జ్ఞాపక శక్తి - అచ్చంగా తెలుగు
సుబ్బుమామయ్య కబుర్లు!
జ్ఞాపక శక్తి 

జ్ఞాపక శక్తి మనకు చాలా ముఖ్యమర్రా. పద్యాలు, ప్రశ్నలకు సమాధానాలు అప్పజెప్పడానికి, మరీ ముఖ్యంగా పరీక్షలు రాయడానికీను, 
పెద్ద వాళ్లకంటే వయసు పెరుగుతుంది కదా, అంతేకాదు వాళ్లకి బోలెడన్ని సమస్యలు, అందుకని జ్ఞాపక శక్తి తగ్గుతుందర్రా. మీలాంటి చిన్న పిల్లలకు అలా కాదు. చక్కగా బాగానే ఉంటుంది. అన్ని గుర్తుంటాయి కూడానూ. మరి కొంతమంది పిల్లలకు ఏమీ గుర్తుండదే! ఎందుకు! అని కదా మీ అనుమానం? చెబుతాను.
ముందు మీరు ఏమి చదవబోతున్నారో దానిమీద ఆసక్తి ఉండాలి. తర్వాత దాని మీద శ్రద్ధ పెట్టాలి. మరో దానిమీదకి ధ్యాస మళ్లకూడదు. మనం చదువుతున్నప్పుడో, వింటున్నప్పుడో అనుమానం వస్తే ఒక పక్కగా రాసిపెట్టుకుని తర్వాత అడిగి తెలుసుకోవాలి. ఆ తర్వాత మొత్తం అర్థం చేసుకుంటూ చదవడం, వినడం చేయాలి. అంతే, ఇహ మిమ్మల్ని ఆ విషయం వదలమన్నా వదలదు. సబ్జెక్ట్స్ మీరు బాగా చదువుకుని మీ ఫ్రెండ్స్ కు చెప్పాలి, వాళ్ల అనుమానాలు తీర్చాలి. మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోవాలి. దానివల్ల మీకు కచ్చితంగా విషయం గుర్తుండిపోతుంది. అప్పుడు మీరు పరీక్షలు ఎంత బాగా రాస్తారంటే చెప్పలేను.
ఈ వేసవి సెలవుల్లో జ్ఞాపక శక్తి పెరిగే కొన్ని మార్గాలు చెప్పనా! వినండి మరి.
1. పద్యాలు చదువుకుని తప్పుల్లేకుండా అప్పజెప్పుకోండి. అది స్కూల్లో చెయ్యాల్సిన పనే కాదు. ఇంట్లోనూ చెయ్యాలి.
2. పిల్లల కథ చదివి కథను మొత్తం స్టెప్స్ గా పేపర్ పై పెట్టాలి. క్యారెక్టర్ల పేర్లను కాగితం మీద రాసుకోవాలి. ఎక్కడైనా ఏవన్నా మిస్ అయిందేమో ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. 
3. సినిమా చూసి కథను మొత్తం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అందులోని మెయిన్ యాక్టర్లు, సైడ్ క్యారెక్టర్ల పేర్లను గుర్తు తెచ్చుకోవాలి.
4. క్విజ్ ల ఆన్సర్ల కోసం కుస్తీ పట్టాలి, క్రాస్ వర్డ్ పజిల్స్ నింపాలి. మధ్యలో వదలకూడదు.
మనం ఎంత కష్ట పడితే, మెదడును ఎంత శ్రమ పెడితే అంత బాగా గుర్తుంటుందర్రా. ఎంత సులువో చూడండి.
మీరు కూడా ఈ సెలవుల్లో జ్ఞాపక శక్తి పెంచుకుని స్కూళ్లు తెరిచాక పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. సరేనా?
ఉంటానర్రా మరి.
మీ సుబ్బుమామయ్య

No comments:

Post a Comment

Pages