అటక మీది మర్మం - 8 - అచ్చంగా తెలుగు
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల-8 వ భాగం 

(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)


(తన మనుమరాలి పోషణకు కావలసిన ధనం కోసం కుమారుడి సాహిత్యాన్ని అమ్మాలనుకున్న మార్చ్ అన్న మిలిటరీ వానికి సాయం చేయటానికి న్యాయవాది కూతురైన నాన్సీ ఒప్పుకొని తన స్నేహితురాళ్ళతో ప్లెజెంట్ హెడ్జెస్ కి వెళ్ళి ఆ భవంతి మొత్తం గాలిస్తుంది. కానీ ఆమెకు మాయమైన ఫిప్ సాహిత్యం కనబడదు గానీ తక్షణ సాయంగా అటకమీద ఒక పాత బల్ల, మంచి చిత్రాలు గీసి ఉన్న అరడజను అట్టపెట్టెలు కనిపిస్తాయి. వాటిని పురాతన వస్తువుల దుకాణంలో అమ్మగా కొంత సొమ్ము వస్తుంది. అదేసమయంలో మార్చ్ స్నేహితురాలు యింట్లో ఉన్న మిలిటరీ వాని మనుమరాలు తట్టురోగంతో యింటికి వచ్చేస్తుంది. దానివల్ల ఆ పాపకు సంరక్షకురాలిగా ఎఫీ అన్న అమ్మాయిని తెచ్చి పెడుతుంది నాన్సీ. ఎఫీ భయస్తురాలు. ఒకరోజు యింటి వద్ద ఉన్న నాన్సీకి ఎఫీ ఫోను చేసి ఉన్నపాటున బయల్దేరి రమ్మని, రాత్రి జరిగిన విషయం చెప్పాలని చెబుతుంది. ఆ కబురు విన్న నాన్సీ అఘమేఘాలమీద అక్కడకు చేరుకొన్నాక, ముందురోజు అర్ధరాత్రి ఒక ఆగంతకుడు ఆ ప్రాంగణంలో తచ్చాడాడని ఎఫీ చెబుతుంది. 'దొంగిలించటానికి ఆ పాత భవనంలో ఏమున్నాయని ' ఎఫీని సంతృప్తిపరచినా, అనుమానంతో ఆ ప్రాంగణంలో అన్వేషించిన నాన్సీకి అడుగుజాడలు కనిపించి బిత్తరపోయింది. తరువాత అటకమీద అన్వేషించిన ఆమెకు పాతభోషాణం పెట్టెలో అమ్మకానికి పనికొచ్చే డజను పాతచిత్రాలు కనిపించాయి. వాటిని మార్చ్ అనుమతితో ఫేబర్ దుకాణంలో అమ్మి, భయపడుతున్న ఎఫీకి తోడుకోసం ఆ రాత్రి ప్లెజెంట్ హెడ్జెస్ కి తిరిగి వస్తుంది. ఆ రాత్రి అటకమీద బట్టలబీరువాలో నాన్సీకి అస్తిపంజరం కనిపిస్తుంది. అది హలోవీన్ ఉత్సవానికి ఫిప్ బంధువొకడు తెచ్చాడని పెద్దాయన చెబుతాడు. దాన్ని ఫిప్ అందులో దాచాడంటే తన సాహిత్యం యితరుల కళ్ళబడకుండా దానికి కాపలాగా దాచాడా? అని నాన్సీ అనుమానిస్తుంది. మరునాడు ఉదయం తన యింటికి వచ్చిన ఆమెకు తండ్రి మరొక కొత్త కేసు గురించి చెబుతాడు. బుకర్ కంపెనీలో తయారయే ఆడపిల్లల పట్టుకండువాలను పోలిన కండువాలను డైట్ కంపెనీ కూడా తయారుచేస్తోందని, కొన్నాళ్ళు బుకర్ కంపెనీలో పనిచేసిన