శ్రీ రంగనాథ క్షేత్రాలు - 4 - అచ్చంగా తెలుగు

శ్రీ రంగనాథ క్షేత్రాలు - 4

Share This
శ్రీ రంగనాథ క్షేత్రాలు - 4
శ్రీరామభట్ల ఆదిత్య 

శ్రీరంగం ( అంత్య రంగం ) - తిరుచిరాపల్లి జిల్లా, తమిళనాడు.
ప్రపంచంలోనే నిత్యపూజలందుకొనే అత్యంత పెద్ద దేవాలయంగా(అంగ్  కోర్ వాట్ పెద్దదే అయినా నిత్యపూజలు జరగవు) అద్భుతమైన శిల్పసంపదతో విశేషమైన ప్రాకారాలతో శ్రీవైష్ణవ సంప్రదాయానికి భూతల వైకుంఠంగా తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి జిల్లాలో ఉన్నది అంత్యరంగ క్షేత్రమైన శ్రీరంగం.
ఈ క్షేత్రంలో శ్రీరంగనాథస్వామి వారు తన దేవేరి రంగనాయకి అమ్మవారితో వెలిశారు. శ్రీరంగానికి ముందు కావేరి నది రెండు పాయలుగా విడిపోయి కావేరి, కొల్లిడంలుగా మారి ఒక ద్వీపాన్ని తయారుచేస్తుంది అదే శ్రీరంగం. ఇక్కడ శివకేశవ అభేదానికి ప్రతిరూపంగా పంచభూతలింగక్షేత్రాలలో జలలింగమైన 'జంబుకేశ్వరుడు' శ్రీరంగడితోపాటు వెలిశాడు. ఇక్కడ విశిష్టాద్వైత మత ప్రచారకుడు శ్రీ రామానుజాచార్యుల పార్థివ దేహాన్ని ఇంకా ప్రత్యేక లేపనాలతో భద్రపరిచి భక్తుల దర్శనార్థం చూపిస్తారు ఆలయ నిర్వాహకులు.

