జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 13 - అచ్చంగా తెలుగు

జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 13

Share This
జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 13
చెన్నూరి సుదర్శన్ 

(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.) 
రంగనాథపురం జూనియర్ కాలేజీలో స్టాఫ్ క్లబ్ ఉంది. దానికి ప్రెసిడెంట్ ఫణీంద్ర. సెక్రటరీ హిందీ మేడం హిమజ. ప్రతీ నెల మనిషికి ముప్పై రూపాయల చొప్పున కాంట్రిబూట్ వేసుకొని స్టాఫ్ రూంలో టీ కాచుకునే వాళ్ళం. ఖర్చులు పోనూ మిగిలిన డబ్బులు స్టాఫ్ మెంబర్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ప్రెజెంటేషన్ కోసం వినియోగించే వాళ్ళం.

హిమజ  సిటీ నుండి ‘ఎవ్రీ డే మిల్క్ పౌడర్’, ‘టేస్టర్స్ చాయ్స్’ టీపౌడర్ తెచ్చేది. లఘు శంక విరామ సమయంలో ఇంద్రాణి, నేను కలిసి టీ కాచేవాళ్ళం. మేము కాచే టీ చాలా రుచికరంగా ఉండేది. స్టాఫ్ అంతా కలిసి కూరలు షేర్ చేసుకుంటూ భోంచేసి.. టీ తాగి క్లాసుల్లోకి వెళ్ళే వాళ్ళం.
            నేను కాలేజీలో చేరి పది  రోజులయింది. ఫణీంద్ర, హిమజల ప్రవర్తనపై అనుమానమేసింది. కొందరు స్త్రీలు మగ వారితో కాస్తా  చనువు ఎక్కువ చూపిస్తారు..  నిజమే..! గాని దాన్ని  కాలేజీలో ప్రదర్శించడం సబబు గాదు. దాని ప్రభావం కాలేజీని కలుషితం చేస్తుందని నా అభిప్రాయం. 
ఆపూట ఇంద్రాణికి  నాకు క్లాసులు లేవు. మాటల సందర్భంలో ఫణీంద్ర కాలేజీ గురించి చెప్పిన పాపారావు ఆగడాలతో కాలేజీ ఆగమైన విషయం చెప్తుంటే ఇందువదన  నిదానంగా వినసాగింది. ఆమెలో ఎదో నిర్లిప్తత గమనించాను. నేను చెప్పడం ఆపేసాను. అది గమనించి ఆమె పెదవి విప్పింది.
            “సార్.. పాపారావు సరే.. చచ్చినరకానికి పోయుంటాడు .. మరి ఈయన కాలేజీనేముద్ధరిస్తున్నాడు?”
            నా అనుమానం నిజమయ్యింది. ఫణీంద్ర మీద తనకూ మంచి అభిప్రాయం లేదని నిర్థారణయ్యింది.
            “సార్.. మగవాని అండలేని  స్త్రీ అంటే లోకానికి లోకువ. ప్రతీ మగవాడు వేటాడాలనే ప్రయత్నిస్తాడు” అంటుంటే ఆమె  కనుకొనుకుల్లో కన్నీటి బిందువులు రావడం నేను కంగారు పడ్డాను. 
            “సారీ.. మేడం. మీ మనసుకు బాధ కలిగినట్లుంది” అన్నాను.
ఇంద్రాణి ఎందుకు బాధపడ్తుందో నాకర్థం కాలేదు.
“సార్.. నాకు పెళ్లి కాలేదు. నన్ను తన వాక్చాతుర్యంతో నానా రకాలుగా హింసిస్తున్నాడు. నేను ఒక సారి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. దాంతో కాస్తా తగ్గాడు. ఒక సంఘటన చెపుతాను వినండి..” అంటూ కన్నీళ్లు ఒత్తుకుంది.
            “ఒక రోజు కాలేజీ సమయం తరువాత స్టాఫ్ అంతా కలిసి బస్ స్టాండుకు బయలు దేరాం. లలితాంబ, హిమజ నేను ముందు వెళ్తున్నాం. మా వెనకాల కొంతమంది మన స్టాఫ్ మెంబర్స్  వస్తున్నారు.
