మనో ధర్మం
పారనంది శాంతకుమారి.

జీవితం కవిత్వం లాంటిది 
రక రకాల భావాలను అందించగలదు.
కవిత్వం జీవితం లాంటిది
రక రకాల స్థితులను చిందించగలదు. 
జీవితం, కవిత్వం రెండూ అశాశ్వతమే!
జీవితం ఇలలో కల లాంటిది,
కవిత్వం కలలో ఇల లాంటిది. 
రెండూ క్షణికానందాన్నే కలిగిస్తాయి.
భ్రమను, శ్రమను కలిగించటం తప్ప
ఇక దేనినీ కదిలించలేవు, కరిగించలేవు.
రెండూ అసత్యంలో మునిగి తేలుతూ ఉంటాయి.
ఐనా రెండింటికీ కలకాలం ఉండిపోవాలన్నఆశే! 
ఈ విషయం తెలిసికూడా ఈ మనసుకు 
జీవించటమన్నా,కవిత్వం రాయటమన్నా.
ఎందుకో ఇంత మక్కువ?
శాశ్వతం కాని వాటి గురించి ఆలోచించి,ఆత్రుత చెంది
ఆశ పడి,నిరాశ పొంది 
చివరకు రాలిపోవటమే మనో ధర్మం,
అదే మనో గమ్యం.
కవిత్వం,జీవితం కూడా అంతే కదా! 
అవికూడా తనలాంటివే అని తెలిసే
అది అలా ప్రవర్తిస్తోందేమో?
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top