నెత్తుటి పువ్వు -4 - అచ్చంగా తెలుగు

నెత్తుటి పువ్వు -4

Share This
 నెత్తుటి పువ్వు - 4
మహీధర శేషారత్నం


(జరిగిన కధ :రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తుంది అతడి శ్రేయోభిలాషి రాములమ్మ. )

“ఏమో! రాజుబాబు! నువ్వు చేసింది నాకు నచ్చలేదు."ముభావంగా నాగరాజుకు టీ అందిస్తూ అనేసింది రాములమ్మ కళ్ళు వాల్చుకుని తదేకంగా టీ క్లాసులోకి చూస్తూ ఒక్క క్షణం ఏం మాట్లాడలేదు నాగరాజు ఊదుకుంటూ గుక్క గుక్క నిదానంగా టీ తాగేడు. .

 "బాబూ అలాంటోళ్ళు చాలామందే ఉన్నారు. అందర్నీ వదిలేసి ఈ అమ్మాయి నొక్కదానే ఎందుకు తెచ్చినట్టు?" తన మనసులోనూ ఏదో ఆలోచన ఉన్నట్లు కొంక తిరుగుడుగా ఉండి రాములమ్మ..

            "నేను తప్పుడు ఉద్దేశంతో తేలేదు అక్క,ఆ అమ్మాయికి దారి చూపిద్దామని తెచ్చేను." నిదానంగా ఒక్కొక్కమాటే అన్నాడు.
          “ఏ ఉద్దేశంలో తెచ్చినా బాబూ! ఆడదంటే నిప్పు. దానికిష్టం లేకపోతే కాల్చేస్తుంది, ఇష్టముంటే వెన్నలా కరిగిస్తుంది, ఏమో బాబూ! నాకు నచ్చలేదు. " ముక్కు చిట్లిస్తూఅంది. నాగరాజు నవ్వేసాడు.
          "నేను రెండు రోజులు అటు వెళ్ళను. కాని కాస్త సాయంత్రాలు చూసి వస్తూండు, నేను వస్తా అక్కా" అంటూ లేచాడు. "ఆ అమ్మాయికీ అవసరం అయితే కావల్సినవి కొని పెట్టు" జేబులో మంచి ఐదొందలు తీసి ఇచ్చేడు.
            “ఏమిటో ఈ బాబు... చెడ్డాడు కాదు కాని ఆడ కూతుర్ని తేకుండా ఉంటే బాగుండేది." ఐదొందల నోటు బొట్లో దోపుకుంటూ గొణుక్కుంది దాములమ్మ
            “ఏంటే! నీ తమ్ముడు దొరగారేదో చేసినట్టున్నాడు. "వేప పుల్లతో పళ్ళు తోముకుంటూ తుపుక్కున ఉమ్మేస్తూ అన్నాడు రాములమ్మ భర్త అప్పల్రాజు,
          “ఏం చేసినా, నీ లాంటి ఎదవ పనులు చెయ్యడంతె..."విదిలించింది.
            “అబ్బో! ఇంతోటి గొప్ప తమ్ముడు. ఆ కాకీ గుడ్డలేస్తే.. తాను, అంతా గొప్పే"
          "ఇదిగో టీ తాగు..” మధ్యలో వాగుడాపుతూ టీ అందించింది.
            ఈ నచ్చినోడి చెవుల్లో పడింది. విషయం... మనసులో పీకులాట మొదలయింది.
            'ఉగ్రవాదమే కాదు. అంతకంటే భయంకరమైన అవినీతి, ఆశ్లీలతల మాటేమిటి? ఇంటర్నెట్లో ఉన్న బూతుకథల మాటేమిటి? అందరికంటే టెక్నికల్ నాలెడ్జ్ తొందరగా పట్టుకునే పిల్లలు చూసే సైట్లేమిటి? అది చదివాక  వాళ్ళకీ, లేడీ టీచర్లను చూసినా, క్లాస్ మేట్స్ ని చూసినా అనే భావాలు కలుగుతాయి. అంతదాకా ఎందుకు? చివరకు తని తల్లిని,చెల్లిని, చూసినా ...ఛీ..ఛీ.... నాగరాజు చీదకరించుకున్నాడు.
            శంకరం నాగరాజునే తదేకంగా చూస్తున్నాడు ఏం మాట్లాడకుండా!
