- అచ్చంగా తెలుగు
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల-9 వ భాగం 
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)

(తన మనుమరాలి పోషణకు కావలసిన ధనం కోసం కుమారుడి సాహిత్యాన్ని అమ్మాలనుకున్న మార్చ్ అన్న మిలిటరీ వానికి సాయం చేయటానికి న్యాయవాది కూతురైన నాన్సీ ఒప్పుకొని తన స్నేహితురాళ్ళతో ప్లెజెంట్ హెడ్జెస్ కి వెళ్ళి ఆ భవంతి మొత్తం గాలిస్తుంది. ఆమెకు మాయమైన ఫిప్ సాహిత్యం కనబడదు గానీ తక్షణ సాయంగా అటకమీద ఒక పాత బల్ల, మంచి చిత్రాలు గీసి ఉన్న అరడజను అట్టపెట్టెలు కనిపిస్తాయి. వాటిని పురాతన వస్తువుల దుకాణంలో అమ్మగా కొంత సొమ్ము వస్తుంది. అదేసమయంలో మార్చ్ స్నేహితురాలు యింట్లో ఉన్న మిలిటరీ వాని మనుమరాలు తట్టురోగంతో యింటికి వచ్చేస్తుంది. దానివల్ల ఆ పాపకు సంరక్షకురాలిగా ఎఫీ అన్న అమ్మాయిని తెచ్చి పెడుతుంది నాన్సీ. ఎఫీ భయస్తురాలు. ఒకరోజు ముందురోజు అర్ధరాత్రి ఒక ఆగంతకుడు ఆ ప్రాంగణంలో తచ్చాడాడని ఎఫీ చెబుతుంది. 'దొంగిలించటానికి ఆ పాత భవనంలో ఏమున్నాయని ' ఎఫీని సంతృప్తిపరచినా, అనుమానంతో ఆ ప్రాంగణంలో అన్వేషించిన నాన్సీకి అడుగుజాడలు కనిపించి బిత్తరపోయింది. తరువాత అటకమీద అన్వేషించిన ఆమెకు పాతభోషాణం పెట్టెలో అమ్మకానికి పనికొచ్చే డజను పాతచిత్రాలు కనిపించాయి. వాటిని మార్చ్ అనుమతితో ఫేబర్ దుకాణంలో అమ్మి, భయపడుతున్న ఎఫీకి తోడుకోసం ఆ రాత్రి ప్లెజెంట్ హెడ్జెస్ కి తిరిగి వస్తుంది. ఆ రాత్రి అటకమీద బట్టలబీరువాలో నాన్సీకి అస్తిపంజరం కనిపిస్తుంది. . మరునాడు ఉదయం తన యింటికి వచ్చిన ఆమెకు తండ్రి మరొక కొత్త కేసు గురించి చెబుతాడు. ఆ కేసులో ముందుకు వెళ్ళాలంటే ముందుగా బుషీట్రాట్ అన్న వ్యక్తి డైట్ కంపెనీలో పని చేస్తున్నట్లు నిర్ధారించాలి. తండ్రి చెప్పినది విన్న నాన్సీ రైల్వే స్టేషన్లో డయానెను కలిసి తన మాటల్తో బో్ల్తా కొట్టించి, ఆమెతో డైట్ కంపెనీకి వెడుతుంది. డయానె తండ్రి దగ్గరకు వెళ్ళిన సమయంలో, ఆ కంపెనీ కార్యదర్శితో ఫాక్టరీలోపల చూడటానికి నాన్సీ వెడుతుంది. అక్కడ ఆమెకు ఒకచోట " ప్రవేశం నిషిద్ధం" అన్న బోర్డు కనిపిస్తుంది. ఇంతలో యజమాని తనను పిలుస్తున్న సంకేతం రాగానే కార్యదర్శి నాన్సీని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతుంది. వెంటనే ఆమె నిషిద్ధప్రాంతానికి చేరి చిన్న నాటకమాడి ఆ ప్రయోగశాలలోకి ప్రవేశిస్తుంది. అక్కడ బుషీట్రాట్ ను చూసి, ఆ విషయాన్ని తండ్రికి తెలిపి, తిరిగి మార్చ్ కేసువైపు దృష్టిని మళ్ళిస్తుంది. రేడియోలో వచ్చిన గాలిపాట స్వరపరిచినది తన కుమారుడేనని మార్చ్ ఆవేశపడతాడు. వీళ్ళ యీ సంభాషణ జరుగుతుండగా పై అంతస్తునుంచి రక్తం గడ్డకట్టించే స్థాయిలో అరుపు వినిపిస్తుంది. పక్కబట్టలకోసం పాత బీరువాలో వెతుకుతున్న ఎఫీని బ్లాక్ విడో సాలీడు మరిచిందని గమనించి డాక్టరు వద్దకెళ్ళి చికిత్స చేయిస్తుంది. హన్నా ప్లెజెంట్ హెడ్జెస్ కి వచ్చి బ్లాక్ విడోని కనుక్కొని చంపేస్తుంది. జబ్బుపడ్డ ఎఫీ కోలుకొనేవరకు నాన్సీ మార్చ్ భవంతిలోనే ఉండిపోతుంది. ఆ రోజే గాలిపాట ముద్రణాధికారికి బెన్ బాంక్స్ చిరునామా కోరుతూ ఉత్తరం వ్రాస్తుంది. భోజనాల సమయంలోమార్చ్ తన కుటుంబవిషయాలను నాన్సీకి చెప్పసాగాడు. తరువాత ఏం జరిగిందంటే. . . . . )
@@@@@@@@@@@@
వారిద్దరూ కలిసి భోజనం చేస్తూండగా, అతను తన కుటుంబ విషయాలు చెప్పసాగాడు.
