నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే)-'అన్నదాతా సుఖీభవ!'   - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే)-'అన్నదాతా సుఖీభవ!'  

Share This
నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే)-'అన్నదాతా సుఖీభవ!'  
శారదాప్రసాద్ 

సరదాగా ఆశలతో,ఆశయాలతో,కలలతో గడిపిన జీవితం ఒక్కసారి జీవన భృతి కోసం పోరాటమయం అయింది.ఉద్యోగం రాకుండా పెళ్లి చేసుకోవటం వలన ,చాలా కుటుంబ ఫంక్షన్స్ కు కూడా ఒక్కొక్కసారి వెళ్ళేవాడిని కాదు.జల్సా ఖర్చులన్నీ తగ్గించుకున్నాను.మా నాన్నగారు జ్యూడిషల్ డిపార్ట్మెంట్ లో మంచి అధికార స్థానంలో ఉన్నారు . ఒక సంవత్సరం టార్గెట్ గా పెట్టుకున్నాను .ఆ లోపుగా ఏ ఉద్యోగం కనుక రాకపోతే,జ్యూడిషల్ డిపార్ట్మెంట్ లోనే ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తారనే ఆశ ఒకటుంది.ఆ రోజుల్లో బ్యాంకు ఉద్యోగాలకు చాలా క్రేజ్ ఉండేది . ఆ క్రేజ్ ఎటువంటిదంటే ,ఇప్పుడు software ఉద్యాగాలున్నంత క్రేజ్.మంచి జీతం,overtime అలవెన్సు ,బోనస్ ,మెడికల్ ఎయిడ్,ఫెస్టివల్ అడ్వాన్స్  ,LFC ,లీవ్ encashment ....లాంటి ఎన్నో సౌకర్యాలుండేవి .అప్పుడే బ్యాంకింగ్ ఇండస్ట్రీ విపరీతమైన growth దిశగా పయనిస్తుంది.దాదాపుగా ఇప్పటి ప్రతి మండల కేంద్రంలో ఆ రోజుల్లోనే ఏదో ఒక బ్యాంకు శాఖ ఉండేది .BSRB అనే సంస్థ బ్యాంకు ఉద్యోగాల కోసం పరీక్షలు పెట్టి ఉత్తీర్ణులైనవారిని ఇంటర్వ్యూలకు పిలిచి,అర్హులైన వారిని ఎంపిక  చేసేవారు. పరీక్ష ఆబ్జెక్టివ్ టైపులో ఉండేది .నెగటివ్ మర్క్స్ కూడా ఉండేవి. ఒక పక్క ఉద్యోగం కోసం నేను పోరాటాం చేస్తుంటే , రాష్ట్రం ప్రత్యేక ఆంధ్రా ఉద్యమంతో అట్టుడికి పోతుంది.చాలా చోట్ల  కర్ఫ్యూలను పెట్టారు.కమ్యూనికేషన్ వ్యవస్థ అయిన పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా పనిచేయలేకపోయింది.ఆ టైంలో నన్ను ఇంటర్వ్యూకు రమ్మని ఆంద్ర బ్యాంకు నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ఇంటర్వ్యూ   హైదరాబాద్ లో .పోవటానికి రవాణా సదుపాయాలు లేవు.ఒక జిల్లా జడ్జి గారు కారులో హైదరాబాద్ వెళుతుంటే ,వారిని బతిమిలాడి నన్ను వారితో హైదరాబాద్ పంపించారు మా నాన్న గారు.అప్పుడు ఆంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయం కోఠీలో ఉండేది. చాలా చక్కని భవనం.ఆ రోజుల్లో అది హైదరాబాద్ కు ఒక ఐకాన్ గా ఉండేది అనటంలో అతిశయోక్తి లేదు.కోఠీకి అతి సమీపంలోనే ఇస్సామియా బజార్ లో మా మేనత్త కుమారుడు ఉండేవారు .వారి ఇంట్లోనే నేను బస చేసాను. ఇంటర్వ్యూకు ఇంకా రెండు రోజుల టైం ఉంది.మా మేనత్త కొడుకు అయిన స్వర్గీయ వాసుదేవమూర్తి గారు నాకు mock ఇంటర్వూస్ కండక్ట్ చేసేవారు.