మంత్రం - అచ్చంగా తెలుగు
మంత్రం
వేమూరి శ్రీనివాస్ 

శంకర రావు  పేరుకు తగ్గ మనిషి. కొంచెం తిక్కున్నా, లెకున్న మనిషి. ఎవరైనా బాధపడితే తట్టుకోలేడు.  వీలయితే సొంత పనులు మానేసయినా  తోచినంతలో ఎదుటివాళ్ళకు సహాయం చేసే మనుసున్న మనిషి. ఎవ్వరితో ఏ పనీ  చేయించుకోవడానికి ఇష్టపడడు,  తన పని తాను చేసుకుంటాడు.  భార్య ఇంటిపనంతా ఒక్కత్తీ  చేస్తానన్నా   ఒప్పుకోడు.   
ఏది చేసినా ఇంట్లోఅంతా సిన్సియర్ గా పర్ఫెక్ట్ గా ఉండాలని తాపత్రయ పడతాడు. ఆఫీసులో అంతే, ఇంటి దగ్గరైనా అంతే.
అవగాహనా లోపంవల్ల, ఇంట్లో భార్యాపిల్లలు, స్వార్థ ప్రయోజనాలకోసం  ఆఫిసులో సాటి ఉద్యోగులు  పని సరిగా చేయకపోతే తిక్క రేగేది. నోటికి వచ్చినట్టు తిట్టేస్తూ ఉంటాడు. . కోపం తగ్గగానే, బాధపడి వాళ్ళ పనులు కూడా తానే  చేసి పెట్టేస్తూ ఉంటాడు. 
మొదట్లో ఆయన తత్త్వం అందరికీ  కష్టంగా అనిపించినా, కొంత కాలం ఆయనతో పని చేస్తే , ఆయనలో  నిబద్ధత, తిట్టడానికి కారణాలు, సాటి మనుషుల పట్ల ఆయనకుండే సహానుభూతి అర్థం చేసుకున్నవారు ఆయనకి  ఒక ప్రత్యేకస్థానం ఇచ్చి గౌరవిస్తూ ఉండేవారు.  చాలా మంది ఆయన మంచితనాన్ని లౌక్యంగా సొమ్ము చేసుకునేవారు.   ఏమయితేనేం, ఇంటా బయటా  జనాల దృష్టిలో ఆయన   తిక్క శంకరయ్య. 
ఒక సెలవు రోజు పొద్దుటే  లేచి  ఇల్లు సర్దుతూ, "ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడవుండవు! ఎవరూ,  తీసిన వస్తువు తీసిన చోట పెట్టరు,  అంటూ మొదలెట్టి ఇంట్లో "పేరిణీ" శివ తాండవం చేస్తూ విసుక్కోవడం మొదలు పెట్టాడు. అయన తత్త్వం తెలుసుకాబట్టి ఇంట్లో ఎవరూ పెద్దగా ఆయనని పట్టించుకోలేదు.
ఈలోగా భార్య కాఫీ గ్లాస్ తీసుకుని ఆయన బూజు దులుపుతున్న గదిలోకి వచ్చింది. దాంతో అయన అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు.
"అసలు నీకు జ్ఞానం ఉందా? బుద్ధున్న వాళ్లు ఎవరైనా బూజు దులిపేగదిలోకి, తినే పదార్థాలు తీసుకోస్తారా? అందులోనూ కాఫీ! ఏదైనా సాలీడు పడితే, తాగి చస్తాడు , దరిద్రం వదిలిపోతుందనే  ఆలోచనా? ఏం మనిషివే, ఇదిగో ఇవే పోలికలు పిల్లలలకూ వచ్చాయి."   అంటూ మొదలెట్టి నోటికేదొస్తే అది  చడమడా తిట్టేశాడు.
ఆవిడ మొహం చిన్నబుచ్చుకుని, పల్లెత్తు మాట అనకుండా కాఫీ గ్లాస్ తీసుకుని అక్కడనుంచి వెళ్ళిపోయింది.
ఇల్లంతా అద్దంలా సద్దేసే, స్నానం చేసి భోజనాలు కానిచ్చి మధ్యాహ్నం ఒక కునుకు తీశాడు.
ఇంట్లో రుద్రనమకం అయిపొయింది. ఇక శాంతి చమకం ప్రవేశించే సమయం ఆసన్నమయింది.  ఆయనలో రుద్రుడి స్థానంలో భోళా శంకరుడు ప్రవేశించాడు. ఆ సమయం ఇంట్లో వాళ్ళు బాగా గుర్తిస్తారు.



