సెల్ఫీ - అచ్చంగా తెలుగు
సెల్ఫీ 
కె.ఎస్.పద్మజ 

భాను మంచి నిద్రలో ఉన్నాడు. టేబుల్ మీద లంచ్ సిద్ధం గా వుంది. కాబ్ వాడు ఇప్పటికే రెండు కాల్స్ చెసాడు. ముడో  కాల్ కి అపార్ట్మెంట్ కింద రెడీ  గా వుంటాడు. ఒక టూ మినిట్స్ కంటే ఎక్కువ వైట్ చేయడు. భానూ నిద్ర డిస్ట్రబ్ చెయాలనిపించలేదు. ఫోన్ లో మెసేజ్ పెట్టి ,నెమ్మదిగా బయటినుంచి లాక్ చెసుకుని లిఫ్ట్ వైపు పరిగెత్తాను. అప్పటికే కింద కాబ్ రడీ గా వుంది. నా కొలీగ్స్ నీరజ ,షీతల్ ఇద్దరూ ఫోన్లలో మునిగి పోయి ,ఒకసారి నావైపు తలెత్తి చూసి జరిగి ,పలకరింపుగా నవ్వారు ,నెను తిరిగి నవ్వేలోపే ,తల ఫోన్లో పెట్టేసారు. నేను డ్రైవర్ వైపు చూసి సారీ అన్నట్లు గా నవ్వాను. ఇది నాకు అలవాటే అన్నట్లుగా మొహం లో ఏభావమూ లేకుండా కారు నడుపుతున్నాడు అతను. కూకట్ పల్లి ఏరియాకు రాగానే నేహా కు మిస్స్డ్ కాల్ ఇస్తుండగానే ,వరదగోదారిలా నవ్వుతూ వచ్చేసింది నేహ "హాయ్ !!! గైస్ ....."అనుకుంటూ. కార్ లో కూచుంటూనే ,"హల్లో .....ఒన్ సెల్ఫీ .....ప్లీజ్ ...."అంటూ ఫోన్ పైకెత్తి పట్టుకోగానే ,అందరం ఒక్కసారిగా తలలు పైకెత్తి ఆమె ఫోన్ కేసి చిలిపిగా చూస్తూ ,హి ......హి హీ ...అంటూ పళ్ళు మొత్తం కనపడేలా నవ్వేసాం. నేహ "థాంక్యూ "అంటూ ,ఇంద కాబ్ .....టు ద ఆఫీస్ ....అంటూ ఫేస్ బుక్ లో అప్లోడ్ చెయడం మొదలెట్టింది. నాకు నవ్వొచ్చింది .ఇది అందరికీ ఒక అసంకల్పిత ప్రతీకార చర్యలా అలవాటై పోయింది. ఎవరు దేనికి సెల్ఫీ అడిగినా ......ఎందుకు ??ఏమిటి ??అని ఆలోచించ కుండా ....వెంటనే పళ్ళు కనిపించేలాగా నోరు మొత్తం సాగదీసి నవ్వటమో .......నోరు సున్నాలా పెట్టి ........ప్రియుడు ప్రియురాలి వంకో .......ప్రియురాలు ప్రియుడివంకో ......చూసినట్లు చిలిపిగా ఫోను వంక చూడటం అలవాటైపోయింది. మనం ఎక్కడున్నామో ....ఏంచెస్తున్నామో ....మన ప్రమేయం ఉన్నా, లేకపోయినా ప్రపంచానికి తెలిసిపోతోంది .దీనివల్ల మంచో ,చెడో ఏమిజరిగినా దానికి ఎవరూ బాధ్యత వహించరు. ఇంతలో ఆఫీస్ వచ్చేయడం తో అందరమూ కాబ్ దిగి ఆఫీస్ వైపు బయలు దేరాం .రహెజా బిల్డింగ్స్ ఆవరణ మొత్తం కూడా సీతాకోక చిలుకలు విడిది చేసిన వనం లాగా కలర్ఫుల్ గా సందడిగా ఉంది. పంచ్ చేసి ....ఆఫీస్ లోకి అడుగు పెట్టామంటే .....దాదాపు బైటి ప్రపంచం తో సంబంధం ఉండదు. ఇంక లంచ్ కోసం లేచె వరకూ ఫోన్ సైలెంట్ మోడ్ లోనే ఉంటుంది. 

                 డైన్ ఏరియా అంతా సందడిగా ఉంది .......కార్నర్ టేబుల్ చూసుకుని సెటిలయ్యాను. భాను నిద్ర లేచాడో లేదో ?అనుకుంటూ కాల్ చెద్దామని ఫోన్ చెతిలోకి తీసుకున్నాను. ఓపెన్ చేసి వైఫై ఆన్ చెయ్యగానే మెసేజ్ ల వెల్లువ .....గబగబా తిరగేస్తుంటే ....మనూ పంపిన మెసేజ్ కనిపించింది. తీరిగ్గాఉన్నావా ...నీతో మాట్లాడాలి అంటూ ....ముందుగా భానూకి డయల్ చెసాను. హలో అనకుండానే .."హాయ్ వసూ ...భోజనం అయిపోయింది. కాప్సికం కూర సూపర్ .....అన్నట్లు నన్ను లేపలేదేం. నువ్వుతిన్నావా ??"అంటూ గబగబా మాట్లాడుతున్నాడు భానూ ."ఓకే !!బాబూ నేను తింటున్నా నువ్వు తిన్నావో లేదో .......ఇంకా స్లీపింగ్ మోడ్ లోనేఉన్నావేమో ....అని ఫోన్ చేసా ".అన్నాను. "తినడం ఆఫీస్ కి రడీ అవటం కూడా ఐపోయింది. వెళ్ళొస్తా .....రాత్రి ట్వల్వ్ అవుతుందేమో నేవచ్చేసరికి ....బై "అంటూ ఫోన్ పెట్టేసాడు భాను .మాకు పెళ్ళయి మూడో సంవత్సరం వచ్చింది. "ఇంకెప్పుడే పిల్లలని కనేది " అని అమ్మ ఒకటే గోల .....కానీ భాను కి ఏదో యూ. కే ప్రాజెక్ట్  రావటం తో ఒక ఆరు నెలలపాటు మధ్యాహ్నం ఒంటిగంటకు ఆఫీస్ కు వెళితే ...మళ్ళీ రాత్రి పదకొండో ,పన్నండో ఐపోతోంది. అందుకేఇంకో వన్నియర్ పాటు పిల్లల్ని కనే ఆలోచన లేదు. ఇంతలో మనూనుంచి మళ్ళీ మెస్సేజ్. లంచి కి వచ్చావా ?అంటూ .మనూ నా కాలేజ్ మేట్ .ఇంక ఇప్పుడు బంధువు కూడా కాబోతోంది !!భానూ వాళ్ళ కజిన్ తో పదిహేను రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ జరిగింది.పృధ్వి నాకు బాగా తెలుసు ....చాలా స్మార్ట్ .మనూ లాంటి నెమ్మదైన పిల్లకి ఇలాంటివాడే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. మనూ కూడా ఇదే బిల్డింగ్స్ లో ఇంకో ఆఫీస్ లో పనిచేస్తోంది. మా డైనింగ్ హాల్ కి వచ్చెయ్యమని మెసేజ్ పెట్టాను. కాలేజీ రోజుల్లో ఇద్దరం కలిసి తినేవాళ్ళం. మళ్ళీ ఈమధ్య అప్పుడప్పుడూ ఇలా తినడానికి వీలవుతోంది. ఎంట్రన్స్ లోనించి మనూ మెల్లగా తలవంచుకుని నడిచిరావటం కనిపించింది. వద్దన్నా చిన్న నవ్వు వచ్చింది నాకు ,ఇది కాలేజీ రోజుల్నించీ ఇలాగే తలవంచుకుని .......నెమ్మదిగా .....చాలా మొహమాటస్తురాలు. ఏదో కాస్త మాగుంపులో కలిసి కొద్దిగా మాటలు నేర్చుకుంది అంతే. !!!!! "రావే తల్లీ ఏంటి విషయం ....పృధ్వీ వీకెండ్ గానీ ప్లాన్ చేసాడా ??ఎటన్నా వెళ్దామనీ .....నా సహజ ధోరణిలో నేను వాగేస్తున్నా .....కానీ మనూ నెమ్మదిగా ....చెతిగోళ్ళ వైపు.     చూసుకుంటూ ....."అతనూ ...అతనూ ...అదే ...ధనుంజయ్ ..కనిపించాడే ..."అంది ."వ్వాట్ ..వాడు ...కనుపించాడా ??!!ఈసారి కుర్చీలోనించి ఎగిరి పడటం నావంతైంది. "అవునే ....ఈ మధ్య ఎవరి ఫ్రెండ్స్ లిస్ట్ లోనో నాఫోటో చూసి ఎక్కడ వర్క్ చేస్తానో తెలుసుకొని ఆఫీస్ కు వచ్చి కలిసాడు .అది నెమ్మదిగా చెబుతున్నా ....దాని మనసులో ఎంత గాభరా పడుతోందో నేను గ్రహించగలను .దాని కంగారు పోగొట్టడానికి ,దాని మాటను తేలిగ్గా తీసేస్తూ ,"సో ..వాట్ .ఐతే ఏమిటి దానికింత కంగారు ఎందుకూ .....కానీ త్వరగా లంచ్ చెసేద్దాం ...నాకు బోలెడు పెండిగ్ వర్క్ ఉంది అంటూ లంచ్ కి ఉపక్రమించాం. "అదికాదే ...అని అదేదో చెప్పబోయినా ....సాయంత్రం కాల్ చేస్తానే తీరిగ్గామాట్లాడుకుందాం ....అని తొందరపెట్టాను దాన్ని. 

