ఇంజనీరింగు చేసి గత సంవత్సరమే తనకు పెళ్ళైంది.
నేనే ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగంతో సరి పెట్టుకోలేకపోతున్నాను.
గాడిద చాకిరి చేయించి అరవైవేలు ఇస్తున్నారు.
కంపెనీలో హెచ్ ఆర్ గా నేనున్నా నా వరకు ఇది తక్కువ జీతమే.
అందుకే బిజినెస్ చేసి నెలకు లక్షపైనే ఆదాయం పొందాలని నా ఉద్దేశ్యం.
మాకు కేటాయించిన గదిలో పందిరి మంచంలో కూర్చున్నాం.
మా నెత్తిన గిర్రున ఫ్యాను తిరుగుతుంటే తల తిరుగుతున్నట్లుంది.
పాతకాలం డొక్కు ఫ్యాను.
నాకు అహంకారం ఎక్కువ.
అందుకే ఇంట్లో ఒక్కోసారి అక్క శైలజ చేత చీవాట్లు,అమ్మ చేత పెసరట్లు తింటుంటాను.
గది అంతా కలియ చూసాను.
ఒక మూల టేబులు,ఒక ఛేరూ ఉంది.
పాతకాలం రోజ్ వుడ్ చెక్కతో చేసినట్లుంది.
కొంచెం శిథిలావస్థలో ఉంది.
పురావస్తు శాఖ వారికివ్వకుండా ఇక్కడెందుకు ఈ చెత్త అనుకున్నాను.
రామదాసు తన వెంట తెచ్చుకున్న వారపత్రికలు చదువుతున్నాడు.
నేను కుతూహలంతో ఆ టేబుల్ సొరగు లాగి చూసాను.
కిర్రుమంటూ ఆ చెక్క టేబుల్ సొరగు తెరచుకుంది.
లోపల ఏవో పాతకాలం నాటి పుస్తకాలు,ఒక నల్లటి పాత డైరీ దొరికింది.
సరదాగా ముందు పేజీ... ఆనక మిగిలిన పేజీలు తిప్పాను.
ఓర్నీ!ఈ నాన్నమ్మకు డైరీ రాసే అలవాటు కూడానా..??
తనను తాను హీరోయిన్ అనుకుంటోంది.
ఎగతాళిగా అనుకున్న నాకు అప్పుడు తెలీలేదు ఆ డైరీ ద్వారా ఒక అద్భుతమైన మనిషి గురించి తెలియబోతోందని...
నా కళ్ళకు కమ్మిన మైకంతో కూడిన అహంకారపు పొరలు తొలగుతాయని....
పందిరి మంచం మీద కూర్చుని నేను డైరీ చదవడం మొదలెట్టాను.
మొదటి పేజీలోనే ఆరంభించింది.
ముత్యాల్లాంటి అక్షరాలతో మా నాన్నమ్మ రాధ.
"డైరీ రాయాలని లేదు.కానీ రాస్తే ఏవైనా పద్దూలు మరచినవి గుర్తుంటాయని రాస్తున్నాను.
ఆయన తీరు ఏమీ బాగా లేదు.
ఇష్టమొచ్చినట్లు డబ్బు ఖర్చు పెడుతూ రేసులూ అవీ అంటూ పట్నం వెళ్ళి వేల కొద్దీ తగలబెడుతున్నారు.
అవి కాక తప్పుడు వ్యసనాలు కూడా అలవడుతున్నాయని నా అనుమానం.
పట్నం నుండి వచ్చినప్పుడల్లా నోటి నుండి దుర్వాసన.
ఒకవేళ త్రాగుతున్నారేమో!
అలా అనుకోగానే నా గుండె మండిపోతోంది.
అన్ని వ్యసనాలకు నాంది త్రాగుడే.
పెద్ద కొండచిలువ ఇంట్లో కొచ్చినట్లు..మెల్ల మెల్లగా అన్ని వ్యసనాలు పచ్చని కాపురంలో వేళ్ళూనుకుంటాయి."
