గురుదక్షిణ - అచ్చంగా తెలుగు
" గురుదక్షిణ"
లక్ష్మీ మురళి 

"శ్రీమతి రాజ్యలక్ష్మి గారిని సవినయంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం."అన్న పిలుపుకి ఈలోకంలోకొచ్చి,నా చేతిలో ఉన్న చేయి ఎవరిదోనని తల పైకెత్తి చూశాను. వారం క్రితం ఇంటికొచ్చి ఈ ఫంక్షన్ కి రావడానికి ఒప్పించిన గీత. నవ్వుతూ తన చేతిని నా కుడిచేతిలో  ఉంచి,స్టేజీ పైకి తీసుకెళ్తోంది.అందరూ స్టాండింగ్ ఓవేషన్,చప్పట్లు."నమస్తే మేడమ్.నేను మీకు గుర్తున్నానా?నా పేరు గీత. చిన్నప్పుడు మీరు మాకు ఐదో తరగతి వరకూ లెక్కలు చెప్పారు.మా అమ్మ మండల ఎమ్ పి పి గా కూడా పనిచేసింది."రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న నాకు అప్పుడు కొంత గుర్తొచ్చింది. ఆ పాఠశాలలో వాళ్ళు మొదటి బ్యాచ్ పిల్లలు నాకు. గీత, రాధ,చెంచులక్ష్మి వీళ్ళంతా. మా బ్యాచ్ వాళ్ళం మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం మేడమ్ అని. ఎప్పుడూ సన్మానాలవీ చేయించుకోవడం,ఆ మాటకొస్తే స్టేజ్ ఎక్కడమే అలవాటు లేదు నాకు ఇన్నేళ్ళ సర్వీసులో.ఏదో వార్షికోత్సవాలప్పుడు,స్వాతంత్ర్య దినోత్సవాల్లాంటి పండుగలప్పుడు పిల్లల ప్రోగ్రాంలకు యాంకరింగ్ లాంటివి చేసేదాన్నంతే.ఎందుకంటే ఆ ప్రోగ్రాములన్నీ నేను ప్రిపేర్ చేసి, వేయించేవే కాబట్టి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కాబట్టి మైకులవీ ఉండేవి కాదు అప్పట్లో.జాతీయ పండుగలప్పుడు చిన్నపాటి స్పీచులివ్వడం మాత్రం అలవాటు.ఎలాగో ఒప్పించింది నన్ను. "గీత,తన స్నేహితురాలు రాధతో కలసి వచ్చింది మా ఇంటికి.

"మా తొలి గురువు,మా అందరికీ ఆదర్శనీయమైన, దైవ సమానమైన పూజ్యులు శ్రీమతి రాజ్యలక్ష్మి మేడమ్ గారికి నా నమస్కారాలు."అన్న రాధ మాటలకి మిన్నంటిన కరతాళ ధ్వనులతో మళ్ళీ నేనెక్కడున్నానో గుర్తొచ్చింది. అంతకు ముందు గీత తో పాటు నా వద్ద చదివిన మొదటి బ్యాచ్ పిల్లలు ప్రసంగిస్తూ,నాతో వాళ్ళ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నిజమే, నేను వాళ్ళతో ఒక టీచర్ లా ఉంటూనే ఒక అమ్మలా,స్నేహితురాలిలా,శ్రేయోభిలాషిగా ఉండేదాన్ని. నే వెళ్ళిన కొత్తలో వాళ్ళకి చదువంటే కేవలం పాఠం వినడం, హోమ్ వర్క్ రాయడం అంతే.డెబ్భై మంది పిల్లల్లో ప్రతి రోజూ స్నానం చేసేవాళ్ళు వేళ్ళపై లెక్కపెట్టొచ్చు.మొదట్లో స్నానం చేయని పిల్లలను విశ్రాంతి సమయంలో ఇంటికి పంపి,స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకు రమ్మనేదాన్ని.దాని వల్ల ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ గొడవకు కూడా వచ్చారు నాతో, స్నానం చేయకపోతే చదువు చెప్పరా అని.మంచి మార్పు తేవడం కోసం ఏదైనా ఎదుర్కోవాలనే మనస్తత్వం ఉన్న నేను అవన్నీ నవ్వుతూ భరించేను.కొద్ది రోజుల్లోనే నేననుకున్న మార్పు వచ్చాక అర్థమైంది. ఇన్నాళ్లూ వీళ్ళకి సరైన పద్ధతిలో నేర్పేవాళ్ళు లేక ఇలా ఉన్నారని.తర్వాత చదువుల మీద పడ్డాను.పరిస్థితి గాడిలో పడ్డాక నాకు కష్టమనిపించలేదు.ఇక పిల్లల ఆల్ రౌండ్ డెవలప్ మెంట్ కోసం ఆటలు, పాటలు, స్వీయ కవిత్వం వ్రాయడం,చిత్ర లేఖనం మొదలైన అంశాల్లో తర్ఫీదునివ్వడం మొదలుపెట్టాను. ముందు ఉండే ఉపాధ్యాయులు కూడా ఎంతో శ్రద్ధగా చెప్పేవాళ్ళే.కానీ ఎక్కువ క్రమశిక్షణ నేర్పితే పిల్లలు భయపడి బడికి రారని నమ్మేవారు. కానీ ఒక పద్ధతిలో శుభ్రత,చదువు వల్ల ఉపయోగం వాళ్ళకి అర్థమయ్యేలా మన పని ద్వారా నిరూపించగలిగితే ఏమార్పైనా సాధ్యమని నాకప్పుడే నమ్మకం బలపడింది.'A positive attitude can make dreams come true " అనే David Baily గారి సూక్తి గుర్తొచ్చింది ఆ సమయంలో.