108 వైష్ణవ దివ్యదేశాలలో శ్రీరంగం కూడా ఒకటి. ఆలయ విశేషాల్లోకి వెళితే 600 శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. తరువాత ఆలయంలో11వ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యుల చేత పూజాపద్ధతులు క్రమబద్ధీకరించబడ్డాయి. ఇక్కడ తెంకళై పద్ధతిలో పూజలు నిర్వహించబడతాయి. తరువాత 14వ శతాబ్దపు తొలినాళ్ళలో ఢిల్లీ సుల్తానుల దండయాత్రలో ఈ ఆలయం బాగా దెబ్బతిన్నది. ఆ సమయంలో భవ్యమైన ఈ ఆలయం సంపదపై మహమ్మదీయ రాజుల కన్ను పడడంతో స్వామివారి ఆభరణాలను, ఉత్సవమూర్తులను వేరే చోటికి తరలించారు. రంగనాయకి అమ్మవారిని మరోచోటికి తరలించారు. ఆ సమయంలో దాదాపు 14 వేల మంది శ్రీవైష్ణవులు ఆలయ రక్షణలో భాగంగా తమ ప్రాణాలు విడిచినట్టు చరిత్ర చెబుతోంది. స్వామి అమ్మవార్ల విగ్రహాలను కాపాడటానికి భక్తులు ఎన్నో ప్రదేశాలు తిరిగారు అలా కొన్ని సంవత్సరాల పాటు తిరిగిన విగ్రహాలు తిరుమలకి చేరుకున్నాయి. అక్కడ ఉన్న మండపంలో ఈ విగ్రహాలను ఉంచి పూజలు చేసారు. అదే ఇప్పుడు మనం శ్రీవారి ఆలయంలో చూస్తున్న రంగనాయక మండపం.
తరువాత 14వ శతాబ్దపు చివర్లో పాండ్య రాజులచేత తిరిగి పునరుద్ధరింపబడి నాలుగు  రాజగోపురాలతో దాదాపుగా ప్రస్తుతరూపుని సంతరించుకుంది. అప్పుడే దాదాపు 1371 సమయంలో విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. మొత్తం 156 ఎకరాల్లో,50 ఉపాలయాలతో, 21 విమానగోపురాలతో, 7 ప్రాకారాలతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం. ఆలయ విశేషం ఏమిటంటే‌ ఆలయంలోని గోడలన్నింటి కొలత దాదాపు 6 మైళ్ళు ఉంటుంది. తమిళంలో ఓంకారం ఎలా ఉంటుందో అలా బంగారు విమానాన్ని ఇక్కడ గర్భగృహంపైన నిర్మించారు. రంగవిలాస మండపం, శేషరాయ మండపం, గరుడ మండపం, వేయిస్తంభాల మండపం, కిళి మండపం ఇవి ఇక్కడి ముఖ్య మండపాలు.
ఆలయ ప్రాముఖ్యాన్ని తెలిపే 'శ్రీరంగనాథ మాహాత్మ్యం' అనే గ్రంథంలో ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. క్షీరసాగర మథనం జరిగేటప్పుడు బ్రహ్మ తపస్సు చేయగా పాల సముద్రం నుండి శ్రీరంగనాథ విగ్రహం ఉద్భవించిందట. ఆ విగ్రహాన్ని అయోధ్యా నరేశుడు శ్రీరాముడు పొందగా, రావణ సంహారం తరువాత దాన్ని విభీషణునికి ఇచ్చాడట. లంకలో ప్రతిష్ట చేద్దామని బయలుదేరిన విభీషణుడు ఒకసారి లంకాద్వీపంలో విగ్రహ ప్రతిష్ట జరిగితే దాన్ని కదిలించడం కష్టమని భావించి, ఆ సమయంలో తమిళనాడు ప్రాంతాన్ని పాలించే ధర్మవర్ముడనే రాజుకు ఆ విగ్రహం ఇవ్వగా ఆయన ఆ విగ్రహాన్ని దక్షిణాభిముఖంగా ప్రతిష్టించాడట ఎందుకంటే లంకాద్వీపం వైపు విగ్రహం చూపు ఉండాలనే కారణంతో. మూడున్నర చుట్లతో, ఐదు పడగలతో ఆదిశేషుడు ఉండగా అయనమీద ఒక గుండ్రనిదిండుపై తల‌ఉంచి దానికి తన కుడిచేతిని ఆధారంగా ఉంచి శయన ముద్రలో ఉంటారు స్వామి. మొత్తంగా ఈ విగ్రహం 6 మీటర్ల పొడవుంటుంది. ప్రక్కనే రంగనాయకి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఉత్సవ సమయంలో స్వామే అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. 
ఆళ్వార్లు అందరూ ఈ స్వామిని విశేషమైన తమిళ ప్రబంధాలతో కీర్తించారు. సౌరమానం ప్రాకారం డిసెంబర్-జనవరి నెలల్లో వచ్చే ధనుర్మాసంలో ఇక్కడ ఉత్సవాలు అద్భుతమైన రీతిలో నిర్వహించబడతాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడి వైకుంఠ మాధవుని వైభవం వర్ణించ శక్యం కానిది. ఇంకా స్వామి ఆభరణాలను శుభ్ర పరిచే జ్యేష్ఠాభిషేకం అనే  ఉత్సవం కూడా అద్భుతంగా నిర్వహిస్తారు. ఇది జూన్-జూలైలో నిర్వహిస్తారు. ఇంకా మార్చి-ఏప్రిల్ నెలల్లో స్వామి బ్రహ్మోత్సవాలు, జనవరి-ఫిబ్రవరి నెలల్లో రథోత్సవం, గజేంద్ర మోక్ష ఘట్టానికి సూచికగా చైత్ర పౌర్ణమి, మే-జూన్ నెలల్లో వసంతోత్సవం నిర్వహిస్తారు. 10వ శతాబ్దం నుండి నేటి వరకు ఈ ఆలయం తమిళనాడులో కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజికంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా గుణాత్మక మార్పును తీసుకువచ్చింది. ‌తమిళనాడులోని ప్రముఖ నగరమైన తిరుచిరాపల్లికి (త్రిచ్చి) కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీరంగం. త్రిచ్చికి రైలు, విమానం, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.
నేటితో త్రిరంగ క్షేత్రాల గురించి వ్యాసాలు పూర్తయ్యాయి నాకు శక్తి ఉన్నంతవరకు మీకందరికీ త్రిరంగ క్షేత్రాల గురించి తెలిపే ప్రయత్నం చేశాను. నాకు చాలా ఇష్టమైన 'రంగాపుర విహార' పాట స్వామి మీదే రచించారు. సరే ఉంటాను మరి. వచ్చే నెల నుండి తెలంగాణ రాష్ట్ర నాట్యమైన 'పేరిణి నాట్యం' గురించి చెప్తాను.  ధన్యవాదాలు.
***

No comments:

Post a Comment

Pages