అంతర్జాల జాలం - అచ్చంగా తెలుగు

అంతర్జాల జాలం

Share This
||శ్రీ||
అంతర్జాల జాలం
  “ శారదా తనయ”


పరుపు పైన వెల్లకిలా పడుకుని ఆలోచిస్తున్నాడు కిరణ్. ఈ రోజు ట్రిప్ లో పెద్దాయన చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. “ అవును. ఆయన చెప్పిందంతా అక్షరాలా నిజం. నా మంచికోరే చెప్పాడాయన. నిజంగానే ఈ రోజు తృటిలో తప్పిన ఆక్సిడెంట్ గురించి తలుచుకుంటే భయం వేస్తుంది. ఎంతట్లో మిస్సయింది ? అదే హైవే పైన  జరిగుంటే కారులోనివాళ్ళంతా హరీ మనేవాళ్ళు. ఏ దేవతో కరుణించబట్టి చివరి నిముషంలో తాను గుర్తించి స్టీరింగ్ తిప్పడం, కారులో ఉన్నవాళ్ళకు కొద్దిగా హడలు పుట్టేట్టు కారు అటూ ఇటూ వెళ్ళినా, చివరికి అంతా సర్దుకుంది. నేను ట్రిప్ మొదలు పెట్టినప్పటినుండి పెద్దాయన నన్ను గమనిస్తూనే ఉన్నాడు. ఎంత మామూలుగా ఉండాలనుకున్నా కుదరలేదు. ఏది ఏమైనా రేపటినుండైనా జాగ్రత్తగా ఉండాలి. “ అనుకుంటూ మళ్ళీ నిద్రకు ఉపక్రమించాడు కిరణ్. 
                                    *************

కిరణ్ ఒక సీదాసాదా కుటుంబంలోనుండి వచ్చినవాడు. తల్లీ తండ్రీ ఇద్దరూ కష్టపడితే కానీ రోజు గడవని పరిస్థితి. ఇంట్లో ఇద్దరు అక్కలు, తను. అందరూ స్కూలుకు వెళ్ళేవాళ్ళు. అక్కలిద్దరూ చక్కగా చదువుకుంటుంటే కిరణ్ మాత్రం తిరుగుళ్ళకు, అల్లరికి అలవాటు పడ్డాడు. క్లాసులకు వెళ్ళేవాడు కాదు. గవర్నమెంటు స్కూలు కాబట్టి ఎవరూ వాడి తలిదండ్రులకు విషయం చెప్పలేదు. అయినా అలాంటి పద్ధతులేవి ఆ స్కూళ్ళల్లో ? స్కూలుకు పిల్లలు వస్తే చాలు అన్నటువంటి పరిస్థితి ఆ స్కూళ్ళది. అక్కలిద్దరూ పదో తరగతి దాకా చదివి, ఇక డబ్బుల్లేక చదువు మానేశారు. ఇంట్లోనే ఉంటూ తల్లికి సహాయంగా ఉండేవారు. తలిదండ్రులు కూడా తమకు తగ్గ తాహతులోనే సంబంధాలు వెతికి వాళ్ళ పెళ్ళిళ్ళు చేశారు.  వాటికయిన అప్పులు తీర్చడానికి కిరణ్ అమ్మానాన్నలు పగలనక రాత్రనక కష్టపడేవారు.  దాంతో వాళ్ళకి కిరణ్ మీద, వాడి చదువు మీద శ్రద్ధ చూపడం కుదరలేదు. కిరణ్ తన అల్లర్లను, ఆగడాలను కొనసాగిస్తూ, చదువుకోకుండా పదవ తరగతి తప్పాడు. తండ్రి నాలుగు దెబ్బలు వేస్తే పొగరుగా “ నాకు చదువు అబ్బదు నాన్నా ! నేను చదువుకోను. ఏదైనా పని చేస్తూ మీకు సాయ పడతా “ అన్నాడు. ఇక వీడిని దిద్దడం తమకు చేతనైన పని కాదని తెలుసుకున్న తలిదండ్రులు పనిలో చేరడానికే ప్రోత్సహించారు. వాడి స్నేహితుల్లో ఒకడు ఆటో తోలేవాడు. వాడితో కలిసి ఆటో తోలడం నేర్చుకున్నాడు. అప్పుడప్పుడు వాడికి రిలీవర్ గా కిరణ్ తోలేవాడు. స్నేహితుడు అంతో ఇంతో డబ్బులు ఇచ్చేవాడు.
