సౌందర్యలహరి -- 6 - అచ్చంగా తెలుగు
సౌందర్యలహరి -- 6
మంత్రాల పూర్ణచంద్రరావు 

శ్రీ గురుభ్యోనమః
శ్లో: 71.  నఖానాముద్యోతై ర్నవనళిన రాగం విహసతాం
కరాణాం తే కాన్తిం కథయ కథయామః కథముమే
కయాచిద్వా సామ్యం భజతు కలయా హస్తకమలం
యది క్రీడల్లక్ష్మీ చరణతల లాక్షరసచణమ్ ll

తా: అమ్మా! పార్వతీదేవీ  అప్పుడే వికసించిన కమలముల కాంతిని  పరిహసించు చున్న నీ హస్తముల కాంతిని ఎట్లు వర్ణింతును? చెప్పుము. కమలములు కమలాలయములు అయిన లక్ష్మీదేవి పాదముల యందలి లత్తుక రసముతో కలసి అరుణిమ కాంతిని పొందిన యెడల కొద్దిగా పోల్చవచ్చునేమో కదా !

శ్లో: 72. సమం దేవి స్కన్దద్విపవదనపీతం స్తనయుగం
తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖమ్
యదాలోక్యాశజ్కాకులిత హృదయో హాసజనకః
స్వకుమ్భౌ హేరమ్బః పరిమృశతి హస్తేన ఝటితి ll

తా: అమ్మా! పాలు కారుచున్న నీ వక్షముల జంటను చూసి గణపతి తన శిరస్సు కుంభములు ఇచ్చటకు వచ్చేనేమో అని తలచి తొండముతో తన తలను తాకి చూసుకుంటున్నాడు కదా.ఒకే సమయమున కుమారులు అయిన గణపతి, కుమారస్వాము ల చేత పానము చేయబడినవో, అట్టి స్తన  ద్వయము  మాకు మేలు కలిగించును. కదా !

శ్లో: 73. అమూ తే వక్షౌజా వమృత రసమాణిక్యకుతుపౌ
న సన్దేహాస్పన్దో నగపతిపతాకే మనసి నః
పిబన్తౌ తౌ యస్మా దవిదితవధూసజ్గరసికౌ
కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌll

తా: అమ్మా!  పర్వత రాజు అయిన హిమవంతునుకి పేరు తెచ్చిన ఓ తల్లీ, నీ కుచములు అమృత రసముతో నిండి,మాణిక్యములతో నిర్మింపబడిన కుప్పెలు అనుటకు మాకు ఎటువంటి సందేహమునూ లేదు.ఎందుకు అనగా ఆ కుచముల పాలు త్రాగిన గణపతి,కుమారస్వాములు ఇప్పటికినీ బాలురు గానే ఉన్నారు. కదా !

శ్లో: 74. వహత్యమ్బ స్తమ్బేరమదనుజకుమ్భ ప్రకృతి భి
సమారబ్దాం ముక్తామణిభిరమలాం హారలతికామ్
కుచాభోగో బిమ్బాధరరుచిభి రస్తశ్శబలితాం
ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివతేll

తా: అమ్మా! నీ మెడలో ధరించిన హారము ముత్యములచే కూర్చబడినదియూ, దోష రహితమై నిర్మలమైనదియూ, దొండపండు వంటి పెదవి యొక్క కాంతులచే చిత్ర వర్ణముగా చేయబడి ఈశ్వరుని పరాక్రమము తో కూడిన కీర్తి ని వహించుచున్నట్లుగా కనబడు చున్నది.

శ్లో: 75. తవస్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః
పయఃపారావారః పరివహతి సారస్వతమివ
దయావత్యా దత్తం ద్రవిడశిశురాస్వాద్య తవ య
త్కవీనాం ఫ్రౌఢానా మజని కమనీయః కవయితాll

తా: అమ్మా! పర్వత నందినీ నీ చనుబాలను హృదయమునుండి ప్రవహించుచున్న వాజ్మయముతో నిండిన పాలసముద్రము వలె నేను తలచు చున్నాను.ఎందువలన అనగా వాత్సల్యముతో నీవు ఇచ్చిన స్తన్యము త్రాగి ఈ ద్రవిడ బాలుడు ( శ్రీ శంకర భగవత్పాదులు )కవులలో మనోహరుడు అయిన కవి కాజాలడు. కదా !

