తప్పు దిద్దుకుంటా! - అచ్చంగా తెలుగు
తప్పు దిద్దుకుంటా!
      -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

నీ చిన్నప్పుడు
అక్షరాలు దిద్దించాల్సొచ్చినప్పుడు
నిర్లక్ష్యం చేశాను
చిట్టి చేతుల సంపాదనకు అలవాటుపడి
మొక్క దశలోనే పండ్లను ఆశించాను
అరె..ఒరె..అని అందరూ పిలుస్తుంటే
వాళ్ల అభిమానం అనుకొన్నాగాని
నీ అధమస్థాయికి సూచికనుకోలేదు
సుకుమారమైన నీ చేతులు.. మొరటుబారుతుంటే..
ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన కాళ్లు
బలపాలుకట్టుకుపోతుంటే..
సూర్యోదయంతో కార్ఖానాకెళ్లి
నడిరేయిన ఇంటి్కొస్తుంటే..
కష్టజీవివనుకున్నా గాని
యాంత్రిక జీవనవిధానం నీదని గ్రహించలేకపోయాను
ఎంత రెక్కాడినా..డొక్కాడడం
మృగ్యమవుతున్న ఈ రోజుల్లో
నీ జీవితం పొగచూరిపోవడానికి నేనే కారణమన్న భావం
మనసును మెలిపెడుతోంది
భగవంతుడా! రేపు నేను పోతే
నాకే స్వర్గసౌఖ్యాలూ ఇవ్వొద్దు
మరో జన్మనిచ్చి వాణ్ని నా కొడుకుని చేయి
అష్టకష్టాలయినా పడి
వాణ్ని చక్కగా చదివించి నా తప్పును దిద్దుకుంటా!
***

No comments:

Post a Comment

Pages