పుష్యమిత్ర - 34 - అచ్చంగా తెలుగు
పుష్యమిత్ర - 34
- టేకుమళ్ళ వెంకటప్పయ్య


జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్తాడు. మనదేశ ప్రస్తుత రాజకీయాలు ఆయనకు అవగాహనకు వస్తాయి. తన కాలంలో యవనులు లాంటి ముష్కరుల దండయాత్రలకు భయపడి కొన్ని వేల మణుగుల బంగారాన్ని భూగర్భంలో ఒక సొరంగంలో దాచిన విషయం చెప్తాడు పుష్యమిత్ర.  ఆ ప్రాంతం పాకిస్తాన్ ఆధీనంలో ఉండడం వలన ఆలోచనలో పడతారు. ఆర్ధిక శాఖామాత్యుడైన పంచాపకేశన్ దాన్నిఎలాగైనా అపహరించాలని పన్నాగాలు వేస్తుంటాడు.  ఇండియన్ గ్లోబల్ ఐ విషయం పాకిస్తాన్ వాళ్ళకు తెలిసిపోయిందన్న విషయం ప్రభుత్వం గమనిస్తుంది.  పంచాపకేశన్ డిఫెన్సు మినిస్టర్ తో మాట్లాడి ఆ సంపద ఎలాగైనా చేజిక్కుంచుకోవాలని ప్రయత్నాలను తీవ్ర తరం చేస్తూ ఉంటాడు. పాక్ వెళ్ళిన వెంకటేశన్ ను మళ్ళీ పోలీసులు అరెస్టు చేస్తారు. (ఇక చదవండి)

"ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్" పాకిస్తాన్ డైలీ న్యూస్ పేపర్ లో పడ్డ ఒక గ్లోబల్ టెండర్ నోటీసును గమనించిన ప్రధాన మంత్రి వెంటనే బెలూచిస్తాన్ లో ఉన్న మిత్రుడు, వ్యాపారవేత్త అయిన షియాజుద్దీన్ కు ఫోను చేసి ఎలాగైనా ఆ టెండర్ ను కైవసం చేసుకోమని చెప్తాడు. దానికి కావలసిన మొత్తం ఎంతైనా భారత్ సమకూరుస్తుందని, ఎట్టి పరిస్తితులలోనూ దాన్ని వదలవద్దని చెప్పి టెండర్ నోటీసు చదవనారంభించాడు.
గ్లోబల్ టెండర్ నోటీసు సారాంశం ఏమిటంటే... పాకిస్తాను దేశంలోని పిండ్ దండన్ ఖాన్ కు దగ్గరలో ఉన్న ఖెవ్రా సాల్ట్ మైన్స్ ను లీజుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని, టన్నుకు ఇంత అని పాకిస్తాన్ కు చెల్లించాలని, పాక్ అవసరాలకు కనీస మొత్తానికి మాత్రమే అమ్మాలని, వారి అవసరాలకు మించి తీసిన ఉప్పును ఇతర దేశాలకు అమ్ముకోవచ్చునని,   టన్నుకు పాక్ ప్రభుత్వానికి చెల్లించగల మొత్తాన్ని టెండర్ ద్వారా తెలియజేయగవలసినదని ఉన్నది.
ఈ విషయం చాలా రహస్యంగా ఉంచాలని అనుకుంటుండగానే పంచాపకేశన్ కు తెలిసిపోయింది. పాక్ లో దండంఖాన్ దగ్గర విలేజి లో తను ఉంచిన  రాఘవన్ నాయర్ అనే టీ దుకాణం వాడు ఫోనులో తెలియజేస్తాడు. పంచాపకేశన్ వెంటనే డిఫెన్సు మినిస్టర్ అగర్వాల్ కు ఫోను చేసి పాక్ లో ఆ టెండర్ వచ్చేట్టు తనకు సహాయం చేయమని పాక్ డిఫెన్సు హెడ్ తో మాట్లాడమని, కొన్ని వేల కోట్లు వచ్చే ఛాన్సు ఉందని ఆశ పెడతాడు.
*    *    *
పుష్యమిత్రుని వద్దకు వెళ్ళి టెండర్ విషయం వివరిస్తాడు ప్రధాని. పుష్యమిత్రుడు నవ్వి భయం లేదనట్టు చెయ్యెత్తి అభయం ఇస్తాడు.
"నేను చెప్పేది సరిగా విన్నారా! ఒకవేళ ఆ టెండర్ మన అనుకూలురకు వస్తే సరి లేకపోతే మొత్తం బంగారమంతా పోగొట్టు కుంటాం కదా!"
"నేను ముందే చెప్పాను. ఆ నిధి మన దేశానికే చేరుతుంది.శతృవులు ఆ నిధిని సాధించుకోలేరు. నాగ బంధాన్ని విప్పడం అసాధ్యం. నేను కూడా వేదాలను తెప్పించి ఆ మంత్రాలను మళ్ళీ మననం చేసుకుంటున్నాను. మీరు అనవసరంగా భయపడకండి. వాళ్ళ దేశానికి పోను మిగతా ఉప్పును భారతదేశావసరాలకు కావాలని చెప్పి బస్తాల మధ్య బంగారం ఉంచి మన దేశానికి తరలిద్దాం."
"అక్కడ పనిచేసే వాళ్ళుగా మన ల్యాండ్ అర్మీని నియమిద్దాం. మెల్లి మెల్లిగా మనం బంగారాన్న్ని తెచ్చుకోవచ్చు"
"తొందర పడకండి. ఆ విషయం అంత తేలిక మాత్రం కాదు. నేనూ యోచిస్తున్నాను".
"సరే! మొదట నా బెలూచిస్తాన్ ఫ్రెండు ను గట్టిగా పట్టుకుని లీజ్ కు తీసుకోవాలి. ఉంటాను."
*    *    *
వెంకటేశన్ను గుర్తు తెలియని రహదారులగుండా తీసుకుని వెళ్ళి ఒక పాడుబడ్డ భవనం ముందు ఆపారు. అది ఏ రాష్ట్రమో తెలీదు. ఒక అడవి లాంటి నిర్జన ప్రాంతం. ఒక కుర్చీలో చేతులూ కాళ్ళు కట్టేసి కూర్చో బెట్టారు.
"మీరు పాకిస్తాన్ కు ఎందుకు వెళ్ళారో సరైన సమాధానం చెప్పకపోతే ఇక్కడే జీవ సమాధి అయిపోతావు" అంటూ ఒక ఆఫీసర్ ఏ.కే.47 గన్ గుండెకు గురిపెట్టి అన్నాడు.
"నేను నిజమే చెప్తున్నాను. మీరు ఎందుకు నమ్మడంలేదో అర్ధం కావడం లేదు. మేము టూరిస్టులు గానే వెళ్ళాము."
"అయితే మారుపేరుతో వరంగల్ లో ఫేక్ ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చారు?"
"నేను తమిళియన్ ను అని తెలిస్తే వాళ్ళు సరిగా సమాధాన మివ్వరని మా ఫ్రెండ్ ఆధార్ కార్డు ఇచ్చాను. దీన్లో ఏమీ మతలబులు లేవు"
"నీవు తెలివి తేటలలో చాలా మితిమీరావు గానీ.. నీ పాక్ యాత్ర రహస్యం ఏమిటి? దీని వెనుక ఎవరు ఉన్నారు?"
"హయ్యో ఎన్ని సార్లు చెప్పినా అర్ధం చేసుకోరేమిటి?"
వెంకటేశన్ మొబైల్ ఫోను  రింగయింది. భయంగా చూశాడు.