ఇంటర్వ్యూ కు నన్ను అట్టహాసంగా తయారుచేశారు. టక్ అప్ చేసి,టై కట్టుకొని ,బూట్లతో ,నా ఫైల్స్ తీసుకొని ఇంటర్వ్యూకి బయలుదేరాను.ఆంధ్రా బ్యాంకు ప్రధాన కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఉండేది.చైర్మన్ లిఫ్ట్ లో వెళ్ళేటప్పుడు,వేరెవరూ అందులో వెళ్లేవారు కాదు.అప్పుడే చైర్మన్ అయిన శ్రీ కల్లూరి గోపాలరావు గారు లిఫ్ట్ లోకి వెళ్లారు.నేను కూడా గబాగబాగా వెళుతుంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ నన్ను వెళ్లనివ్వలేదు.ఇది చూసిన చైర్మన్ సెక్యూరిటీకి సైగ చేసి అతన్ని అనుమతించమని చెప్పారు.ఆయనే నాకు ఉద్యోగం ఇయ్యబోయే వ్యక్తి అని నాకు తెలియదు.  ఆయన చాలా అందగాడు.ఆపిల్ రంగులో ఉంటాడు. ఆయన దిగిన ఫ్లోర్ లోనే నేనూ దిగాను.నిజానికి అదే నేను మొదటి సారిగా లిఫ్ట్ ఎక్కటం.వేరే ఫ్లోర్ లో ఎలా దిగాలో ,లిఫ్ట్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు కాబట్టి ,ఆయనతోనే నేను దిగాను.ఆయన వెంటనే ఆయన రూమ్ లోకి వెళ్లారు.అక్కడ ఉన్న ప్యూన్ ను బెల్ నొక్కి పిలిచి ,బయట ఉన్న కుర్రాడిని పంపమని చెప్పారు.ఆ ప్యూన్ చెప్పగానే నేను రూమ్ లోకి వెళ్లాను.ఆ రూమ్ దాదాపుగా ఒక చిన్న ఇల్లు లాగా ఉంది.ఆయన కూర్చున్న కుర్చీ సింహాసనంలాగా ఉంది. ఆయన టేబుల్ దాదాపుగా 6 అడుగుల పొడవు,6 అడుగుల వెడల్పుగా ఉంది.ఆ టేబుల్ మీద కల్లూరి గోపాలరావు ,చైర్మన్ అని వ్రాసి ఉంది .దాన్ని చూడగానే నాకు చెమటలు పట్టాయి.ఆయన్ని లెక్క చేయకుండా ఆయనతో పాటే లిఫ్ట్ లో వచ్చినందుకు నన్ను సెలెక్ట్ చేయరేమోనని భయం కలిగింది.ఆయన నా వంక చూసి కన్నులు ఎగరవేసి ఎందుకు వచ్చావు అనే సైగ చేశారు.నేను నా ఇంటర్వ్యూ టెలిగ్రామ్ ను చూపించాను.వెంటనే మళ్ళీ బెల్ మోగిస్తే ,ప్యూన్ వచ్చాడు.ఆ టెలిగ్రామ్ మీద ఏదో వ్రాసి,ఆ ప్యూన్ కు ఇచ్చారు .ఇక నన్ను వెళ్ళమని తల తిప్పాడు.ఇదంతా కేవలం సైలెన్స్ ద్వారానే జరిగింది.ఆయన చూపులు ఆర్డరింగ్ లుక్స్.నా చూపులు బెగ్గింగ్ లుక్స్. కళ్ళతో మాట్లాడటం అంటే ఏమిటో నాకు తెలిసింది.ఆయనకు నమస్కారం చెప్పి,వెంటనే ప్యూన్ తీసుకెళ్లిన చోటికి వెళ్లాను.అది ఇంటర్వ్యూ రూమ్.ప్యూన్ చైర్మన్ గారు endorse చేసిన టెలిగ్రామ్ ను ఇంటర్వ్యూ chief కు ఇచ్చాడు.వాళ్ళు ఆ టెలిగ్రామ్ ను చూసి.నా సబ్జెక్టు maths కాబట్టి,నన్ను పైథాగరస్ సిద్ధాంతాన్ని గురించి చెప్పమన్నారు.వెంటనే టకటకా చెప్పాను.ఆ తర్వాత ఆ రోజు వార్తాపత్రికలోని ముఖ్యాంశాలను గురించి అడిగారు.అవి కూడా చెప్పాను.ఉద్యోగం ఇస్తే ఎక్కడికైనా వెళుతావా? అని ప్రశ్నించారు.వెళుతానని చెప్పాను.ఇక నీవు వెళ్లొచ్చు అని చెప్పారు. వారికి Thanks చెప్పి బయటకు వచ్చాను .ఆ తర్వాత 10 రోజులకే నాకు appointment లెటర్ ను పంపారు.