ఇలా కొన్నేళ్ళ తరువాత, హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీల హవా పెరిగేటప్పటికి కార్ల వాడకం పెరిగింది. ఎన్నోట్రావెల్ ఏజన్సీలు ఈ కంపెనీలకు తమ కార్లను అద్దెకు పెట్టసాగాయి. వాటికి డ్రైవర్ల అవసరం పెరిగింది. కిరణ్ స్నేహితుడు ఒక కార్ కొని అలా అద్దెకు తిప్పసాగాడు. కిరణ్ కి వాడి ఆటో తిప్పడానికి దొరికింది. నెలసరి ఆదాయం బాగానే రాసాగింది. తలిదండ్రులు కూడా ఏదో కొడుకు ప్రయోజకుడయ్యాడని సంతోషపడ్డారు. స్నేహితుడు కూడా ఆటోని అతడికే అమ్మేశాడు. అక్కలిద్దరూ పుట్టింటికి వచ్చినప్పుడు తమ్ముడి స్వంత ఆటోలో తిరిగి సంబరపడ్డారు. 
కానీ, వీటన్నిటి మధ్య పలికిన ఒక అపశృతి, కిరణ్ తాగుడు మొదలుపెట్టడం. కిరణ్ స్నేహితుడికి కార్ల అద్దెల్లో బాగా కలిసివచ్చేది. దాంతో ఇద్దరూ కలిసి బార్లకు వెళ్ళడం, తాగి ఇళ్ళకు వెళ్ళడం మొదలయింది. ఇద్దరూ మితంగానే త్రాగేవారు. ఇంట్లో అమ్మ అభ్యంతరపెట్టినా కిరణ్, “రోజంతా ఆటో తోలతాను కదా,  ఒళ్ళంతా నొప్పులమ్మా ! అందుకే కొద్దిగా మందు తాగితే మంచిగా నిద్రపట్టి మరుసటి రోజుకు ఫ్రెష్ గా ఉంటాను. అయినా బండి తోలేటప్పుడు తాగను కదా .  మరేం ఫర్వాలేదులే. “ అనేవాడు. చేతికి వచ్చిన కొడుకునింకేం అనగలరు ? ఊరుకున్నారు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి.
సాఫ్ట్ వేర్ కంపెనీలకి గడ్డు రోజులు వచ్చాయి. ఉద్యోగాలు తీసేసే దశ వచ్చింది. కార్లు అద్దెకు తీసుకోవడం కూడా తగ్గింది. కిరణ్ స్నేహితుడి ఆర్భాటం తగ్గింది. కారు అమ్మేసి, తను వేరే ఏదైనా బిజినెస్ లోకి మారతానననీ, తన కారుని తీసేసుకోమనీ కిరణ్ తో పోరు పెట్టసాగాడు. మధ్యలో కిరణ్ కూడా కారు డ్రైవింగ్ నేర్చుకోవడం, లైసన్స్ తీసుకోవడం కూడా జరిగింది. కిరణ్ కు కూడా ఆటో బోరు కొట్టసాగింది. దాన్ని అమ్మేసి, స్నేహితుడి  కారు చవకలోనే కొని, తనే ట్రావెల్స్ కి పెట్టి నడపసాగాడు.
ఆటో మాదిరిగా ఉత్త సిటీలో మాత్రమే తిప్పడం కాకుండా, బయటి ఊర్లకు వెళ్ళాల్సి వచ్చేది కిరణ్ కి. ఊళ్ళు చూడడం జరిగింది. ప్రపంచ జ్ఞానం పెరిగింది.  కార్ డ్రైవర్ గా లెవెల్ పెరిగింది. అలాగే చేతిలో డబ్బులు కూడా బాగానే ఆడేవి. అమ్మానాన్న చేసిన  అప్పుల్లో తనే చాలా భాగం తీర్చేశాడు . వాళ్ళకు కూడా నెమ్మదిగా అనిపించసాగింది. తాగుడు అలవాటు కొనసాగుతున్నా బండి తోలేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేవాడు.