"నా కొడుకు ఫిప్ కి ఈ సంగీతపరిజ్ఞానం స్వతహాగా వచ్చింది. మా అమ్మ పాటలను వ్రాయటంలో పరిపూర్ణమైన ఆనందాన్ని పొందేది. మా కుటుంబం కోసమే వాటికి బాణీలు కట్టేది. ఆ బాణీలు ఎప్పుడూ చేతివ్రాతగా పుస్తకాలలోనే ఉండిపోయాయి. మా అబ్బాయి వాటిలోని కొన్ని మాధుర్యాలను తీసుకొని తాను ఉపయోగించుకొన్నాడు. " గాలిపాట " అన్నది ఎప్పుడో మా అమ్మ వ్రాసిన కొన్నిగీతాలను సంకలనం చేసి అల్లినది."
ఆ చిన్న సమాచారానికే నాన్సీలో ఆత్రుత, ఆనందం ముప్పిరిగొన్నాయి. కోర్టుకి వెళ్ళటానికి యిది మంచి సాక్ష్యం కావచ్చు.
"మీ అమ్మగారి పాటలేమయ్యాయి?" వెంటనే అడిగింది.
"చెప్పలేను. కొన్ని పాటలు ఎక్కడో అటకమీదే ఉండిఉండొచ్చు. అవి ఫిప్ దగ్గర లేవని మాత్రం చెప్పగలను. ఆ పాత మధురాలను వాడు చాలాసార్లు కూనిరాగాలుగా విని మనసుకు పట్టించుకొన్నాడు."
తన పరిశోధన తీవ్రం చేయటానికి నాన్సీకి ఈ వివరాలు చాలు. గిన్నెలు కడిగేసిన వెంటనే ఆమె ఫ్లాష్ లైటులో కొత్త బాటరీ వేసి అటక మీదకు వెళ్ళింది. అక్కడ ఉన్న పెట్టెలన్నీ కెలకటం మొదలెట్టింది. ఒక పెట్టెనిండా ఆసక్తిని గొలిపే వార్తాపత్రికలు, ముఖ్యంగా శతాబ్దానికి పూర్వానివి కనిపించాయి.
"నేను చేయాల్సిన పని కన్నా ఎక్కువగా చదవాల్సివస్తోంది" తిట్టుకొంటూనే తనలో నవ్వుకొంది. "వీటిని చదవటం ఆపి నా అన్వేషణను కొనసాగించాలి" అంటూ వార్తాపత్రికలను పక్కన పెట్టింది. 
ఆత్రంగా పెట్టెలో ఉన్న యితర కాగితాలను కెలుకుతూ తన చేతిని పెట్టె అడుగుకు పోనిచ్చింది. ఆమెకు గుండ్రంగా చుట్టి ఉన్న దళసరి కాగితం కనిపించింది. అది ఒక రిబ్బనుతో కట్టివేసి ఉంది.
"ఇంతకాలం నేను వెతికే వస్తువు యిదే కావచ్చు" ఆమె మనసు ఆనందంతో పొంగిపోయింది.