బుషీట్రాట్ అన్న వ్యక్తి డైట్ కంపెనీలో జేరాడని, అతనే తమ పట్టుకండువాలను పోలిన పట్టుకండువాలను అక్కడ తయారు చేసి తన వ్యాపారాన్ని దెబ్బ తీస్తున్నారని, దీనిలో డైట్ కంపెనీ యజమాని డైట్ హస్తం ఉందని, అందుకే ఆ కంపెనీపై కేసు వేయాలని బుకర్ భావిస్తున్నట్లు డ్రూ తన కూతురికి చెబుతాడు. ఆ కేసులో ముందుకు వెళ్ళాలంటే ముందుగా బుషీట్రాట్ డైట్ కంపెనీలో పని చేస్తున్నట్లు నిర్ధారించాలి. దానికోసం నాన్సీ డైట్ కూతురు డయానె ను స్నేహం చేసుకొని, ఆమె ద్వారా వారి కంపెనీలో అడుగుపెట్టాల్సి ఉంటుంది. తండ్రి చెప్పినది విన్న నాన్సీ రైల్వే స్టేషన్లో డయానెను కలిసి తన మాటల్తో బో్ల్తా కొట్టించి, ఆమెతో డైట్ కంపెనీకి వెడుతుంది. డయానె తండ్రి దగ్గరకు వెళ్ళిన సమయంలో ఆ కంపెనీ కార్యదర్శితో ఫాక్టరీలోపల చూడటానికి నాన్సీ వెడుతుంది. అక్కడ ఆమెకు ఒకచోట " ప్రవేశం నిషిద్ధం" అన్న బోర్డు కనిపిస్తుంది. ఇంతలో యజమాని తనను పిలుస్తున్న సంకేతం రాగానే కార్యదర్శి నాన్సీని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతుంది. వెంటనే ఆమె నిషిద్ధప్రాంతానికి చేరి చిన్న నాటకమాడి ఆ ప్రయోగశాలలోకి ప్రవేశిస్తుంది. అక్కడ బుషీట్రాట్ ను చూసిన విషయాన్ని తండ్రికి తెలిపి, తిరిగి మార్చ్ కేసువైపు దృష్టిని మళ్ళిస్తుంది. రేడియోలో వచ్చిన గాలిపాట స్వరపరిచినది తన కుమారుడేనని మార్చ్ ఆవేశపడతాడు. వీళ్ళ యీ సంభాషణ జరుగుతుండగా పై అంతస్తునుంచి రక్తం గడ్డకట్టించే స్థాయిలో అరుపు వినిపిస్తుంది. తరువాత ఏం జరిగిందంటే. . . . . )
@@@@@@@@@@@@

పై అంతస్తునుంచి రక్తం గడ్డకట్టించే స్థాయిలో అరుపు వినిపించింది. వెంటనే పాడే ప్రయత్నం విరమించుకొని నాన్సీ ఉరుకులు పరుగులమీద పై అంతస్తుకి చేరుకొంది. సుశాన్ దుప్పటి కప్పుకొని పడుకొంది.
"రక్షించావ్! దేవుడి దయవల్ల పాప బాగానే ఉంది" అనుకొంటూ వేగంగా అటకవైపు వెళ్ళింది.
"పైనెవరు?" అంటూ పిలిచింది.
" నేను. . .ఎఫీని."
ఒక్క అంగకు రెండేసి మెట్ల చొప్పున ఎక్కుతూ నాన్సీ అటకమీదకు చేరుకొంది. అక్కడ పనిపిల్ల ఒంటరిగా, మెలికలు తిరుగుతూ గెంతుతోంది. గాలిలో ఎడమచేతిని విదిలిస్తూ దయనీయంగా ఏడుస్తోంది.
"నన్ను కరిచింది. నన్ను కరిచింది" అంటూ గోల పెడుతోంది.
"ఏమి కరిచింది?" నాన్సీ అడిగింది.