అప్పుడు మార్కెట్ లోకి వచ్చింది ఉచిత సిమ్ లు ఇచ్చీ స్కీమ్.  అంతవరకూ ఆఫీసుల్లోనూ, ఇళ్ళల్లోనూ ఎక్కువగా ఉంటూ, ఏదో కొద్ది మందికి మాత్రమే తమతమ మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉంటున్న అంతర్జాలం, అందరికీ అందేలా చేసే సదుద్దేశమని బాకా బజాయిస్తూ, కానుకగా ఇచ్చిన ఉచిత సిమ్ మార్కెట్ లోకి వచ్చింది. మొదటి మూడు నెలలు అన్నీ ఫ్రీ. ఉత్త సిమ్ కార్డు వేయించుకోవడమే తరువాయి. కాల్స్ ఫ్రీ, అంతర్జాలం ఫ్రీ అని తెలిసేటప్పటికి అందరూ ఎగబడి తమ తమ మొబైల్ ఫోన్లలో వేయించుకున్నారు. తన తోటి డ్రైవర్లందరూ వేయించుకున్నా, తను మాత్రం అంత మొదట్లో ఆసక్తి కనబరచలేదు. కానీ, డ్యూటీల మధ్యలో అందరి కబుర్లూ వాటి గురించే. అందులోనూ ఇప్పుడు ఇంటర్నెట్ వలన తమ తమ మొబైల్ ఫోన్లలో చూడగలిగే అశ్లీల ఫోటోలు, విడియోలు, సినిమాలు వీటి గురించే ఎక్కువగా కబుర్లు సాగేవి. తరువాత 
యు- ట్యూబులో వచ్చే విడియోల గురించి. రాజకీయాలకు సంబంధించిన చర్చలు, మతపరమైన చర్చలు. అవి ఎంతవరకూ నిజమో ఎవరికీ పట్టేది కాదు. అందులో వచ్చే సమాచారమంతా నిజమేనని నమ్మేవారు. వాటి మీద చర్చలు, వాగ్యుద్ధాలు, రోషాలు,ఆవేశాలు అన్నీ కిరణ్ ను అబ్బుర పరచసాగాయి. పైగా తాగుడు, జూదం మాదిరి అదొక వ్యసనం కాదు ఒళ్ళు పాడు కాదు అనే సమర్థింపులు కూడా వినిపించేవి.

కానీ, ఎన్నాళ్ళని తన చుట్టూ ఊరించే విషయాలను తను చూడకుండా ఉండగలడు ? అదీ ప్రాయంలో ఉన్నకుర్రవాడాయె ! మిగతా డ్రైవర్లంతా గేలి చేయడం మొదలెట్టారు. “ ఒరే వీడో సత్తెకాలం మనిషిరా ! చేతికంది వస్తున్న స్వర్గాన్ని కూడా కాదంటున్నాడు. ఎలాంటి వీడియోలు ఉంటాయి తెలుసా మావా ! అవేం ఫారిన్ గుంటలు తెల్సా ! బట్టలిప్పుకుని మీద మీద పడతారనుకున్నావ్ ? నువ్వు చూడాల్సిందే “ అని చుట్టూ చేరి వర్ణించేవారు. 
మరికొందరైతే, “ మాకైతే న్యూస్ పేపరే అక్కర్లేదు గురువా ! అన్ని వార్తలూ ఇందులో వస్తాయి. యు ట్యూబ్ లో అయితే అందరి లీడర్ల బండారమంతా బయట పెట్టే విడియోలు వస్తాయి. దేశంలో ఎక్కడ ఏం అల్లర్లు జరిగినా, అన్యాయం జరిగినా ఫేస్ బుక్ లో వచ్చేస్తుంది. వాట్సప్ లో నీ ఫ్రెండ్స్ తో చాట్ చేసుకోవచ్చు, విడియోలు, ఫోటోలు పంపుకోవచ్చు. నీకు ఇష్టమైన సినిమాలు డౌన్ లోడ్ చేసుకుని, నీకు వీలైనప్పుడు చూసుకోవచ్చు. మాంచి ఇంగ్లీషు సినిమాలు దొరుకుతాయి. ఏమైనా విషయం ఉంటే షేర్ చేసుకోవచ్చు. అంతెందుకు. మన డ్రైవర్లకు చాలా మట్టుకు ఉపయోగపడే జిపిఎస్ ఉంటుంది.  ఏ ఊరికైనా వెళ్ళాలనుకుంటే దార్లో ఎవ్వరినీ అడగక్కర్లేదు. అందులో నువ్వు వెళ్ళాల్సిన దగ్గర దారి కనిపిస్తూ పోతుంది. అలా వెళ్ళిపోవడమే. “ అనిచెప్పుకొచ్చారు.