భార్య తాగడానికి చల్లటి నీళ్లిచ్చి వేడి వేడి టీ  చేతిలో  పెట్టి  ముభావంగా వెళ్ళిపోయింది.

ఆవిడని చూసిన తరువాత, మామూలుగానే శంకరంలో ఒక చిన్న అపరాధ భావం తలెత్తింది.
అయితే రిస్క్ తీసుకోవడానికి భయ పడ్డాడు. తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది పరిస్థితి. అప్పుడు కనుక ఆవిడని కదిపితే 'తుఫాను మొదలవుతుంది.
"శంకరం కోపం వస్తే గుర్తుకు వచ్చినవి మాత్రమే తిడతాడు, అదే ఆవిడయితే గుర్తుపెట్టుకుని మరీ తిడుతుంది."
ఈ లోగా "నాన్నా" అంటూ పదవతరగతి చదువుతున్న వాళ్ళమ్మాయి "ప్రోగ్రెస్ రిపోర్ట్"  సంతకం చేయమని ఇచ్చింది.
"మార్కులు చూస్తే ఏదీ వందకు వంద తగ్గలేదు,  చివరలో ప్రిన్సిపాల్ "ది బెస్ట్ స్టూడెంట్ అఫ్ ది స్కూల్  విత్ కన్సిస్టెంట్ పెర్ఫార్మన్స్ ఇన్ ది పాస్ట్ టెన్ ఇయర్స్, వుయ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హర్" అని  రాసిన  కామెంట్స్  చూసి ఆనందంతో ఉక్కరిబిక్కిరి అయిపోయాడు.



 సాధారణంగా ఏ స్టూడెంట్ గురించీ  ఏ స్కూలు అటువంటి కామెంట్స్ పెట్టదు  
కానీ ఆ పిల్ల డిఫరెంట్, ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు అదే స్కూల్ లో చదువుతోంది.  పరీక్షలైనా, ఎలేక్యూషన్ అయినా, ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అయినా ఆ పిల్ల ఉందంటే, స్టేట్ వైడ్ గా ఉన్న వాళ్ళ స్కూల్స్ అన్నింటిలోనూ ఆ పాప చదివే స్కూల్కి   ఫస్ట్ వస్తుంది.
 ఆ పిల్ల టాలెంట్ కి ముచ్చటపడి మొత్తం చదువు స్కూల్  మేనేజ్మెంట్ ఫ్రీగా చెప్పిస్తామన్నా శంకర రావు ఒప్పుకోలేదు. దేవాలయానికి ఉత్త చేతులతో వెళ్లకూడదని అతని అభిప్రాయం. 

శంకరరావు కూతురిని దగ్గరకు తీసుకుని నా బంగారు తల్లివిరా నాన్నా. చెప్పునీకు ఏది ఇష్టం? మంచి డ్రెస్ కావాలా?  ఎక్కడికైనా వెళ్దామా? సినిమాకెల్దామా?  ఏమి కావలి?    అంటూ వళ్ళో కూర్చేబెట్టుకుని ముద్దు చేస్తూ  వరాల మీద వరాలు ఇచ్చేస్తున్నాడు.
లోపలినించి బయటకొచ్చిన శంకరరావు భార్య  శంకరరావుని  కూతురిని మర్చి మార్చి చూస్తూ  స్వగతంలో అనుకుంటునట్టు పైకే అంది "మేమూ అలా పెరిగిన వాళ్ళమే". అలా అన్నప్పుడు ఆమె గొంతులో నిష్టూరం లేదు, ఒక జగత్ సత్యం చెబుతున్న భావం తప్ప.
భార్య అన్న మాటా చెంప మీద    ఛెళ్ళున కొట్టినట్టయింది శంకర రావుకి.  అసలే భోళా మనిషి, పైగా సున్నితం మనస్కుడు, ఆ పైన చేసిన పనికి అపరాధ భావంతో ఉన్నాడు, దానితో  అతనిలో అంతర్మధనానికి ప్రారంభమయ్యింది. 