అంత వరకు చదివాక మరి కొన్ని పేజీలు తిప్పాను.
"అనుకున్నంతా అయ్యింది.ఆయన చెడుదారులు పడుతున్నారు.పరస్త్రీ వ్యామోహంతో నా నగలన్నీ తీసుకెళ్ళారు.
పుట్టింటివారివి,అత్తింటివారివి అన్నీ కాళ్ళొచ్చినట్లెళ్ళిపోయాయి.
చేతికి బంగారు కడియాలు.చెవికి లక్ష్మీదేవి బొమ్మ గల కమ్మలు మాత్రమే మిగిలాయి.
మొన్న బంగారు గొలుసు గల తాళిబొట్టు లాక్కుని వెళుతుంటే నెత్తీనోరుకొట్టుకుని మొత్తుకున్నాను.
ఏదీ!వింటేనా!ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఇట్లాంటి మొగుడు వచ్చాడు.
అసలు ఆ ఈశాన్యంలో మరుగుదొడ్లు కట్టినప్పటి నుండే ఈ వ్యసనాలెక్కువైయ్యాయి.
ఉత్తరం దిక్కు ప్రధానద్వారం గల ఇంటికి ఇంటి ముందు ఈశాన్యంలో మరుగుదొడ్లు ఎవరైనా పెడతారా!ఈయన చోద్యం సంతకెళ్ళ!
వాయవ్యంలో ఓ వారగా ఉన్న స్నానాల గది!దాని పక్కనే మరుగుదొడ్డి చాలంటున్నా వినక అయిదు మంది కుటుంబ సభ్యులకు ఒక ఎగస్ట్రా మరుగుదొడ్డి ఉంటే మంచిదని కట్టాడు.
దేవుడిని నమ్మడు,వాస్తును నమ్మడు,తిని బలాదూరు తిరగడం,ఆస్థులమ్మి జల్సా చేయడం పెళ్ళాన్ని తిట్టడం ఇదే నా పెనిమిటి(భర్త)ఘనకార్యాలు.
పెద్దగా చదువుకోలేకపోవడం నా ఖర్మ.
ఏంటో ఈ రోజూ ఆయన్నెక్కువగా తిట్టేసాను.
ఈ డైరీ కంటబడితే అంతే సంగతులు.
మంచం క్రింద దాచాలి.చూసాడంటే నా
తోలు తీసి గుమ్మానికి వెళ్ళాడదీస్తాడు.హు.."
అంత వరకు చదివి నేను ఆగాను.ఏమాటకామాటే చెప్పుకోవాలి.
పాపం నాన్నమ్మ మంచిమనసు గల పడతే.తాతయ్యే దుర్మార్గుడన్న మాట.

**** 
మనసంతా కకావికలమైపోయింది నాకు.
పాపం ఆ పెద్దావిడ ఎన్ని బాధలు పడిందో..!!తలచుకుంటే గుండె చెరువైపోయింది.
నాన్నమ్మా!నువ్వు గ్రేట్ రా!
తరువాత పేజీలు తిరగేసాను.
"రెండ్రోజులుగా వంటింటి పొయ్యి లోంచి పిల్లి లేవలేదు.పిల్లలకు తిండి లేదు.పక్కింటి నుండి నూకలు తెచ్చి గంజి చేసిచ్చాను.ఆయన ఈ మధ్య ఇంటిపట్టునుండడం లేదు.ఇల్లు ఎలా గడుస్తుంది.నేనా పాతికేళ్ళ స్త్రీని.ఏ పనీ చేతకాదు.వంట తప్ప.
ఎలా సంసారం గడుస్తుందో తలచుకుంటే భయంగా ఉంది.
శారదమ్మ వడియాలు చేయడానికి పిలిస్తే సాయం చేసాను.ఎండలో వడియాలు పెట్టాను.
ఆలోచిస్తుంటే వడియాల వ్యాపారం పెట్టాలనిపిస్తోంది.
