పందిరి మంచం - అచ్చంగా తెలుగు
పందిరి మంచం 
డా. తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం 

రజనికి పెళ్లి చూపులు జరగ బోతున్నట్టు తెలియగానే నిశ్చితార్థానికి ఏ చీర సింగారించాలి అని ఆలోచన మొదలు పెట్టారు స్నేహితురాళ్లు.రజని అందం అంతా ఆమె కన్నులలో ఉంది. వెలుగు లీనే ఆమె కళ్ళు ఎదుటి మనిషిని కట్టి పడేస్తాయి. రంగు చామన ఛాయ అయినా పొందికైన శరీరపు వంపులు, ఒత్తైనజుత్తు , ఆకట్టుకునే చిరునవ్వు ఆమె ఆభరణాలు.  
పెళ్లికొడుకు అనంతపురం లో ప్రైవేటు స్కూల్లో టీచర్ . కను ముక్కు తీరు, ఒడ్దు పొడవు చక్కని వాడనే చెబుతాయి. పేరు చంద్ర మోహన్.  అమ్మాయిని చూడగానే అతని కళ్ళలోవెన్నెల వెలుగు కనబడింది.
 కొడుకు కి పిల్ల నచ్చిందని తల్లి విశాలమ్మకు అర్థం అయ్యింది. పిల్లలు చిన్న వాళ్ళు గా ఉన్నప్పుడే ఆమె భర్త పోయాడు . పిల్లలని ఆస్థి నీ కాపాడుకున్నసమర్థురాలువిశాలమ్మ. ఒక కొడుకు, ఒక కూతురు. కూతురుకు పద్దెనిమిది ఏళ్ళకే పెళ్లి చేసేసింది విశాలమ్మ.  ఆమెకూ రజని నచ్చింది.  "మీరు అమ్మాయిని తీసుకుని మా ఇంటికి ఒకసారిరండి. మీ అమ్మాయి అత్తవారిల్లు చూసి నట్టు వుంటుంది అని మర్యాదగా పిలవడం లోనే తమకి పిల్ల నచ్చిందని తేటతెల్లం చేసింది.  
అబ్బాయి పని చేసేది గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూలు గనుక మంచి జీతం , ఆపైన పదవీ విరమణ తరువాత పింఛను గారంటీ . స్వంత ఇల్లు, పదెకరాల పొలం ఉంది. ఒక్క ఆడపిల్ల పెళ్లి అయి అత్తగారింట్లో ఉంది.   ఆడపిల్లకు పంచి ఇచ్చినా చెరొక అయిదు ఎకరాలు వస్తాయి. ఇంకేమి కావాలి అన్నారు శివరావు, పరమేశ్వరి. కాదనలేదు రజని.   ఆఅమ్మాయికి చంద్ర మోహన్ నచ్చాడు.
చూసిన మొట్ట మొదటి సంబంధమే కుదిరి పోవడంతో రజని తల్లితండ్రులు మురిసి పోయారు. మంచి రోజు చూసుకుని వియ్యాల వారింటికి బయలుదేరారు అమ్మాయితోసహా. టవర్క్లాక్ దాటి కుడి వైపు తిరిగితే కోర్ట్ రోడ్ లో వుంది విశాలమ్మ   గారి ఇల్లు. 
రజని   అన్న మురళి , తల్లి పరమేశ్వరి,తండ్రి శివరావు లతో కలిసి కాబోయే అత్త గారింటికి  చేరేసరికి గుమ్మం ముందు ఇద్దరు ముత్తైదువులు ఎదురు చూస్తూ కనబడ్డారు     అందులో ఒకామె చంద్ర మోహన్ పోలికలతో ఉంది.  
కూతురు ని పిలిపించారులా ఉంది అనుకుంటూ ఆమెను చిరునవ్వుతో పలుక రించారు. తమ్ముడికి కాబోయే భార్యను నఖ శిఖ పర్యంతం చూసి సంతృప్తి గా నవ్వింది వదినగారు.    ఆమె పేరు శశిరేఖ . ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. బూరె బుగ్గలతో , పెద్ద కళ్ళతో ముద్దుగా ఉన్నాడు. చంద్ర మోహన్ చిన్నప్పుడు ఇలాగే ఉండి ఉంటాడు అనుకుంది రజని.   ఇరుగు పొరుగు వారు కాబోలు. వచ్చిన వారిని మర్యాదగా లోపలికి ఆహ్వానించి కూర్చో బెట్టారు. 
