జర్నీ ఆఫ్ ఏ టీచర్ -7 - అచ్చంగా తెలుగు
జర్నీ ఆఫ్ ఏ టీచర్ -7
                                                                                  చెన్నూరి సుదర్శన్ 

(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.)
సూర్య ప్రకాష్ చిరునవ్వు నవ్వుతూ స్టాఫ్ నుద్దేశించి..

            “చూసారా.. శ్రీకొండ  కాలేజీలో విజయకుమార్ మాస్టారు భార్య విధి శాపగ్రస్తురాలినా తన విధుల్లో పేరుగాంచాడు. మునిపల్లి జూనియర్ కాలేజీలో క్రాంతికుమార్ వివాహ స్వయంకృపారాధంతో విధుల నిర్లక్ష్యం..

            ఇంకా ఆకాలేజీలో నేను గమనించింది..

విద్యార్థులు సరిగ్గా రారని లెక్చరర్లు.. లెక్చరర్లు సరిగ్గా రారని విద్యార్థులు.. నిందించుకోవడం.. తప్ప ఒరిగిందేమీ లేదు.

సరిదిద్దాల్సిన బాధ్యతల నుండి ‘నొప్పించక తానొవ్వక తప్పించుకొనువాడు ధన్యుడు సుమతీ’ అనే రీతిలో  ప్రిన్సిపల్ విద్యాసాగర్..” అంటూ సూర్యప్రకాష్ తన వ్యంగ్యాన్ని  రెండు చేతులకప్పగించిన వైనం హాల్లో స్టాఫ్‍కు నవ్వులు పూయించింది.

“విద్యాసాగర్ సామాన్యుడేమీ కాదు.. అతని కథ మరో చరిత్ర..” అంటుంటే స్టాఫ్ ఉత్సుకతతో వినసాగింది.

***

నేనొక రోజు విద్యాసాగర్ చాంబర్‍కు వెళ్ళే సరికి ఎవరో ఒకరు పల్లెటూరి ఆసామి గోడకు వారగా నేలపై  కూర్చోనున్నాడు.

“రండి సార్..కూర్చోండి” అంటూ కుర్చీ చూపించాడు విద్యాసాగర్.

 నేను కుర్చీలో కూర్చుంటూ తల తిప్పి అతన్ని చూడసాగాను ‘ఎవరా..?’ అన్నట్లుగా.

“ఆతను నా పెళ్ళాం  మొగుడు సార్. పేరు.. ఏసుపాదం.

అన్నయ్యా.. సార్‍కు దండం పెట్టు” అంటూ తల  ఎగరేసాడు విద్యాసాగర్. అతడు రెండు చేతులా దండం పెట్టాడు.

ప్రపంచంలో మరో వింతను చూస్తున్నట్లుగా.. నేను విన్నది నిజమేనా ఆన్నట్లుగా ఉంది నా చూపు. అది గమనించి విద్యాసాగర్ ఫకాలున నవ్వుతూ “మీరు విన్నది నిజమే సార్.. అందులో సందేహమేమీ లేదు” అన్నాడు.

“అయితే మీకు నామాటలకర్థం తెలియాలంటే నా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి..” అనుకుంటూ తన టేబుల్ పై అద్దం కిందున్న కాలపట్టిక చూసాడు. నాకు క్లాస్లేవీ లేనట్లు నిర్థారించుకొని తన వ్యక్తిగత విషయాలు చెప్పసాగాడు.

“మ్యాథ్స్  సార్.. నా లైఫ్ చాలా  విచిత్రం. కాని ఫెయిల్ కాలేదు.

సమస్యలెదురుకున్నాను. నాకు నచ్చిన రీతిలో జీవనగమనం సాగిస్తున్నాను. నన్ను మీరేమనుకున్నా

ఫరవాలేదు” అంటూ సిగరెట్టు వెలిగించాడు.

“నేను బాల్యం నుండి చిల్లరమల్లరగా తిరిగేవాణ్ణి. మా ఇంట్లో నేనే అందరికంటే చిన్నవాణ్ణి కావడం.. నేను పుట్టగానే మా అమ్మ కాలం చేయడం వెరసి  నన్ను అందరూ గారాబం చేసారు. నాకు ఇద్దరక్కయ్యలు, ఇద్దరన్నయ్యలు.