మంచి లాభసాటి వ్యాపారం.పెద్దగా పెట్టుబడి అవసరం లేదు.
పైగా తెలిసిన పనే కాబట్టి నేను అట్టే శ్రమపడనవసరం లేదు.
ఆయన మీద పిల్లల ఖర్చులకై ఆధారపడవలసిన అవసరం లేదు.
రామదాసుకు పొలం కౌలుకిచ్చాను కాబట్టి బ్రతిమాలి బామాలి వడియాలు అమ్మి పెట్టమంటాను.
సాయం చేస్తాడన్న నమ్మకం ఉంది."
ఆసక్తిగా మరో పేజీ తిరగేసాను.

"వడియాల వ్యాపారం జోరుగా సాగుతోంది.
కొన్న వారందరూ రాధమ్మ సగ్గుబియ్యం వడియాలు నూనెలో వేయించి అన్నంలో కలుపుకుని తినగానే నోట్లో వెన్నలా కరిగిపోతున్నాయి అని అంటున్నారు.
వడియాలు కొన్నవాళ్ళు తమ బంధుమిత్రులకు కానుకగా కొని ఇవ్వడం.వారు వాడి చూసాక అద్భుతంగా ఉన్నాయి వడియాలని ఆరా తీసి మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి కొనుక్కుని వెళ్ళడం నా శ్రమకు గుర్తింపు లభించిందన్న మానసిక ఆనందం మిగిల్చింది.
పైగా రాధమ్మ వడియాల ఇల్లు అనగానే ఊర్లో మా ఇల్లు చూపించేంత పేరు,పరపతి వచ్చేసింది.
వేసవికాలం ముగియగానే మెల్లగా అరిసెలు,జంతికలు చేసి రామదాసు చేత అమ్మి పెట్టమనాలి.
రామదాసుకు నేను ఎంతో ఋణపడి ఉన్నాను.నాకు తమ్ముడిలా సాయం చేస్తున్నాడు.
అంత వరకు చదివిన నాకు-
"శరత్ గారు భోజనం రెడీ చేసాను.
ఉన్న కూరగాయలతోనే బెండకాయ వేపుడు,ముక్కల సాంబారు,పాపులర్ అప్పడాలు చేసాను.తోడుపెట్టిన గడ్డపెరుగు ఉంది.రేపు ఇంకొక కూర ఎగస్ట్రా చేస్తాను."ఆప్యాయంగా అంది శాంతమ్మ.
"అలాగే అత్తా!"అనుకోకుండా అనేసాను.
"పరవాలేదు.అలానే పిలు.మీకు ..మాకు బీరకాయపీచు చుట్టం ఉంది."
ప్రేమగా అంది శాంతమ్మత్త.
నేనూ,రామదాసు తినేందుకు బయల్దేరాం.
హాల్లో చెక్క పీటలు వేసి కూర్చోమంది.
డైనింగు టేబులే తప్ప చెక్కపీటలు నాకు అలవాటు లేదు.
అయినా చేతులు కడుక్కుని సర్దుకుని బాసింపట్టు వేసుకుని వేడివేడి అన్నం తింటుంటే పక్కనే శాంతమ్మత్త వడ్డించ సాగింది.
అన్నం తింటుంటే నెయ్యి వేడి చేసి  సాంబారు అన్నంపై... నేను నజుకుంటూ తింటుంటే వేసింది.
శాఖాహారమైనా నాకు అంత రుచికరమైన భోజనం నా జన్మలో తినలేదనిపించింది.
భోజనం చేసాక మేను వాల్చాం.
పందిరిమంచం పాతదైన బెడ్డు కొత్తది కావడంతో నాకు ఈజీగా నిద్ర పట్టింది.
నిద్రలో నాన్నమ్మ కలలో వచ్చింది.
నేనెప్పుడూ నాన్నమ్మను చూడలేదు.
నేను పుట్టక ముందే చనిపోయింది.