రజని కళ్ళు   చంద్ర మోహన్ కోసం వెదుకు తున్నాయి. వెనుక గది లో నుండి ఆమెను గమనిస్తున్న చంద్ర మోహన్ గుండె ఉప్పొంగింది. మంచి నీళ్ళ గ్లాసులతో వస్తున్న తల్లి వెంటముందు గదిలోకి అడుగు పెట్టాడు. చప్పున కళ్ళు వాల్చుకుంది రజని. 
       కాఫీ ఫలహారాలు అయ్యాక " అమ్మాయిని లోపలికి తీసుకు వెళ్ళి ఇల్లు చూపించరా " అని కొడుకు కు పురమాయించింది విశాలమ్మ. రజని అమ్మ ,నాన్న, అన్న  ముసిముసి గా నవ్వుతూ అక్కడే కూర్చున్నారు.  " రండి " అన్న చంద్ర మోహన్ పిలుపుతో తల వంచుకునే అతనిని అనుసరించింది రజని.
        రైలు పెట్టెల లాగా వరుసగా ఒక దాని వెనుక ఒకటిగా నాలుగు గదులు ఉన్నాయి. రెండో గదిలో పెద్ద పందిరి మంచం ఉంది.  అతను ఆ మంచం పక్కన ఆగి ఆమెవస్తున్నదా లేదా అన్నట్టు వెనక్కి చూసాడు.   నగిషీ పని చెక్కిన పందిరి మంచం వైపు ఆశ్చ్ర్యం గా చూస్తున్న రజని వైపు చూసి నవ్వి " మా తాతగారి  కాలం నాటి టేకు మంచం" అన్నాడు.   " మన కోసమే " అని అతను ఆనక పోయిన అన్నట్టే వినబడి రజని సిగ్గుగా కళ్ళు దించుకుంది. 
  మూడో గదిలో  ఒక వైపు గోడ వారగా నవారు మంచం మీద పరుపు వేసి ఉంది. మంచం కింది నుండి బియ్యం బస్తాలు కనబడు తున్నాయి. మరొక వైపు గోడకు మడిచి పెట్టినమడత మంచం, దాని కింద ఏవో ఇత్తడి సామాను ఉన్నాయి.  దాని వెనుకనే వంట గదిలో గ్యాస్ పొయ్యి ఉన్న గట్టు, గూట్లో తళ తళ లాడే గిన్నెలు , ఆ వెనుక   ఉన్న స్థలం లోఒక మూలన మరుగు దొడ్డీ, మరో పక్కన స్నానాల గది ఉన్నాయి.  
 " ఇల్లు నచ్చిందా?" అదుర్తాగా రజని ముఖం లోకి చూస్తూ అడిగాడు చంద్ర మోహన్. " వూ ! మరి భోజనాలు ఎక్కడ చేస్తారు." అడిగింది ."ఓ మీకు బల్ల ముందు కూర్చునితినడం అలవాటా? మేము వంటింట్లోనే పీటలు వాల్చుకుని కూర్చుని తింటాము . ఫర్వాలేదు కదా ! " అడిగాడు. మళ్లీ వూ అంది నెమ్మదిగా. 
            పెళ్లి ,శోభనం ఏ పేచీలు లేకండా జరిగి పోయాయి.  
అత్తవారింటికి వచ్చింది రజని . బియ్యం బస్తాలు, ఇత్తడి సామాను ఉన్న గదిలో నవారు మంచం పక్కన మడత మంచం వాల్చి రజని తలితండ్రులు కుట్టించిన కొత్తపరుపులు వేసి కాసిని పువ్వులు జల్లి ,సారెతో వచ్చిన లడ్డు, జీల్‌బి పళ్లెం లో పెట్టి, ఇత్తడి గ్లాసులో ఇసుక పోసి రెండు ఆగరు వత్తూలు వెలిగించి పెట్టారు.   నవారు మంచం కన్నా మడత మంచం రెండు అంగుళాలు ఎత్తుగా వుంది. 
పందిరి మంచం మీద నడుము వాలుస్తూ " తలుపు గడియ వేయకు నాన్నా ఒక రాత్రి వేళ నీళ్ళ గదిలోకి పొవాల్సి వస్తుంది నాకు " అంటున్న విశాలమ్మ వైపుతెల్లబోయి చూసింది సిగ్గుల మొగ్గలా ఉన్న పెళ్ళికూతురు .  
"అమ్మకు ఆ మంచం మీద పడుకుంటే తప్ప నిద్ర పట్టదు .. అక్కడైతే నాన్న పక్కనే వున్నట్టు ధైర్యం గా ఉంటుందిట . " తలుపులు దగ్గరగా వేస్తూ చెప్పాడు చంద్రమోహన్. 
