పుష్యమిత్ర - 28 - అచ్చంగా తెలుగు
పుష్యమిత్ర - 28
- టేకుమళ్ళ వెంకటప్పయ్య


జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్తాడు. ప్రభుత్వం వారు పుష్యమిత్రునికి హిందీ మొదలైన భాషలను నేర్పిస్తారు. క్రమంగా మనదేశ ప్రస్తుత రాజకీయాలు ఆయనకు అవగాహనకు వస్తాయి. తన కాలంలో యవనులు లాంటి ముష్కరుల దండయాత్రలకు భయపడి కొన్ని వేల మణుగుల బంగారాన్ని భూగర్భంలో ఒక సొరంగంలో దాచిన విషయం చెప్తాడు పుష్యమిత్ర.  ఆ ప్రాంతం పాకిస్తాన్ ఆధీనంలో ఉండడం వలన ఆలోచనలో పడతారు. ఆర్ధిక శాఖామాత్యుడైన పంచాపకేశన్ దాన్నిఎలాగైనా అపహరించాలని పన్నాగాలు వేస్తుంటాడు. దిల్లీ లో ఒకరోజు విషవాయువు లీకై జనజీవనం అతలా కుతలమయింది. పుష్యమిత్ర శ్రీలంకలో ఉన్న ఒక చెట్టు ఆకుతో వ్యాధిని నయచేయడం వీలవుతుందనగా ప్రధానితో కలిసి శ్రీలంకకు ఒక హెలికాప్టర్ లో బయలుదేరారు. పుష్యమిత్రుడు శ్రీలంకలో ఆకులను తీసుకుని వచ్చి వ్యాధిని గంటల్లో నయం చెయ్యడం పాక్ కు ఆగ్రహం కలిగిస్తుంది. దీనికంతటికీ కారణమైన మొహమ్మెడ్, ముస్తఫాలు పట్టుబడతారు. ఇంకా ఎన్నో భయంకర వ్యాధులు భరతఖండాన్ని పట్టిపీడిస్తున్నాయన్న ప్రధాని మాటలకు వాటికి మందులు కనిపెట్టవలసి ఉందని అంటాడు. (ఇక చదవండి)
ఆర్ధిక శాఖామాత్యుడైన పంచాపకేశన్  లాహోర్ కు దగ్గరగా పుష్యమిత్రుడు దాచిన ఆ సంపదను ఎలా కొట్టెయ్యాలా అని ఆలోచిస్తూ, దిల్లీ లో హోటెల్ రూంలో బసచేసిన నలుగురు ఏజెంట్లను అర్జెంటుగా రమ్మని పిలిపిస్తాడు. వాళ్ళను మామూలు విజిటర్ల వేషాలతో తనను వివిధ ప్రాంతాలనుండి కలుసుకునేందుకు వచ్చినట్లుగా, చేతిలో రకరకాల వినతి పత్రాలతో రమ్మని చెబుతాడు. వారిని సీ.సీ. టీవీల్లో చూసి గుర్తించి సెక్యూరిటీతో ఆ నలుగురినీ లోపలికి పంపమనీ, తన భవనం గేట్లన్నీ మూసెయ్యమనీ , చీమకూడా తను చెప్పే వరకూ లోనకు ప్రవేశించడానికి వీల్లేదనీ హుకుం జారీ చేస్తాడు.

అదే సమయంలో ప్రధాని పర్సనల్ సెక్యూరిటీ వారి మొబైల్ మ్రోగింది. క్యాబిన్లో కూర్చుని మాట్లాడుతున్న ప్రధాని "వన్ మినిట్" అంటూ తన సీక్రెట్ క్యాబిన్లోకి వచ్చాడు.
"చెప్పండి మిస్టర్ ఆర్యా! ఎనీ ఇంపార్టెంట్ న్యూజ్"
"యెస్ సార్! మీకు నిన్న చెప్పినట్టు కల్కటా, ముంబై, చెన్నై ఫ్లైట్లలో వచ్చిన కొందరు వ్యక్తులు అందరూ కలిసి ఒకేసారి ఫైనాన్సు మినిస్టర్ ఇంట్లోకి వెళ్ళారు. బంగ్లా తలుపులు మూసేశారు. మేము ఆయన ఇంట్లో పెట్టిన సీక్రెట్ కెమెరాలను, సంభాషణలను మీకు త్వరలో అందజేయగలం. ఓవర్ సర్" అని పెట్టేశాడు.