            ఇంతలో ‘లలితాంబా..  నువ్వు నడుస్తుంటే నీ వెనక భాగం బలే ఊగుతోంది’ అన్నాడు ఫణీంద్ర.
            ఆమె వెంటనే వెనుతిరిగి కాలి చెప్పు తీసి బూతులు తిట్టింది. దాంతో అంతా సైలెంటై పోయారు.
            కాని ఆమెకు మద్దతుగా జెంట్స్ ఎవరూ మాట్లాడ లేదు. ఈ మగ జాతే అంత” అంటూ ఈసడించుకుంది.
            “ఇక లలితాంబ జోలికి వెళ్ళడం మానేసి హిమజ  వెంట పడ్డాడు.
            హిమజ భర్త మిలిటిరీలో పనిచేసే వాడు. కాశ్మీర్ అల్లర్లలో అసువులుబాసాడు. అతడు ప్రసాదించిన కొడుకు భవిష్యత్తు దృష్ట్యా ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోలేదని చెబుతుంది..
            మిలిటరీ కుటుంబమాయే.. ఆమె చాలా ధైర్యవంతురాలు. తన   గురించి ఎవరేమనుకున్నా లెక్కచేయదు. ఆమెకు సపోర్టింగ్ చేస్తున్నట్లు నటిస్తూ ఫణీంద్ర వలలో వేసుకున్నాడని అనుకుంటారంతా.. ఎంత వరకు నిజమో..! నాకూ తెలియదు.
            కాలేజీలో వారి కదలికలు గమనిస్తూ పిల్లలు తనను బనాయిస్తున్నట్లు ఫణీంద్ర గొప్పగా చెప్పుకుంటాడు. నాకసహ్య మేస్తుంది.
            ఫణీంద్ర పరమ దుర్మార్గుడు సార్..
            అతడు పనిచేసిన పూర్వపు కాలేజీలో ఒక అమ్మాయిని ట్యూషన్ సాకుతో అఘాయిత్యం చేస్తే ఆ అమ్మాయి బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది.
            కాలేజీ విద్యార్థుల బహిష్కరణ.. ఫణీంద్ర సస్పెండయ్యాడు. అతడికీ రాజకీయ పలుకుబడి ఉపయోగించి నేరారోపణ రుజువు కాకుండా మేనేజ్ చేసుకున్నాడు.. మళ్ళీ విధుల్లో చేరాడు. బదిలీల పరంపరలలో ఇక్కడకు వచ్చి చేరాడు.
            ఫణీంద్ర ప్రాక్టికల్ ల్యాబ్ తరగతులు హాజరవ్వాలంటేనే అమ్మాయిలూ గజ, గజా వణకి పోతుంటారు. అతడి చేతలు జుగుప్సాకరంగా ఉంటాయని అమ్మాయిలూ నాతో చెప్పుకుంటూ కన్నీరు పెడ్తుంటారు.
            అతడికి పెళ్ళీడుకొచ్చిన కూతురు ఉంది.. అదేమీ రోగమో..!  కొద్ది రోజులు పోతే మీకే అర్థమవుతుంది.. ఇక్కడి పరిస్థితులు..”
            నాకు నోటమాట రాక కొయ్యబారి పోయాను. ఒక గురువుకు ఉండాల్సిన లక్షణాలేనా.. గురువు అంటే ఎలా ఉండాలి?
            గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః,
            గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః
బ్రహ్మ , విష్ణు, మహేశ్వరులతో పోల్చిన గురువా ఇతను?
సమాజంలో తల్లిదండ్రుల తరువాత స్థానం కలిగిన గురువా ఇతను..? 
            గురువు అంటే ముందు స్వచ్చీలుడై ఉండాలి. లేకుంటే  గురువు బోధనలపై శిష్యులు మనసు పెడతారా?..
కొద్ది సేపు మా మధ్య మౌనం అలుముకుంది.
            కాలేజీ లెక్చరర్.. అయినా ఇంద్రాణికింకా  పెళ్లి కాలేదు.. విషయం కనుక్కుందామనుకొని.. కాసేపు సందేహించాను. ఇందువదన  మూడ్ చూసి ధైర్యం తెచ్చుకున్నాను. అడిగితే తప్పేంటి? అని నా మనసు వెన్ను తట్టింది.   
(సశేషం)  

No comments:

Post a Comment

Pages