నా  యమ్మే పూర్తయ్యే సరికి అందరు సెటిలై ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. మా నాన్న నేను మిగిలాం.

            నాన్నకు జిల్లా కలెక్టరుగా ప్రమోషనొచ్చింది..గడియ  తీరిక ఉండేది కాదు. నేను ఏకాకినయ్యాను. ఇంట్లో బోర్ కొట్టి ఫ్రెండ్స్ తో షికార్లు కొట్టే వాణ్ణి.

             ఒక రోజు మానాన్న చీవాట్లు పెట్టాడు. నాలుగు రాళ్ళు సంపాదిస్తే తెలుస్తుంది.. గాడిదలా పెరిగావు కాని నీ కాళ్ళ మీద నీవు నిలబడే జ్ఞానం లేదన్నాడు. నాకు పౌరుషం పొడ్చుకొచ్చింది. వెంటనే  ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‍గా జాయినయ్యాను.

అక్కడ తగులుకుంది ఈయనగారి సతీమణి మేరీ. ఇనుపరజను ప్రోగైన నామదికి ఆయస్కాంతంలాంటి ఆమె సొగసు. ఆమె ఆ కాలేజీలో గార్డినర్. నేను పాఠాలు చెబుతూ ఆమె కుండీలలో పూల మొక్కలకు వయ్యారంగా నీళ్ళు పోస్తున్న దృశ్యాలు.. అలనాటి రాధ బృందావనంలో హోయలోలికిన చందాన  నా హృదయానికి హత్తుకు పోయేవి. అది వయసు ప్రభావం. ‘లవ్ ఈజ్ బ్లైండ్’ అన్నారందుకేనేమో..!

ఆమె నా పెళ్ళయిందని ఎంత మొత్తుకున్నా నేను వదల్లేదు. కొన్ని పురాణాలు రాధీకకిదివరకే వివాహమైనా శ్రీకృష్ణుడు రాధల ప్రణయగాధ విశ్వవ్యాప్తమని వల్లించడంలేదా.. అని లొంగదీసుకున్నాను.

 కోర్టులు.. డైవోర్స్.. అంతా ఫాల్స్.. ‘రూల్స్ ఫార్ ఫూల్స్’ అని నచ్చజెప్పి ప్రతీ నెల కొంత డబ్బిస్తానని ఏసుపాదంతో ఒప్పందం చేసుకున్నా.

మేరీని నాకిచ్చి చర్చిలో మా పెళ్లి జరిపించిన మహనీయుడీయన.

షరా.. మామూలే. పెళ్లి చేసుకొని గుమ్మంలో అడుగు పెట్టబోయిన మాకు చేదు అనుభవం ఎదురయ్యింది. మా నాన్న అడ్డుకున్నాడు. ఇంట్లో స్థానం లేదని అడుగు పెట్టనీయకుండా గుమ్మం బయటనుండే పారదోలాడు. అయినా నేను భయపడ లేదు. చేతిలో ఉద్యోగ మున్నదన్న ధీమా. వేరే కాపురం పెట్టాం.

గొప్పదనమేమిటంటే.. ఏసుపాదం మళ్లీ పెళ్లి చేసుకోలేదు.

ఒంటరిగా బతుకుతున్నాడు. తండ్రిలేడు.. తోడబుట్టినవారెవరూ లేరు. తల్లి ఒక్కర్తే ఈయనకు తోడు. నేను జాలితో మరికొంత ఎక్కువ మొత్తంలో  డబ్బిద్దామంటే నాకూ కుదరడం లేదు” అంటూ తల సుతారముగా చూపుడు వేలుతో  గోక్కోసాగాడు.

జేబులో నుండి కొంత డబ్బు తీసి లెక్కించి ఏసుపాదం చేతిలో పెట్టాడు. ఏసుపాదం రెండు చేతులా మాకు నమస్కరించి వెళ్లి పోయాడు.