ఇన్ని బోధనలు అయ్యాక, ఒక శుభ ముహూర్తాన ఇరవై వేలు పెట్టి ఒక మొబైల్ కొన్నాడు కిరణ్. వెంటనే వెళ్ళి దానికి ఉచిత సిమ్ కార్డు వేయించాడు. తన స్నేహితులతో అది ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాడు. మెల్లగా ఉచ్చు బిగుసుకో సాగింది. అశ్లీల సైటులను నోరు వెళ్ళబెట్టుకుని చూడసాగాడు. అదే ప్రపంచంగా మార సాగింది. రాత్రికి ఇంటికి చేరుకున్నాక అమ్మా, నాన్నలతో మాట్లాడడమే తగ్గిపోయింది. వాళ్ళు నిద్రకు ఉపక్రమించగానే తన మొబైల్ లో తనకు కావలసిన విడియోలు, సినిమాలు చూసుకుంటూ రాత్రి చాలా సేపటివరకు మేల్కొనడం జరిగింది. దాని ప్రభావం డ్రైవింగ్ పైన పడసాగింది. చిరాకు ఎక్కువైంది. కొద్దిగా సమయం దొరికినా, మొబైల్ కి శరణు పోవడం కొనసాగింది. డ్యూటీ అంటూ లేకపోతే ఎంచక్కా చూస్తూ గడిపియ్యొచ్చు కదా అనే సోమారితనం ప్రారంభమయ్యింది. కానీ పొట్టగడవాలి కదా ! దాని తాలూకు చిరాకంతా కస్టమర్ల పైన చూపడం  మొదలయింది. టిపిన్ కిగానీ, భోజనానికి గానీ వాళ్ళు వెళ్ళి వచ్చి ’ పద బాబూ ! వెళ్దాం’ అంటున్నప్పుడు, తను ఏమైనా తనకు నచ్చిన విడియో చూస్తుంటే చిరాకుగా మొహం పెట్టేవాడు. ’మళ్ళీ వీళ్ళు దిగే దాకా తను ఆ మంచి విడియో చూడలేడు కదా’ అనిపించేది. దాంతో ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీళ్ళని వదిలించుకోవాలి అనిపించేది. ఎవరైనా’ కొద్దిగా అటు నుండి వెళ్దాం, కొద్దిగా పనుంది ’ అంటే నిర్మొహమాటంగా లేదని చెప్పేసేవాడు. మాట్లాడుకున్న టైముకంటే ఎక్కువ ఉండననేవాడు. ట్రావెల్ వాళ్ళు తనకు ట్రిప్ లు ఇవ్వడం తగ్గించేశారు. క్రమేణా ఆదాయం తగ్గసాగింది. దాంతో ఇంకా చిరాకు ఎక్కువయ్యింది. తన పేదరికమే దీనికంతటికీ కారణమనిపించసాగింది. అమ్మానాన్నల పైన విసుక్కోవడం, అప్పుడప్పుడు తిట్టడం కూడా అయినాయి. ఏదైనా ఇంటికి కొనాలని తల్లో, తండ్రో చెప్తే, “ ఎక్కడనుండి తేను ? డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా ” అని అరిచేంత వరకు వచ్చింది.