"అస్తిపంజరం. ఏదో చెయ్యి త్వరగా!"
"ఎఫీ! సరిగా చెప్పు! నిన్నేం కరిచింది?"
"అస్తిపంజరమని చెబుతున్నా కదా!" అంటూ తెరిచి ఉన్న బట్టలబీరువా లోంచి ముందుకు విలాసంగా వంగి ఉన్న అస్తిపంజరాన్ని చూపించింది.
"వాడే నా దగ్గరకొచ్చి వేలు కొరికాడు. ఓ! అది ప్రాణాలతోనే ఉంది."
యువగూఢచారి ఎఫీ వేలుని పరీక్షించి చూసింది. కానీ అటక మీది మసక వెలుతురులో ఆమెకు గాయమేమి కనిపించలేదు. ఎఫీకి మొదటినుంచి అస్తిపంజరంపై ఒక అపనమ్మకం ఉంది. ఆ అపనమ్మకంతోనే అది తనను కరిచిందని ఎఫీ భ్రమపడి ఉండొచ్చునని నాన్సీ అనుకొంది.
ఇంతలో అటక మెట్ల దగ్గర అడుగులచప్పుడై నాన్సీ లోపలినుంచి బయటకొచ్చింది. వయోభారంతో యిబ్బంది పడుతూ మెట్లెక్కుతున్న పెద్దాయన కనిపించాడు.
"మార్చ్! పైకి రావటానికి యిబ్బందిపడొద్దు. ఇక్కడంతా బాగానే ఉంది" అని నాన్సీ చెప్పింది.
"నేను తప్ప. ." అంటూ ఎఫీ ఏడుస్తూ అంది.
"క్రిందకెడదాం" అంటూ ఆమెను నాన్సీ పిలిచింది. "అక్కడ వెలుతురులో నీ వేలు మరొకసారి చూస్తాను. ఇంతకీ బట్టల బీరువాలో దేనికోసం వెతికావు?"
"పక్కలు మార్చటానికి ఏమైనా దొరుకుతాయేమోనని చూశాను. ఇంట్లో మంచి దుప్పట్లు లేవు. ఓ! ఇప్పుడు నా చెయ్యంతా లాగేస్తోంది."
వాళ్ళు అటక దిగి రెండవ అంతస్తుకి చేరుకొన్నాక, నాన్సీ ఆమె చేతిని పరీక్షగా చూసి త్రుళ్ళిపడింది. ఎఫీ బాధ ఎక్కువైపోతోందని బిగ్గరగా ఏడవసాగింది.
"అమ్మో! దాన్ని చూడు. చచ్చిపోతున్నాను" అంటూ అరవసాగింది.
ఆమె అరుపులకు సుశాన్ వాళ్ళున్న హాలులోకి వచ్చింది. తాతామనవరాళ్ళు ఉబ్బిపోయిన ఎఫీ ముంజేతిని, చూపుడువేలిపై చిన్న గాయాన్ని చూశారు.
"ఎవరు గాయపరిచారు?" పాప వణికిపోతూ అడిగింది.
నాన్సీ పాప ప్రశ్నకు బదులీయలేదు. ఆమెను లోనికెళ్ళి నిద్రపొమ్మని ప్రశాంతస్వరంతో చెప్పింది. తరువాత మార్చ్ దగ్గర పెద్ద చేతిరుమాలు తీసుకొని ఎఫీ భుజం దగ్గర బిగించి కట్టింది.
"ఈమెను వెంటనే డాక్టరు దగ్గరకు తీసుకెడితే మంచిది. ఇంట్లో ఆ గాయాన్ని నయం చేసే వస్తువేమీ లేదు" నాన్సీ అంది. తరువాత మార్చ్ దగ్గరకెళ్ళి " ఏదో విషపూరితమైన సాలీడు కరిచిందేమోనని భయపడుతున్నా" అని అతని చెవిలో గొణిగింది.