ఆ పాఠశాలలో ఎనిమిదేండ్లు పనిచేసి వేరే ఊరికి బదిలీ పై వెళ్ళేప్పుడు ఊరివారంతా వచ్చి, "మీరు ఎలాగైనా ఇక్కడికి వస్తే మరికొన్ని తరాలు బాగుపడతాయమ్మా,కావాలంటే కలెక్టర్ నుండైనా ఆర్డర్ తెప్పిస్తాం."అన్న వారి అభ్యర్థనకు చిరునవ్వుతోనే సమాధానపరచి,పిల్లలకు వీడ్కోలు చెబుతుంటే రాధ వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని భోరుమని ఏడుపు. రాధ ఇక్కడ వాళ్ళ అత్త,నాయనమ్మ ల దగ్గర ఉండి చదువుకునేది.వాళ్ళ అమ్మ మీద బెంగతో ఒకటో తరగతిలో అసలు బడికి రాక చదువేమీ రాలేదు. రెండో తరగతిలో హాజరు అంతంతమాత్రమైనా,తనని ప్రత్యేక శ్రద్ధతో రోజూ ఇంట్లో తన కుటుంబ విషయాలు మాట్లాడుతూ మెల్లిగా నాకు బాగా చేరికయ్యేట్లు చేసుకున్నాను. తెలిసీతెలియని వయసవడంతో నన్ను వాళ్ళ అమ్మ లాగే భావించి అన్నీ చెప్పుకునేది.మెల్లిగా ఐదో తరగతి కి వచ్చేసరికి చదువులో కూడా మొదటి వరుసలోకొచ్చేసింది.తర్వాత హైస్కూలు చదువులకు వెళ్ళిపోయింది. మళ్ళీ నాకు బదిలీ అయిందని తెలిసి పరుగెత్తుకొచ్చింది.తర్వాత మళ్ళీ కనపడలేదు.ఎంపీపీ కూతురు గీత మాత్రం డాక్టర్ అయిందని మొన్న ఇంటికి వచ్చినప్పుడు తెలిసింది. రాధ గురించి అడుగుదామంటే అప్పుడే తనకి అర్జెంట్ కాల్ వచ్చేసరికి ఇద్దరూ నావద్ద ఫంక్షన్ కి వస్తామని మాట తీసుకుని వెళ్ళిపోయారు."ఇప్పుడు మన జిల్లా నూతన కలెక్టర్ కుమారి రాధ గారు మాట్లాడతారు." అనే అనౌన్స్ మెంట్ వినపడేసరికి మైకు వైపు తిరిగాను.

'రాధ కలెక్టరా?'ఆశ్చర్యం, ఆనందం.