మెడికల్ టెస్ట్ కు రమ్మని కబురు చేశారు.మళ్ళీ ఇస్సామియా బజార్ లోనే బస. మెడికల్ టెస్ట్ అయిపొయింది.నన్ను తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం పోస్ట్ చేస్తూ మరొక లెటర్ ను ఇచ్చారు.ఆ లెటర్ తీసుకొని పరమానందంతో ఇంటికి వచ్చాను.వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లుగా ఉంది నా పరిస్థితి. అప్పుడు ఆంద్ర బ్యాంకు ఉద్యోగులందరూ తీవ్రమైన సమ్మె చేస్తున్నారు. That agitation shook the entire Banking Industry. ఆ రోజుల్లో రీజినల్ ఆఫీస్ కాకినాడలో ఉండేది.రిపోర్ట్ చేయటానికి ఏ శాఖ కూడా పని చేయటం లేకపోవటం వలన నేను కాకినాడ వెళ్లాను. ఆ ఉద్యమంలో మేనేజర్ నుంచి ప్యూన్ వరకు అందరూ పాల్గొన్నారు.కాకినాడ రీజినల్ మేనేజర్ శ్రీ కుటుంబరావు గారు ,నా appointment లెటర్ చూసి,కొద్ది సేపు ఆలోచించి-- ఇప్పుడు అందరూ సమ్మె చేస్తున్నారు,రేపు నిన్ను కూడా చేయమంటారు,చేస్తే నిన్ను డిస్మిస్ 
చేయాల్సి వస్తుంది.కనుక ఒకపని చేయమని ఆయనే సలహా ఇచ్చారు."మా అమ్మమ్మ గారి ఆరోగ్యం బాగా లేనందువలన ,నేను ప్రస్తుతం ఉద్యోగంలో జాయిన్ కాలేను,కొద్ది రోజులు నాకు అనుమతిని ఇస్తే ,ఆ తర్వాత జాయిన్ అవుతానని !" చెబుతూ ఆయనే లెటర్ వ్రాయించి సంతకం చేయమని నాకు ఇచ్చారు.ఆ లెటర్ బాగానే ఉందని ,సంతకం చేసి ఇవ్వమని అక్కడే ఉన్న యూనియన్ నాయకులు కూడా చెప్పారు.అలానే సంతకం చేసి ఆ లెటర్ ఇచ్చిన తర్వాత,పర్మిషన్ ఇస్తూ రీజినల్ మేనేజర్ గారు మరొక లెటర్ నాకు ఇచ్చారు.రీజినల్ మేనేజర్ ఔదార్యానికి,తెగింపుకి నాయకులు కూడా జేజేలు పలికారు.అలా ఉద్యోగంలో చేరకముందే యూనియన్ తో నాకు బంధం ఏర్పడింది.ఆ యూనియన్ రధసారధి శ్రీ దువ్వూరి కృష్ణమూర్తి గారు .తర్వాత రోజుల్లో నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో 
ఆయన ముఖ్యుడయ్యాడు.63 రోజుల స్ట్రైక్ జరిగింది.అన్ని రోజులు జీతాలు లేకుండా ఉద్యోగులు నానా ఇబ్బందులు పడ్డారు.ఏ ఉద్యమం అయినా delay అయిన కొద్దీ బలహీనపడుతుందని నాకు అర్ధం అయింది .ఆ స్ట్రైక్ ను విజయవంతంగా ఎదుర్కొన్న చైర్మన్ శ్రీ గోపాలరావు గారికి పద్మశ్రీ వచ్చింది.స్ట్రైక్ ముగియగానే కొంత 
కాలం తర్వాత,నేను 14-03-1973 న  ముమ్మిడివరంలోని ఆంధ్రాబ్యాంకు శాఖలో చేరాను.ఆ విధంగా ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థాపకుడైన శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఎందరికో లాగా నాకు కూడా అన్నదాతగా మారారు.రోజూ భోజనం చేయగానే అన్నదాతా సుఖీభవ!అని అనటం నాకు కూడా అలవాటు. పుష్కరాల్లో శ్రీ పట్టాభి సీతారామయ్య గారికి కూడా నేను పిండ ప్రదానం చేస్తుంటాను.ఇప్పటికి ఇంతే!మరికొన్ని విషయాలతో మరోసారి!!
***