 నాకంతా సినిమా ఫక్కీలా కనబడసాగింది. నమ్మశక్యం కాలేదు. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. నా అంతరంగాన్ని పసిగట్టిన విద్యాసాగర్ “ సార్.. రేపు  ఆదివారం మా ఇంటికి రండి. అలాగే నాదగ్గరున్న ఎక్స్ట్రా గ్యాస్కనెక్షన్  తెచ్చుకుందురు” అంటూ తన ఇంటికి ఆహ్వానించాడు. తాముంటున్న భరత్‍నగర్ కాలనీ చిరునామా ఇచ్చాడు.

“ అలాగే సార్.. థాంక్ యూ..”  అంటూ స్టాఫ్ రూంకు దారితీసాను.

అ మరునాడు విద్యాసాగర్ ఇంటికి ప్రయాణమయ్యాను. కాలింగ్ బెల్ నొక్కగానే వారి పనిమనిషి వచ్చి 

తలుపు తెరచింది.

“రండి సార్..” అంటూ సోఫా చూపించి లోనికి వెళ్ళింది. నేను టీపాయ్‍పై ఉన్న డైలీ పేపర్ తీసి హెడ్ లైన్లు చదువుతూ తిరగేస్తున్నాను.

            “సారీ సార్.. బాత్రూంలో ఉన్నాను. లేటయ్యింది” అంటూ విద్యాసాగర్ వచ్చాడు. నేను లేచి నిలబడి అభివాదం చేసాను. కూర్చోమంటూ మర్యాదపూర్వకంగా చెయ్యినూపాడు.

            “మేరీ.. గరం గరం చాయ్‍లా.. అలాగే పిల్లలను రమ్మను..” అంటూ అప్యాతనంతా తన మాటల్లో కుమ్మరించాడు.

            కొద్ది సేపటికి సర్కసు రింగులోకి ప్రవేశించినట్లు బిల, బిలా వచ్చి పిల్లలు లైను కట్టారు. నేను నిర్ఘాంత పోయాను. నల్గురమ్మాయిలు.. ఒక అబ్బాయి.

            “సార్.. అబ్బాయి కావాలనే తాపత్రయంలో అదే పనిలో ఉంటే.. నలుగు రమ్మాయిలు పుట్టుకొచ్చారు. అందరికంటే పెద్దమ్మాయి డిగ్రీ చదువుతోంది. ఇక వరుసగా ఇంటర్, స్కూల్ ఫైనల్, యైత్ క్లాస్, చివర్న.. వాడు సిక్స్త్ క్లాస్”అంటూ అందరినీ పరిచయం చేసాడు.            

            మేడంగారు ట్రేలో టీ కప్పులతో ప్రత్యక్షమైంది.

నేను కొయ్యబారిపోయాను. ఆమెవరో కాదు.. నేనుకున్న పని మనిషి. నిజమే ‘లవ్ ఈజ్ బ్లైండ్’ అనుకున్నాను. అమ్మాయిలంతా విద్యాసాగర్ పోలిక. చాలా అందంగా ఉన్నారు. అబ్బాయి మాత్రం అచ్చు మేడం గారి పోలిక. ముఖంలో ఏమాత్రమూ కళ లేదు. రంగు చామనఛాయకు రవంత ఎక్కువయినా కొందరి ముఖాల్లో చామంతిపువ్వులా తేజస్సు ఉట్టిపడ్తుంది.

            నిర్లిప్తంగా లేచి నిలబడి మేడంకు అభివాదం చేస్తూ టీ అందుకున్నాను. కాసేపు ముచ్చటించి  గ్యాస్ స్టౌవ్.. రెగ్యులేటర్ అలాట్‍మెంటు కాగితాలు తీసుకొని డబ్బులిచ్చాను.

            తిరిగి ఆటోలో వస్తుంటే విద్యాసాగర్ అన్న మాటలు నన్ను పదే, పదే ఆలోచనలో పడేసాయి. “సార్..ఈ సంసార భారంతో కాలేజీ సక్రమంగా నిర్వహించలేక పోతున్నాను. దానికి తోడు పాపారావు తెలుగు లెక్చరర్ తన వాటా తనకివ్వందే వదలడు. అతడితో పెద్ద చిక్కు. బదిలీ చేయించి తరిమేయాలని చూస్తున్నా..”