           రాధ మాట్లాడుతోంది,"నా చిన్నతనంలో అమ్మస్థానంలో ఉండి,నేను తప్పటడుగులు వేయకుండా చూసి, నేనీస్థాయికి రావడానికి కారణమైన నా తొలి గురువు శ్రీమతి రాజ్యలక్ష్మి గారికి ఈ సన్మానం ఉడతాభక్తిగా నేనిచ్చే గురుదక్షిణ మాత్రమే. Charles kuralt చెప్పినట్లు, 'Good teachers know how to bring out the best in students.'అమ్మా ,ఎవరిపైనా ఆధారపడకుండా జీవించాలనే మీరిచ్చిన స్ఫూర్తితో మేమీ స్థాయికొచ్చాం.మీరు చెప్పిన రామానుజన్ చరిత్ర వల్లే ఎంత కాలం బ్రతికామని కాదు, ఎంత సాధించామన్నదే ముఖ్యమని అర్థమైంది. మీరు చెప్పిన వేదగణితంలో సమస్యలకి సులువైన,వేగవంతమైన పరిష్కారం కనుగొనడమెలాగో తెలిసింది. ఆ వయసులో అర్థం కాకపోయినా, ప్రాచీన భారతీయ గణిత శాస్త్రం విలువ తర్వాత మాకు అర్థమైంది.అబ్దుల్ కలాం గారి గురించి మీరు చెప్పడం వల్లే 'కలలు కనడమే కాదు,వాటిని సాకారం చేసుకోవడానికి మన శాయశక్తులా ప్రయత్నించాల'నే పట్టుదల మాలో కలిగింది. మదర్ థెరిస్సా గారి గూర్చి మీరు చెప్పినప్పుడు సేవకు మించిన దైవం లేదని తెలిసింది. మీరు మా కోసం పడిన తపనను ఇప్పుడు గుర్తు చేసుకుంటే,పనిని మించిన దైవం లేదని తెలుస్తోంది. చివరిగా నేను ఈ సన్మానం జరపడానికి ముఖ్య కారణం,నేను కలెక్టర్ అవ్వడానికి ముఖ్య కారణం ఇప్పుడు ఇక్కడ మనముందు ఆశీనులైన నా గురువు శ్రీమతి రాజ్యలక్ష్మి గారే.వారు నన్ను పదేపదే 'నీకు కలెక్టరయ్యే తెలివితేటలు ఉన్నాయి.'అనే మాట ఎందుకో నా మెదడులో ఉండిపోయింది. అందుకే ఇంజనీరింగ్ పూర్తవగానే సివిల్స్ కి ప్రిపేర్ అయి,కలెక్టర్ అయ్యాను.ప్రతి ఉపాధ్యాయుడు పిల్లలను ఈవిధంగా ప్రోత్సహిస్తే వారు ఎంతో ఎత్తుకు ఎదగగలరని చెప్పడానికి నా జీవితమే ఒక ఉదాహరణ."

           vఆశ్చర్యంగా వింటున్న నాకు ఆనందభాష్పాల్లాంటివేవో కళ్ళనుండి రాలుతుండగా,'ఇప్పుడు శ్రీమతి రాజ్యలక్ష్మి మేడమ్ గారు మాట్లాడతారు'అనే పిలుపుతో నెమ్మదిగా లేచి,మైకు దగ్గరగా వెళ్లి నిలబడ్డాను.మనసులో ఎన్నో భావాలు చెప్పాలని.కానీ బయటకేమీ రావటం లేదు. ఎక్కడ మొదలు పెట్టను,ఏమని మొదలు పెట్టను.నా భావాలన్నీ చెప్పడం మొదలు పెడితే ఈరోజు చాలదు. అందుకే నా మనసులోని ఒకే మాట చెప్పాను."ఇప్పటికి ఎంతో మంది విద్యార్థులకు చదువు చెప్పాను.ఇప్పుడు సన్మానం చేసిన పిల్లలను కనీసం నేను గుర్తు పట్టలేదు. ఎందుకంటే చాలా చిన్నప్పుడు చూశాను వాళ్ళని నేను. కానీ ఇందాకటినుండీ నా మనసులో ఒకటే ఆలోచన. మిగిలిన పిల్లలను కూడా  నేను  ఇంత ప్రోత్సహించి వుంటే ఇంకా ఎంతో మంది కలెక్టర్లు, డాక్టర్లు అయ్యేవారు కదా అనిపిస్తోంది. ఇప్పటికి ఇంతకు మించి మాట్లాడలేను చిరంజీవులను ఆశీర్వదించడం తప్ప."Every good citizen adds to the strength of the nation."అని శలవు తీసుకున్నాను.ఇంటికెళ్తూ రిటైర్మెంట్ తర్వాత నేనేంచేయాలో ఒక స్థిర నిర్ణయానికొచ్చాను.
***

2 comments:

  1. చాలా బాగున్నాయండీ కథా, కథనమూ కూడా. అభినందనలూ...

    ReplyDelete
  2. చాలా బాగున్నాయండీ కథా, కథనమూ కూడా. అభినందనలూ...

    ReplyDelete

Pages