అలాంటి సందర్భంలోనే ఈ రోజు జరిగిన సంఘటన జరిగింది. మామూలుగానే ఈ రోజు కూడా తనకు అనంతగిరికి వెళ్ళే ట్రిప్ తగిలింది. నలుగురే మనుషులు. కొత్తగా పెళ్ళైనట్టుంది, ఇద్దరు కొత్త దంపతులు, ఆ అబ్బాయి అమ్మానాన్నానూ. పెద్దాయన తన పక్కన ముందు సీట్లో కూర్చున్నాడు.   ఓ రెండున్నర గంటల ప్రయాణం.  ట్రాఫిక్ పెద్దగా లేకపోయినా అడపాదడపా వచ్చే పోయే బళ్ళతో రోడ్డు రద్దీగానే ఉంది. తను జాగ్రత్తగానే నడుపుతున్నాడు. కానీ ఏదో అన్యమనస్కం తనకి.  క్రితం రాత్రి విడియోలు చూసి పడుకునేటప్పటికి ఒంటి గంట. సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. మళ్ళీ ఎనిమిందిటికల్లా వీళ్ళ కోసం రావాల్సి వచ్చింది. తగిన విశ్రాంతి లేక చిరాకు గా ఉంది. వెనక సీట్లో ఉన్నవాళ్ళు గోలగా మాట్లాడుతూ ఉంటే ’ అబ్బా’ అనిపించసాగింది. మొహం ముటముటలాడ సాగింది. ఎలాగోలాగా అనంతగిరి చేరారు. వాళ్ళంతా కొండమీది గుడికి వెళ్తే తను మామూలుగానే నెట్ ఆన్ చేసుకుని తనకు నచ్చిన విడియో చూడసాగాడు. పైకెక్కి దేవుడికి దణ్ణం పెట్టుకుందామన్న ఆలోచన కూడా రాలేదు. అర్జెంటుగా విడియోలు చూసేయాలి అనిపించింది.  ఒక గంట తర్వాత వాళ్ళు తిరిగి రాగానే, తిరుగు ప్రయాణం మొదలెట్టారు. అంతవరకూ బాగానే ఉంది.
మధ్యలో తనకు స్నేహితుడి నుండి ఫోన్ వచ్చింది. “ ఒరే మావా ! ఎక్కడున్నావ్ “ అంటూ. “  డ్యూటీలో ఉన్నాన్రా. అనంతగిరి నుండి వస్తున్నా. ఇంకో రెండు గంటల్లో సిటీలోకొచ్చేస్తా. ఏంటి సంగతి ? “ అన్నాడు. అటునుండి వాడు ’ ఒరే మావా ! మంచి విడియో ఒకటి క్రొత్తగా అప్ లోడ్ అయిందిరా ! నా సామిరంగా ! ఎంత బాగుందనుకున్నావ్ ! నువ్వు చూడాలంతే ! నేను చూసేశాను.తొందరగా వచ్చెయ్. ఇద్దరం కలిసి మళ్ళీ చూద్దాం. “ అన్నాడు. అంతే. తన మనశ్శాంతి పాడై పోయింది.  ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీళ్ళని డ్రాప్ చేసేసి, స్నేహితుడి దగ్గరికి వెళ్ళి చూడాలి అని మనసు లాగసాగింది.  ప్రతి మైలూ దూరం అనిపించసాగింది. చిరాకు,నిస్పృహ. తను కూడా ఏ ఆఫీసులోనో పని చేస్తుండి ఉంటే ఎంత బాగుండేది. తన ఖర్మ,  ఇలా రోడ్లమ్మట తిరగాల్సొస్తోంది. ఛ, దీనమ్మ జీవితం! ఇలా సాగాయి అతని ఆలోచనలు. చేతులు యాంత్రికంగా స్టీరింగ్ పైన కదులుతున్నా, మనసు మాత్రం ఎటో వెళ్ళిపోయింది. అంతలోనే అకస్మాత్తుగా ముందు వెళ్తున్న కారు దేనికో ఆగింది. అన్యమనస్కంగా బండి తోలుతున్న కిరణ్, చివరి నిమిషంలో గుర్తించి, తన కారును ప్రక్కకి తిప్పాడు. ముందే స్టేట్ హైవే. చిన్నది. కారు రోడ్డు దిగి, ప్రక్కన గతుకుల్లోకి వెళ్ళింది. బండిలోని వారంతా కుదుపులకు లోనయ్యారు. మరుక్షణంలో బండి తన నియంత్రణ తప్పుతుందని భయం వేసింది కిరణ్ కి. అలాగే ముందుకు వెళ్తే అక్కడున్న కరెంట్ స్తంభానికి గుద్దుకోవాలి కారు. అంతలోనే మెలకువ తెచ్చుకుని, బ్రేక్ వేశాడు. సడన్ బ్రేక్ పడడం వలన అందరూ ముందుకు తూలి, ముందు సీట్లకు కొట్టుకున్నారు. పెద్దాయన తల అద్దానికి తగిలింది.
