జర్నీ ఆఫ్ ఏ టీచర్ -2 - అచ్చంగా తెలుగు
జర్నీ ఆఫ్ ఏ టీచర్ -2
చెన్నూరి సుదర్శన్

(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు.)
2007  వ, సంవత్సరం..
ప్రభుత్వ జూనియర్ కాలేజి గుమ్మడిదల వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభమైన  రోజు. 
విద్యార్థుల సంఖ్య స్వల్పంగా ఉన్న మూలాన  కాలేజీ వాతావరణం చాలా  ప్రశాంతంగా ఉంది.
వచ్చిన కొద్ది మంది విద్యార్థినీ, విద్యార్థులంతా ఒక  గదిలో కూర్చొని తమ, తమ మిత్రులతో కబుర్లు చెప్పుకుంటున్నారు. వేసవి సెలవుల్లో సాధించిన వారి, వారి ఘన కార్యాలను ప్రదర్శిస్తున్నారు కొందరు. 
ప్రథమ సంవత్సరంలో చేరడానికి  అప్లికేషన్స్ కోసం ఎవరైనా వస్తారేమో..! అని ఎదురి చూస్తూంది ఆఫీసు. 
స్టాఫ్‍రూంలో గత పబ్లిక్ పరీక్షల పేపర్ వాల్యూయేషన్‍పై ఛలోక్తులు విసురుకుంటున్నారు స్టాఫ్. 
ఆఫీసు అసిస్టెంటు అగమయ్య ఫ్లాస్క్ తో వరండా గుండా బిరా, బిరా వెళ్ళడం చూసి “సార్ బయలు దేరుదామా! స్టాఫ్ మీటింగ్ టైమయ్యింది. ఆగమయ్య టీ కోసం వెళ్తున్నాడు” అంటూ తన కుర్చీలో నుండి లేచి నిల్చున్నాడు ఫిజికల్ డైరక్టర్. 
స్టాఫంతా ఒకసారి తమ, తమ చేతి గడియారాల వంక చూసుకున్నారు. 
“నిజమే పి.డి. సార్.. మూడు కావస్తోంది”    అంటూ మ్యాథ్స్ సీనియర్‍మోస్ట్ జూనియర్ లెక్చరర్ లేచి తన లాకర్ నుండి ఫైల్  తీసుకొని కదిలాడు. ఆ తరువాత ఒకరి వెనకాలే మరొకరు నింపాదిగా లేచి   పి.డి.తో బాటు ప్రిన్సిపల్ చాంబర్‍కు బయలు దేరారు. 
సాధారణంగా కాలేజీల్లో లెక్చరర్లు, వారు బోధించే సబ్జెక్ట్ పేర్లతో పిలుచుకోవడం కద్దు. విద్యార్థులూ అలాగే లెక్చరర్లను పిలుస్తూంటారు.
సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. 
కళాశాల ప్రిన్సిపాల్ ప్రతీ విద్యాసంవత్సర ఆరంభంలో, ఆఖరులో తప్పనిసరిగా అలా స్టాఫ్ మీటింగ్ పెట్టడం జూనియర్ కాలేజీలలో ఆనవాయితీ. 
ఆరంభంలో గత సంవత్సరం తాలూకు విద్యార్థుల ఉత్తీర్ణత శాతంగణాంక వివరాలు.. వాటిని మరింత మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన సోపానాలు..ఇంకా ఆ విద్యా సంవత్సరం పరీక్షలు, ఫర్నీచర్, గ్రంధాలయం, ఆఫీసు, అడ్మిషన్స్, ప్రయోగశాలలు, సాంస్కృతిక, స్కాలర్‍షిప్  తదితర విభాగాలకు విధుల నిర్వహణలో జూనియర్ లెక్చరర్‍లను భాగస్వాములను చేయడం మొదలగు అంశాలపై చర్చించుకోవడం..
ఇక విద్యాసంవత్సర ఆఖరులో కళాశాల స్టాక్ తనిఖీ చేసిన వివరాలు.. అంతవరకు జరిగిన కృషి.. జరుగబోయే వార్షిక పబ్లిక్ పరీక్షలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తదితర అంశాలను సమీక్షించు కోవడం పరిపాటి. 
మధ్య మధ్యలో అత్యవసర మీటింగులు సరే సరి..
ఆరోజు విద్యాసంవత్సర ప్రథమ సమావేశం..  
హాల్లో ప్రవేశించగానే స్టాఫంతా సూర్యప్రకాష్‍కు అభివాదం తెలిపింది.