మరుక్షణం తన కారులో ఎఫీని వేగంగా డాక్టర్ ఐవర్స్ ఆసుపత్రికి నాన్సీ తీసుకెళ్ళింది. అదృష్టవశాత్తూ అతను ఆసుపత్రిలోనే ఉన్నాడు. అతను నాన్సీ అనుమానాన్ని ఖాయపరుస్తూ, బహుశా అది బ్లాక్ విడో సాలీడు కావచ్చునని అన్నాడు.
"ఈ ప్రాంతంలో అరుదుగా కనిపించే సాలీడు రకమది" అంటూ విరుగుడు మందును సిరంజిలో నింపి ఎఫీకి ఇంజెక్ట్ చేశాడు. అప్పటికే ఎఫీ జబ్బుపడ్డదానిలా కనిపిస్తోంది, నటిస్తోంది. ఆమె క్రుంగిపోకుండా ఉండటానికి డాక్టరు ఆమె భుజంపై సున్నితంగా తట్టి ధైర్యం చెప్పాడు. "తరంతులా అని మరో విషపుజాతి సాలీడు ఉంది. అది కూడా ఈ ప్రాంతాలకు చెందినది కాదు."
డాక్టరు మాటలకు ఎఫీ మరింత క్రుంగిపోయింది. తన యవ్వన జీవితం అంతం కాబోతోందంటూ మూలగసాగింది.
"నాన్సెన్స్! అదృష్టవశాత్తూ రక్తం బయటకు రాకుండా ధమనిని నొక్కిపెడుతూ నాన్సీ గట్టిగా కట్టు కట్టడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిపోయింది. అయినా, రెండురోజులు బాధను ఓర్చుకోవలసి ఉంటుంది" ఐవర్స్ చెప్పాడు.
"ఈ బాధతో నా పని ఎలా చేసుకోగలను?" ఎఫీ అడిగింది.
"దాని గురించి బెంగ పెట్టుకోకు. నీకు నేను సాయం చేస్తాను" నాన్సీ వెంటనే ఆమెకు భరోసా యిచ్చింది.
ఎఫీ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను నాన్సీకి చెప్పి, ఎఫీకి ఆందోళన పడవద్దని ధైర్యం చేప్పాడు. బ్లాక్ విడో సాలీడు కోసం ఆ పాత భవనాన్ని కూలంకషంగా శోధించమని కూడా డాక్టర్ సలహా యిచ్చాడు.
"మా యింటికెళ్ళి హన్నాని మనతో తీసుకెడదాం. కొన్ని గంటలు ఆమె మనకు సాయంగా ఉంటుంది" ఇద్దరూ కారులో తిరిగొస్తుండగా ఎఫీతో నాన్సీ అంది. అడగ్గానే గ్రూ వారికి సాయం చేయటానికి ఆనందంగా ఒప్పుకొంది. వారు ప్లెజెంట్ హెడ్జెస్ చేరుకోగానే నాన్సీతో కలిసి హన్నా అటకపైకి వెళ్ళింది. తనతోపాటు పురుగులమందును, చీపురును కూడా ఆమె తీసుకెళ్ళింది. అటకమీద ఉన్న డజన్లకొద్దీ సాలెగూళ్ళను దులిపేసి, కనిపించిన ప్రతి సాలెపురుగును పట్టుకొన్నారు.
" మనకు మామూలు సాలెపురుగులు తప్ప మరేమీ కనిపించలేదు. ఈ బ్లాక్ విడో పాక్కుంటూ ఎక్కడికి పోయుంటుంది?" అంటూ నాన్సీ నిట్టూర్చింది.
"అది కనపడకపోతే ఈ రాత్రి నిన్ను యిక్కడ ఉండనీయను" హన్నా దృఢంగా అంది.
యువగూఢచారి 'హన్నా భయాన్ని తొలగించాలంటే ఏదో చేయాలి. లేకుంటే ఆమె తనని యింటికి వచ్చేయమంటుంది' అని ఆలోచించింది.