             మధ్యాహం సెషన్ లో మాత్రం వర్క్ మీద కాన్సంట్రేట్ చేయలేక పోయాను .ధనుంజయ్ మాకు కాలేజ్ లో రెండేళ్ళు సీనియర్ .'రాముడు మంచిబాలుడు 'అనిపించుకునేలా ఉండేది అతని ప్రవర్తన. అన్నయ్యా ....అనుకుంటూ ఎప్పుడూ చాలా మంది అమ్మాయిలు అతని చుట్టూ గుమిగూడి ఉండేవాళ్ళు .ఇతని దగ్గర సేఫ్ !!వెర్రివేషాలు వెయ్యడు అని చాలామంది అమ్మాయిలు అతనికి స్నేహితులయ్యేవాళ్ళనుకుంటా .....ఎప్పుడూ చుక్కల్లో చంద్రుడిలా ....చుట్టూ కనీసం ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో కనిపిస్తూ ఉండేవాడు. మా బాచ్ మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళం కాదు .ఐదారుగురం క్లోజ్ గా ఉండేవాళ్ళమేమో ...మాకు వేరే ఎంటర్టైన్ మెంట్ తో అవసరం ఉండేది కాదు. ధనుంజయ్ ని ఎప్పుడన్నా దూరం నించి అమ్మాయిలతో కలిసి రావడం చూసి ,"అడుగోవే చుక్కల్లో చందమామ అని నవ్వుకునేవాళ్ళం. కానీ మాలోచాలా నెమ్మదిగా ఉండే మనస్విని అతని మీద ఆసక్తిని పెంచుకుందని గమనించలేకపోయాం. మేం థర్డ్ ఇయర్  లోకి వచ్చేసరికి అతను కాలేజీ ఐపోయి ,జాబ్ సెర్చింగ్ లో ఉన్నాడు .మిగిలిన రెండేళ్ళూచదువుల్లో పడిపోయాం . ఇంటర్న్ షిప్స్ తోనూ ,కాంపస్ ఇంటర్వ్యూలతోనూ బిజీగా ఉన్నాం .లాస్ట్ సెం లో తెలిసింది మాకు ,మనూ ,ధనుంజయ్ ఒకరికొకరు ఇస్టపడ్డారని .!!అందరం అనూని చుట్టేసి .."ఏయ్ !!పిల్లిపిల్లా ఎంతపనిచేసావే !!అని అబినందించాం ."ఎలాపరిచయం చెసుకున్నావే !!ఇంతకాం గా ఉండేదానివి !అంతమంచికుర్రాణ్ణి ఎలా పడేశావ్ !!చెప్పు ...చెప్పూ ..."అని అల్లరిచేసాం .తన ప్రమేయం ఏమీ లేదనీ ...అతనే తనను పరిచయం చేసుకున్నాడనీ ,అందరిలాగా అన్నయ్యా అని పిలవబోతే ....ఒప్పుకోలేదనీ "ధనా అని పిలువు !వాళ్ళందరూ వేరు ,నువ్వువేరు "అన్నాడట అలా మొదలైన స్నేహం ప్రేమకి దారితీసిందట .ఎప్పుడూ మాటల్లో చెబుతుండేది ,అతని ప్రవర్తన చాలా హుందాగా ఉంటుందనీ ,ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఎడ్వాంటేజ్ తీసుకోడనీ ,అనవసరంగాతాకే ప్రయత్నం కూడా చెయ్యడనీ చెప్పేది. మేం కూడా మంచిపిల్లకి మంచి అబ్బాయి దొరికాడని సంతోషించాం. మా బాచ్ లో అందరం దాదాపు ఎంటెక్ చెయాలన్న ఉద్దేశ్యం ఉన్నవాళ్ళమే .అందరం ఆప్రయత్నంలో ఉన్నాం .కానీ మనూ మాత్రం "ధనా వద్దన్నాడే ..."అని ఇంట్రెస్ట్ చూపించలేదు .పోనీ కాంపస్ ఇంటర్వ్యూ లకి అటెండవుతావా ?...అతనికి. జాబ్ లేదు కదా .....ఎవరోఒకరికి జాబ్ ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చాం. "లేదే అతను నేను శ్రమ పడటం చూడలేడట ఉద్యోగం వద్దన్నాడే "అనేసింది. కానీ నాకెందుకో ఎక్కడో తేడా కొడుతోంది .ఇప్పుడే ఇతను దాని  జీవితం మీద అజమాయిషీ మొదలు పెట్టాడు .....ఇంత చదువుకునీ ఇది పాతకాలం అమ్మాయిలాగా వంటచేసుకుంటూ ,పిల్లల్ని కంటూ బ్రతికేస్తుందా .....నాకెందుకో నచ్చలేదు .దానికి చదువుకోకపోతే పోయావ్ ...కనీసం ఉద్యోగమన్నా తీసుకొమ్మని బతిమాలాను .కానీ అది నామాట వినలేదు .

