బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-05 (చిన్న శేష వాహనము) - అచ్చంగా తెలుగు

బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-05 (చిన్న శేష వాహనము)

Share This
బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-05 (చిన్న శేష వాహనము)
081. శ్రీహరి నిత్యశేషగిరీశ
(అన్నమాచార్యులు రచించిన సంస్కృత కీర్తన ఇది.)
డా.తాడేపల్లి పతంజలి 

(కీర్తన సంఖ్య 527 సంపుటము 3 రాగిరేకు సంఖ్య 291 )
శ్రీహరి! నిత్య! శేషగిరీశ
మోహనాకార !ముకుంద !నమో ! శ్రీహరి!
1.దేవకీ సుత దేవ వామన
గోవిందా గోప గోపీనాథా! శ్రీహరి!
గోవర్ధనధర గోకులపాలక
దేవేశాధిక తే నమో నమో ||
2.సామజావన! శార్ఙ్గపాణి!
వామనా! కృష్ణ! వాసుదేవ
రామనామ !నారాయణ! విష్ణో
దామోదర శ్రీధర నమో నమో ||
3.పురుషోత్తమ పుండరీకాక్ష
గరుడధ్వజ కరుణానిధి శ్రీహరి
చిరంతనాచ్యుత శ్రీవేంకటేశ్వర
నరమృగ తే నమో నమో || 

తాత్పర్యము:
ఓ శ్రీహరీ ! నిత్యుడా! శేషాచలమునకు ప్రభువా!
మోహనమైన ఆకారము కలవాడా! మోక్షమునిచ్చువాడా ! నీకునమస్సులు.

1.దేవకీదేవి కుమారుడా! ప్రకాశించువాడా! వామనావతారమెత్తినవాడా!
గోవిందుడా! గోపాలకులకు, గోప కాంతలకు నాథుడా! శ్రీ హరీ ! 
గోవర్థన పర్వతమును ధరించిన వాడా ! గోకులమును పాలించువాడా!
దేవతలకు ప్రభువా ! అధికుడా! నీకునమస్సులు.నమస్సులు

2.గజమును కాపాడిన వాడా ! శార్ఙ్గమను ధనుస్సును చేతియందు కలవాడా !
వామనావతారమెత్తిన వాడా ! కృష్ణుడా ! వసుదేవుని కుమారుడా ! 
రాముడను పేరు కలిగిన వాడా! నారాయణుడా ! ఓ విష్ణు మూర్తీ ! 
దామోదరుడా ! లక్ష్మిని ధరించిన వాడా! నీకునమస్సులు.నమస్సులు

3.ఓ పురుషోత్తముడా ! తెల్ల తామరలవంటి కన్నులు కలవాడా !
గరుడుని గుర్తు కలిగిన జెండా కలిగినవాడా ! దయకు నిధివంటి వాడా! శ్రీహరీ! 
చిరంతనుడా! (అనేక రోజులనుంచి , చిరకాలం నుంచి ఉన్నవాడా) అచ్యుతుడా ! శ్రీ వేంకటేశ్వరుడా! 
నరసింహావతారము ధరించిన వాడా ! నీకునమస్సులు.నమస్సులు.


విశేషాలు
శార్ఙ్గపాణి!
శార్ఙ్గము అనునది విష్ణువు యొక్క విల్లు. శృంగము( కొమ్ము) తో జేయబడినది.
దామోదర 
దామము అంటే తాడు; ఉదరము అంటే పొట్ట. అంటే తాడుతో కట్టబడిన పొట్ట కలవాడు అని అర్థం. 
దామములు అంటే లోకములు. ఉదరము అంటే లోపలిభాగము. అందుకే పోతన "జగజ్జాలములున్న బొజ్జ గట్టన్ వశమే?" అన్నారు.

ఏకాదశీ వ్రతాలు చేసేటప్పుడు మార్గశిర మాసంనుంచి మొదలుపెట్టి కార్తీకమాసంతో పూర్తి చేస్తుంటారు. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో కృష్ణుణ్ణి పిలుస్తుంటారు. మార్గశిరమాసంలో కేశవ, ఇలా కార్తీకానికి దామోదరనామం వస్తుంది. అందుకే కార్తీక దామోదర అంటారు.
రోటిని కదిలించుకుంటూ వెళ్ళి రెండు మద్ది చెట్లను కూల్చటమంటే అజ్ఞాన బంధనాలు త్రెంచి మోక్షమును, జ్ఞానాన్ని ప్రసాదించుట అనేది అంతరార్థం ."దామోదర! గుణమందిర సుందరవదనారవిందగోవిందా" అని విష్ణు షట్పదీ స్తోత్రంలో శంకరుల వారు అన్నారు.
శేషగిరీశ
ఈ కీర్తనలో  మొదటగా శేషగిరీశ అను సంబోధన గమనింపదగింది.
నివాస శయ్యాసన పాదుకాంశుకో
పధాన వర్షాతప వారణాదిభిః
శరీరభేదైస్తవ శేషతాం గతైః
యథోచితం శేష ఇతీర్యతే జనైః
ఆ వేంకటేశునికి (విష్ణువుకు) ఉండేందుకు నివాసము, నిదురించేందుకు శయ్య, పాదాలను ఉంచుకునే పీఠము, పైన ఉత్తరీయము తలగడ, , ఎండా వానానుంచి రక్షించే గొడుగూ అన్నీ   ఆదిశేషుడే. పర్వతరూపంలోను ఉన్నవాడు కూడా (శేషాద్రి) ఆదిశేషుడే. ఇంతటి విశిష్టత ఉన్నది కనుకనే ఆదిశేషుడు బ్రహ్మోత్సవాలలో రెండవ సారి చిన్న శేష వాహన మయ్యాడు.స్వస్తి.
 ***

No comments:

Post a Comment

Pages