శ్లో:76. హరక్రోధజ్వాలావళిభి రవళీఢేన వపుషా
గభీరే తే నాభీసరసి కృతసజ్గో మనసిజః
సముత్తస్థౌ తస్మాదచలతనయే ధూమలతికా
జనస్తాం జానీతే తవ జనని రోమావళిరితిll

తా: అమ్మా! పర్వతరాజ కుమారీ ! మన్మధుడు పరమ శివుని కోపాగ్ని కీలలతో దహింప బడిన శరీరముతో నీ యొక్క లోతయిన  నాభి మడువున దూకి తనను తాను కాపాడుకొనెను. కాలుచున్న వాని శరీరము చల్లారుట చేత వెడలిన పొగ తీగ బయల్పడగా , దానిని నీ యొక్క నూగారు ప్రాంతముగా కనబడుచున్నది. కదా!

శ్లో: 77. యదేతత్కాళిన్దీతనుతరతరజ్గౌ కృతి శివే
కృశే మధ్యే కిఞ్చత్తవ జ్జనని యద్భాతి సుధియాం
విమర్దాదన్యోన్యం కుచకలశయో రన్తరగతం
తనూభూతం వ్యోమ ప్రవశిదివ నాభిం కుహరిణీమ్ll

తా: అమ్మా! భవానీ! నీ యొక్క నడుము నందు ముందుగా కనపడుచున్నది సన్నదియు అగు యమునా నది యొక్క సన్నని కెరటము యొక్క రూపము గలదిగా  నల్లని అయిన చిన్న వస్తువును  నీ కుచకుంభములు ఒకదానికి ఒకటి ఒరిపిడి వలన వాటి మధ్యన ఉన్న ఆకాశము చిన్నదయి క్రింద నాభి వరకు జారినదిగా కనబడుచున్నది . కదా !

శ్లో: 78. స్థిరో గజ్గావర్తః స్తనముకుళరోమావళిలతా
కలవాలం కుణ్డం కుసుమశరతేజో హుతభుజః
రతేర్లీలాగారం కిమపి తవ నాభి ర్గిరిసుతే
బిలద్వారం సిధ్ధే ర్గిరిశనయనానాం విజయతే ll

తా: అమ్మా! పార్వతీ దేవీ! నీ యొక్క నాభిస్థానము చలనము లేని గంగానది యొక్క సుడిగుండము,కుచములు అనెడి పూవుల మొగ్గలతో నిండిన నూగారు అనెడు తీగెకు పాదునూ,మన్మధుని తేజస్సు అనెడి అగ్నికి హోమకుండము, రతీదేవి విహరించు స్థలము, ఈశ్వరుని నేత్రముల తపస్సిద్ధికి గుహాముఖము,వర్ణించుటకు వీలు కానిదయి ఉన్నది.కదా !

శ్లో: 79. నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్షమజుషో
నమన్మూర్తేర్నారీ తిలక శనకైస్ర్తుట్యత ఇవ
చిరం తే మధ్యస్య తృటితతటినీతీర తరుణా
సమావస్ధాస్ధేమ్నో భవతు కుశలం శైలతనయే ll

తా: అమ్మా! నారీ తిలకమయిన ఓ పార్వతీ దేవీ ! స్వభావ సిద్ధముగా సన్నగా యున్నదియు,కుచముల బరువులచే కొద్దిగా వంగియున్నదియు,మెల్లగా తెగుచున్నట్లున్నదియు, ఒడ్డు విరిగిన నది పైన ఉన్న వృక్షము వలెననూ,నిలకడగా ఉన్న నీ నడుమునకు క్షేమము అగు గాక.

శ్లో: 80. కుచౌ సద్యస్స్విద్య త్తటఘటితకూర్పాసభిదురౌ
 కషన్తౌ దోర్మూలేకనక కలశాభౌ కలయతా
తవ త్రాతుం భజ్గాదలమితి వలగ్నం తనుభువా
త్రిధా నద్దం దేవి త్రివళిలవలీవల్లిభిరవ ll

తా: అమ్మా! ఎప్పటికప్పుడు చెమటలు పట్టుచున్న పార్శ్వములు అంటుకొని పిగుల్చుటకు సిద్ధముగా ఉన్నవినూ,బాహు మూలములను ఒరుసుచున్నవియునూ  సువర్ణ కుంభ కాంతి కలిగినట్టివినూ అయిన కుచములను నిర్మించుచున్న మన్మధుడు వీని బరువు వలన నడుమునకు భంగము కలుగకుండా మూడు ఏలకీ లతలచే మూడు  ముడతలు గా చుట్టబడినదిగా యున్నది .కదా!

