పగలే చంద్రుడు - అచ్చంగా తెలుగు

పగలే చంద్రుడు

Share This
పగలే చంద్రుడు--!
  కె.బి.కృష్ణ,

తెల్లవారుఝామునే నిద్ర లేచే మూర్తి అతని భార్య కొంచం అశ్రద్ధ చేసి బద్దకం గా లేచరావేళ. " ఇదేమిటే బాబూ-- ఇంకా తెల్లవారనే లేదు, అప్పడే నిద్రలేచావేమిటి మనం ?" అనుకుంటూ మూర్తి గడియారం చూశాడు. సమయం ఆరున్నర అయింది.
" ఓరిదేముడో గంట ఆలస్యం గా లేచాం ఇవ్వాళ అనుకుంటూ పనుల్లో ములిగివున్న శ్రీమతి దగ్గరకు చేరి " ఏమిటే ఇవ్వాళ వెలుగు రాలేదు ? ఒక వేళ సూర్యుడికి మబ్బులు అడ్డు వచ్చాయా ఏమిటి ? " అనుకుంటూ డాబా ఎక్కి చూశాడు. అస్తమించే సూర్యుడు వుండే కమలాపండు రంగు లో వున్నాడు సూర్యుడు ఇదేమిటే ఇలా వున్నాడేమిటి ? ఈ పాటికి అసలు సూర్యుని వేపు చూడనేలేము కదా అనుకుంటూ చకచకా క్రిందకు దిగుతూంటే, కంగారు కంగారు గా శ్రీమతి ఎదురు వచ్చింది.
" ఏమండీ విన్నారా ఈ సంగతి ? మనకు ఇక సూర్యుని కాంతి వుండదట ! సూర్యుడి లోని వెలుగునంతా మనుషులు లాగేశారుట, ఏం చేయాలా అని తలపట్టుకుని శాస్త్రజ్ఞులు తలలు పట్టుకుంటున్నారట, మాయగోల సౌరశక్తి సౌరశక్తి అని సూర్యుణ్ణి కూడా వదిలి పెట్టకుండా ఆయనలోని కాంతి నంతా లాగేశారు. ఇక మనం చీకట్లోనే పడి చావాలి " అంటూంది శ్రీమతి. " ఏమిటే నువ్వు చెప్పేది ? " అంటున్న మూర్తి తో " నా బొంద నేను గాదు చెప్పేది, దూరదర్శన్ లో ఘోషిస్తున్నారు, రండి చూడండి.." అంది విసుగుగా
లోపల టి.వీ తెర మీద ఎఱ్ఱని పెద్ద పెద్ద అక్షరాలతో " ఇప్పడే అందిన వార్త అంటూ మీరు ఎప్పడైనా సూర్యుడు వుదయించడని అనుకున్నారా ? ఎప్పడూ అనుకుని ఉండి ఉండరు. కాని సరిగ్గా అలాగే జరిగింది ఇవ్వాళ. ప్రపంచం అంతా వేడీ, వెలుగూ మీద ఆధారపడి సౌరశక్తి అని చెప్పి సూర్యగోళం లో వున్న వేడి వెలుగునంతా ప్రజోపయోగం కోసం లాగేయడం తో సూర్యుని లో కాంతీ వేడి తగ్గిపోయిందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితి ని ఎలా అధిగమించాలో వారంతా బుర్రలు పట్టుకుని శోధిస్తున్నారు...." అంటూ దూరదర్శన్ లో రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి.