          బీటెక్ తరువాత అందరం తలోవైపూ ఐపోయాం .మాలో కొందరు ఉద్యోగాల్లోను కొందరం పీ జీ లోనూ సెటిలయ్యాం .ఇంక మాటలు కూడా అప్పుడప్పుడేమాట్లాడుకోవడం కుదురుతోంది. ఫోన్లు కూడా నెలకో రెణ్ణెల్లకో ఒకసారి చెసుకోవటం జరుగుతోంది. ఒక రోజు మనూనించి సడన్ గా ఫోను ......అటు ఉద్యగం రాకపోవడం ,ఇటు పీజీ లో జాయిన్ కాకపోవడం వల్లా వాళ్ళ నాన్నగారు పెళ్ళిసంబంధాలు చూస్తున్నారనీ ,కాదని ఎలాచెప్పాలో తెలియటం లేదనీ ,"ఒక సంబంధం వాళ్ళు బాగాఇష్టపడ్డారే ....తాంబూలాల వరకూ వచ్చారని చెప్పింది. "అయ్యో !!ఎలామరి ధనుంజయ్ కి ఏవిషయం చెప్పావా ?అతనేమంటున్నాడు ?"అని అడిగా ..."చెప్పానే !వచ్చి నాన్నగారితో మాట్లాడమని ....లేకపోతే నేనయినా చెబుతాను .నాన్నని మీ పేరెంట్స్ దగ్గరికి పంపిస్తానని కానీ తాను ఉద్యోగం వేటలో ఉన్నాననీ కొంచెం సమయం కావాలని చెప్పాడు .దాని గురించి నీవేమీ వర్రీ అవద్దు .ఆ పెళ్ళి సంబంధం వాళ్ళు ఫార్వార్డ్ కాకుండా నేను చూస్తాలే అన్నాడు "అని చెప్పింది. నాకు ఎక్కడో తేడా అనిపించసాగింది "మీరు ప్రేమించుకున్న విషయం తను ఇంట్లో చెప్పకుండా ....మీ ఇంటో నిన్ను చెప్పనివ్వకుండా ....అదేమిటే ..ఎవరో పెళ్ళివారికి చెప్పి ఎలా ఆపేస్తాడూ .....నీగురించి ఏదో తప్పు చెప్పక పోతే వాళ్ళు సంబంధం ఎందుకు వదులుకుంటారూ ....అతను నిన్ను తప్పుదోవపట్టిస్తున్నాడు ఆలోచించు ....దానివల్ల నీకేకాదు మీ నాన్నగారి పరువు ప్రతిష్టలకీ ఇబ్బంది కలుగుతుందేమో ఆలోచించు "అన్నాను .అది ఎంతమాత్రం పట్టించుకోకుండా ....."ఏమోనే ధనా అలా చెయ్యడు ."అనేసింది. చివరకు అనుకున్నంతా ఐంది ...ధనా ఆ అబ్బాయికి ఫోన్ చెసి ఏం చెప్పాడో తెలియదు ...వీళ్ళిద్దరూ తీసుకున్న సెల్ఫీలు మాత్రం ఆ అబ్బాయికి చేరాయి .దాదాపుగా ఖాయమైన సంబంధం చెడిపోవడం ,పైగా మీఅమ్మాయి ఎవరినో ప్రేమించిందట !!అతనితోనే పెళ్ళిచెయ్యచ్చుకదా !!అని సలహా. కూడ ఇచ్చారటవాళ్ళు. మనూ వాళ్ళ నాన్నగారు చాలా డిప్రెస్ అయ్యి కొన్నాళ్ళు అస్సలు మాట్లాడలేదట. తర్వాత కొన్నాళ్ళకి ,ఆ అబ్బాయినీ ,పేరెంట్స్ ని తీసుకుని రమ్మను మాట్లాడదాం అన్నారట .కానీ అప్పటికే ఉద్యోగం లో చేరిన ధనా ,,తన అమ్మానాన్నా ఒప్పుకోలేదనీ .....ఇంకో సంబంధం చూసారనీ ఆ అమ్మాయిని చెసుకోకపోతే విషం తీసుకుని చ్చిపోతాం అని చెప్పారని ...చెతులు పట్టుకు ఏడ్చాడట .!!ఇది అటు అమ్మానాన్నలకీ చెప్పలేక ,ఉద్యోగం ,చదువూ రెండూ వృధా చెసుకుని చాలా డిప్రెషన్ లోకి వెళ్ళి బాధపడింది .కన్నవాళ్ళు గనక అమ్మా నాన్నా అక్కునచెర్చుకుని ,దాన్ని మనుషుల్లోకి తెచ్చి ,పీజీ చెయించారు .ఈమధ్యనే ఉద్యోగం లో జాయినై ఇప్పుడిప్పుడే పాత గాయాలు మరిచిపోతోంది .ఈ మధ్యనే భానూ వాళ్ళ కజిన్ తో ఎంగేజ్ మెంటు జరిగింది .పెళ్ళిచూపులు జరిగాక ,అతను ఎఫ్ బీ లో నా ఫ్రెండ్స్ ఫొటోలలో చూసి అడిగేడు తనగురించి .చాలా మంచి అమ్మాయి పెళ్ళి చేసుకొమ్మని సలహా కూడా ఇచ్చాను. కానీ ఇంతలోనే వాడు ....ఆ చచ్చువెధవ .....మళ్ళీ దానికి కనబడతాడు అనుకోలేదు. 

               విపరీతమైన తలనెప్పితో తలంతా భారమైంది. ఇంటికొచ్చి కాసిని కాఫీ తాగి పడుకున్నాను. భాను మధ్యలో ఫోన్ చెసాడు .ఇంటికొచ్చేసావా?అని. ముక్తసరిగా సమాధానం చెప్పి పడుకున్నాను .వంటకూడా చెయబుద్ది కాలేదు .అలానిస్త్ర్రాణం గా పడుకుండి పోయాను. పదకొండింటికి భానూ వచ్చాడు .పడుకున్న నన్ను చూసి "ఏమైంది వసూ ?ఎందుకలాఉన్నావ్ ?బాలేదా ?"అని ప్రశ్నల వర్షం  కురిపించాడు ."లేదు కొంచెతలనెప్పిగా ఉంది అంతే ...."అని తప్పించుకున్నాను ."అయ్యో ఆకలిగాఉందా ?డిన్నర్ చెద్దాం వచ్చెయ్ "అని కిచెన్ లోకి వెళ్ళి ఖాళీ గిన్నెలు చూసి ,"అరె !!వంట చెయ్యలేదా !!సర్లే నువ్వు పడుకో ఐదునిముషాల్లో డిన్నర్ రడీ చెస్తా "అంటూ కుక్కర్ లో రైస్ పడేసి ఆలూ ఫ్రై చెసి ఇరవై నిముషాల్లో డిన్నర్ రడీ చెశాడు .తినేసి తీరిగ్గా పడుకున్నాక ,"ఇప్పుడు చెప్పు వసూ .....ఏమిటి నువ్వేదో చాలా బాధ పడుతున్నావ్ ...ఆఫీస్ లో ఏమైనా ఇబ్బందా ....అనునయంగా అడిగాడు .నేనూ ఉండబట్టలేక మనూ సంగతి అంతా చెప్పాను ."చాలా మంచిది భానూ అది పాపం దానికే ఎందుకిలా జరుగుతోంది ....అమ్మానాన్నా చచ్చిపోతామన్నారని వేరే పెళ్ళి చేసుకున్న వాడు ,మళ్ళీ దాని జీవితం లోకి వెతుక్కుంటూ మళ్ళీ ఎందుకు వచ్చాడు ? ఇప్పుడే అది అతనుచేసిన మోసం నుంచి బయటపడి కొత్తజీవితం ప్రారంభిస్తోంది .అతనే ప్రేమలోకి దింపి ,అతనే నిరాకరించి ,మళ్ళీ ఎందుకొచ్చినట్లు .......ఒకసారి ఎంగేజ్ మెంట్ వరకూ వచ్చి ఆగిపోయిన పెళ్ళి ,ఈసారి పీటలవరకూ వచ్చి ఆగిపోదుకద ......అలా జరిగితే ఇంక అంకుల్, ఆంటీ చుట్టపక్కాల్లో తలెత్తుకోలేరు ......ఇంక మనూ సంగతి ....ఈసారి ఏ సూసైడో చెసుకుంటుంది .ఒకసారి దెబ్బతిన్నది ,కానీ వాడి ప్రవర్తన మీద దానికి నమ్మకం .ఈ సారి ఏం చేస్తాడో తలుచుకుంటే భయంగా వుంది "అన్నాను. భాను చిన్నగా నవ్వుతూ "ఊరికే మాట్లాడాడు అంతేకదా ....నువ్వు అనవసరంగా భయపడుతున్నావేమో ఎక్కువగా ఆలోచించి బుర్రపాడుచేసుకోకు అని తేలిగ్గాతీసేసాడు. నాకూ అలాగే అనిపించింది .అనవసరంగా నేను భయపడి మనూని కూడా భయపెట్టడం ఎందుకు అనిపించింది. 