9 comments:

  1. శాస్త్రి గారి ఆర్టికల్ చాలా బాగా ఉంది ! ఆరోజులను గుర్తు తెచ్చి నందుకు ధన్యవాదములు ! ఆ రోజుల్లో మా SBI లో ఉన్న, మా యూనియన్ కూడా AIBEA కు affiliate అయి ఉండేది ! శ్రీ దువ్వూరి కృష్ణ మూర్తి(D.K) గారిని ,అల్ ఇండియా లీడర్స్ దగా చేసారు ! వాళ్ళను నమ్ముకుని,యీయన generalసెక్రటరీ హోదాలో స్ట్రైక్ కాల్ యిచ్చి భంగ పడ్డారు ! మంచి వ్యాసం అందించిన శారదా ప్రసాద్ గారికి,మీ పత్రిక యాజమాన్యానికి ,నా హృదయ పూర్వక ధన్యవాదాలు !

    ReplyDelete
  2. మీ జీవితాన్నే మార్చెసిన విషయాలను చక్కగా కళ్ళకు కట్టినట్లు వివరించారు.
    పుష్కరాల్లో శ్రీ పట్టాభిరామయ్య గారికి పిండప్రదానం చేయడంలో మీ ఔన్నత్యం చాటు కున్నారు ఎందుకంటే అన్నదాతా సుఖీభవ కాబట్టి .
    ధన్యవాదములతో
    నాగయ్య

    ReplyDelete
  3. మిత్రమా,
    నీజీవితానుభవాలు ఒక కధలాగా,నీకేగాక చదువరులు అందరికి నచ్చేవిధంగ వ్రాస్తున్నావు. కొనసాగించు..నీరచనలు తప్పక చదివేవాళ్ళలోనేను ఒకడిని, తరువాత ఏమి విషయంపై వ్రాస్తావో అని ఎదిరిచూస్తుంటాను...శుభాకాంక్షలతో..
    నీప్రియమిత్రుడు,
    వి.యస్.కె.హెచ్.బాబురావు.

    ReplyDelete
  4. మిత్రమా,
    నీజీవితానుభవాలు ఒక కధలాగా,నీకేగాక చదువరులు అందరికి నచ్చేవిధంగ వ్రాస్తున్నావు. కొనసాగించు..నీరచనలు తప్పక చదివేవాళ్ళలోనేను ఒకడిని, తరువాత ఏమి విషయంపై వ్రాస్తావో అని ఎదిరిచూస్తుంటాను...శుభాకాంక్షలతో..
    నీప్రియమిత్రుడు,
    వి.యస్.కె.హెచ్.బాబురావు.

    ReplyDelete
  5. చాలా ఆసక్తికరంగా సాగుతుంది మీ కధ !అభినందనలు !!

    ReplyDelete
  6. బాబయ్య మీరు కతలు బాగా రాస్తారు. హాయ్ మా గోదావరోళ్ల గురించి బాగా సెబుతారు హాయ్

    ReplyDelete

Pages