టీచింగ్, నాన్‍టీచింగ్ స్టాఫ్‍కు విద్యాసంవత్సర ఆరంభ శుభాకాంక్షలు తెలుపుతూ..  ఆహ్వానించాడు సూర్యప్రకాష్. 
ముందుగా స్టాఫ్‍ను పరిచయం చేసుకున్నాడు. కేవలం ఇద్దరు కాంట్రాక్ట్ లెక్చర్లు తప్ప మిగతా వారంతా అనుభవజ్ఞులైన రెగ్యులర్  లెక్చరర్లు కావడం.. తన సంతోషాన్ని వ్యక్తపర్చాడు.  
టేబుల్‍పై ఉన్న గ్లాసులోని మంచినీళ్ళు కాసిన్ని తాగి, గత సంవత్సరం కాలేజీ ఫలితాలు ఆశాజనకంగా లేవంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు.. 
సమావేశ తీర్మాన పుస్తకంలో రాయడానికి తన పనిలో తానున్నాడు ఇంగ్లీష్ లెక్చరర్. 
పరీక్షల విభాగపు ఇంచార్జ్ మ్యాథ్స్ లెక్చరర్ అడిగిందే తడవుగా ఫలితాల విశ్లేషణ ముందుంచడానికి ఆతృత పడ్తున్నాడు. అతడి సబ్జెక్ట్ లో మంచి ఫలితాలున్నాయి.. కెమిస్ట్రీ లెక్చరర్ విద్యార్థుల ఫలితాలూ ఫరవాలేదు. ఎటొచ్చీ ఫిజిక్స్ లెక్చరర్ సబ్జెక్టులోనే అతి తక్కువగా ఉన్నాయి.. దాంతో కాలేజీ ఎం.పి.సి. ఉత్తీర్ణత శాతం పడిపోయింది.. దీనిని హైలైట్ చేయడానికి నానా హంగామా ప్రదర్శిస్తున్నాడు. 
ఇదంతా ఫిజిక్స్ లెక్చరర్ ఒక కన్ను సగం మూసి, కింది పెదవును పైపన్నుతో కరిచి పట్టి  కనిపెడ్తూనే ఉన్నాడు. 
సూర్యప్రకాష్ తన ఉపన్యాసాన్ని ముగించి ఫలితాలపై స్టాఫ్ అభిప్రాయాలు కోరాడు.
ఇంతలో ఆగమయ్య ట్రేలో టీ, బిస్కట్లు సర్వ్ చేయసాగాడు.      
“సార్.. మనం ఎంత శ్రద్దగా పాఠాలు చెప్పినా లాభం లేదు సార్.. పిల్లలు శ్రమపడొద్దూ..!” అంటూ జువాలజీ లెక్చరర్ జోగయ్య  తన అభిప్రాయాన్ని   చెప్పాడు. 
“పిల్లల్లో క్రమశిక్షణ పూర్తిగా లోపించింది సార్.. ఈ రోజు నేను వస్తుంటే  ‘ఒరేయ్.. జోగయ్యా.. జోపుకో..! జోపుకో..!!’ అంటూ పిల్లలు నన్ను బనాయిస్తున్నారు..” 
స్టాఫ్ భళ్ళున నవ్వింది.
సూర్యప్రకాష్ చేతి సంజ్ఞ చూసి వాల్యూం  తగ్గించారు.. 
“ఇదేం పద్దతి సార్..? పిల్లలు మూత్రశాలల్లో మన లెక్చరర్ల మీద బూతులు రాస్తున్నారు. నేను గమనించి మన ఆగమయ్యతో అన్నీ తుడిపించాను” అని చెబుతుంటే అతడి పక్కనే కూర్చున్న బాటనీ మేడం భాగ్యలక్ష్మి కంట నీరు నిండుకోవడం లోలోన నవ్వుకుంటూ గమనిస్తున్నాడు కామర్స్ లెక్చరర్. 
భాగ్యలక్ష్మి కంటి తీక్షణం పెరగడంతో సర్దుకున్నాడు.
“దీనికి మనం కూడా కొంతవరకు బాధ్యులమని నా అభిప్రాయం” అన్నాడు సూర్యప్రకాష్. భాగ్యలక్ష్మి తీక్షణ చూపు ప్రిన్సిపల్ వైపు మళ్ళింది. జోగయ్య అవాక్కయ్యాడు. 
