శివమ్మ కధ -13 - అచ్చంగా తెలుగు
శివం -37
శివమ్మ కధ -13
రాజ కార్తీక్ 

(మహాదేవుడు శివమ్మ ను తనతో పాటు కైలసానికి రమ్మని అంటారు, కానీ శివమ్మ ఒక షరతు పెట్టి వరం అడుగుతుంది. వరం ఏదైనా ఇస్తానని వాగ్దానం చేస్తాడు,  తన కోరిక ఏమిటో తెలియక ముందే)
విష్ణు దేవుడు "శివమ్మ మొహం లో ఆనందం చూడు భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నట్లు ...కాదు కాదు తన సొంత వాడ్ని చేసుకున్నట్లు .."అన్నాడు.
పార్వతి మాత "సోదరా ! ఆమె ఆజ్ఞ లో మహాదేవుడు ఉన్నాడు .."అంది.
శివమ్మ మొహం లో ఉన్న ఆనందం ..ఒక మాతృ మూర్తి బిడ్డని కానీ మొదటిసారిగా చూసిన అనూభూతి లో ఉంది .. ఏదో తన్మయత్వoతో మెరిసిపోతోంది.
నంది ,భృంగి ,నాగరాజు ఏదో లా చూస్తున్నారు.
నేను "అమ్మ, ఆజ్ఞాపించమ్మ. ఏమి చేయాలి చెప్పు నీ బిడ్డ?" అని అడిగాను.
శివమ్మ తల్లి ఆనందబాష్పాలతో ఏమీ చెప్పలేకపోతోంది.
శివమ్మ- "శివయ్య నేను నిన్ను ఆజ్ఞాపించటం ఏంటి ..ఈ లోకాలు నీ ఆజ్ఞ లేకుండా నడుస్తాయా? "
నేను- "ఎంత వాడనైనా, ఇప్పుడొక తల్లి బిడ్డను కాదమ్మా ..వెతికి పట్టి చూసినా, కన్నతల్లి కన్నా విలువ ఐనది ఉంటుందా? నీకన్నా ఎవరు ఎక్కువమ్మ ..నీ దగ్గర ఇలాగే ఉండిపోయి నీకు సేవలు చేయాలని ఉందమ్మ ".
అందరి మనసులో ఒకటే ఆలోచన "బంధాలు, బాంధవ్యాలు లేని మహాదేవుడు, ఒక సాధారణ భక్తురాలి ప్రేమ కి ఒక మాములు మనిషి వలె ఆనందపడుతున్నాడు " అని.
విష్ణు దేవుడు "ఏదో ఒక మహత్తరమైన భక్తీ ఘట్టం మొదలు కానుంది " అన్నాడు.
శివమ్మ "కన్నయ్యా ! ఈ నీ భక్తురాలి  "
నేను "అమ్మ నేను నీ బిడ్డని , సందేహించకు."
శివమ్మ "అవును శివయ్య ...నువ్వు నా బిడ్డవి శివయ్య ..అలగే నాతో ఉంటావా? "
నేను "ఉంటానమ్మ, అందుకే గా నిన్ను కైలసం రమ్మంది. ఎప్పుడూ, మా అమ్మ నాతోనే ఉంటుంది కదా ..ఏమి నంది,  భృంగి, నాగరాజా , ఏమంటారు?"
వారు "అవును మహాదేవా, తమరి లాగే శివమ్మ తల్లి కి కూడా మేము సేవలు చేస్తాము. మహాదేవుడి లాగా చూస్తాము " అన్నారు.
నేను "ఓయ్ ...నాకన్నా మా అమ్మ ని ఎక్కువగా చూడాలి " అన్నాను.
సంఘటన చూస్తున్న బ్రహ్మ, విష్ణు దేవులు ఇలా అనుకున్నారు.
బ్రహ్మ దేవుడు "ఇంతకన్నా మహాదేవుడు భక్త సులభుడు అని చెప్పటానికి నిదర్శనం ఏమి ఉంటుంది?"
విష్ణు దేవుడు "చూడు సోదరి, వాళ్ళ అమ్మని ఎక్కువగా చూడాలట" అన్నారు.
పార్వతి & సరస్వతి మాతలు "తమరు అక్కడ ఉన్నా, అంతే అంటారు. ఇద్దరూ ఒకటే గా" అన్నారు.
పార్వతి మాత "మహాదేవ, ఏనాడూ నన్ను కూడా మీరు అలా అనలేదు కానీ మీ అమ్మను మాత్రం "అంటూ పులకించిపోయింది.
నేను -"చెప్పు అమ్మ చెప్పు ఏమిటి నీ కోరిక "
శివమ్మ -"శివయ్య నాకు జీవితంలో ఏమి ఆశలు లేవు ..అన్ని తీరిపోయ్యై ..నేను ఒంటరిదాన్ని అని అందరు అనుకున్నా, నాతో నువ్వు ఉన్నావని నాకు తెల్సు. శివయ్య ఆ రోజు తుఫాను లో నన్ను కాపాడినప్పుడు కాదు, ఎప్పుడూ నువ్వు నాతోనే ఉన్నావని నాకు తెల్సు .కానీ ఒకకోరిక శివయ్య .."
నేను- "చెప్పు అమ్మ "
శివమ్మ- "అన్ని కోరికలు లేవయ్యా, కానీ  సహజంగా నేను ఒక స్త్రీ ని. నా  జీవితానికి పరిపూర్ణత లేని ఒక సాధారణ మహిళను. నేను ఎప్పుడు ఒక గోడ్రాల్ని అని అందరు  అంటారు. కానీ ఎవరికీ దక్కని  మహా భాగ్యం నాకు దక్కింది .అది నిన్ను బిడ్డ లా పొందటం. నేను ఏమి తపస్సులు చేయలేదు. ఏదో ఎప్పుడూ నిన్ను నాకు తోచిన విధంగా తల్చుకున్నా. ఎంత నిన్ను నా బిడ్డ అనుకున్నా, ఒక్క లోటు ఉండిపోయింది కన్నయ్య "
నంది -"అందుకే కదా మాతా, మహాదేవుడు నిన్ను కైలసం రమ్మంది "
శివమ్మ- "వచ్చే ముందు ఒక సారి నిజమైన మాతృమూర్తి అనూభూతి పొందాలి, అదీ నీతో "
నేను -"చెప్పు అమ్మ తథాస్తు, నీకు ఏమి కావలి చెప్పు "
శివమ్మ - "బహుశా ఈ కోరిక ఎవరు కోరి ఉండరు .ఇది కోరిక కాదు ,ఆశ కాదు నీకు నేను మానసికంగా చేసిన పూజ ప్రత్యక్షంగా చేయటమే ."
నేను- "చెప్పమ్మ, అంత వివరణ ఎందుకు?  నీకు ఏమి కావాలి చెప్పు " అన్నాను నాకు తెలియనట్టు. 
అందరికి ఆత్రుత ఉత్కంఠా.
శివమ్మ "శివయ్య, నువ్వు నాకోసం చిన్న బిడ్డ లా మారిపోవాలి. నీకు నేను ఒక తల్లి లా అన్ని పనులు చేయాలి. పసి పిల్లాడ్ని సాకినట్టు సాకాలి."
నేను "తథాస్తు "అన్నాను.
చుట్టూ అంతా విస్పోటనం. ఆ పొగలో నుండి 
నేను నెలల బాలుడి వలె ప్రత్యక్షమయ్యి ఆడుతున్నా.

ఇక చూడండి మధుర ఘట్టం...
(సశేషం)

No comments:

Post a Comment

Pages