"ఎఫీ కేకలకు అది ఎక్కడికో పారిపోయి ఉంటుంది."
నాన్సీ ఆ మాటలను పరిహాసంగా అన్నా, తన మనసులో ఏదో తెలియని భయం. ఎవరో చొరబాటుదారు తమను హెచ్చరించటానికి ఈ విషపు పురుగును యీ యింట్లోకి వదిలిపెట్టి ఉంటాడు. ఫిప్ మార్చ్ సాహిత్యాన్ని దొంగిలించినవాడే ఈ పని చేసి ఉండే అవకాశం లేకపోలేదు. అతను బెన్ బాంక్స్ కాదు గదా!
"గాలిపాట ముద్రణాధికారికి బెన్ బాంక్స్ చిరునామా వెంటనే యిమ్మని తప్పక వ్రాయాలి" అని ఆ యువతి తీర్మానించుకొంది. " ఈ గందరగోళంలో అతన్ని పూర్తిగా మరిచిపోయాను."
"ఓ! " అకస్మాత్తుగా హన్నా అరిచింది. బట్టలబీరువా క్రిందనుంచి బయటకు పాకుంటూ వస్తున్న సాలీడుపై చీపురుతో హన్నా ఛెళ్ళుమని చరిచింది. వెంటనే నాన్సీ దానిపై స్ప్రే గన్నుని ప్రయోగించింది.
"ఇదే బ్లాక్ విడో!" నాన్సీ ఆనందం పట్టలేక అరిచింది. "ఇంక నువ్వు దేని గురించి బెంగ పెట్టుకోనవసరంలేదు."
"ఇక్కడ మరిన్ని యిలాంటి విషపు పురుగులు లేనంతవరకూ" హన్నా అంది. అయితే అక్కడ ఉండిపోవటమే నాన్సీకి క్షేమం కావచ్చునని ఆమె అంగీకరించింది. కానీ అప్రమత్తంగా ఉండమని హెచ్చరించింది.
హన్నా భోజనం తయారుచేసేలోగా నాన్సీ గాలిపాట ముద్రణాధికారికి హడావిడిగా చిన్న ఉత్తరం వ్రాసింది. తరువాత ఎఫీ దగ్గరకెళ్ళి ఆమెకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసింది. ఎఫీకి జ్వరం తగిలింది. అంతేగాక చెయ్యి విపరీతంగా దురద పెడుతోందని ఆమె చెప్పింది. ఎఫీ గాఢనిద్రలోకి జారుకొన్నాక, శబ్దం కాకుండా మునివేళ్ళపై సుశాన్ యోగక్షేమాలు విచారించటానికి పాప గదిలోకి వెళ్ళింది. నాన్సీ రాకను పసిగట్టిన పాప తలగడ మీదనుంచి తలెత్తి చూసింది.
"ఎఫీని విషపు సాలీడు కుట్టిందటగా! ఆమె అంతా చెప్పింది."
పనిపిల్ల పాపకు సాలీడు కధను చెప్పినందుకు నాన్సీలో కోపం పెల్లుబికింది. కానీ దాన్ని తనలోనే అణచుకొని ఆమె చిరునవ్వు నవ్వింది.
"అది నిజమే! కానీ మన యింట్లో ఉన్నవన్నీ మంచి సాలీళ్ళే! ఎలా వచ్చిందో కానీ ఆ విషపు సాలీడు యిప్పుడే చచ్చిపోయింది."
జరిగిన దురదృష్ట సంఘటన నుంచి సుశాన్ దృష్టిని మళ్ళించటానికి, ఆ యువతి దూకే సాలీళ్ళు, ఎగిరే రకాల విచిత్ర చేష్టలను వివరించసాగింది.