సాయంకాలం సూర్యాస్తమయానికీ, రాత్రికీ మధ్యన వుండే చీకటి వెలుగూ కాని చీకటి తో నిండిన కొంచం వెలుగు వుంది. రోడ్లమీద నడవవచ్చును కాని పనులు చేసుకోవచ్చును, కాని చాలా జాగ్రత్త గా వుండాలి. చదువుకోడానికి పనికి రాదు ఆ వెలుగు. ఇంతలో వీధి లో దూరశ్రవణ యంత్రాలు అమర్చిన రక్షకభటుల వాహనాలు తిరుగుతున్నాయి ప్రజలకు సూచనలు చెబుతూ--
నగర ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి. ఈ వేళ సూర్యుడు ఉదయించలేదు. ఎందుకు అలా జరిగిందో జాతీయ, అంతర్జాతీయ పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు శోధిస్తున్నారు. వారి పరిశోధనల ఫలితంగా రేపు సూర్యుడు ఉదయిస్తే ఉదయించవచ్చునని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ప్రజలందరూ ఇళ్ళల్లో విద్యుద్దీపాలు వేసుకుని పనులు చేసుకోండి. అవసరమైతే తప్ప బయటకు తిరగడానికి రావద్దు. బయట రోడ్ల మీద కూడా వీధి దీపాలు వెలిగే ఏర్పాటు చేయడం జరిగింది. కాని ఈ వెలుగు కాని వెలుగు లో ప్రజలందరూ చాలా జాగరూకత తో వుండాలని పోలీస్ శాఖ హెచ్చరిస్తూంది. సూర్యుడు ఉదయించక పోవడానికి కారణాలు ఏమిటి ? విదేశీ హస్తం వుందా ? అని కూడా అనుమానాలు వస్తున్నాయి. ప్రజలందరూ చాలా జాగ్రత్త గా వుండండి. కొత్త వారు కనుపిస్తే పోలీసులకు వారిని పట్టించండి--" అని చెబుతున్నారు పోలీస్ వేన్ నుండి.
వీధుల్లో వెలుగూ చీకటీ కాని ఆ చిన్న వెలుగు లోనే జనం గోల గోల గా తిరుగుతున్నారు. యువకులంతా ద్విచక్రవాహనాల మీద గట్టిగా హారన్లు కొడుతూ, పెద్దగా కేకలు పెట్టుకుంటూ ఒకో వాహనం మీదా ముగ్గురు నలుగురూ ఎక్కి తిరుగుతున్నారు. ఏది వచ్చినా పిచ్చి లేచేది మొదట యువకులకే కదా !
వెంటనే మూర్తి కి తన పిల్లలు గుర్తుకు వచ్చారు. ముందుగా చెన్నపటం లో ఉన్న తన కొడుకు తో దూరవాణి లో “ అబ్బూ ఏమిటిరా ఈ ఘోరం ? అక్కడ పరిస్థితి ఎలా వుంది ? మీ కైనా సూర్యుడు ఉదయించాడా ? " అంటే " లేదు నాన్నగారూ ప్రపంచం అంతా అలాగే వుంది " అన్నాడు. “ మీరు జాగ్రత్త, పిల్లల్ని ఎక్కడికీ వెళ్ళనీయకండి--" అన్నాడు మూర్తి.
మూర్తి శ్రీమతి దూరవాణి లో కూతురితో మాట్లాడదామనుకుంటే “ నెట్ వర్క్ కి స్వాగతం. ఖుషీ పాటలు కావాలంటే ఒకటి నొక్కండి, మజా పాటలు రావాలంటే రెండు నొక్కండి శృంగారం పాటలు కావాలంటే మూడు నొక్కండి, కామెడీ పాటలు కావాలంటే నాలుగు నొక్కండి పాత పాటలు కావాలంటే ఐదు నొక్కండి, మా ప్రియమైప వినియోగదారులారా ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మా నెట్ వర్క్ ఎప్పడు బంద్ అవుతుందో తెలియదు, అందువలన త్వరగా ఒకరినొకదు పలకరించేసుకోండి..' అని వాయించి, కూతురిని కలిపింది మా తల్లి. “ అమ్మాయ్. ఎలా వున్నారు ? ఏం కాలమే ఇది కలికాలం చూశావా ? బ్రహ్మంగారు చెప్పినట్లుగా ప్రళయం ఎంతో దూరం లో లేదే బాబూ. పిల్లలు జాగ్రత్త, నువ్వూ అల్లుడు గారూ... " అంటూ మాట్లాడుతోంటే నెట్ వర్క్ కట్ అయిపోయింది. 