చుట్టిన పేపరును విప్పి చూసిన ఆమె దానిలో ఒక పాట, దానికి కట్టిన బాణీ వ్రాసి ఉండటం గమనించింది. ఆమె మొదటి వరుసలో ఉన్న స్వరాలతో కూనిరాగం తీయబోయింది. కానీ అది అంత పేరున్న బాణీ కాదు. ఆమె దగ్గరలో ఉన్న మరొక పెట్టెలో ఆత్రంగా వెతకసాగింది. ఆమె చెయ్యి పెట్టె అడుగుభాగానికి చేరుకోగానే సూదిగా ఉన్న వస్తువేదో వేలిలో దిగబడినట్లు అనిపించింది. తాను కూడా విషం బారిన పడిందేమోనన్న భయంతో గుండె జారిపోయింది. జాగ్రత్తగా దానిలోని కాగితాలను ప్రక్కకు తప్పించి, బ్లాక్ విడో సాలీడు కోసం చూసింది. అక్కడ తన చేతిని గాయపరచినదేమిటో చూసి నవ్వుకొంది. పాతకాలంలో మగవాళ్ళ బూట్లకు పెట్టుకొనే బకెల్ లేదా కొక్కెం అది. అలాంటివి ఆ పెట్టెలో అనేకం కనిపించాయి.
"ఎంత విలువైనవి" అంటూ వాటిని గుప్పిట్లోకి తీసుకొని పైకెత్తింది. వెండితో తయారైన ఆ ఆభరణాలపై ఆ మాత్రం విలువైన రాళ్ళు పొదిగి ఉన్నాయి. వాటిలో ఒకటి సూదిలా మొనతేలి ఉంది. అదే తనకి గుచ్చుకొంది. తను కనుగొన్న వాటిని చూసి ఆమె సంతోషించింది. ఈ రాళ్ళతో పొదిగిన వెండి కొక్కాలన్నింటిని అమ్మితే పెద్దాయనకి బోలెడు డబ్బులొస్తాయి. పెట్టెలోనున్న వాటన్నింటిని ఒక కాగితంలో మూటగట్టి తన జేబులో పెట్టుకొంది. అదే సమయంలో ఆమె నేలపై ఉంచిన ఫ్లాష్ లైట్ దూరానికి దొర్లుకొంటూ వెళ్ళి ఆరిపోయింది. ఆమె ముందుకు వంగి దాన్ని తీయబోతుండగా ఆ చేతిపై మెత్తటి వస్తువేదో పడింది. వెంటనే ఏ మాత్రం సంగీత పరిజ్ఞానం లేని వ్యక్తి వీణను వాయించినట్లు వింతైన అపస్వరాలు వినిపించాయి. చీకటి దట్టంగా ఉన్న అటకపై నాన్సీ కదలకుండా పడుకొని ఉంది. ఆమెకు ఊపిరి తీసుకోవటమే కష్టమనిపిస్తోంది. భయంతో వెన్నులో వణుకు పుట్టింది. భీకరంగా వినిపించిన సంగీతం ఒక్కసారిగా ఆగిపోయింది, తనకు దగ్గరలో ఎవరో రహస్యంగా పొంచి పొంచి నడుస్తున్న అడుగుల చప్పుడు వినిపిస్తోంది. దానితోపాటు వినిపించీ వినిపించనట్లు దేనిమీదో మెల్లిగా తడుతున్న శబ్దాలు వినిపించాయి.
"ఇక్కడ వీణ గాని, పియానో గానీ లేవుకదా!" నాన్సీ ఏకాగ్రతకు ప్రయత్నిస్తూ తనలో అనుకొంది. "ఇది బహుశా జనాలను అటక మీదకు రాకుండా చేసే కుట్ర కావచ్చు."
ఉన్నట్లుండి శబ్దాలు ఆగిపోయాయి. నాన్సీ మళ్ళీ ఫ్లాష్ లైట్ కోసం వెతికింది. ఈసారి కళ్ళకు కనిపించినా, అది ఆరిపోయి ఉండటంతో ఆమెకు కోపం వచ్చింది.
"షాపువాడు పనికిరాని బాటరీ అమ్మినట్లున్నాడు" అనుకొంటూ ముఖం చిట్లించింది.
అక్కడనుంచి ఆమె దూరంగా ఉన్న మెట్లను క్షేమంగా చేరుకోవాలంటే, అటకపై చెల్లాచెదురుగా పడి ఉన్న పెట్టెలన్నింటినీ దాటుకొని వెళ్ళాలి.
"ఇప్పుడేం చేయాలి?" తనలోనే ప్రశ్నించుకొందామె.
అకస్మాత్తుగా ఎవరో తన పేరును గొణుగుతున్నట్లు వినిపించింది "నా. . .న్సీ. . . .నా. . . .న్సీ" అంటూ.
క్రమేపీ ఆ పిలుపు మరింత దగ్గరగా, బిగ్గరగా వినిపించింది.
