అన్నదాత - అచ్చంగా తెలుగు
 అన్నదాత
బి.ఎన్.వి.పార్ధసారధి 

శ్రీ నాథ్ కారు డ్రైవింగ్ చేసుకుంటూ హైదరాబాద్ నుంచి తాను కొనబోయే ఫాంహౌస్ చూడటానికి బయలుదేరాడు. హైదరాబాద్ కి దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరం లో వుందా ఫాంహౌస్. ఫాంహౌస్ చూసి వెనుదిరిగి వస్తూండగా బాగా ఆకలి వేయటంతో దారి లో ఏదన్నా మంచి ధాబా (హోటల్) కనిపిస్తే ఆగి ఏమన్నా తిందామని అనుకొని ప్యాంటు జేబు లో పర్స్ కోసం యదాలాపంగా తడిమిచూసాడు. 
పర్స్ కనిపించలేదు. కారుని హైవే లో వారగా ఆపి పాంట్, షర్టు మొత్తం పరిశీలించి చూసాడు. కారు లో కూడా అంతా వెతికాడు. ఎక్కడా తన పర్స్ కనిపించలేదు. ఇంతలో మొబైల్ చార్జింగ్ అయిపొయింది. చార్జర్ కూడా పర్స్ తో పాటు ఇంట్లో మరచిపోయానని గ్రహించాడు. ముందురోజే కారులో పెట్రొల్ ఫుల్ ట్యాంక్ కొట్టించడంతో కారులో పెట్రొల్ బాగానే వుంది. ఇంటివరకు తిరిగి వెళ్ళడానికి ధోకా లేదు. కానీ ఆకలి బాగా వేస్తోంది. కనీసం మంచి నీళ్ళు దొరికినా బాగుణ్ణు అని చుట్టూ పరికించి చూసాడు. దగ్గరలోనే ఒక పూరి గుడిశె కనిపించింది.
దరిదాపుల్లో కనుచూపు మేరలో వేరే ఇల్లు గానీ మనుష్య సంచారం గానీ అగుపించక పోవటం తో ఆ గుడిశె లోపలికి వెళ్ళాడు శ్రీనాథ్. ఆ గుడిశె లో ఒక నడివయస్సు ఆలు మగల జంట జొన్న రొట్టెలు తింటూ కనిపించారు. శ్రీనాథ్ మంచి నీళ్ళు అడిగితే అతనికీ నాలుగు జొన్న రొట్టెలు వద్దంటున్నా వినకుండా బలవంతంగా ఇచ్చి తినిపించారు. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో వారికి చేతులెత్తి దణ్ణం పెట్టి కారేక్కాడు శ్రీనాథ్.
పై సంఘటన జరిగి దాదాపు నాలుగు నెలలు కావస్తుంది. ఈ నాలుగు నెలలలో శ్రీనాథ్ మూడు సార్లు ఆ ఫాంహౌస్ కి బేరం ఖాయం చేసుకోవటానికి వెళ్ళాడు. వెళ్ళిన మూడు సార్లు దారిలో ఆ పూరి గుడిశె దగ్గర ఆగి ఆ దంపతులు కనిపిస్తారేమో అని చూసాడు. ఆ గుడిశె ఖాళీ గా నిర్మానుష్యంగా కనిపించడం తో నిరాశతో వెనుదిరిగాడు శ్రీనాథ్.
కొన్నాళ్ళ తరవాత ఒక రాత్రి నాడు ఇంటిదగ్గర సినిమా ధీయేటర్ లో సెకండ్ షో చూసి నడుచుకుంటూ వస్తున్నాడు శ్రీనాథ్. మెయిన్ రోడ్ లో ఆ సమయానికి సాధారణంగా ఇసక లారీలు బారులు తీరి వుంటాయి. 