"ఫోను ఎత్తి స్పీకర్ ఆన్ చెయ్యి. సంభాషణ మొత్తం రికార్డు కూడా చెయ్. తేడా వచ్చిందా పీక తెగి క్రింద పడుతుంది..జాగ్రత్త... ఊ..కానీ...ఎత్తు!"
"హెలో.."
స్పీకర్ ఆన్ చెయ్యి సైగ చేశాడు ఆఫీసర్. స్పీకర్ నొక్కి.
"హెలో ఎవరండీ!"
"పంచాపకేశన్ హియర్. నా గొంతు గుర్తుపట్టలేనంతగా బలిసికొట్టుకుంటున్నావా? ఎక్కడున్నావ్?"
"సార్! నేను వరంగల్ లో ఉన్నాను"
"వెంటనే పాతదిల్లీ లోని అజాద్ మార్కెట్ లో ఎప్పుడూ ఉండే ప్రదేశానికి రా! మాట్లాడాలి. అర్జెంట్. బై"
"ఎవరతను? గర్జించాడు ఆఫీసర్"
"మా ఫ్రెండు తమిళియన్. దిల్లీ లో ఉంటాడు. ఏదో బిజినెస్ పని మీద రమ్మన్నాడు. 
వెంటనే ఫోను స్వాధీనం చేసుకుని నంబర్ నోటు చేసుకున్నాడు.
"పద దిల్లీ వెల్దాం"
బలన్వంతంగా జీప్ ఎక్కించి ఫ్లైట్ లో తీసుకుని వెళ్తుండగా దిల్లీ ఏర్పోర్ట్ లో చూసి గుర్తుపట్టి వెంటనే పంచాపకేశన్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు వార్తాహరులు.
వెంటనే అలర్ట్ అయిన మినిస్టర్ తను మాట్లాడిన ఫోన్ నంబర్ను చెప్పి. వెంటనే ఈ నంబర్ ఎవరో ఊరు పేరు లేని వాళ్ళకు బదలాయించండి అని మొబైల్ కంపెనీ కి ఫోను చేసి చెప్పేశాడు.
*    *    *
"సార్! బెలూచిస్థాన్ వాళ్ళకు టెండర్ ఇచ్చేట్టు లేరు పాక్ వాళ్ళు. మీకు ముందే చెప్తున్నా! ఇంక 10 రోజులు టైం ఉంది. ఆల్టర్నేటివ్ చేసుకోవడం మంచిది. నా ప్రయత్నం నేను చేస్తున్నా. బై".
వెంటనే పీ.ఎం. గుజరాత్ లోని ఆయిల్ కంపనీ ఓనర్ కు సుకేష్ శుభానీ కి ఫోన్ చేసి "అహ్మదాబాద్ లో ఒక సాల్ట్ మైనింగ్ కంపెనీ ని ఫ్లోట్ చెయ్యండి. 3 సంవత్సరాల క్రితం ఫ్లోట్ చేసినట్టు ఆర్.ఓ.సీ.వాళ్ళ రికార్డులలో రాయించండి..3 ఫేక్ బ్యాలన్స్ షీట్లు లాభదాయక కంపెనీ అన్నట్టు  తయారు చేసి ఫైలింగ్ చేయించండి. మీకు ఒక గ్లోబల్ టెండర్ నోటీసు పంపుతున్నాను. దానికి క్వోట్ చెయ్యండి. ఈ టెండర్ ఎవ్వరికీ రాకూడదు. మనకే రావాలి. బై". 
*    *    *
"మిస్టర్ పీ.ఎం.సాబ్ మా ప్రెసిడెంట్ మాట్లాడతారట" అని పాకిస్తాన్ నుండి ఫోన్.
"యెస్. పీ.ఎం. స్పీకింగ్"
"ఆదా బరజ్.  వుయ్ ఆర్ వెరీ హాపీ... యువర్ కంపనీ కోటెడ్ వెరీ హై రేట్ పర్ టన్ ఆఫ్ సాల్ట్. వుయ్ విల్ గివ్ ఆపర్చ్యునిటీ. బట్ దట్ మచ్ ప్రాఫిట్స్ విల్ నాట్ కం. వుయ్ ఆర్ టెలింగ్ ఇన్ అడ్వాన్స్".
"నో ప్రాబ్లెం ప్రెసిడెంట్. వుయ్ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ మెడిసనల్ పర్పసెస్. మీకు తెలియని విషయం కాదనుకోండి అయినా చెప్తున్నాను. 100 గ్రాముల సాల్ట్ (NaCl) లో 39.34 గ్రాముల శోడియం (Na) ఇంకా 60.66 గ్రాముల క్లోరిన్ (Cl) ఉంటుంది. కానీ మీ మైనింగ్ సాల్ట్ లో కెమికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ గా ఉండి ఎన్నో కెమికల్స్ తయారు చేసుకోడానికి వీలవుతుంది. వుయ్ అండర్స్టాండ్  దట్ ఈజ్ మఛ్ యూజ్ఫుల్".
"ఓకే. బట్ వుయ్ ఆర్ ఇంకరింగ్ మఛ్ ఎక్స్పెండిచర్ దేన్ మనీ వాట్ వుయ్ ఆర్ గెటింగ్. అవర్ నీడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దెన్ ఓన్లీ యుర్ మెడిసిన్స్."
" ఓకే. బట్ వన్ ధింగ్ సార్!"
"బోలీయేజీ"
"వుయ్ విల్ అపాయింట్ ఆల్ అవర్ స్తాఫ్ యిన్ మైన్స్"
"బుట్  ఎబవుట్ 200 ప్యూపిల్ విల్ లూజ్ ది జాబ్. ప్రాబ్లం హై ఇధర్".
"నో.   వుయ్ రెక్వయిర్ ట్రెయిండ్ ప్యూపుల్ ఫర్ మెడిసిన్స్ ఫర్ మైనింగ్. వుయ్ విల్ గివ్ వాలంటరీ కాంపెన్సేషన్ ఫర్ ది గైజ్ వెరీ వెరీ సాటిస్ఫాక్టరీలీ. లీవ్ ఇట్ టు అజ్.  వుయ్ విల్ డీల్ విత్ దెం స్మూత్లీ. డోంట్ వర్రీ!"
"మళ్ళీ మీ ఇండియా తో ఈ విధంగా బంధం బలపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బై పీ.ఎం. సాబ్"(సశేషం)
-0o0-

No comments:

Post a Comment

Pages