నాన్నమ్మ లాగా మా నాన్నగారుంటే మా నాన్నగారిలాగా నేనుంటానంట.
అందుకే నేను నాన్నమ్మ డైరీ చదువుతూ ఆమె మనస్తత్వానికి కనక్ట్ అవుతున్నాను.
డైరీ మొత్తం రాత్రి లోపల చదివేసాను.
చాలా విషయాలు కదిలించాయి.
తాతయ్య గుండెపోటుతో మరణించాక ఒంటి చేత్తో నాన్నమ్మ ముగ్గురు పిల్లలను పెంచిన వైనం,లోకం అనే పెడసరపు మాటలను లెక్క చేయక అప్రతిహతంగా ముప్ఫై అయిదేళ్ళ దాకా వడియాల వ్యాపారం కొనసాగించడం.
ఇవ్వన్నీ ఆమె గుండె నిబ్బరానికి నిదర్శనం.
ఒక స్త్రీగా అంత మానసిక స్థైర్యం మా నాన్నమ్మకే సాధ్యమేమో.
ఆ డైరీ చదివాక నా మాటతీరులోనూ ఆలోచనా విధానంలోనూ మార్పు వచ్చింది.
కొంచెం సంస్కారవంతంగా ఆలోచిస్తున్నట్లనిపించింది.
డైరీలో ఆమె మెన్షన్ చేసిన మహత్తర విషయం ఆలోచింపజేసింది.
నాకు ఉత్సాహం కలిగించింది.
నేనో స్థిర నిర్ణయం తీసుకోవడానికి ఊతం కలిగించింది.
***** 
ఊరంతా నేనూ,రామదాసు తిరిగి వచ్చాం.
పొలం గట్లమ్మట జాగ్రత్తగా 
యాభై పైబడిన వారంతా నాన్నమ్మను గుర్తు తెచ్చుకుని కళ్ళనీళ్ళపర్యంతమయ్యారు.
మీ నాన్నమ్మ గారి వడియాలు చాలా రుచికరంగా కరకర లాడుతూ ఉంటుందని.
చుట్టుపక్కల నుండి కూడా వచ్చి కొనుక్కుని వెళతారని,ఎలా చేస్తారు వడియాలు అని అడిగితే కొలతలు అవీ చెబుతారని అయినా ఆమె చేతి రుచి ఎవ్వరికీ రాలేదని ఇలా అంటుంటే ఆనందమనిపించింది.
మా నాన్నని కష్టపడి సివిల్  ఇంజనీరింగు చదివించింది.
బాబాయ్ లిద్దరినీ బియ్యే చదివించి ఉద్యోగస్తులను చేసింది.
నాన్న ప్రభుత్వోద్యోగం చేసి రిటైర్ అయ్యారు.
నన్నూ,అక్క శైలజనూ ఇంజనీరింగు చదివింపజేసారు.
ఇవన్నీ నాన్నమ్మ పెంపకం వల్లే.తను అందరి దీవెనలు పొందడం వల్లే మా జీవితాలు అందంగా కుదిరాయి.
నేను శాంతమ్మతో కుశల ప్రశ్నలడిగి బయల్దేరాను.
డైరీలో నాన్నమ్మ రాసింది గుర్తుతెచ్చుకున్నాను.
పందిరి మంచం లో రహస్య అర ఒకటి ఉంది.
అందులో నాన్నమ్మ దాచిన పాతకాలం నాటి బంగారు మురుగులు,ఒక కంటె(బంగారు చోకర్ లాంటి మెడను అట్టి పెట్టి ఉండే నెక్లసు)
కొన్ని బంగారు కమ్మలు ఒక తెల్ల సంచీలో భద్రపరచి ఉన్నాయి.
ఆశ్చర్యమనిపించింది.అదే సమయం ఈ పాత పందిరి మంచం చెక్ చేయని శాంతమ్మ గారి మీద గౌరవం కలిగింది.
ఆఖరుకి టేబుల్ సొరగు లోని డైరీ కూడా తను చదివినట్టు లేదు.