“ ఏంటి ! ఏం డ్రైవరువయ్యా నువ్వు ! చూసుకుని నడపక్కర్లేదా ! ఎంతలో ప్రమాదం తప్పింది ? ముందే కొత్తగా పెళ్ళైన జంట. ఏవండీ మీకెలా ఉంది ? దెబ్బ బాగా తగిలిందా ?                 “ అంటూ పెద్దావిడ అరవసాగింది. కొడుకు కూడా “ తలకాయ ఎక్కడ పెట్టుకుని తోలుతున్నావ్ ? కార్లో పెద్దవాళ్ళిద్దరు ఉన్నారు అని కూడా లేదా ? వాళ్ళకేమైనా అయితే ఎలా ? మీ ప్రొప్రైటర్ కి కంప్లంట్ చేస్తా పద “ అంటూ ఎగిరాడు.
తనకు కూడా చాలా నామోషి అనిపించింది. సిగ్గుగా కూడా. ఇలా ఎప్పుడూ ప్యాసెంజర్లతో మాటలు పడలేదు. కాని తప్పు జరిగిపోయింది. అందుకే “ సారీ సర్. ముందు కారువాడు అలా సడన్ గా ఆపేసరికి ఇలా జరిగింది. ఏమనుకోకండి. అయినా ఎవ్వరికీ ఏమీ కాలేదు కదా ! “ అన్నాడు. మళ్ళీ అబ్బాయి ఏమోఅనబోయే సరికి పెద్దాయన “ ఫర్లేదు లేరా ! పొరబాట్లు అందరికీ జరుగుతూనే ఉంటాయి. నాకేం పెద్ద దెబ్బ తగల్లేదు లేదులేవే ! బాబూ ! నువ్వు ఇకనుంచైనా జాగ్రత్తగా బండి తోలు” అని చెప్పి సర్దేశాడు.
తరువాతి ప్రయాణం సజావుగానే సాగింది. జాగ్రత్తగా వాళ్ళని ఇంటిదగ్గిర దింపి, బాడుగ తీసుకుని, వాళ్ళకి ఇంకోసారి ’ సారీ ’ చెప్పి ఇంటికి బయలుదేరాడు. ఇక స్నేహితుడి వద్దకు వెళ్ళే మూడ్ లేకపోయింది.  దిగి తనకు డబ్బులిచ్చేటప్పుడు ఆ పెద్దాయన చెప్పిన మాటలే చెవిలో మార్మోగుతున్నాయి. “ బాబూ ! బండి ఎక్కినప్పటినుండి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. అదేదో అశాంతి నీ మొహంలో. ప్రతి చిన్నదానికీ చిరాకు పడుతున్నావు. తొందరగా నీ పని ముగించెయ్యాలనే ఆత్రత కనిపిస్తోంది. ఈ ఉచిత సిమ్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నాను. ఎవరికీ మనశ్శాంతి లేదు. ఏవో ఉరుకులు పరుగులు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా, ఎలాగోలాగా పని ముగించెయ్యాలనే ఆత్రత. ఎందుకంటే మీ చేతిలో ఉందే ఈ మాయాలోకం.  మిమ్మల్ని ఏ కలల నగరికో తీసుకెళ్తుంది. అంతకు ముందు సినిమాలకు వెళ్ళి రోజూ వారీ శ్రమను మరచిపోయేవారు. కాని, దానికి డబ్బులు పెట్టాల్సొచ్చేది. సినిమా హాల్ దాకా వెళ్ళాల్సొచ్చేది. ఎప్పుడో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ మాయదారి ఉచిత సిమ్ వచ్చాక, అవన్ని మీ అరచేతికి వచ్చేశాయి. పైగా అంతా ఫ్రీ, ఉచితం. వాడెవడో తన ఏసి చేంబర్ లో కూర్చుని, ఈ స్కీము తెచ్చి, అందరికీ అగ్గి పెట్టాడు. ఎక్కడికెళ్ళినా ఏ వర్కరూ పని మీద శ్రద్ధ పెట్టడం లేదు. అంగడికెళ్తే అందులో పని చేసే పనబ్బాయి తొందరగా