            ఇలాంటివాడు అలాంటి తప్పేలా చేసాడు? శంకరం చూచాయిగా తెలిసింది నాగరాజు ఎవరో ఆడపిల్లని తెచ్చేడని. నాగరాజు చెప్పలేదు, శంకరంఅడగలేదు. శంకరం ఎప్పుడూ అనుకుంటాడు, వీడు పోలీసు డిపార్ట్ మెంట్ కి పనికిరాడనుకుంటుంటాడు. ఇంత సెన్సిటివ్ నెస్ పనికిరాదని.
          హఠాత్తుగా తలెత్తి చూసిన నాగరాజు మాట్లాడవేమిట్రా"అన్నాడు.
            “మాట్లాడేదేమిటి? కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న కథే ఇది. స్త్రీల అంగాంగాలని పూర్వం వాళ్ళు మాటలతో చెప్పేవాళ్ళు. స్త్రీలని సినిమాలలో చూపిస్తున్నారు. హీరోయిన్స్ ఒకళ్ళతో ఒకళ్ళు పోటీపడి ఒళ్ళు చూపిస్తున్నారు. డబ్బుతప్ప దిగ్నిటీ గురించి ఎవళ్ళూ ఆలోచించడం లేదు. డబ్బున్న వాళ్ళు ఇళ్ళు, వస్తువులు ప్రదర్శనకు పెట్టినట్టు వీళ్ళూ ఒళ్ళు ప్రదర్శనకు పోటీవడి పెడుతున్నారు, సిగ్గూ ఎగ్గూ లేకుండా...." కసిగా అన్నాడు శంకరం.
          లేడీ కానిస్టేబుల్ రమాదేవి వీళ్ళ సంభాషణ వింటూ మౌనంగా సెల్ఫోన్ నొక్కుకుంటూ కూర్చుంది.
          “మాట్లాడరేమిటి రమాదేవి గారూ! మీ విషయాలేగా మాట్లాడేది" అన్నాడు శంకరం.
          ఏం మాట్లాడేది సార్! ఆడవారు ముందుకు వెడుతున్నారో, వెనక్కి వేడుతున్నారో! ఏది కష్టమో, ఏది సుఖమో నాకేం తెలియటంలేదు" నిట్టూర్చింది.
          శంకరంకి తెలుసు ఆవిడ హెడ్డానిస్టేబుల్ రెండో భార్యని.
            “ఈ లోకం అంతా డబ్బు మీద నడుస్తోంది సార్! డబ్బూమీద... మొగుడికి పెళ్ళాం లేదు, పెళ్ళానికి మొగుడులేడు, తల్లికి బిడ్డ లేదు, బిడ్డకి తల్లిలేదు..." ఆవేశపడి పోయింది.
            ఆవిడ బాధలేమిటో తెలియని నాగరాజు మౌనంగా ఉండిపోయాడు. అసలే హెడ్ కానిస్టేబుల్ భార్య... ఎందుకు కదిపానా? బాబూ! అని మనసులోనే చెంపలు చేసుకున్నాడు శంకరం.
            క్షణంలో ఆవిడ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
            “నాకు తెలుసు సార్! మీ మనసులో నా గురించేం అనుకుంటారో అని. ప్రేమ... ప్రేమ అనుకుంటూ ఆనాదిగా ఆడది మోసపోతూనే ఉంది. అంతామగవాడి ఆధిపత్యమే ఉద్యోగాలు చేసే ఆడాళ్ళు మద్దెలలు సార్ మద్దెలలు. రెండువైపులా  వాయింపే.ఇస్త్రీ బట్టల మడతలు నలగవు... కానీ కనిపించని మనసులు .... అవి మీకు కనపడవు సార్"అంటూ భోరున ఏడ్చింది.
          శంకరం కంగారుపడిపోయేడు. ఇవిడ ఏదో లోకంలో ఉంటే అనవసరంగా కదిపాను. ఎవరయినా చూస్తే...
            ఇంతలో బయట బూట్లచప్పుడు వినబడింది. ఎస్సై వస్తున్నట్లున్నాడు. అందరూ చకచకా సర్దుకున్నారు. రమాదేవి కర్చీఫ్తో గట్టిగా ముఖం తుడుచుకుంది, ఏమీ జరగనట్టు. సెల్ స్విచ్ ఆఫ్ చేసింది..