ఫుట్ పాత్ మీద కూలీలు తల కింద పార పెట్టుకుని నిద్రిస్తూ వుంటారు. తెల్లవారుజామున ఇసక లారీలతో పాటు వెళ్లి లారీల్లోంచి ఇసక దింపి తమ కూలీ వేతనాలు తీసుకుని వెళ్ళిపోతారు. శ్రీనాథ్ కి ముగ్గురు కూలీలు ఆ సమయం లో బీడీలు కాలుస్తూ ఖబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. వీధి దీపం వెలుతురులో వాళ్ళ మొహాలు స్పష్టం గానే కనిపిస్తున్నాయి. అందులో ఒకడి మొహం చూడగానే వెంటనే అతన్ని గుర్తు పట్టాడు శ్రీనాథ్. తనకి ఆనాడు హై వే మీద జొన్న రొట్టెలు పెట్టిన ఆ నడివయసు దంపతులలో భర్త ఇతనే. 
శ్రీకాంత్ పలకరించినా అతను శ్రీకాంత్ ని గుర్తు పట్టలేదు. జొన్న రొట్టెల సంఘటన గుర్తు చెయ్యగా అప్పుడు అతను శ్రీకాంత్ ని గుర్తించాడు. అతని పేరు రామయ్య. వానలు లేక కరవు రావటంతో ఋణభారం తీర్చలేక వున్న
కాస్త భూమిని కోల్పోయి బ్రతుకు తెరువు కోసం భార్య ని ఊర్లో విడిచి రామయ్య హైదరాబాద్ వచ్చినట్టు గ్రహించాడు శ్రీకాంత్ అతనితో సంభాషణ ద్వారా. శ్రీకాంత్ కొనబోయే ఫారం హౌస్ రిజిస్ట్రేషన్ మరో నెల రోజుల్లో అవుతుంది. ఫారం హౌస్ రామయ్య వాళ్ళ ఊరికి పది కిలోమీటర్ల దూరం లోనే వుంది.
రిజిస్ట్రేషన్ అయి ఫారం హౌస్ తన అధీనం లోకి రాగానే శ్రీకాంత్ అక్కడ రామయ్య అతని భార్య వుండటానికి విడిగా రెండు గదులు,టాయిలెట్ కట్టించాడు. రామయ్య హస్తవాసితో మూడేళ్లలో ఆ ఫారం హౌస్ బాగా అభివృద్ధి చెందింది. ఫారం హౌస్ ఖర్చులు అన్నీ శ్రీనాథ్ భరించేవాడు. కానీ అక్కడ పండించగా వచ్చిన ఆదాయం లో సింహ భాగం శ్రీనాథ్ రామయ్యకే ఇచ్చేవాడు.
ఒకనాడు రామయ్య చేతులు జోడించి , “ ఎన్నడూ మీ ఋణం తీర్చుకోలేను” అని అంటూంటే అతన్ని వారిస్తూ , “ నువ్వు ఆనాడు నాకు జొన్న రొట్టెలు పెట్టినప్పుడు నానుంచి ఏమీ ఆశించి ఇవ్వలేదు. ఒక సాటి మనిషిగా నీకు వున్నంతలో ఆతిధ్యం ఇచ్చావు. కానీ నేను చేస్తున్నదాంట్లో కాస్త స్వార్ధం వుంది. ఈ ఫారం హౌస్ నీ చేతిలో పెడితే నాకు లాభం వస్తుందని నాకు తెలుసు. నా లాభం లో నీకు వాటా ఇస్తున్నాను అంతే. 
నేను ఈ ఫారం హౌస్ లో డబ్బు పెట్టుబడి పెడితే నువ్వు నీ మంచితనాన్ని పెట్టుబడిగా పెట్టావు. మంచితనానికి విలువ కట్టలేము.నువ్వు చేసింది కేవలం మానవత్వం అయితే నేను చేస్తున్నది పూర్తిగా వ్యాపారం. సూక్ష్మం గా ఆలోచిస్తే నేనే నీ ఋణం ఎన్నటికీ తీర్చుకోలేను.” అన్నాడు శ్రీనాథ్ తన స్వరం లో నిజాయితీ ధ్వనిస్తుండగా.

  ***

No comments:

Post a Comment

Pages