తెలుగు-వెలుగు - అచ్చంగా తెలుగు
తెలుగు-వెలుగు

ఉన్నవ. సత్యకుసుమ హరనాధ బాబురావు.బి.యస్ సి.,ఎం.ఏ.,ఎం.ఇడి.

.
తే.గీ. తెలుగు ధాత్రి సకలకళాత్రాతి భాతి
కర్మ భూమియౌ భారతికిదియె కనక
ధార బంగారు పంటల ధాన్య రాశి
సర్వ సౌఖ్యాలనొసగెడి సిరుల సురభి ||- (1)

తే.గీ. తెలుగుపౌరులు నిత్య సత్య వ్రతాది
దీక్ష ధారులు యతిధి సత్కారబుధులు
పుణ్య కార్యానురక్తులై పొరుగువారి
మేలు కోరెడి సహృదయ వరులు ||- (2)

తే.గీ. తెలుగు నారీమణులు యమృతమునుదాపు
మాతృ మూర్తులు గేహములందు దీప
కాంతులై వెలిగెడి శుభగాత్ర సిరులు
వంశవృధ్ధి నొనరచేయు వేల్పురాండ్రు ||-..(3)

తే.గీ. తెలుగు తల్లికి కీర్తిని దెచ్చినట్టి
ముద్దు బిడ్డలు అల్లూరి మొదలు దుగ్గి
రాల టంగుటూరి పఠాభి వావిలాల
బూర్గుల జమలాపురము ప్రముఖు లెల్ల ||- ..(4)

తే.గీ. తెలుగు రాజ్యము ప్రగతికి దారి జూపి
వారి తోవన ప్రభవించి వెలుగు నింపి
తెలుగు ఖ్యాతి విస్తరిలిగ దలపబూని
నేడు విడిపోయి హాయిగ నేలుకొనగ ||- …(5)

తే.గీ. తెలుగు భాషకు సాటిలేదిల మరంద
మాధురీ మహిమాన్విత మేదురంబు
శుభకర శ్రవణానంద సంశ్రుతంబు
లలిత పదబంధ శొభిత లోలితంబు ||- …(6)

తే.గీ. తెలుగు వంటకాలు భళిరా తినగ తనివి
తీరు ఆంధ్రమాతగ పేరు దాల్చె గోగు
కంద బచ్చలి వంగ శాకంబు చింత
చిగురు కాకర రుచులను జెప్ప తరమె ||- ….(7)

తే.గీ. పోళీలు కజ్జి కాయలు ఆవపెరుగు వడలు
మిరపబజ్జీలు జంతికలు మొదలుగాను
పాయసము పులిహోర పుల్లయట్ల
రుచులు నాకము దరిచేర్చు రూఢిగాను ||- …(8)

తే.గీ. తెలుగు పద్యాలు వినసొంపు తీపిలయల
గతులు ఛందంబును ప్రాస గలిగి యతుల
నియమబధ్ధమైన సొబగు నడకగలిగి
తెలుగుల యెడదలూగించి తమినిదీర్చు ||-…(9)

తే.గీ. తెలుగుతల్లికి మ్రొక్కి నుతింతు మధుర
భావసంభరిత లలిత పదమిళిత ర
సానుసార కవితాఝరీ స్ఫూర్తిత రచ
నానుభవంబు కలుగంగ నియతి తోడ ||-…..(10)

No comments:

Post a Comment

Pages