          నాగరాజు మనసులో ఓ మహాప్రస్థానంలోని కవిత కదలాడింది. పందొమ్మిది వందల నలభైలలోనే ఏం రాసాడు?అప్పటికీ, ఇప్పటికీ ప్రపంచం, ఆడదాని బ్రతుకూ ఏం బాగుపడలేదు. ఆపిల్స్ మీద మైనం పూసి నిగనిగలాడేటట్టు చేసినట్టున్నాయి. కొద్దిపాటి చదువులు, సంపాదనలు...
          “ఏది సత్యం? ఏదసత్యం...
          ఉన్మాది మనస్సినీ వాలిలో
          ఘోకంకేనా,భేకం బాకా!
          ........
          కడుపు దహించుకుపోయే
          పడుపుకత్తె రాక్షసరతిలో
          అర్ధనిమీలిత నేత్రల
          భయంకర బాధలపాటలపల్లవి...
          నెట్ లు, యూ ట్యూబ్లు అందుబాటులో కొచ్చాక వెండితెర వెలుగులు చీకటి జీవితాలు చదివితే కడుపులో తిప్పినట్టవుతుంది. ఛీ..ఛీ.. ఏం ప్రపంచం ఇది?... నాగరాజు మనను ఆటలా కుతలంగా ఉండి ఎస్సై మాట ఆలకించలేరు.
          శంకరం మెల్లిగా నాగరాజు భుజం తట్టాడు.
            ఎస్సై నవ్వాడు.
            “మీ ఫ్రెండు తన లోకంలోకి వెళ్ళిపోయాడా పాపం"అంటూ జోక్ చేసాడు.
            పిచ్చినా కొడకా నీకేం తెలుసురా వాడి గురించి,అనాలనిపించినా అనలేక శంకరం ఓ పిచ్చి నవ్వు నవ్వాడు.
            నాగరాజు, రమాదేవి డిటో డిటో...
          ముసుగులు, అన్నీ ముసుగులో ఆంతా ముసుగులో దాక్కుంటారు. బ్రతికుండడానికి రెండు ముక్కుకన్నాలు,పడకుండా ఉండడానికి రెండుకళ్ళు. ముద్దలోపలికి వెళ్ళడానికి రెండు పెదాలమధ్య ఒక కన్నం.అంతే మనిషి.
            ఈ నిరాశామయ లోకంలో కదనశంఖం పూరిస్తున్నాను. నాగరాజు కళ్ళు మూసుకు కూర్చున్నాడు రమాదేవి, శంకరం మౌనంగా ఉన్నారు. అవేళ నైట్ డ్యూటీ వాళ్ళది. నాగరాజు పనిలేక మూడ్ బాగుంటే ఏవో కవితలు వినిపిస్తాడు. లేకపోతే ఏదో పుస్తకం ముందుకేసుకు కూర్చుంటాడు.
          అక్కడికీ శంకరం అంటుంటాడు. “ఒరేయ్! నా మాటవిని ఇంకో ఉద్యోగం చూసుకోరా!" అని
            “మరే! ఉద్యోగాలు చెట్లకు కాస్తున్నాయి! ఏ ఉద్యోగంలో అయినా ఏవో ఉంటాయి గొడవలు పెళ్ళాం బిడ్డల్ని పస్తు పడుకో బెట్టనా?".... అని నవ్వుతూ తేల్చేస్తాడు.
            ఇది తరచు వాళ్ళిద్దరి మధ్య నడిచే చర్చే.
          ఎస్సై అందరికీ వర్క్ ఎలాట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అత్యవసరమైతే కాల్ చెయ్యమంటూ అంటే ఇన్ డైరెక్టుగా కాల్ చెయ్యవద్దని చెప్పడమే. వాళ్ళకంటే చిన్నవాడే వయసులో, డైరెక్టు రిక్రూటిమెంట్, ఖర్చుపెట్టి పోస్టుకొనుక్కొన్నాడు. కనుక పై సంపాదనకు కక్కుర్తి పడతాడు. చెడ్డవాడు కాడంతే.
            రమాదేవి కాసేపు రెస్ట్ తీసుకుంటానంటూ లేడీస్ ఎలాట్ చేసిన రూంకి వెళ్ళిపోయింది.
(సశేషం )

No comments:

Post a Comment

Pages