"నిజమే కదా!" ప్రతీ ఆడపిల్లా  ఇలానే చిన్నతనంలో  తండ్రివళ్ళో కూర్చుని గారం గారంగా, ముద్దు ముద్దుగా  పెరిగినదే కదా.  అవే ముద్దులు- అవే మురిపాలు, అవే బుజ్జగింపులు- అవే లాలనలు...  ఒకసారి పెళ్ళయితే ఏమై పోతాయి అవన్నీ?
కావాలనే అందో, లేక తన మనసుకు చిన్నతనం  జ్ఞాపకాలు గుర్తుకొచ్చి అందో తెలియదు కానీ, భార్య మాటలతో శంకరరావు మనసు కలిచినట్లు అయిపొయింది.
అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న శంకరరావు కూతురు "నాన్నా! పెళ్ళయితే ఎవరైనా అమ్మలా తిట్లు తినాలా?" అని అమాయకంగా అడిగేసరికి, గొంతులో అప్పటివరకూ  అడ్డుపడినట్టు ఉన్న  బాధ, ఒక్కసారి కళ్ళ నీళ్ల రూపంలో  బయటకొచ్చేసింది.
పిల్ల కంగారుపడి, "అమ్మా! నాన్న ఏడుస్తున్నాడే?" అన్న కేకతో, బయటకు పరిగెత్తుకొచ్చింది శంకర రావు భార్య.
"ఏమయ్యింది? అని ఆందోళనగా అడిగింది. 
"ఏం  లేదు, ఐ యాం  సారీ!, నిన్ను చాలా బాధ పెడుతున్నాను అన్నాడు.
ఆడ పిల్లలా ఏంటా ఏడుపు? ముందు ఆపు, అయినా నీ గురించి నాకు తెలియదా? నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను, దేవుడా, అన్నీ చక్కటి బుద్దులు ఇచ్చి ఈ తిక్క ఎందుకు పెట్టావు ఈ మనిషికి ? అదే లేకపోతె వీడిని మించినవాడు ఉండదు కదా అని"
అలా అంటూనే  వంటిట్లోకెళ్ళి, గ్లాసుడు మంచినీళ్లు తెచ్చి భర్తకిచ్చింది. 
మొగుడు కోప్పడితే తోకమీద లేచే భార్య, చెట్టంత మొగుడు కళ్లనీళ్లు పెట్టుకున్నప్పుడు మాత్రం నిజమే  మాట్లాడుతుంది.



నీళ్లు నోట్లో పెట్టుకోబోతున్న శంకర రావు నాసికకి  గ్లాస్ నుంచి వచ్చే ఉల్లిపాయల వాసన చికాకు తెప్పించింది.
మంచినీళ్లు తాగే గ్లాసులకి ఇలా అడ్డవయిన వాసనలు రాకూడదని  ఎన్ని సార్లు చెప్పను? ఒకసారి చెబితే గుర్తుండదా? అని విసుక్కుంటూ నీళ్లు తాగాడు.
అతని భార్యా, కూతురు ఘొల్లున నవ్వారు.           
ఈ సారి అతని గొంతులో విసుగు, కోపం లేవు, ఎన్ని సార్లు చెప్పినా వీళ్లేందుకు మారరు అన్న బాధ తప్ప.
భార్యపై తిక్క రేగిన ప్రతి సారీ అతని చెవుల్లో ఒకటే మాట విసిపిస్తోంది "మేమూ ఇలా పెరిగిన వాళ్ళమే"
అది గుర్తు వచ్చినప్పుడల్లా, అతని కోపం మాయమవుతుంది. మాటను మించిన మంత్రం ఉండదంటే ఇదే కదా!
***

No comments:

Post a Comment

Pages