            ఒకవారం తర్వాత మనూనించి ఫోన్ !!"ఈ వీకెండ్ ఖాళీ ఏనా నేను మీ ఇంటికి రానా "అని ."ఏమిటే ???మళ్ళీ ఏంజరిగింది "అనినేను ఆరాతీసేలోపే ఫోన్ పెట్టేసింది అది .పృధ్విని కూడా లంచ్ కి పిలుద్దాం అనిపించింది ,కానీ ఇది ఎందుకొస్తోందో ....మళ్ళీ ఏమి బాంబ్ పేలుస్తుందో తెలీదుగనక అతన్ని పిలువలేదు. అది ఇంటికి రావటం తోటే భాను ,"నాక్కొంచెం పనుందండీ ....స్నేహితురాళ్ళు ఇద్దరూ కబుర్లు చెప్పుకోండి "అంటూ మాయిద్దరికీ స్పేస్ ఇస్తూ తను బైటికి వెళ్ళాడు. "ఇంకచెప్పవేతల్లీ ఏమిటి సంగతులూ ....అని ఆరాలు మొదలెట్టాను ."ముందు ఆకలేస్తుంది అన్నంపెట్టవే ,తరువాత మాట్లాడుకుందాం ...."అని లంచ్ కి తొందరపెట్టింది అది .అన్నాలు తిన్నాక తీరిగ్గా మొదలెట్టింది. ధనుంజయ్ రెండురోజులకోసారి ఏదో వంకతో తనను కలుస్తున్నాడనీ ,"అమ్మానాన్నా మాట కాదనలేక పెళ్ళిచేసుకున్నాను గానీ ,ఆ అమ్మాయి చాలా గయ్యాళి ,భర్తగా అస్సలు గౌరవించదు .బాగా డబ్బున్న వాళ్ళు  అవటం వల్ల తన అమ్మా నాన్నలనీ అస్సలు లెక్కచెయ్యదు .ఇంతవరకూ పిల్లలు కూడాలేరు .అయ్యో !!నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని చేసుకున్నా నీజీవితం బాగుండేదిరా ......నువ్వు పడేబాధ చుడలేకపోతున్నాం "అంటున్నారుట వాళ్ళ అమ్మానాన్నా. అని చెప్పుకొచ్చింది. "మరే నిన్ను ఇబ్బంది పెట్టినందుకు మంఛి శాస్తి జరిగింది .ఐనా ఈ విషయాలన్నీ ఇప్పుడు పనిగట్టుకుని నీకు చెప్పడం ఎందుకూ "అన్నాను విసుగ్గా ..."అయ్యో !,అదేంటే స్నేహితురాలిగా అతని బాధలు వింటే తప్పేముందీ "అంది అనూ ....నేను మాత్రం ..."నువ్వు అతన్ని ఎవాయిడ్ చెయ్యడం మంచిది ....ఒకసారి అతను నీ జీవితంలోకి వచ్చినందుకే చాలా నష్టపోయావ్ ......ఇంకో సారి వాడి సోది మాటలు వినకు .....దాని వల్ల నీకే నష్టం .ఒకసారి జరిగిన నష్టం చాలు ....భగవంతుని దయవల్ల తేరుకుని సంతొషంగా ఉన్నావ్ ....పృధ్వి చాలా మంచివాడు మళ్ళీ చెజేతులా మంచి అవకాశం పోగొట్టుకోకు .నాకు మాత్రం ధనంజయ్ మీద సదభిప్రాయం లేదు .వాడి అతిమంచితనం వెనుక కనపడని కౄరత్వం ఏదో ఉంది .అనవసరం గా వాడితో ఎక్కువ మాట్లాడకు "అని కొంచెం స్థిరంగానే చెప్పాను. అది బాధ పడుతుందని  తెలుసు కానీ దానికి అర్ధం కావడానికి కొంచెం కరుకుగా చెప్పక తప్పలేదు .సాయంత్రం ఇంటికొచ్చిన భానుకి విషయ మంతా  చెప్పేదాకా మనసు మనసులో లేదు నాకు. భానూ నవ్వి" నేనూ పృధ్వి దగ్గరే ఉన్నా ...కానీ అతనితో ఈవిషయం చెప్పాలనిపించలేదు .....నువ్వు చెప్పేది వింటుంటే ఈ ధనుంజయ్ గాడెవడో డేంజరస్ గా అనిపిస్తున్నాడు .......వీడి సంగతేమిటో చుడాల్సిందే ....."అన్నాడు. "అయినా మీ అమ్మాయిలు ఇంతే !!!మగాడు కాస్త బేలగా కనిపిస్తే చాలు ,కాసిని కన్నీళ్ళు పెట్టుకోగానే వాడి తప్పులన్నీ క్షమించేసి ,జాలి చూపిస్తారు .వాడు ఇదే ఎడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు .పైగా మిగిలిన ఆడవాళ్ళతో అతని ప్రవర్తన వల్ల మంచి వాడుగా ముద్ర  వేసుకున్నాడు .నాకు తెలిసి వాడు ఈ అమ్మాయినే కాదు .....ఇన కొందరిని కూడా ఇలాంటి వాళ్ళను చూసి స్నేహం వంకతో దగ్గరయి వుంటాడు. వాడికి కావలసింది శరీరం కాదు .....ఎమోషనల్ ఎటాచ్మెంట్ .....దానితో ఎంతమోసమయినా చెయ్యగలడు .ఇదివరకు వాడు మనూని చేసింది అదే ......"అన్నాడు ."దానివల్ల అతనికేమిటి లాభం ??"అన్నాను నేను ."సింపుల్ ...ఒకమ్మాయి తనకోసం బాధపడటం .....జీవితం కోల్పోవటం ......సమాజంలో మాటలు పడటం ......ఒకరకమైన శాడిజం ........పైగా ఎవరన్నా ఆత్మహత్యలకు పాల్పడినా ....వాడి ప్రవర్తనను మెచ్చుకునేవాళ్ళు ,మంచివాడిగా సర్టిఫై చేసేవాళ్ళు బోలెడు మంది ఉంటారు "అన్నాడు ."అయ్యో !!!మరి మనూని వీడినుండి కాపాడేదెలా ........పోనీ పృధ్వికి చెప్పేద్దామా ? అన్నాను ."ఆలో చిద్దాం అసలు ముందు వీడి చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి .....వీడి ఉద్యోగ వివరాలు తెలిస్తే మిగిలినవిషయాలు కనుక్కుందాం .....పృధ్వికి చెప్పవలసిన అవసరం ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా చెబుదాం "అన్నాడు. 