మా నాన్న సుందరం నా చదువుకై ఎంతో ఖర్చుపెట్టాడు.అందుకే ఈ వ్యాపార విషయంలో నాన్న సాయమడగడం అంత న్యాయమనిపించడం లేదు.
డైరీలో మా నాన్నమ్మ రాసుకుంది తన అరవైయ్యవ ఏట వరకు వడియాల వ్యాపారం చేస్తుండేదని.
నాన్నమ్మ నిద్రలోనే చనిపోయిందని మా నాన్నగారు చెప్పేవారు.
అదృష్టవంతురాలు.అనాయాస మరణం.
ఊరు వదిలి కారు డ్రైవ్ చేస్తూ అన్నాను.
"రామదాసు తాతా!నేను ఈ పెంకుటిల్లు అమ్మను.పాపం గుడ్డి భర్తతో ఆ శాంతమ్మ ఎన్నాళ్ళుంటుందో ఉండనీ..!!"
"చాలా సంతోషం నాయనా!మంచి విషయం చెప్పావు."
"ఆ పది లక్షలు నాన్నమ్మ బంగారు మురుగులు,బంగారు కంటె,బంగారు కమ్మలు కుదువ పెడితే వస్తాయి.
నాకు మా నాన్నను అప్పు అడగడానికి మనస్కరించలేదు.కానీ నాన్నమ్మ నగలు కుదువ బెట్టి డబ్బు తెచ్చుకుంటే నాన్న ఏమీ అనరు.ఎందుకంటే నేనెలాగు ఆ నగలు వ్యాపారంలో లాభం రాగానే విడిపిస్తానని మా నాన్నకు తెలుసు.ఎటొచ్చి సెంటిమెంట్ గా నగలు కుదువ బెట్టేందుకు ఒప్పుకోరేమోనని మనసులో చిన్న సందేహం.
బ్యాంకులో కొద్ది పాటి వడ్డీ కడితే చాలు."అని నాన్నకు నచ్చ చెబుతాను.
ఈ నగల విషయం చెప్పి నాన్నకు షాక్ ఇవ్వాలి.ఆ పాతకాలం పెంకుటిల్లు అమ్మనవసరం లేదనగానే నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి.
మెయిన్ రోడ్డు పై వేగంగా కారు నడుపుతూ హైవేస్ దారి పడుతూ కారు యుటర్న్ చేస్తూ ఉత్సాహంగా అనుకున్నాను.

కొసమెరుపు:—
అసలు విషయం ఏంటంటే ఆ నగలు శరత్ నాన్న సుందరం.., కొడుకు మనసు మార్చేందుకు.. అమ్మ బ్రతికిన పెంకుటిల్లు నేలమట్టం చేయడం ఇష్టం లేక శరత్ రామవరం బయల్దేరుతున్న విషయం తెలిసిన ముందురోజే పందిరి మంచపు అరలో నగలు మరియు చెక్క టేబుల్ సొరగులో తన తల్లి రాధమ్మ రాసిన డైరీ  శరత్ కంటబడేలా పెట్టాడు.
ఎందుకంటే ఈ నగలు అమ్మో లేదా కుదువ బెట్టో వ్యాపారం చేయడానికి శరత్ కు అనుమతివ్వగలడు.
నిక్షేపం లాంటి పెంకుటిల్లు కూల్చేందుకు,అమ్మేందుకు మనసు రావడం లేదు.

గతంలో అమ్మ చనిపోక ముందే అతని హస్తగతమైన వస్తువులు ఇప్పుడు కొడుకు పరం చేసాడు.
తను రెండ్రోజుల ముందు వచ్చి వెళ్ళిన  విషయం శరత్ కు చెప్పవద్దని ఆ ఇంట్లో బాడుగకు ఉన్న శాంతమ్మ చేత ప్రమాణం చేయించుకున్నాడు.
 *******

No comments:

Post a Comment

Pages