ఇక్కడ పంచాపకేశన్ వాళ్ళకు విషయం బ్రీఫ్ చేశాడు. ఈ వ్యవహారం మనం ఇదివరకు డీల్ చేసినటువంటివి కావు. విదేశీ వ్యవహారం. ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ళు పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తారు. బీకేర్ఫుల్. మొదట ఈ నెలలో మీరు విజిటర్స్ పాసెస్ తీసుకుని కెమికల్ ఇంజినీర్లుగా వేషాలు మార్చి ఖెవ్రా గనులు పరిశోధన నిమిత్తం వచ్చామని చెప్పండి. మైక్రో  మెటల్ డిటెక్టర్లను జాగ్రత్తగా వాళ్ళకు అనుమానం లేకుండా మీ పరిశోధనలో భాగం అనిపించేట్టు ఉపయోగించి ఆ నిధి నిక్షేపాలను కనుక్కోండి. మనకు సరియైన విషయం తెలిశాక మనం ముందుకు ప్రొసీడ్ అవుదాము. కరప్షన్ కు లొంగని వాడు ఈ వరల్డ్ మొత్తంలో లేడు. వాళ్ళ ఆర్ధిక మంత్రి నాకు పరిచయస్తుడే! తర్వాత రంగం తర్వాత నడిపిద్దాం. మీరు మీ మీ ప్రాంతాలకు వెళ్ళి పాస్పోర్టులు, వీసాలు మారు పేర్లతో కెమికల్ ఇంజినీర్లలా తీసుకోండి. అక్కడి పాస్పోర్ట్ ఆఫీసులతో ప్రాబ్లం వస్తే నా పీ.ఏ. రామనాధన్ కు ఫోన్ చేయండి. ఆయన మీకు అన్నీ అరేంజ్ చేస్తాడు.
యెస్ సార్! అని ఎవరికి వారు తమ ప్లాన్లు ఆలోచించుకుంటూ వెళ్ళిపోయారు. 
ఇంతలో పీ.ఎం.ఫోను రింగైంది. ఆపరేటర్ కనెక్టు చేయగానే.
"యెస్ సార్!"
"ఎక్కడ ఉన్నారు?"
"సార్! ఇంట్లో.. ఎవరో విజిటర్స్ వస్తే మాట్లాడుతున్నాను సర్."
"ఎక్కడ నుండి వచ్చారు?  ఏం పనుల మీద?"
"వారికి ఏవో ఇండస్ట్రియల్ లైసన్సులు కావాలట. కెమికల్ ఇంజినీర్ల బృందం సార్!"
"ఆ పేపర్స్ వచ్చేటప్పుడు తీసుకుని రండి. ఆఫీసులో మీకోసం వెయిట్ చేస్తున్నా" అని ఫోను పెట్టేశాడు.
ఏ.సీ రూంలో కూడా చెమట పట్టించిన పీ.ఎం ఫోనుకు కొద్దిగా భయపడి బయలుదేరాడు.
ఫైనాన్సు మినిస్టర్ అటువెళ్ళగానే పవర్ కట్ చేసిన పీ.ఎం బృందం పవర్ ఆఫీసు వారిమని చెప్పి ఇంటిలో ప్రవేశించి తమ పని కానిచ్చుకున్నారు.
రెండు గంటల అనంతరం రహస్య సమావేశం. పుష్యమిత్రతో పీ.ఎం., ఆర్ధిక మంత్రి పంచాపకేశన్.
"మనం ఎలా ప్రొసీడ్ అవాలంటారు? మిస్టర్ పంచాపకేశన్?"
"అదే ఆలోచిస్తున్నా సార్! పాకిస్తాన్ వాళ్ళతో చాలా ప్రాబ్లం కదా?"
"అక్మల్ ముస్తఫా. అదే ఎఫ్.ఎం నీకు పరిచయమే కదా?"
"నో సార్. ఆ మధ్య ఒకసారి కలిసాము అంతే!"
మౌనంగా వాళ్ళ సంభాషణ వింటున్నాడు పుష్యమిత్ర.
"అయినా డబ్బుకు లొంగని వాడెవడు ఈ ప్రపంచంలో. ఏదో ఒకటి చేద్దాం."
అన్న పీ.ఎం మాటలకు ఆశ్చర్యపోయాడు పంచాపకేశన్. 
కొంచెం ఖంగారుగా "ఏదో ఒకటి చేద్దాం.సార్." అన్నాడు.
పుష్యమిత్ర ఆమాటలకు "ముగ్గురం కలిసి ఒకసారి ఆ ఉప్పు గనుల దగ్గరకు వెళ్ళి వద్దాం. మొదట ఆదేశం పర్మిషన్ తీసుకోండి" అన్నాడు.
"నేను వస్తే బాగుండదు. పంచాపకేశన్ తో కలిసి మీరు వెళ్ళండి" అన్న పీ.ఎం. మాటలకు "ఓకే" అని తలూపారు.
వెంటనే ఏర్పాట్లు చేయబడ్డాయి.
*     *     *