                నాలుగురోజుల తర్వాత భానూ సేకరించిన సమాచారం ఏమిటంటే .....ధనుంజయ్ గచ్చి బౌలీ లో ఏదో చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగానే "రాముడు మంచిబాలుడు "అని ఆఫీస్లో కూడా పేరుతెచ్చుకున్నాడు .ఇతని పక్కసీట్ లో పనిచేసే సైరా ఇతనికి మంచి స్నేహితురాలు .ఆఫీస్ లోఇతని గురించి తెలిసిన సమాచారమింతే .."ఐ తే ఇప్పుడేం చెద్దాం  .ఈ సమాచారంతో మనం చెయగలిగింది ఏముందీ "బేలగా అడిగాను భానూని ."మనిద్దరం వెళ్ళి ఆ అమ్మాయినిఅదేసైరానువిచారిస్తేఏమన్నాతెలుస్తుందా ?.ఆలోచించు"అన్నాను .తనుమాత్రం ,"నేనెందుకూ ...నువ్వూ మనూ వెళ్ళండి మంచో చెడో ఏదయినా తెలియాల్సింది తనకే కదా !!" అన్నాడు .నాకూ నిజమే అనిపించింది కానీ అతని ఫ్రెండ్ని అతనికి తెలియకుండా ,అతని ఆఫీస్ లో కలవడం కొంచెం రిస్కే కానీ తప్పదు .మనూ కి ఫోన్ చేసాను. దాన్ని కన్విన్స్ చేయడమే కొంచెం కష్టమైంది. "ఎందుకే అతని బాధలేవో అతను పడుతున్నాడు .మా పాత ప్రేమ గురించి  అస్సలు మాట్లాడలేదు ఇంతవరకూ .....ఈ ఎంక్వైరీలవల్ల లాభమేంటి చెప్పూ ??అసలే సున్నితమైన మనసున్నవాడు తెలిస్తే బాగోదు బాధపడతాడు ."అంది. కానీ నేనే పట్టువదలని విక్రమార్కురాలిలాగా దానిని ఒప్పించాను .ఒకరోజు మధ్యాహ్నం పర్మిషన్ తీస్కుని ధనుంజయ్ ఆఫీస్కి వెళ్ళాం .ఈ మధ్య మా హైదరాబాదీ అమ్మాయిలకు స్కార్ఫులు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయ్ .ఒక ఎడ్జ్ తలమీద చుట్టూ పూర్తిగా కప్పి ,రెండో ఎడ్జ్ కళ్ళుమాత్రం వదిలేసి ,ముక్కుని కవర్చేస్తూ వెనక్కితెచ్చి గట్టిగా ముడివేసామంటే చాలు .వీలయితే కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టామంటే ..ఇంక ఎవ్వరూ గుర్తుపట్టలేరు .ఈ మద్య కాలేజీ పిల్లలకు ఇది ఒక మంచి అవకాశం గా మారింది .అలా స్కార్ఫు కట్టేసుకుని బాయ్ఫ్రెండ్ వెనకాల బైక్ మీద కూర్చుని జామ్మంటూ తిరిగేస్తూ ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరో కన్నతండ్రి బైక్ పక్కన ఆగినా వాళ్ళమ్మాయే అని వాళ్ళ నాన్న కూడా కనుక్కోలేడు !!అలాగే మేం కూడా ఒకవేళ ధనుంజయ్ ఆఫీసు లో కనపడ్డా గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకుని మరీ వెళ్ళాం .మా తిక్కమొహం అనూ మా ఎంక్వైరీ ఎక్కడ బటపెట్టేస్తుందో అని దానికి అన్నిజాగ్రత్తలూ చెప్పి ,అవసరమైతే తప్ప మాట్లాడొద్దని వార్నింగు ఇచ్చిమరీ తీసుకెళ్ళాను .ఆఫీసు లో సైరాను చూడగానే అనిపించింది ...కాస్త అటూ ఇటూగా మనూ లాంటి అమ్మాయే అని .ఉమన్స్ ఎరా మాగ్జైన్ నుంచి వచ్చామనీ రాండం గా 'లవ్ అండ్ ఫామిలీ ఎఫ్ఫెక్షన్స్' గురించి ఇంటర్వూ అనీ ఏవో కబుర్లు చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళ ఆఫీస్ కాంటిన్ కు పట్టుకొచ్చాం .ప్రేమగురించి మీ అభిప్రాయం చెప్పమన్నాను .ఆ అమ్మాయెవో రెండుమూడు కొటేషన్లు చెబుతూ మాట్లాడుతోంది .ఇంతలో మనూ కలుగజేసుకుని ధనుంజయ్ తెలుసా అని అడిగేసింది !!నాకు గుండె గుభేల్ మంది !ఇదిప్లాన్ చెడగొట్టేసేలాఉందే అని .....కానీ ఆ అమ్మాయి తనసహజ ధోరణిలో మాట్లాడుతూ "ఫ్రెండ్ గురించి అడుగుతున్నారా ??ఫ్రెండ్ షిప్ కి నిర్వచనం అతనే నండీ ......పాపం పక్షవాతం తో మంచం లో ఉన్న భార్యని పసిపిల్లలా చూసుకుంటున్నాడు .ఉన్న ఒక్క మూడేళ్ళ  కూతురినీ అమమ్మ దగ్గర ఉంచి భార్యను తనదగ్గరే ఉంచుకున్నాడు ...అందుకే అప్పుడప్పుడూ ఇంటినుంచే ఆఫీస్ పని చేస్తుంటాడు .ఇవాళ కూడా వర్క్ ఫ్రం హోమే ....కేవలం నాఒక్కదానితోనే చనువుగా ఉంటూ మనసులో మాట చెప్పుకుంటాడు .మరీ డిప్రెస్స్డ్ గా ఉన్నప్పుడు నేనే బలవంతంగా మూవీస్. కో బైటకో తీసుకెళుతుంటా "........అనిచెప్పిందా అమ్మాయి .మనూ నన్ను మింగేసేలా చుస్తోంది .....నేను వెంటనే "సరే సరే !!థాంక్యూ సోమచ్ ....ప్రేమగురించీ స్నేహం గురించీ మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేసినందుకు .....అలాగే ఒన్ సెల్ఫీ ప్లీజ్ "అనగానే వెంటనే నవ్వుతూ ఫోన్ కేసి చూసింది .నాఫోన్ నుంచి సెల్ఫీ తీసుకుని తననంబర్ ఫీడ్ చెసుకుని బయటపడ్డాం ."మనూ కొపం గా నేను చెప్పలా .......అనవసరంగా ధనాను అనుమానిస్తున్నావ్ పాపం "అంది .నాకూ ఒక నిముషం పాపం కదా అనిపించింది .సరే !!ఎలాగూ ఇక్కడిదాకా వచ్చాం ,ధనుంజయ్ ఇంట్లోనే ఉన్నాడేమో ....ఒకసారి పాపం వాళ్ళావిడను చుసి వెళదాం అని దాన్ని లాక్కెళ్ళాను. కాబ్ ఎక్కాక ,మనూకే గుర్తొచ్చింది !!ధనాపిల్లలు లేరని చెప్పాడుకదే !!!మరి మూడేళ్ళ పాప ఉందని చెప్పిందేమిటీ ....పైగా భార్యకు పక్షవాతమనికూడా చెప్పిందే ,సైరా అని .స్కార్ఫ్ తీసేయబోయిన నేను అలాగే ఉంచెసాను .ఏదో తేడా అనిపిచడంతో .....