మూర్తి ఇంకో నెట్వర్క్ లో తన ఫ్రెండ్ తో " అరేయ్ ఎలా వుంది మీకు ?" అంటూంటే “ ఏముందిరా-- మనం పెద్దాళ్ళమైపోయాం ఇలా హేపీ గా కాలం వెళ్ళిపోతే చాలనుకుంటున్నామా ఇదేం ప్రళయం రా బాబూ..." అంటూ అతను మాట్లాడుతోంటే ఆ నెట్ వర్క్ కూడా ఆగిపోయింది. " ఇక ఎవరితో మాట్లాడుకుందామనుకుండా దూరవాణి కూడా లేకుండా పోయింది. కాఫీ తాగుదామే, కలిపేవా? అంటూంటే, అతని శ్రీమతి కాఫీ పట్టుకొచ్చింది. ఇద్దరూ కూర్చుని కాఫీ, బిస్కట్ల తో తీసుకుంటూంటే “ ఏమిటంటారు ఈ విపరీతం ?" అని శ్రీమతి అంటుంటే—
“ ఏముందీ. జనాభా విపరీతంగా పెరిగిపోతుంటే, ప్రకృతి ప్రసాదించిన వనరులు సరిపోక, మనిషి కొత్తగా ఏం చేయాలా, వనరులు ఎలా పెంచుకోవాలా అనే ఆలోచనతో పరిశోధనలు చేసి, చేసి, భూమిలో ఖనిజాలనూ, రాళ్ళనూ, నీళనూ, బొగ్గునూ, లాగేస్తున్నారు. నదుల్లో కూడా అట్టడుగున వున్న ముడిచమురు లాగేస్తున్నారు, సముద్రం లోతుల్లో నిక్షిప్తంగా వున్న నూనెలనూ, పెట్రోల్ ముడి పదార్థాన్ని, నూనెలనూ రిగ్ లతో వెలికి తీసేస్తున్నారు. చివరకు వేగం గా వీచే గాలి ని కూడా వదలకుండా గాలి మరలతో విద్యుత్ ని ఉత్పత్తి చేస్తున్నారు. కొన్నాళ్ళు పోతే స్వచ్ఛమైన గాలి కూడా దొరకదేమో. మాయదారి మేళం. నోస్ట్రడామస్, బ్రహ్మం గారి లాంటి వారు భవిష్యవాణి చెప్పినట్లు గా ఏదో ఒక రోజున భూమి, ఆకాశం, సముద్రం ఏకమైపోయి, జీవరాశి ఉనికి వుండదేమో. త్వరలోనే ప్రళయం వచ్చేసేలావుంది--" అంటూ ఆవేశం గా మాట్లాడుతున్న మూర్తితో
" మీరు మరీ ఉద్రేకపడకండి. అసలే మీకు జీ.పి, షుగరూ, గుండెజబూ మోకాళ్లనెప్పలూ మెడ నెప్పలూ లాంటి ఎన్నో వున్నాయి. ఈ విపరీతమైన ఆలోచనలతో అవన్నీ ఏకమై మీకు ఏదైనా అయిందంటే సూర్యోదయం మాట దేముడెరుగు, మన జీవితం లో వెలుగులన్నీ ఆరిపోతాయి-- " అంటున్న శ్రీమతి తో--- " ఛ ! అపశకున పక్షి లా అలా మాట్లాడకే బాబూ. ఏదో చేస్తారు లే. సాయంత్రానికి గాని రేపు ఉదయానికి గాని సూర్యుడు ఉదయిస్తాడే బాబూ --" అంటున్నాడు మూర్తి ఆందోళనతో, దూరదర్శన్ లో నిరంతరాయం గా వార్తా కథనాలు వస్తూనే వున్నాయి. ఈ భారతదేశం లో గుజరాత్ రాష్ట్రం లో సూర్యకాంతి ఆధారంగా ఆరువేల మెగా వాట్ల విద్యుత్తును ఉ త్పత్తి చేసే అనేక సౌరశక్తి కేంద్రాలు ఎన్నో ఏర్పాటు చేసే ప్రయత్నం లో వుంది. ఇప్పటికే సౌరశక్తి తో విద్యుత్ తయారీ కేంద్రాల స్థాపన విషయం లో భారత దేశం లో ప్రధమ స్థానం లో వున్న గుజరాత్ రాష్ట్రం ప్రపంచం లో కూడా ప్రధమ స్థానానికి ఎగ బాకడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఇక పోతే ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లా