పీ.ఎం ఆఫీసు నుండి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ కు కాంఫిడెన్షియల్ మెసేజ్ వెళ్ళింది. "నాకు తెలీకుండా పాకిస్తాన్ కు వెళ్ళడానికి భారతీయులకు ఎవరికీ నేను చెప్పే వరకూ ఇండియాలో ఏ పాస్పోర్ట్ ఆఫీసు నుండి వీసాలు ఇవ్వొద్దు. అలా అప్లై  చేసిన వారిని, వీసా ఇంటర్వ్యూ అని మీటింగ్ అరేంజ్ చేసి,  అరెస్టు చేసి దిల్లీ తీసుకుని వచ్చి ఆర్మీ రహస్య స్థావరంలో ఉంచి నాకు కబురు చేయండి. దిస్ ఈజ్ వెరి వెరి కాన్ఫిడెన్షియల్ మాటర్. ఈవెన్ అదర్ డిపార్ట్మెంట్స్ కు కూడా చెప్పొద్దు.  వేరే గవర్నమెంటు డిపార్ట్మెంట్స్ అడిగితే మాత్రం “వీసా టెంపరరిలీ సస్పెండెడ్ టు పాక్"  అని మాత్రమే చెప్పండి"
"యెస్ సార్.”
"ఇంకో విషయం ఎఫ్.ఎం. పంచాపకేశన్ కు ఇచ్చిన ఫారిన్ విజిట్ ఫోల్డర్ లో సీక్రెట్ క్యాం -కం-రికార్డర్ అరేంజ్ చేయడం మరచిపోకండి"
"యెస్ సార్.”
వెల్కం టు పాకిస్తాన్!" ప్రొటోకాల్ ప్రకారం అధికారులు వచ్చి రిసీవ్ చేసుకున్నారు ఇద్దరినీ.
"మమ్మల్ని అనవసరంగా అనుమానిస్తున్నారు మీ ఇండియన్స్. మేము ఎప్పుడూ మీతో స్నేహం కోరుతూ ఉన్నాం" అంటూ వారు చెప్పే ఏవో మసిపూసి మారేడు కాయ చేసే మాటలు వినీ విననట్టు వూరుకున్నారు.
ఇద్దరూ ఇస్లామాబాద్ లో బస చేశాక ప్రక్కరోజు ఉదయాన్నే అనుకున్న ప్రకారం పుష్యమిత్రను కెమికల్ సైంటిస్టుగా పరిచయం చేసి. ఆయనతో జీలం జిల్లాలో ఉన్న ఖెవ్రా గనులకు (32°38'60 ఉత్తరం 73°1'0 తూర్పు) హెలికాప్టర్లో తరలి వెళ్ళారు. వారితో అలాడిన్ అనే ఒక గైడును కూడా పంపారు. 
*     *     *
గైడు అక్కడ దిగగానే మొదలు పెట్టాడు. "సార్...ఇవే ఖెవ్రా సాల్ట్ మైన్స్. దీనిని మేము లవణ సామ్రాజ్యంగా భావిస్తాము. ఇది 98 శాతం శుద్ద్ధమైన ఉప్పు. మనం ఇప్పుడు జీలం జిల్లాలో ఉన్నాం. ఇక్కడ జనాభా సుమారు 80 వేలు ఉండొచ్చు. ఇది ప్రపంచంలోనే రెండవ పెద్ద ఉప్పుగని. ఇక్కడ అంతకు ముందు ఒక సముద్రం  800 మిలియన్ల సంవత్సరాల క్రితం ప్రవహించేదని అది క్రమంగా అంతర్ధానమవడంతో ఇలా ఉప్పుగనులయ్యాయనీ చెప్తారు. మీ పుష్యమిత్ర సైంటిస్టు కాబట్టి వివరంగా చెప్పాలి. ఇక్కడ 82 మిలియన్ టన్నుల ఉప్పు ఉన్నట్టు ఒక అంచనా! 2010 సం.లో ఒకసారి వచ్చిన పెద్ద వర్షానికి గుహలో 2 అడుగుల మేర వర్షం నీరు నిలిచిపోయింది. కొంతకాలం మూసి మళ్ళీ విజిటర్లకు అనుమతిస్తున్నాం" అంటూ చెప్పుకు పోతున్నాడు గైడు. కానీ వారి మనసు మనం ఎలా నిధిని కనిపెట్టాలా అని ఉంది.
"ఇక్కడ తావి అనే నది ఎక్కడ ఉంది" ప్రశ్నించాడు పుష్యమిత్రుడు.
"సార్! ఆ నది మీ భారతదేశంలో జమ్ము లో ఉంది." అన్నాడు.
"ఈ గుహలో ఎన్ని మైళ్ళు లోపలికి వెళ్లవచ్చు?"
"దాదాపు పాతిక మైళ్ళు ఉంటుంది సర్."
"మేము లోపలికి వెళ్ళొచ్చా?"
"ఎస్. కానీ నేనుకూడా మీతో ఉండమని ఆర్డర్స్ సర్."
"సరే! ఎదైనా లోనకు వెళ్ళగలిగే వెహికల్ పిలిపించండి" చెపాడు పంచాపకేశన్.
ఒక కారు వంటి వాహనంలో లోపలికి వెళ్ళసాగారు. ( సశేషం)

1 comment:

Pages