       ధనుంజయ్ ఉండే అపార్ట్మెంట్ కు వెళ్ళాం ....నంబర్ చెప్పగానే ఆ అమ్మగారింటికా ....అని వాచ్ మన్ మాతో పాటు లిఫ్ట్ లో వచ్చి దించి వెళ్ళాడు ."అయ్యగారికేమో కాంపులుఎక్కువ ఉద్యోగం అమ్మా !!పిల్లలు మహా అల్లరి చేస్తారు "అని చెబుతున్న వాడివైపు ఆశ్చర్యంగా చూస్తున్న మనూ చేయి గిల్లి ఏం మాట్లాడొద్దని సైగ చేసాను. డోర్ బెల్ కొట్టగానే ఎవరూ అని తలుపుతీసిన ఆవిడను చూస్తూ అలాగే ఉండిపోయాం ఆవిడ చాలా అందంగా ఉంది ముట్టుకుంటే మాసి పోయేలా రంగూ ,మంచి నవ్వు మొహం తో కళ కళ  లాడుతూ . "అయ్యగారికోసమమ్మా ......అని వాచ్ మన్ చెప్పగానే ......ఆయన ఇంట్లో లేరండీ ....కాంప్ కి వెళ్ళారు రేపు సాయంట్రం గానీ రారు "అని చెబుతున్న ఆవిడవైపే నొరుతెరుచుకుని చూస్తున్న అనూని ,భుజం మీద తడుతూ ....."అబ్బే సార్ గురించి కాదండీ మీకోసమే వచ్చాం .వనిత చానెల్ నుండి ...అనేసాను "ఆవిడ అనుమానంగా చూస్తూ ..."టీవీ వాళ్ళా ఐతే కెమేరాలేవీ ??అన్నది .ఇవి కేవలం సెలెక్షన్సే ...."అన్నాను .ఆవిడ లోపలికి దారిచ్చింది ...మనసులో హమ్మయ్యా !,అనుకుని లోపలకు వెళ్ళాం .అసలు సరిగ్గానే వచ్చామా రాంగ్ అడ్రస్ కాదుగద అని అనుమానిస్తున్న.  మాకు ఎదురుగా ఫోటోలో ఇద్దరు పిల్లలూ భార్య తో నవ్వుతూ ఫొటోలో దర్శనమిచ్చాడు ధనుంజయ్. మనూ నోరుతెరుచుకుని అలానే ఉంది .....బాగా షాక్ తిన్నట్లుగా ......నేనే మొదలు పెట్టాను ఇంటర్వ్యూ లాగా ప్రశ్నలు ."మీది పెద్దలు కుదిర్చిన వివాహమేనా "అడిగాను. 
"అయ్యో కాదండీ ....మాది లవ్ మారేజే ....మేమిద్దరం క్లాస్ మేట్స్ మి ...రెండో సంవత్సరం నుంచీ  ఒకరికొకరం ఇష్టపడ్డాం ....మా నాన్న గారి కి చాలా బిజినెస్ లు ఉన్నాయ్ మొదట్లో ఒప్పుకోలేదు ,ఎవరికీ చెప్పకుండా పెళ్ళి చెసుకున్నాం "ఒకింత గర్వంగా చెప్పింది .
"మీ ఇద్దరూ అన్యోన్యంగా వుంటారా ??"అడిగాను తర్వాత ఏమడగాలో తెలియక ."ఆయనకు నేనంటే చాలా ఇష్టం ....కష్టపడిపోతావ్ ఉద్యోగం కూడా వద్దు అంటారు ....అఫ్కోర్స్ !!నాన్నగారికి నేను ఒక్కతే ఆడపిల్లను కావడంతో నా పేరుమీద ఉన్న వ్యాపారాల్లో కొంత వాటా లాభం గా నెలకో లక్ష బాంక్ లో వేస్తారు "అంది. "వెరీ నైస్ అండీ ...ఇంక మీ వారి గురించి చెప్పండీ "అన్నాను ."ఆయన ఎంతో మంచివారు కాలేజీ రోజులనుంచీ తెలుసు .....వాళ్ళ అమ్మగారికీ నాన్న గారికీ ఇష్టం లేకుండా చేసుకున్నారని .....వాళ్ళు నన్నేమన్నా ఇబ్బంది పెడతారనివాళ్ళ అమ్మానాన్నా దగ్గరికి వెళ్ళరు .....నన్ను వెళ్ళనివ్వరు .పాపని అమ్మదగ్గరే వుంచాం ....బాబుని కూడా పంపించేయ్ నువ్వు చెయ్యలేవు అంటారు అంత మంచివారండీ "అంది తన్మయత్వంగా .....వెరీ గుడ్ మేం త్వరలో వస్తాం ఇంకా బోలెడు ఇంటర్వ్యూ లు ఉన్నాయ్ .మీకు బహుమతి గనక వస్తే ,సర్ప్రజ్ గా మళ్ళీ వస్తాం .గుర్తుగా ఒక సెల్ఫీ అనగానే ఆవిడ సరే అని నవ్వుతూ ....నాఫోన్ కేసి చూసింది .నేను ఇంకా షాక్ లోనించి తేరుకోలేక ఫ్రీజ్ అయిపోయిన మనూని ,భుజం తడుతూ ముగ్గురికీ సెల్ఫీ తీసాను .ఇద్దరం ఇంటికి వచ్చి స్ట్రాన్ గా ఒక కాఫీ తాగితేగానీ జరిగిన విషయాలు అవగాహనకు రాలేదు .పాపం మనూ ముఖం తెల్లగా పాలిపోయింది ...."ఎంత పనిచెసాడో చూడు !!!అంటే నిన్ను ప్రేమించానని వెంటపడటానికి ముందే ఈఅమ్మాయిని పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకున్నాడు .నిన్నుకేవలం ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కే వాడుకున్నాడు. వాడికోసం ఏడ్చే వాళ్ళుంటే ....వాడికేదో ఆనందం .ఇలాంటివాణ్ణి ఏం చెయాలి ??నీవేమో పిచ్చిదాన్లా వాడిమీద జాలి పడ్డావ్ చూడు "అన్నాను ."అదిసరే .....వాడు మళ్ళీ ఎందుకు వచ్చినట్లు .....ఇంకోసారి నన్ను ఎలా ఏడిపిద్దామని వాడి ప్లాన్ .......అది ముందు తెలియాలి .....ముందు ఇది నేను పృధ్వికి చెప్పాలి "అంది మనూ స్థిరం గా .....దాని మొహం లో దెబ్బతిన్న మనోభావాలకి ప్రతీకారమేదో  తీర్చుకోవాలన్న పట్టుదల కనిపించింది. నా ప్రయత్నం వృధా కాలేదనిపించింది నాకు. "ఇప్పుడేంచేద్దాం "అన్నాను నేను ."చెబుతాను ......ముందు వాడేం చెస్తాడో చూద్దాం "అంది .