            వాటాలేంటి?.. అర్థం కాలేదు.. నాకర్థమైందల్లా ఒక్కటే.. ‘యథా రాజా.. తథా ప్రజా..’

అసలు తప్పంతా విద్యాసాగర్ వద్ద ఉంది. ఇక కాలేజీ ఎలా బాగుంటుంది?. ఈ కాలంలో కూడా కొడుకు పుట్టాలనే ఆరాటంతో గంపెడు పిల్లలను కనడం.. వారి కోసం జీతం డబ్బులు సరిపోక కాలేజీ సొమ్మును దొంగలా దోచుకు తినడం.. అడ్డు వచ్చినవారికి వాటాలు పంచడం.. నా ఆలోచనల కంటే వేగంగా వెళ్తున్న ఆటో కుదుపుతో తేరుకొని చూసా.. మా ఇంటి ముందు ఆగింది ఆటో.

            ఒక రోజు నేను సీరియస్‍గా క్లాసులో సమస్య సాధిస్తున్నాను. ఒకాయన వచ్చాడు. నాకు క్లాసు మధ్యలో ఎవరైనా డిస్ట్రబ్ చేస్తే నచ్చేది కాదు. ఎవరైనా పిల్లవాడి పేరెంట్ కాబోలు.. అనుకొని “ఎవరు కావాలి?” అంటూ అడిగాను.

            “ఎవరెందుకు సార్.. క్లాసులోకి రావాలా అని అడుగుతున్నా.. నాది ఇదే క్లాసు..” నిర్లక్ష్యంగా సమాధాన మిచ్చాడు. అతడి వాలకం చూసి ఆశ్చర్యపోయాను. చేతిలో ఒక చిన్న డైరీ లాంటి నోట్ బుక్  తప్ప మరేదీ లేదు.

“యస్..కమిన్..” అంటూ క్లాసులోనికి అనుమతించాను.   

“నీ పేరు?’’ 

“సుధాకర్”

            అనగానే నాకు అర్థమైంది. ఆ రోజు ప్రిన్సిపల్‍ను రిజిస్టర్‍తో బాదింది ఈ మహానుభావుడే..

            “సారీ సుధాకర్ ఎవరో పేరెంట్ అనుకున్నాను”

            “పేరెంట్‍నే అనుకొండి సార్” అనగానే క్లాసంతా నవ్వింది. సుధాకర్ సీరియస్‍గా క్లాసంతా కలియ జూశాడు. వెంటనే గప్‍చిపైపోయింది.

            “నవ్వడమెందుకండీ.. ఇందులో తప్పేముంది.. కూర్చో సుధాకర్.. చదువుకు వయసుతో పనిలేదు. ఈ వయసులో గూడా  చదువు మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నావంటే నాకు చాలా  ఆనందంగా ఉంది”

            “శ్రద్ధా.. పాడా.. లెక్కలు నాకేమస్తై సార్.. స్కాలర్‍షిప్ కోసం కాలేజీకి అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వస్తుంటా..”

            “మరి పరీక్షలెలా రాస్తావు?”

            “నేను రాసేదేమిన్నది సార్.. చూసి రాసుడు బాగా ప్రాక్టీసు చేస్తే చాలు..”

            “చూసి రాయడమేంటి?”

            “మీకు తెల్వదు సార్.. కాలేజీకి కొత్త గదా.. పరీక్షలిక్కడ ఫుల్ మాస్ కాపీ..  గైడ్లు పెట్టి రాస్తం.. గైడ్లల్ల దొరకకుంటే సార్లు చిట్టీలందిస్తరు”

            నేను నిర్ఘాంత పోయాను. నోట మాట రాలేదు. సుధాకర్‍తో మరిన్ని కాలేజీ విషయాలు తెలుసుకోవాలని ప్రస్తుతానికి క్లాసుగదిలో మాట్లాడడం బాగుండదని టాపిక్ మారుస్తూ సమస్య సాధనలో మునిగి పోయాను.

