భావ'జాలం' - అచ్చంగా తెలుగు
భావ'జాలం'
కంభంపాటి రవీంద్ర 

కార్లో ఏదో పాట వింటూంటే , మా ఫ్రెండొకడు అన్నాడు 'ఛీ ఛీ ..నువ్వు ఏఆర్ రెహ్మాన్ పాటలు వింటావా ?' 'ఏం .. నీకు నచ్చవా ?' అని అడిగేను . 
'ఇక్కడ నచ్చడం నచ్చకపోవడం కాదు విషయం .. అతను ముస్లిం .. అలాంటివాళ్ళు కంపోజ్ చేసిన పాటలు వింటే మన మతాన్ని మనమే అవమానపరిచినట్టు ' అన్నాడు 
'పోనీ .. ఎవరి పాటలు వినమంటావు ?'
'ఎవరి పాటలైనా విను .. కానీ ఇలా వేరే మతం వాళ్ళు కంపోజ్ చేసిన పాటలు వినకు '
'సరే .. నీ మాట ప్రకారమే నేను రెహ్మాన్ పాటలు వినను .. దేవిశ్రీ ప్రసాదు పాటలు వింటాను .. కానీ ఆ దేవిశ్రీప్రసాదు మ్యూజిక్ టీములో ముస్లిమ్స్ ఉండరని గ్యారంటీ ఏమిటి ?'
'నీతో వాదించడం అనవసరం .. అసలు నీలాంటి వాళ్ళ మూలంగానే దేశం చెడిపోతూంది ' అంటూ మొదలెట్టేడు 
ఇంతకు మునుపు బాగానే ఉండేవాడు కదా .. ఇప్పుడేమైంది వీడికి అని మెల్లగా ఆరా తీస్తే , బయటపడిందేమిటంటే , ఇవన్నీ వాట్సాప్ , ఫేస్బుక్ పోస్టుల ప్రభావమని !
ఈ మధ్య ,సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకొచ్చేక , ప్రతివారూ మనం ఎలా బతకాలి, ఎందుకు బతకాలి , ఎవరితో బతకాలి , ఏం కట్టుకోవాలి , ఎలా కట్టుకోవాలి , ఎప్పుడు కట్టుకోవాలి అంటూ క్లాసులు తీసేవాళ్ళు ఎక్కువయ్యేరు . నా వరకు భారతదేశాన్ని మించిన దేశం ఈ ప్రపంచం లో లేదు , భారతీయులంత గొప్ప ప్రజ ఈ భూమ్మీద లేరు . ఎందుకంటారా .. ఇన్నిరకాల జాతులు, సంస్కృతులు , మతాల సామరస్య సమ్మేళనం మన దేశం . ఈ దేశం లో లోటుపాట్లు బోలెడు ఉన్నాయి , ఈ జనాభా కి ఆమాత్రం లోటుపాట్లు ఉండడం సహజం కూడా , ఎందుకంటే చైనా లాగ ఇక్కడ మిలట్రీ పాలన లేదుగా మరి ! 
ఈ మధ్య ప్రతి ఒక్కడి చేతిలో స్మార్ట్ ఫోన్ అనే ఆయుధం , కోతికి కొబ్బరి కాయ దొరికినట్టు , ఉండడం తో ఎవడికి తోచిన విద్య ఈ సోషల్ మీడియా లో ప్రదర్శించేస్తూ , అవతలి వారిని ప్రభావితం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు . దీనిమూలంగా  అనవసర చర్చలూ , పనికిరాని ఆవేశాలూ - సోషల్ మీడియా వాడికి కావాల్సినన్ని లైకులూ , హిట్లూ , తద్వారా డబ్బులూ !
సరిగా ఆలోచించేమంటే ఈ చెత్త అంతా సృష్టించిన వాడెవడో మనకు తెలీదు , ఎవడో వాడికుండే ఎజెండా తో రాసి , మన వాట్సాప్ లో వేసేస్తాడు . మనం ఇదో ముఖ్యమైన విషయం లా ఇంకో పది మందికి పంపిస్తాము . 
ఈ మధ్య కుటుంబ సభ్యుల మధ్యన పెరుగుతున్న అంతరాలకు కారణం ,  ఫోన్లోని  చెత్త మీద పెట్టినంత శ్రద్ధ మన కుటుంబ సంబంధాల మీద పెట్టకపోవడమే !
సోషల్ మీడియా లో ఉండొద్దని చెప్పను , కానీ వీలైనంత దూరంగా ఉండండి . మానవ సంబంధాలని మించినవి కావు  ఈ ఆన్లైన్ బంధాలు ! నెట్ వర్క్ సరిగా లేదంటే బంధం యొక్క బ్యాండ్ విడ్త్ తగ్గిపోతుంది . 
ఏతావాతా చెప్పేదేమంటే , ఇలాంటి పనికి రాని చెత్తనంతా మన బుర్రకి ఎక్కించుకోనక్కరలేదు . మనకి ఏది అవసరమో తెలిసేంత విచక్షణ ఉండేలా మన తలితండ్రులు మనల్ని పెంచేరు , ఎవరో చెబితే ఇంకెవరి మీదో ఓ అభిప్రాయం ఏర్పరుచుని , అనవసర విద్వేషాలూ  , పనికిరాని కోపాలూ పెంచుకుని మనసు తద్వారా ఆరోగ్యం పాడుచేసుకోనక్కర్లేదు . 
***

No comments:

Post a Comment

Pages