శ్లో: 81. గురుత్వం విస్తారం క్షితిథరపతిః పార్వతి నిజాత్
న్నితమ్బాదాచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిదధే
అతస్తే విస్తీర్ణో గురు రయ మశేషాం వసుమతీం
నితమ్బప్రాగ్భార స్స్థగయతి లఘుత్వం నయతి చ.ll

తా: అమ్మా! పార్వతీ దేవీ కొండలకు రాజు అయిన నీ తండ్రి హిమవంతుడు తన కొండ చరియల నుండి కొంత విస్తీర్ణము తీసి నీ వివాహ సమయమున భరణముగా ఉంచెను. అందువలన నీ పిరుదులు అతిశయముతో  భూమిని కప్పుచున్నవి.అందువలన భూమి చిన్నతనము పొందుచున్నది.దేవికి భూమి ఆసనమయి ఉన్నది కదా!

శ్లో: 82. కరీన్ద్రాణాం శుణ్డాన్ కనక కదలీకాణ్డపటలీ
ముఖాభ్యామూరుభ్యా ముభయమపి నిర్జిత్య భవతీ
సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే
విధిజ్ఞే జానుభ్యాం విభుధకరికుమ్భద్వయమసిll

తా: అమ్మా! శాస్త్రములు అన్నియు తెలిసిన ఓ హిమవంతుని తనయా ! నీవు దిగ్గజములయిన ఏనుగుల తొండములు, బంగారు అరటి బోదెల సముదాయమును , నీ రెండు తొడల చేతను జయించి,భర్త యగు పరమ శివునికి మోకాళ్ళ మీద నమస్కరించుటచే కఠినములు అయిన మోకాళ్ళతో దేవతా గజమయిన ఐరావతము కుంభముల జంటను జయించి ప్రకాశించుచున్నావు కదా !

శ్లో: 83. పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే
నిషజ్గౌ జజ్ఘే తే విషమవిశిఖో బాఢమకృత
యదగ్రే దృశ్యన్తే దశశరఫలాః పాదయుగళీ
నఖాగ్రచ్ఛద్మాన స్సురమకుటశాణై కనిశితాఃll

తా: అమ్మా! గిరి పుత్రికా ! అయిదు బాణములు కల మన్మధుడు రుద్రుని జయించుటకు తన బాణములు సరిపోవని తలచి నీ పిక్కలను అంబుల పొదిగా చేసుకొని, కాలి వ్రేళ్ళను బాణములుగా చేసుకొని,గోళ్ళను బాణముల చివరనున్న ఉక్కు ముక్కలుగా చేసుకొనెను.నీకు నమస్కరించు దేవతల కిరీటముల ఒరిపిడికి గోళ్ళ చివరి భాగములు అరిగి పోయి పదును పెట్టినవిగా ఉన్నవి కదా !

శ్లో: 84. శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా
మమాప్యేతౌ మాతశ్శిరసి దయయా ధేహి చరణౌ
యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటినీ
యయోర్లాక్షాలక్ష్మీరరుణ హరిచూడామణిరుచిఃll

తా: అమ్మా! వేదములయిన నీ శిరస్సునందు ఉపనిషత్తులు సిగలో పూవులుగా ధరింపబడినవో, శివుని జటాజూటము నందలి గంగా జలముతో పాద ప్రక్షాళణకొరకు ఉపయోగించునవియు,విష్ణువు యొక్క కౌస్తుభ మణి కాంతులే లత్తుకగా గల నీ పాదములను నా శిరస్సునందు దయతో ఉంచుము.

శ్లో: 85. నమోవాకం బ్రూమో నయనరమణీయాయ పదయో
స్తవాస్మ్యె ద్వన్ధ్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే
అసూయత్యత్యన్తం యదభిహననాయ స్పృహయతే
పశూనామీశానః ప్రమదవన కజ్కేళితరవే.ll

తా: అమ్మా! నీ పాదముల చేత తాడనమును కోరుచున్న ఉద్యానవనమందు ఉన్న అశోక వృక్షములను చూచి పశుపతి అయిన ఈశ్వరుడు అసూయను చెందుచున్నాడో, కనులకు ఇంపయిన తడి లత్తుకతో కూడిన నీ పాదముల జంటకు ప్రణామములు.


No comments:

Post a Comment

Pages