            ఆ రోజు సాయంత్రం ట్రైన్లో హైదరాబాదుకు బయలు దేరాను.

            వికారాబాదు జంక్షన్లో ఆలస్యమైంది. తిరిగి ట్రైన్ బయలు దేరే సరికి కాస్తా చీకటి పడింది. శీతాకాలం మూలాన ఏడు గంటలకే చలి ప్రారంభమైంది. ఇంటికి వెళ్ళే సరికి మరో గంట పడ్తుందనుకుంటున్నాను..

రైలు వేగమందుకుంది. దానికి లయబద్ధంగా మా భోగీ చివర ఒక పాట ప్రారంభమైంది. గాయకున్ని ఉత్తేజ పరుస్తూ  చప్పట్లు.. కేరింతలు. నేను నా సీట్లో నుండి లేచి ఓమారు  చేతులు నలుపుకొని ప్యాంటు జేబులో దూర్చి నాలుగడుగులు పాట వైపు వేసాను.

            “దండాలు  దండాలూ.. జనార్ధనా..

            నీకు శతకోటి దండాలన్నా.. జనార్ధనా.. || దండా||

            పల్లెల్ల బతుకులు చూసి.. జనార్ధనా..

            నువ్వు అడవి పాలైనావా.. జనార్ధనా..    || దండా||

            అలా మొదలైన పాట వేగం పుంజుకుంది. ఈలల జోరు పెరిగింది. గాయకుణ్ణి చూడాలనే ఆతృత పెరిగింది. మా విద్యార్థులేనన్న అనుమానమూ కలిగింది. మరో అడుగు ముందుకేసి తొంగి చూసాను.

గాయకుడు సుధాకర్.

            నిలబడి నృత్యం చేస్తూ పాడుతున్నాడు. అతడి ముఖంలో హావభావాలు చూసి ఆశ్చర్య పోయాను. చేతిలో

ఎర్ర రంగు కర్చీఫ్ లయబద్ధంగా ఊగుతోంది.

            నీ వదనంల వెలుగులు చూసీ.. జనార్దనా..
            సూరీడే కుంగి పోయే.. జనార్ధనా..       || దండా||
            నీ ఉరుకుడు వేగం చూసీ.. జనార్ధనా..
            చిరతపులి చిన్న బోయే.. జనార్ధనా..     || దండా||
            నీ గుండెల్లో బుసలు వింటూ..  జనార్ధనా..
            నాగుబాము  నాట్యం చేసే.. జనార్ధనా.. || దండా||

            సుధాకర్ సంకేతం మేరకు బృందం ‘అయ్యో..! అయ్యయ్యో..!!’ అంటూ గుండెలవిసేలా నినదిస్తుంటే..

            విచారంగా కాళ్ళపై కూర్చుండి పోయాడు సుధాకర్. ముఖం కన్నీటి మయమైంది. విషాదం పెరిగింది.. పాటలో వేగం తగ్గింది.. కర్చీఫ్ ముఖం పై కప్పుకున్నాడు.

            “ఎదురెదురూ  కాల్పూలంటూ.. జనార్ధనా..
            నిన్ను పిట్టోలె కాల్చిండ్లే.. జనార్ధనా..    || దండా||

            మా బతుకుల బాగు కోసం..  జనార్దనా..
            నీ పానాలే  ధారపోస్తివా.. జనార్ధనా..   || దండా||
            నిన్ను మరవము మరువమూ.. జనార్ధనా..
            నీ బాటను విడువమన్నా.. జనార్ధనా..   || దండా||

            గొల్లగూడ స్టేషనొచ్చింది. పాట పూర్తయ్యింది.. రైలు ఆగింది. సుధాకర్‍తో బాటు అతడి బృందమూ దిగిపోయింది.
            నేను వచ్చి నా సీట్లో కూర్చున్నాను. నా ఆలోచనలన్నీ సుధాకర్ చుట్టే తిరుగుతున్నాయి. 
(సశేషం)

No comments:

Post a Comment

Pages