        మూడురోజుల తరువాత అనూనించి ఫోన్ ...."ఈరోజు మళ్ళీ ఆఫీస్ కి వచ్చాడు .ముఖ్యమైన విషయమేదో మాట్లాడాలి అంటున్నాడు .సాయంత్రం ఆఫీస్ అవర్స్ అయ్యాక బైట లాన్ లో వైట్ చేస్తానని అన్నాడు .ఆఫీస్ అయ్యాక కొంచెం వైట్ చెయ్యి ఏమైనా అవసరం అనుకుంటే కాల్ చేస్తా. . వద్దువుగాని ..."అంది .దానిగొంతులో ఇదివరకటి జంకు లేదు .నాకు కావలసిందింది అదే !!అది అంతమాత్రం నిర్మొహమాటం గా వ్యవహరించ గలిగితే చాలు .....ధనుంజయ్ లాంటి గుంటనక్కలు దెబ్బకు తోక ముడుస్తాయ్ .ఆఫీస్ అవర్స్ అయ్యాక దాని ఫోన్ కోసం ఎదురుచూస్తూ ...కాంటిన్ లో కూర్చున్నా .ఒక గంట తరువాత అనూ దగ్గరినుండి మిస్స్డ్ కాల్ !!వెంటనే బాగ్ తీసుకుని వాళ్ళ ఆఫీస్ లాన్స్ వైపు గబగబా నడిచాను. ఎదురుగా బెంచ్ మీద అతిమంచి తనమంతా మొహంలోకి తెచ్చుకుని జీసస్ ముసుగేసుకున్న సైతాన్ లా కూర్చొని ఉన్నాడు ధనుంజయ్ !!.మొహమాటం గా హాయ్ !!అని పలకరించి ,మనూ పక్కన కూర్చున్నాను .నేను ఆసమయం లో వస్తానని ఉహించలేదేమో ....నన్ను చూడగానే అతని మొహం లో రంగులుమారడం గమనించాను ."రా!!.. వసూ !!నాకో చిన్న సలహా చెప్పూ !!!పాపం ధనా ...వాళ్ళావిడతో వేగలేక పోతున్నాట్ట !!తను విడాకులు తీసుకుంటాడట నన్ను కూడా ఎంగేజ్ మెంటు కాన్సిల్ చేసుకో ......ఒన్నియర్ తర్వాత మారేజ్ చెస్కుందాం అంటున్నాడు .....ఏం చెయ్యమంటావ్ "అంది .అలా మనూ నాకంతా చెప్పేస్తుందని ఉహించలేదేమో ..."అదికాదు మనూ "...అంటూ మనూని ఆపే ప్రయత్నం చేసేడు .కానీ అది వినిపించుకోలేదు. నేనూ ఊర్కోకుండా .."మరి విడాకులివ్వడానికి మీ ఆవిడ ఒప్పుకుంటుందా ......ఒక సంవత్సరంలో  విడాకులొస్తాయని గారెంటీ వుందా మీకు ....అలా అయితే మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా ??.....అలాగే మనూ పేరెంట్స్ నీ ఒప్పించాలి గద ?...ఎప్పుడు కలుస్తున్నారు వాళ్ళని "అని గబగబా ...ప్రశ్నలు వేయడం మొదలెట్టాను ???దెబ్బకు బిత్తరపోయి !!"అదీ ....అదీ ...విడాకుల దేముందీ ....మ్యుచ్యువల్ గా అప్లయ్ చేస్తే .....ఒన్నియలో వస్తాయి ....అప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడదాం .....ఈలోపు ఎంగేజ్ మెంట్ ఐపోయింది కనుక అతనికి విషయం చెప్పి పెళ్ళి కాన్సిల్ చెసేద్దాం ..."సాధ్యమైనంత మంచితనం మొహంలోనికి తెచ్చుకుంటూ అతను చెబుతున్న తీరు చూస్తుంటే .....ఎడమకాలి చెప్పుతీసి ఎడాపెడా వాయించాలన్నత ఆవెశం వచ్చింది నాకు .ప్రక్కన ఉన్న మనూ పరిస్థితి ఇంతకంటే ఎక్కువగానే ఉందని అర్ధమౌతొంది నాకు .రక్తం మరిగిన తోడేలు ....పొంచి ఉన్నట్లుగా కనబడుతున్నాడు. ధనుంజయ్ నాకళ్ళకు .మనూ మాత్రం కూల్ గా ....."అలాగే ధనా .....మరి అతనితో ...ఎలా చెప్పటం ?పెళ్ళి కాన్సిల్ చెసుకోమనీ ..."అంది .వెంటనే తోడేలు లోపల ఆనందంతో చిందులేస్తున్నట్లు ....ఆ మొహం లో తెలిసిపోతోంది ."నువ్వు దిగులు పడకు మనూ .....ఆ సంగతి నేను చూస్తాను .ఇంక వెళ్ళిరానా "అంటూ ఆనందంగా ఇంటిదారి పట్టింది తోడేలు .
          ఆ రోజు శనివారం ..హాలిడే కనుక అందరం తీరిగ్గా బ్రేక్ ఫాస్ట్ ముగించి పృధ్వీ కారులో బయలుదేరాం .భాను అప్పటికే పృధ్వికి విషయం కన్వేచెసాడు .పొద్దున బ్రేక్ ఫాస్ట్ సమయం లో మనూ దాని బాధ పృధ్వీకి చెప్పుకుని బాధపడింది .పృధ్వీ మనూని ఓదార్చి ..."ఇలాంటి వాళ్ళను వదిలెయ్యొద్దు మనూ ...వాడిని నలుగురిలో పెట్టి తన్నడానికి నాకు అరగంట చాలు .కానీ ఇన్నిరోజులూ నువ్వు పడ్డ మనోవేదన .....వాడివల్ల ఇంకెంతమంది అమ్మాయిలు బాధలు పడుతున్నారో ...వాడికి సరైన బుద్ధి నువ్వే చెప్పాలి .ఇంకో ఆడపిల్లని ఏడిపించడానికి భయపడాలి నీ కు ఎలాంటి సాహాయం చెయడానికి నేను సిద్ధం .ఏంచెయ్యాలో ఆలోచించు "అన్నాడు .దారిలో కారాపి ,మంచి పూల బొకే ఒకటి కొన్నాం .ధనుంజయ్ వాళ్ళ అపార్ట్ మెంట్ వీధి చివర కారాపి ,మనూ ,నేనూ ఇద్దరం బయలుదేరాం ..భానూ పృధ్వీ ఇద్దరూ ఆల్ ద బెస్ట్  చెప్పి మమ్మలి ప్రొత్సహించారు ....డోర్ బెల్ కొట్టగానే ,ధనుంజయ్  భార్య తలుపు తీసింది నేను సెల్ ఫోన్ లో రిపోర్టర్ లా గారికార్డుచేస్తున్నామనూపూలబొకేఆవిడచేతికిస్తూ ...."కంగ్రాచ్యులేషన్స్ ....మేడం ..మీరూ మేము నిర్వహించిన బెస్ట్ వైఫ్ కాంపిటీషన్ లో సెలక్టయ్యారు .మీ వారిని కూడా పిలుస్తారా ??ఇద్దరినీ ఇంటర్వ్యూ చెస్తాం అంది .ఆవిడ వెంటనే కెవ్వుమని అనందంతో ఒక కేకపెట్టి .వంటింట్లోకి పరుగెత్తి చెతిలో గరిటతో పైన షర్ట్ కూడా లేకుండా ఉన్న ధనుంజయ్ ని లాక్కొచ్చింది .మమ్మల్ని చూస్తూనే !!ధనుంజయ్ మహంలో ..అంతులేని కంఫ్యూజన్ ,భయం ఒక్కసారి బైటపడ్డాయి ..."ఏంటండీ అలాచూస్తున్నారూ ,వీళ్ళు వనితా టీవీ నుండి వచ్చారు ...