లో కదిరి లో 5500 ఎకరాల్లోనూ, కర్నూలు జిల్లా పాణ్యం లో 5000 ఎకరాల్లోనూ, కోస్తా విశాఖపట్నం తీరం లో 4000 ఎకరాల్లో నూ ఎన్నో వేల మెగావాట్లు విద్యుత్తు ఉత్పత్తి చేసే సౌరశక్తి తో విద్యుత్ ని ఉత్పత్తి చేసే కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశం లో ప్రతీ ఖాళీ ప్రదేశం లోనూ ఇంకా కొన్ని వేల ఎకరాల్లో సౌరశక్తి యంత్రాలు ఏర్పాటు చేశారు. దేశమంతటా ప్రతీ భవనం పైనా, పరిశ్రమలపైనా, వ్యాపార కేంద్రాలపైనా సౌరశక్తి యంత్రాలు ఏర్పాటు చేశారు. ప్రతీ కారు మీదా బైక్ కి వెనకాలా, సౌరశక్తి యంత్రాలు ఏర్పాటు చేసి, పెట్రోల్, డీసెల్ అవసరం లేకుండా చేశారు. చివరకు కొన్నాళ్ళు పోతే రోడ్ మీద నడిచే ప్రతీ మనిషీ, జంతువు మీద కూడా సోలార్ పేనల్స్ ఏర్పాటు చేసే ఆలోచనలో వున్నారు ఇంజనీర్లు. అంతా బాగానే వుంది, అయితే సూర్యుని నుండి ఇలా తీవ్రమైన ఉద్యమ తరహా లో వేడీ, వెలుగూ లాగేస్తుంటే, కూర్చుని తింటే కొండలైనా తరిగి పోతాయనట్లు గా, ఇప్పడు చూడండి సూర్యుడు కాంతివిహీనం గా అయిపోయాడు, అందుకని శాస్త్రవేత్తలు ఈ విషయమై తీవ్రం గా ఆలోచించి, కనీసం కొంతకాలం సూర్యునికి విశ్రాంతి ఇస్తే మళ్ళీ సూర్యుడు ఉదయించే ఆవకాశం వుంటుందేమో అందరూ సీరియస్ గా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది--" దూరదర్శన్ లో కథనాలు వస్తూనే వున్నాయి. ఈ ఛ-- ఆ దూరదర్శన్ కట్టేసెయ్. తెల్లవారకపోతే మనం పనులు ఏం చేసుకుంటాం, మనిషి దినచర్య ఏమిటి? దైవం ప్రసాదించిన ప్రకృతిని మనిషి ఇలా నాశనం చేసేసుకుంటూంటే, మనల్ని ఎవరు రక్షిస్తారు ? --" మూర్తి ఆందోళనతో తలమునకలైపోతున్నాడు.
ఇంతలో కొంచం వెలుగు వస్తూ, తగ్గిపోతూ వుంది. “ ప్రజలకు శుభవార్త, కొన్ని గంటలలో పౌర్ణమి నాడు పండు వెన్నెల లో కురిపించే చంద్రుని వెన్నెల తో వెలుగులు చిందించాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అయితే సూర్యుని వద్ద తీవ్రమైన వేడీ వెలుగూ తగ్గిపోవడం తో, మామూలుగా పౌర్ణమి నాడు వచ్చే వెన్నెలలో సగం వెలుగు మాత్రమే ప్రసారమయ్యే అవకాశాలు వుంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. అంటే పగలే వెన్నెల అని చెప్పాలి. ఈ పగలే వెన్నెల
తో ప్రపంచం అంతా ఎంత కాలం కాలక్షేపం చేస్తుందో శోచించాల్సిన అంశం గా భావిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, అసలు సూర్యుని వెలుగూ, వేడీ ఆధారం గా విద్యుత్ ని ఉత్పత్తి చేయవచ్చునని ఎవరు కనుగొన్నారో వారిని ప్రపంచద్రోహులు గా తీవ్రంగా పరిగణించి వారిని బహిరంగంగా శిక్షించాలని ప్రజలు ఉద్యమిస్తున్నారు.