"కొన్ని సర్కసులో మనుషులు చేసినట్లు గాలిలో వ్రేలాడుతూ పిల్లిమొగ్గలేస్తాయి. కొన్ని తాము అల్లిన దారాన్ని పట్టుకొని ఊగుతూ గాలి వీచే దిశలో వేలాడుతూ ముందుకు సాగిపోతాయి. కొన్ని సమయాల్లో సముద్రపు గట్టునుంచి కడలిమధ్యలో ఉన్న ఓడలోకి గాలివాటానికి వేలాడుతూ చేరుకొంటాయి."
"ఓ! అలాంటి సాలీళ్ళను చూస్తూంటే భలే సరదా అనిపిస్తుంది" పాప నవ్వుతూ అంది. ఆమెలో భయం పూర్తిగా తొలగిపోయింది.
హన్నాగ్రూ పాపకోసం పళ్ళెంలో ఆహారం తెచ్చింది. పెద్దాయన్ని తింటున్న సుశాన్ కి తోడు ఉంచి, హన్నాను తమ యింటి దగ్గర దించటానికి నాన్సీ వెళ్ళింది. వాళ్ళు నాన్సీ యింటికి చేరుకొనే సమయానికి ఆమె స్నేహితురాళ్ళు వెళ్ళిపోబోతున్నారు.
"ఏ లోకంలో ఉన్ నావు తల్లీ నువ్వు?" నాన్సీని చూసిన జార్జ్ ఆక్షేపించే ధోరణిలో అడిగింది. "నీకేదో జరిగిందని అనుకొన్నాం. మా యింటికి భోజనానికొచ్చి, నువ్వు చేపట్టిన కొత్త విషయం గురించి చెప్పవా?"
ఆమె ఆహ్వానానికి నాన్సీ ధన్యవాదాలు చెప్పింది. కానీ ఆమె ఆహ్వానాన్ని ఎందుకు మన్నించలేకపోతోందో వివరించింది. బ్లాక్ విడో కధ వినగానే బెస్ భయంతో కేకపెట్టింది.
"ఎందుకైనా మంచిది. నువ్వు ఆ ప్రాంతానికి దూరంగా ఉండు తల్లీ!" అంటూ సలహా కూడా యిచ్చింది.
"చింతించకు. నా జాగ్రత్తలో నేనుంటాను" అని నాన్సీ బదులిచ్చింది. తరువాత వాళ్ళిద్దరినీ తన కారులో ఎక్కించుకొని జార్జ్ యింటి దగ్గర వాళ్ళను విడిచిపెట్టింది.
అక్కడనుంచి బయల్దేరి, బజార్లో ఫ్లాష్ లైట్ బాటరీ కొనుక్కొని ప్లెజెంట్ హెడ్జెస్ కి చేరుకొంది. సుశాన్ ప్రక్కను సర్ది ఆమెను మంచంపై పడుకోబెట్టింది. ఆ పాప ఆపేక్షతో యువగూఢచారి మెడను చుట్టేసింది.
"నువ్వెప్పుడూ నాతోనే ఉంటావ్! నువ్వు నా ప్రాణస్నేహితురాలివి" అంటున్న పాప బుగ్గపై నాన్సీ ఆప్యాయంగా ముద్దాడింది.
"కొంతకాలం నేనిక్కడే ఉంటాను. మనం కలిసి గడిపే ప్రతిరోజూ ఒక ఏడాదిలాగ భావిద్దాం."
ఆమె మాటలకు పాప సరేనన్నట్లు తలాడించింది. నాన్సీతో ఆడుకొంటూనే పాప మెల్లిగా నిద్రలోకి జారుకొంది. తరువాత ఆమె మొదటి అంతస్తులో రేడియో వింటున్న మార్చ్ దగ్గరకు వెళ్ళింది. వారిద్దరూ కలిసి భోజనం చేస్తూండగా, అతను తన కుటుంబ విషయాలు చెప్పసాగాడు.
(తరువాయి భాగం వచ్చే నెలలో)

No comments:

Post a Comment

Pages