విశాలమ్మ గురక వినబడే దాకా భర్తను మీద చేయి వేయనీయ లేదు కొత్త పెళ్ళికూతురు.  
        అమ్మ నిద్ర పోయాక భార్య మంచం మీదకి చేరి, ఆవిడ నీళ్లగది అవసరానికి లేచే లోపు తన మంచం మీద   వుండేవాడు చంద్ర మోహన్.  
     భయం భయంగా చేసే ఈ కాపురం కాస్త అలవాటు అయ్యేసరికి రజనికి నెల తప్పింది. ఆ వెంటనే వేవిళ్లు.  
" అమ్మాయికి కాస్త నిద్ర , విశ్రాంతి అవసరం నాయనా! నీ మంచం ముందు గదిలో వేసుకో " నిర్మొహమాటం గా కొడుకు కి చెప్పింది విశాలమ్మ 
            "ముందు గదిలో ఆయన, మధ్య గదిలో అత్తయ్య, మూడో గదిలో నేను ఈవిడ ఎక్కడి మంచాల డాక్టరు అమ్మా " అంటూ తల్లి దగ్గర వాపోయింది రజని 
" కాన్పు అయ్యేదాకా ఓర్చుకో అమ్మలూ ఎంత ఇంకో నాలుగు నెలలు అంది పరమేశ్వరి..  
         మొదటి కాన్పు అని రజనికి అయిదో నెల రాగానే పుట్టింటికి తీసుకు వెడతామని అన్నారు శివరావు పరమేశ్వరి. విశాలమ్మ కాదనలేదు.  
చంద్ర మోహన్ గుంభనం గా వూరుకున్నాడు. . అత్తవారిల్లు పక్కనే ఉన్న హిందూపురం. అక్కడ కూతురికి, అల్లుడికి విడిగా ఒక గది ఉంచారు పెళ్ళయిన నాటినుండి.  
వారంవారం అత్తారింటికి వెళ్ళి వస్తున్నాడు చంద్ర మోహన్.  
ఆడపిల్ల పుట్టింది రజనికి. మా ఇంటి మహాలక్ష్మి అని మనవరాలికి  బాలసారె కు బంగారు గాజులు, గొలుసు తీసుకు వచ్చింది విశాలమ్మ. చంద్ర మోహన్ తండ్రి పేరు రమణరావు. పాపకు రమ  అని  పేరు పెట్టారు విశాలమ్మ సంతోషం కోసం. 
       పాపకు అయిదో నెల వచ్చేదాకా పుట్టింటి లోనే ఉంది రజని. మూడో నెల నుండి హిందూపురం వారం వారం వచ్చి పోతున్నాడు చంద్ర మోహన్. 
       పాపకు అయిదో నెల నిండక ముందే కోడలిని పంప మని కబురు పంపింది విశాలమ్మ.  
మళ్లీ నవారు మంచం ,మడత మంచం పక్క పక్కన చేరాయి.    మనవరాలు  నాయనమ్మ మంచం మీద దర్జాగా పడుకుంటోంది.  
           "ఈ రెండు మంచాలు ఎవరికైనా ఇచ్చేసి మన ఒక డబుల్ కాట్ కొనుక్కుందాము "అని మొదలు పెట్టింది రజని.  
" అమ్మ ఈ గదిలో నుండే స్నానాల గదికి వెళ్తుంది. ఆవిడ ముందు మనిద్దరం ఒక మంచం మీద కనబడితే ఆవిడకు ,మనకు కూడా మొహమాటం గావుంటుంది " అంటూ కొట్టి పడేసాడు చంద్ర మోహన్. 
మరో రెండేళ్ళకు కొడుకు పుట్టాడు రజనికి  .  కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని ఆపరేషన్ చేశారు." ఏడుకొండల వాడికి   మొక్కుకున్నాను  "అంటూ శ్రీనివాస్అని పేరు పెట్టింది నానమ్మ.  పిల్లలు పెద్ద వాళ్ళవుతున్నా   రజని  సరదా మాత్రం తీర లేదు. .
      పదేళ్ళు గడిచాయి. రమ పన్నెండు సంవత్సరాలకే పెద్ద మనిషి అయ్యింది.  
మరుచటి ఏడాది విశాలమ్మ జబ్బు పడింది. బాగా నీరస పడింది." నాకో నులక మంచం తెచ్చి ముందు గదిలో వెయ్యరా చంద్రం " అనడిగిందావిడ. అక్కడికిమారాక రజనితో చెప్పిందావిడ " మీవదిన కు వాళ్ళ నాన్న మంచం అంటే ప్రాణం. నేను పోయాక ఆ మంచం దానికి ఇచ్చేయండి. " అని.  