ఇంతలో ఇప్పడే అందిన వార్త అని టి.వీ లో " భూమి నుండీ, నదుల నుండీ, సముద్రం నుండీ బొగ్గునూ, ఖనిజాలనూ, నూనెలనూ ముడిచమురునూ వెలికి తీసే కార్యక్రమం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఆపివేయాలనీ, భారతప్రభుత్వం ప్రకటించింది, వీటి ని బేఖాతరు చేసేవారిని కఠినంగా శిక్షిస్తామని కూడా ప్రకటించింది.
“ ఛీ ఈ తెలివితేటలు ముందే ఏడ్చి వుంటే ఎంత బావుండును ? అసలే నాకు తెల్లవారక పోతే కడుపు లో ఏమీ కదలవు. బాత్రూమ్ కి కూడా వెళ్ళలేను " అని కోపం గా అనుకుంటున్న మూర్తి తో “ చాల్లెండి సంబడం అసలు సూర్యోదయం అవలేదురా మొగుడా అని జనం ఏడుస్తుంటే మీ మోషన్ గోల ఏమిటి మధ్యలో ఏడ్చినట్లే వుంది. సూర్యోదయం అయితే రెండు రోజుల మోషనూ చక్కగా ఫ్రీమోషన్గా అయిపోతుంది లెండి. అలా బయటకు వెళ్ళి అసలు ఏం జరుగుతూంగో చూసి రండి.." అని శ్రీమతి అంటోంటే –
ఏడినట్టే వుంది. ఈ కనుపించీ కనుపించని వెలుగు లో నేను బయటకు వెళ్తే ఎక్కడైనా పడ్డాననుకో లేనిపోని గోల... " అంటూ కుర్చీలోంచి లేచి నడవబోయి ముందు వున్న టీపాయ్ కాలికి తగిలి పడబోయి నిలదొక్కుకున్నాడు మూర్తి---
అంతే ! బెడ్రూమ్ లో డబుల్ బెడ్ రూమ్ లో బెడ్ మీద నుండి కింద పడి కొట్టుకుంటూ " చాల్చాల్లే ఏమీ కనపడడం లేదు ఎలా నడవాలి ? " అని కోపంగా కళ్ళు మూసుకునే అరుస్తున్న మూర్తిని లేవదీసి కూర్చోపెట్టింది అతని శ్రీమతి. " ఏమిటీ పిచ్చిమేళం. అరుస్తున్నారేమిటి? అంటున్న తన శ్రీమతి తో “ అదేమిటే వెలుగు గానే వుందే. సూర్యుడు ఉదయించాడా ఇవ్వాళ ? " అని అంటున్న భర్తను వింత గా చూస్తూ " పిచ్చి పిచ్చి ఆలోచనలతో నిద్రపోతారు. రాత్రి పడుకునే ముందు సౌరశక్తి నిరంతరం గా లాగేసుకోవడం వలన కొన్నాళ్ళకి సూర్యుడు ఉదయిస్తాడో లేదో-- అంటూ విపరీతమైన కోపం తో సణుక్కుంటూ పడుకున్నారు ఏమయిందీ ? " అని శ్రీమతి అంటోంటే విషయం చెప్పాడు.
చాల్చాల్లెండి. సమయం ఏడున్నర అయింది. ఎందుకు లేవ లేవదోనని నేను గాబరా పడుతున్నాను." అంటున్న ఆమెతో " ఏమే ఒక వేళ సూర్యుడు ఉదయించలేదనుకో ? మనం ఏం చేయాలి ? " అంటున్న భర్త తో.. “ చాల్లెండి చోద్యం. సూర్యదేవుడా మజాకానా ? ప్రపంచం అంతా ఏకమైనా ఆయన లోని వేడీ, వెలుగూ ఏ మాత్రం తగ్గే ప్రసక్తే లేదు ఎవరికీ ఈ సంగతి చెప్పకండి. మీకు పిచ్చి పట్టిందనుకునేరు-- " అంటూ వడివడి గా వంటింట్లో కి వెళ్ళింది మూర్తి శ్రీమతి.

No comments:

Post a Comment

Pages