మన వైపు రాడు. ఏ వస్తువూ చూపించడు. తొందరగా తెమల్చుకుని వెళ్ళండి, నాకు పనుంది అనే మాదిరి మొహాల్లో భావాలు. ఏం పని అంటే ఇదే విడియోలు చూడడం. ఎక్కడో అంగళ్ళలో పని చేసేవాళ్ళకి శ్రద్ధ లోపిస్తే కలిగే ప్రాణనష్టం అంటూ ఉండదు. కానీ నువ్వు కారు తోలేటప్పుడు ఇలా అశ్రద్ధ చేసావనుకో. నువ్వూ, నీతోపాటు కారులో కూర్చున్న మేము కూడా టపా కట్టాల్సివస్తుంది. లేదా ఏ అంగ వైకల్యమో, పిచ్చివాళ్ళవడమో లేదా వెన్నెముక దెబ్బ తిని అవయవాలు స్వాధీనంలో లేక జీవితాంతం మంచానికతుక్కుని బ్రతకాల్సి రావడమో జరుగుతుంది.. కాబట్టి బాబూ జాగ్రత్త ! ఇకనైనా నేను చెప్పిందాని గురించి ఆలోచించు. దీన్ని ఎంత వాడాలో అంత వాడు. విడియోలు చూడాలంటే రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు చూసుకో. అంతేకానీ, నీ డ్యూటీలో ఉన్నప్పుడు దీని వలలో పడ్డావనుకో. దీని పరిణామం భయంకరంగా ఉంటుంది. ఇక నీ ఇష్టం ! “ అని మెత్తగా చివాట్లతో కూడిన బోధన చేశాడు. అప్పటికి తలాడించి ఇంటికి వచ్చాక తనకూ నిజమే అనిపించసాగింది. 
******************

మరుసటి రోజు నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, అమ్మానాన్నలతో పాటు కాఫీ తాగాడు. క్రిందటి రోజు ఏదో కలతతో ఇంటికొచ్చి పడుకున్న కొడుకు మొహం, ఉదయాన తేటగా అగుపించే సరికి వాళ్ళకుకూడా నెమ్మది అనిపించింది.  కిరణ్ కూడా అనుకున్నాడు 
“  ఒకసారి తన జీవితాన్ని తరచి చూసుకుంటే తను ఎంత అధోగతికి దిగజారాడో అనిపిస్తుంది. అమ్మానాన్నలు తన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ? వాళ్ళా ముసలివాళ్ళయ్యారు. చేతకాదు. తన మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. వాళ్ళనే పోషించడానికి తనకు చేతకావడం లేదు. అందుకే పెళ్ళి కూడా చేసుకోలేదు తను. మరి, అలాంటప్పుడు తన చేతిలోని బ్రతుకు తెరువును కాలదన్నుకోవడం ఎంతవరకు సమంజసం? తను బాగా సంపాదించి, అప్పులు తీర్చిన రోజులను గుర్తు చేసుకున్నాడు. అమ్మానాన్నలు ఎంత సంతోషించారు అప్పుడు ! తను ప్రయోజకుడయ్యాడని సంబరపడ్డారు. అంతలోనే ఎంత మార్పు !  వాళ్ళిద్దరినీ చూసుకునే బాధ్యతంటూ తన పైన ఉంది. ఇక ఈ విడియోల అలవాటు మానాలి. ముందు ఉచితమేనని కొనుక్కున్నా, ఇప్పుడు దీనిక్కూడా నెలా నెలా కట్టాలి. అదో ఖర్చు.  అయినా తన సంపాదనకు, మనశ్శాంతికి అడ్డుగా వచ్చే అలవాటును కొనసాగించడం మంచిది కాదు. “ అని నిర్ణయించుకుని డ్యూటికి వెళ్ళడానికి లేచాడు. 
***

No comments:

Post a Comment

Pages