నాకు బెస్ట్ వైఫ్ గా ప్రైజ్ వచ్చింది .మనిద్దరినీ ఇంటర్వ్యూ చెస్తారట...అయ్యో ఇలాగే వచ్చేసారు ...కొంచెం రడీ అయ్యి రండీ ...ప్లీజ్ ..."అంది అభ్యర్ధనగా ....మనూ ,"అసలు మీకంటే ముందు బెస్ట్ హజ్బెండ్ గా మీవారికి అవార్డ్ ఇవ్వాలేమో నండీ ...మీకు శ్రమలేకుండా హాలిడే రోజు చక్కగా వంటచేసి పెడుతున్నారూ ...."అంది .అవిడ మెలికలు తిరుగుతూ.నిజమేనండీ ఇంట్లో వుంటే తనే చేస్తారు వంట "అంది గొప్పగా ."నువ్వు వాళ్ళకు కాఫీలు పట్రా "అని అవిడను లోపలికి పంపి "ఇలా వచ్చారేంటి మనూ .....అది అసలే గయ్యాళి ....ఇలా అయితే అది అసలు విడాకులిస్తుందా ?"ఇంక చాలు వెళ్ళండి "రహస్యంగా పళ్ళు బిగపట్టి చెబుతున్నాడు కంగారులో నేను రికార్డు చెస్తున్న విషయం గమనించక .నా కయితే నవ్వాగింది కాదు ...కుందేలు మాస్క్ నుండి బైటకొస్తున్న గుంటనక్కను చూసి .మనూ మాత్రం" ఔనా !!విడాకులిచ్చేస్తావా ???ఐతే ఇప్పుడే అడిగేస్తా ఆవిడను తెలిసిపోతుంది  కదా !!"అంది ."ఏమండీ రడీ అయ్యా రా !!!అన్న అవిడకేకకు ఒక్క ఉదుటున లేచి ఆ ...ఆ ...వస్తున్నా అని లోపలికి పరుగెత్తాడు. "సారీ అండీ ..అనుకుంటూ కాఫీ తెచ్చిన ఆవిడతో ,మాప్రశ్నలు మొదలెట్టాం .....ఇప్పుడు మీవారు నాకు విడాకు లిచ్చెయ్ వేరే అమ్మాయిని చేసుకుంటా .....అన్నారనుకోండి మీ రేం చెస్తారు ?అని అడిగిది మనూ ....మా మధ్య గొడవలేమీ లేవండీ ...అయినా మేమెందుకు విడాకులు తీసుకుంటాం ?? అంది ."లేవనుకోండి ...మీ స్పందన తెలుసుకోవడానికి అడుగుతున్నాం ...ఏంచెస్తారు చెప్పండి అన్నాం .పాంటూషర్ట్ తో బయటికొచ్చిన ,ధనా ...మనూ ని మింగేసేలా చుస్తున్నాడు .ఆవిడ "మావాళ్ళు అంత చెతగాని వాళ్ళు కాదు .....నేను ఇష్టపడ్డాను గనక ,అల్లుడిగా గౌరవిస్తున్నారు .అలాటి పనేదయినా చెస్తే .....సున్నం లోకి ఎముకమిగలదు .ఆడవాళ్ళం మనం గట్టిగా లేకపోతే ఎలా "?అంది ."మంచిమాట చెప్పారు వెరీ గుడ్ "అంది మనూ చప్పట్లు కొడుతూ ....కక్కలేక మింగలేక తేలు కుట్టిన దొంగలా ఉంది ధనుంజయ్ పరిస్థితి ."వాళ్ళకు స్నాక్స్ లేమైనా ఇవ్వు "అంటూ ఆవిడను లోపలికి పంపించేసి ,అసలైన తోడేలు బయటపడింది .మనుకేసి కౄరంగా చుస్తూ ....అసలెందుకొచ్చావ్ ఇక్కడికి ......ఒకసారి నీ జీవితం అభాసు పాలు చేసా ...ఇసారి కోలుకోలేవ్ ...నన్ను రెచ్చగొట్టకు అన్నాడు ."మనూ నెమ్మదిగా "అవునా .....ఏచెస్తావో చెయ్యి చుద్దాం ....ఈ లో పు గా ఇది చూసుకో నీ వాట్సాప్ లో "అంటూ .....సైరాతో మేం దిగిన సెల్ఫీ పంపింది .ఒక్కసారి ఉలిక్కిపడి ....సైరాని కూడా కలిసావా ?"అని బిక్క చచ్చి పోయాడు .ఇంతకు ముందే ఇక్కడికి వచ్చి నీ ప్రేమకధ కూడా తెలుసుకున్నా ".....అంటూ అతని భార్యతో దిగిన  సెల్ఫీ పంపింది ."ఐతే మొన్న నేను నీతో మాటాడే కంటే ముందే మాఇంటికి  వచ్చావా ?ఎంతమోసం "అన్నాడు ."మోసమంటేనువ్వు చెసింది ..దీన్ని జ్ఞానం సంపాదించడం అంటారు ...నన్నూ ,సైరాను ,నీభార్యనే కాకుండా ఇంకెవరినో కూడా మోసం చేస్తున్నావ్ ...ఆఫీస్ లో వర్క్ ఫ్రం హోమూ ,ఇంట్లో కాంపులూ వంకపెట్టి ఇంకా ఏం చేస్తున్నావ్ ....తలుచుకుంటే కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు .....జాగ్రత్త ఇంకెప్పుడైనా నాజీవితంలోకి తొంగి చుసావో ???నిన్ను బతకనివ్వను .నన్నేకాదు ఏ ఆడపిల్లనయినా ముసలి కన్నీళ్ళతో మోసం చేసావంటే ...మేము వచ్చిన దగ్గరినుండీ రికార్డవుతున్న నీ చిలకపలుకులన్నీ మీ ఆవిడకు వాట్స్ ఆప్ చెసేస్తాను "....మాటల్లోనే స్నాక్స్ పట్టుకొచ్చింది ఆవిడ "థాంక్స్  "అండీ మాకు అలవాటులేదు అంటూ చివరిగా ఒన్ సెల్ఫీ ప్లీజ్ ....అని మనూ ఫోన్ పైకెత్తి పట్టుకోగానే ....ఆవిడ పళ్ళన్నీ కనపడేలా నవ్వుతూ ఫోన్. కేసి చూస్తూ ,అబ్బారండీ !!అని ధనుంజయ్ ని చెయ్యి పట్టి లాగింది .నవ్వలేని ,ఏడవలేని గుంటనక్క ఫోన్ కేసి అయోమయంగా చూడసాగింది ఫోటో క్లిక్ మనిపించి ,చటుక్కున బయటపడ్డాం .మేము లేటయ్యేసరికి భానూ ,పృధ్వి కొంచెం కంగారుగా మాకెదురయ్యారు .జరిగిందంతా చెప్పి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నాం ఆ సెల్ఫీ చూసి ."అన్యాయం మనూ ...కాబోయే భార్యా భర్తలం మనం ఇంతవరకూ సెల్ఫీ తీసుకోలేదు "అన్నాడు పృధ్వీ బుంగమూతి పెట్టి ."ఓకే ...చెలో ..అందరం ఒక సెల్ఫీ తీసుకుందాం ........మబ్బులు వీడిపోయిన గుర్తుగా "అని అందరం అక్కడే ధనా అపార్ట్ మెంట్ బాక్ గ్రౌండ్ లో వచ్చేలా సెల్ఫీ తీసుకున్నాం .ఆ ఫొటోలో ప్రపంచంలోని అనందమంతా మనూ ,పృధ్వీ మొహాల్లో కనబడుతోది ....ఆ వెనక అప్పార్ట్ మెంట్ బాల్కనీలో కరెంట్ షాక్ కొట్టిన కాకిలా చూస్తున్న ధనుంజయ్ కనిపిస్తున్నాడు .
***

No comments:

Post a Comment

Pages