           ఆవిడ మాటలకు కంగారు పడి చంద్రమోహన్ అక్కను పిలిపించాడు. కూతురును తృప్తిగా చూసుకుని నాలుగు రోజులకే వెళ్ళి పోయింది విశాలమ్మ.  
అమ్మ మాట ప్రకారం పందిరి మంచం    అక్క గారింటికి చేర్చాడు చంద్ర మోహన్.  
రెండు నెలలు గడిచాయి. " మూడో ఇంట్లో ఉన్న రావు గారు వాళ్ళ స్వంత వూరికి వెళ్ళి పోతున్నారు. వాళ్ళ డబుల్ కాట్ మోసుకు   వెళ్ళడం     కష్టం అని  చవకగా అమ్మేసి పోదామని అనుకుంటున్నారు ట . మనం తీసుకుంటే సరి " మొగుడితో అంది రజని.  
"ఎదిగిన పిల్ల ఇంట్లో తిరుగుతుంటే మనకి ఇప్పుడు డబుల్ కాట్    అవసరమా? వాళ్ళు పుస్తకాలు పెట్టుకోవడానికి , చదువు కోవడానికి వీలుగా ముందుగదిలో శీనుకు, అమ్మ గదిలో రమకు రెండు మంచాలు, షెల్ఫ్లు తెస్తున్నాను  . మనకు అలవాటైన చోటు ,మంచాలు మనకుచాల్లే " అన్నాడు చంద్రమోహన్.  
రమ ఎం ఫాం చేసి గుంటూరులో ఒక ఫార్మసీ కంపెనీ లో చేరింది. శీను బీటెక్ చేసి ఉద్యోగం లో చేరాడు . మరో అయిదేళ్లలో పిల్లలు ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేశారు. 
           రజనికి డయాబెటిస్ , చంద్రమోహన్ కి హై బీపీ వచ్చాయి. రజనికి కంటి ఆపరేషన్ జరిగింది . ఇప్పుడు రజని కళ్ళు కాంతులీనడము లేదు. జుట్టుపల్చ బడింది.  
శీనుకు అమెరికాకు వెళ్లే అవకాశం వచ్చింది. వెళ్ళాక రెండు సంవత్సరాలు ఇండియా కు రాలేక పోయాడు.  
     రమకు  ఇద్దరు పిల్లలు. గుంటూరు లోనే స్థిర పడ్డారు. రజని ,చంద్ర మోహన్ లకు అరవై ఏళ్ళకే వయసుకు మించిన ముసలితనం  మీద పడింది.అమ్మ నాన్న ఒంటరిగా అనంతపురం లో ఉండడం కన్నా గుంటూరు లో రమ ఇంటికి దగ్గరగా ఉంటే బాగుంటుంది అని అన్న చెల్లెళ్ళు ఆలోచించారు.గుంటూరు లో చెల్లి ఇంటికి దగ్గరగా ఒక అపార్ట్‌మెంట్ కొన్నాడు శీను.  
అనంతపురం ఇంట్లోని పాత సామాను వదిలించుకుని అవసర మైనవి మాత్రం తీసుకు వచ్చారు.  
అమ్మ నాన్న వచ్చే లోపు కొత్త ఫర్నిచర్ కొని పెట్టారు పిల్లలు . 
 "అమ్మా! నానమ్మ పందిరి మంచం అంటే నీకుఇష్టం ఇష్టం కదా !అందుకే ఈ డబుల్ కాట్ కొన్నాము మీ కోసం " అంటూ గర్వంగా తల్లికి చూపించాడుశీను.    కొత్త రకమైన నగిషీ పనితో ఆధునికం గా ఉంది మంచం. 
"ఇంకో పడక గదిలో రెండు సింగల్ కాట్స్ ఉన్నాయి "చెప్పింది రమ.  
రజని పిల్లల వైపు చూసి నవ్వింది.
"ఈ వయసులో నిద్ర పట్టడమే కష్టం. పక్కన మనిషి కాస్త కదిలినా మెలుకువ  వచ్చేస్తుంది. మళ్లీ నిద్ర రాదు.  మేము ఆ గదిలోని సింగిల్ కాట్స్ అటు ఇటుగోడలకు చేరువగా వేసుకుంటాము. ఈ పందిరి మంచం మీరు   వచ్చి నప్పుడు  వాడుకోవడానికి పనికి వస్తుంది " అంది రజని.    కొత్త పందిరి మంచం రజనివైపు దిగులుగా చూసింది.  చంద్ర మోహన్ భార్య ముఖం చూడలేనట్టు దృష్టి మరల్చు కున్నాడు . 
***

No comments:

Post a Comment

Pages