"ఆ గొంతు మార్చ్ దే!" ఆమె ధృవీకరించుకొంది. "ధన్యవాదాలు దేవుడా! ఇప్పుడు యిక్కడకు వెలుతురు రాబోతోంది."
లేచి నిలబడ్డ ఆమె మనసులోకి మరొక ఆలోచన రాగానే భయంతో బిగిసిపోయింది. తను గాక ఈ అటకమీద ఎవరైనా ఉన్నట్లైతే, మెట్లెక్కి వచ్చిన వాళ్ళకు తప్పకుండా హాని చేస్తారు. వెంటనే ఆమె ధైర్యాన్ని కూడగట్టుకొని గట్టిగా అరిచింది.
"నేను అటకమీదే ఉన్నాను. మీరు యిక్కడకు రాకండి. దీపం పట్టుకొని మెట్ల దగ్గరే నిలబడండి."
అలా అరుస్తున్న తన నోటిని ఎవరో వెంటనే మూసేస్తారని ఆమె భావించింది కానీ అలా జరగలేదు. దానితో మరింత ధైర్యం కూడగట్టుకొని తన ఫ్లాష్ లైట్ పనిచేయటం లేదని మరొకసారి అరిచింది.
కొన్ని సెకండ్ల తరువాత మెట్ల దగ్గర దీపం వెలుగుతూ కనిపించింది. మార్చ్ మెట్ల దగ్గర నిలబడి హుషారుగా మాట్లాడుతున్నాడు.
నాన్సీ అటకమీద దారి చూసుకొని క్షేమంగా బయటకొచ్చింది. వెంటనే యిద్దరూ రెండవ అంతస్తుకి చేరుకొన్నారు. మార్చ్ ఆమె చేతిని పట్టుకొన్నాడు.
"నీ వాలకం తెల్లగా పాలిపోయినట్లుంది. పైన ఏదో జరిగింది. ఏమిటది?" అడిగాడతను.
"క్రింద ఎవరైనా పియానోని ముట్టుకొన్నారా?" అడిగిందామె.
"పియానో? లేదే! ఎందుకు?"
"ఎవరో కొన్ని స్వరాలను వాయించినట్లు వినిపించింది." ఆమె బదులిచ్చింది.
"నీకు తెలిసిన విషయాలేవీ నాకు చెప్పటంలేదు" పెద్దాయన ఆమెతో అన్నాడు. "నేను అన్ని సంగతులను వినాలి. నా దగ్గర ఏ విషయాన్నీ దాచవద్దు."
"అటకమీద ఎవరో లేక ఏదో ఉన్నట్లు భయపడ్డాను" అంటూ నాన్సీ ఒప్పుకొంది. "నా ఫ్లాష్ లైట్ ఆరిపోగానే అనేకరకాల వికృత శబ్దాలు వినిపించాయి."
మార్చ్ లో ఆవేశం తన్నుకొచ్చింది. "నేను అతన్ని వదిలిపెట్టను" అంటూ అటక మెట్లు ఎక్కబోయాడు. నాన్సీ అతన్ని ఆపటానికి ప్రయత్నించింది.
"వాణ్ణి యిదివరకే ఎదుర్కొన్నాను" అంటూ చేతిలోని కొవ్వొత్తిని పైకెత్తి పట్టుకొన్నాడు. "ఈ అటకమీది రహస్యాన్ని కనుక్కోవటం యిప్పటికే ఆలశ్యమైంది."
నాన్సీ అతన్ని అనుసరించింది. అక్కడ ఎవరూ లేకపోవటం, చొరబాటుదారు అటకమీదకు రావటానికి రహస్యమార్గమేదీ కనిపించకపోవటం ఆమెను నిరాశకు గురిచేసింది. ఇంతకుముందు ఆమె పడుకొన్న ప్రాంతానికి దగ్గరలో నేలమీద పెద్ద ఎలుగుబంటి బొమ్మ పడి ఉంది.
'అది పైనున్న దూలం మీదనుంచి నా చేతిపై పడి ఉంటుంది ' అని యువగూఢచారి తీర్మానించుకొంది. గడచిన పదిహేను నిమిషాలలో జరిగిన వింత సంఘటనల్లో యిది ఒకటని ఆమె పెద్దాయనకు చెప్పింది.
"ఈ ఎలుగుబంటి బొమ్మే నాపై పడిందనుకుంటా" నాన్సీ చెప్పింది.
"ఈ బొమ్మ ఫిప్ కి చెందినది" వివరించాడతను. "కొన్నేళ్ళుగా దీన్ని నేను చూడలేదు."
ఆమె అతన్ని యిబ్బంది పెట్టినందుకు క్షమాపణను కోరింది. ఇంతకుముందు తాను అటకపై వదిలేసిన ఫ్లాష్ లైట్ ను వంగి తీసుకొంది. తనకు అనుభవమైన యితర విషయాలను ఆమె అతనికి చెప్పలేదు. కానీ తాను విన్న సంగీతస్వరాలుగాని, పొంచి పొంచి నడచిన అడుగులచప్పుడు గాని, దేనిమీదో దరువేసినట్లున్న శబ్దాలు గానీ తన భ్రమ కాదని ఆమెకు తెలుసు. వాటిని ఎవరు ఎందుకు చేశారో నిగూఢ రహస్యంగానే ఉండిపోయింది.
"మీకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి" పెద్దాయన ఆలోచనలను మళ్ళించటానికి ఆమె అంది. "నేను పాతవార్తాపత్రికల గుట్ట క్రింద ఒక పాతపాటను కనుగొన్నాను."
పెద్దాయన ఆమె యిచ్చిన దళసరి కాగితాన్ని ఆత్రంగా పరిశీలించాడు. "ఓ! గుర్తొచ్చింది. ఇది ' కొత్త-పాత ' అనే గీతం." అతను తలను పంకిస్తూ ఆ బాణీలో కొంతభాగాన్ని కూనిరాగం తీశాడు.
"మా అమ్మ కట్టిన బాణీ యిది. దీన్ని ఫిప్ తరువాత మెరుగుపరిచాడు. ఇది వాడు కట్టిన బాణీలలో అత్యుత్తమమైనది."
"ఇది మన పరిశోధనలో మంచి పురోగతి" కింద అంతస్తుకు వెళ్ళాక చెప్పిందామె. "బెన్ బాంక్స్ ఈ రాగంలో పాటను ప్రకటిస్తే, మీరు తప్పకుండా అతనిపై కేసు పెట్టొచ్చు."
"నీ ఉత్తరానికి త్వరలోనే బదులు వస్తుందనుకొంటున్నా" అంటూ భారంగా నిట్టూర్చాడు. "నాలాంటి ముసలోడికి ఈ ఉత్కంఠను తట్టుకోవటం చాలా కష్టం."
నాన్సీ పెద్దాయన్ని హుషారెక్కిస్తూ కొన్ని మాటలు మాట్లాడింది. ఆ తరువాత తన జేబులోంచి ఖరీదైన పాత బూట్ల బకెల్స్ మూటను తీసింది. వాటిని చూసి ఎంతో ఆనందించాడతను.
కొంతసేపయ్యాక అతనికి శుభరాత్రి చెప్పి తనకు కేటాయించిన పడకగదిలోకి వెళ్ళిపోయింది. ఆ వారాంతమంతా యింటిపనుల్లో ములిగిపోయిన ఆమెకు అటక మీదకు వెళ్ళే అవకాశమే దొరకలేదు. కానీ శనివారం కొద్దిగా వీలు చేసుకొని రివర్ హైట్స్ లోని ఫేబర్ దుకాణానికి వెళ్ళింది. ఆమె చూపించిన బకెల్స్ ను అతను పెద్దమొత్తంతో కొన్నాడు. ఆ సొమ్మును చూసిన పెద్దాయన ఎంతో పొంగిపోయాడు.
"అద్భుతం నాన్సీ! నీవు నా పట్ల చూపే శ్రద్ధకు ఖరీదు కట్టలేను" అంటూ తన ఆనందాన్ని ప్రకటించాడు. నాన్సీ అతని పొగడ్తలను వినమ్రంతో తోసిపుచ్చింది. ఇంతవరకూ తాను కూడగట్టిన డబ్బు సుశాన్ రక్షణకు గాని, ఆ యింటి నిర్వహణకు గాని పూర్తిగా చాలదని ఆమెకు తెలుసు.
సోమవారంనాటికి ఎఫీ పూర్తిగా కోలుకొని యింటిపనుల్లో తన విధిని నిర్వర్తించే శక్తిని పుంజుకోవటంతో, నాన్సీ తన యింటికి వచ్చేసింది. కొన్నాళ్ళ విరామం తరువాత చూసిన తన కూతుర్ని డ్రూ ఉల్లాసంగా అభినందించాడు.
"నా కూతుర్ని చూడగలిగినందుకు ఆనందిస్తున్నాను" అంటూ ఆప్యాయంగా అన్నాడు. " ఈ శుభసందర్భంలో ఈ రోజు పూర్తిగా సెలవు తీసుకొని పండుగ చేసుకోవాలనుకొంటున్నాను."

(తరువాత కధ వచ్చే సంచికలో)

No comments:

Post a Comment

Pages