“మనం.. అలాంటి అవకాశం వారికిస్తున్నాం కాబట్టే మనల్ని అలా అనగల్గుతున్నారు. మనపై రాయగల్గుతున్నారు. మన అనుచిత ప్రవర్తనవల్ల వారి మనసు దోచుకోలేక పోతున్నాం. కాలేజీ లెక్చరర్లమైన మనం ఎంతో హుందాగా వ్యవహరించే బదులు హేయంగా ప్రవర్తిస్తున్నాం. మన విలువలను మనమే చేజేతులా చేజార్చుకుంటున్నాం”
“కొత్త ప్రిన్సిపాల్ కదా..! అలాగే ఉంటాయి బడాయి మాటలు” అంటూ పక్కనే కూర్చున్న హిందీ మేడం చెవిలో గుస గుస లాడుతున్నాడు కామర్స్ లెక్చరర్. 
సూర్యప్రకాష్ ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకమని తెలియదు పాపం.. నీ గుస, గుస నాకర్థమౌతుందిలే.. అన్నట్లు కదలాడుతున్న సూర్యప్రకాష్ ముఖ కవళికలు గమనించి తలదించు కున్నాడు కామర్స్ లెక్చరర్.       
“హైస్కూల్, జూనియర్ కాలేజీ పిల్లల మనస్తత్వాలను మార్జాల, మర్కట కిశోర న్యాయాలుగా అభివర్ణించ వచ్చు.. మీకు తెలిసే ఉంటుంది” అంటూ కొనసాగిస్తున్న సూర్యప్రకాష్ నీతి వాక్యాలతో కామర్స్ లెక్చరర్ కామ్ అయిపోయి తిరిగి తలెత్తాడు.
సూర్యప్రకాష్ పెదవులపై చిరునవ్వు మొలిచింది.    
“మార్జాలకిశోర న్యాయమంటే.. పిల్లి తన పిల్లలను పదిలంగా నోట కరచి ఇల్లిల్లూ తిప్పుతుంది. పిల్లల బాధ్యత తనే తీసుకుంటుంది. ఇది హైస్కూల్ పిల్లలకు వర్తిస్తుంది. అక్కడ పిల్లల క్రమశిక్షణ బాధ్యతంతా ఉపాధ్యాయులదే..
కాని కాలేజీలలో వ్యవహారం అలా కాదు. మర్కటకిశోర న్యాయం. 
కోతి ఒక కొమ్మ మీది నుండి మరో కొమ్మ మీదకు దూకుతున్నప్పుడు  పిల్లలే దాని కడుపును గట్టిగా పట్టుకుంటాయి. అది ఏమాత్రమూ బాధ్యత వహించదు. అలాగే మన కాలేజీ పిల్లలు మనల్ని పట్టుకొని ఉన్నప్పుడు మనం గోడలు దూకుతుంటే.. జరిగే పర్యవసానం.?” అంటూ ప్రశ్నార్థకంగా చూసే సరికి స్టాఫ్ అంతా మరోమారు నిండు నీటి కుండలు నేలపై బడి భళ్ళున పగిలినట్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. 
జోగయ్య నవ్వు  నవ్వాలా..! వద్దా..! అన్నట్లుగా ఉంది. అతడి ముఖ కవళికలను భాగ్యలక్ష్మి కళ్ళల్లో వెతుక్కుంటున్నట్లు సూర్యప్రకాష్ గమనిస్తూనే ఉన్నాడు. నవ్వుల కార్యక్రమం అనంతరం సూర్యప్రకాష్ ఉపన్యాసం మళ్లీ  కొనసాగించబోయాడు.
“సార్.. మీ పరిచయ భాగ్యం కలిగించండి” అంటూ తెలుగు లెక్చరర్ వినయంగా అడిగాడు.
సూర్యప్రకాష్ మందహాసం చేసాడు. అతడి  మదిలో ఒక ఆలోచన మెదిలింది.  ప్రస్తుత కాలేజీ వాతావరణం దృష్ట్యా  తన పరియంతోబాటు  మరింత  జోడించాలనుకున్నాడు.. 
జోగయ్య వైపు చూస్తూ..“ప్రతీ కాలేజీలో స్టాఫంతా అలాగే  ఉంటారని కాదు.. కాని ఒక్కరుంటే చాలదా..? చెట్టు వేరు పురుగులా.. కాలేజీకి చెడ్డపేరు రావడానికి.
 నేను ఇంత వరకు ఐదారు  కాలేజీలలో పని చేసాను..
 మొదటి సారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి నా అనుభవాలను మీతో పంచుకోవాలను కుంటున్నాను” అంటూ మొదలు పెట్టాడు. 
స్టాఫ్ సంతోషాన్ని  వ్యక్తపర్చింది చప్పట్లు కొడుతూ..
***

1 comment:

  1. మనం కలిసి కొన్ని సంవత్సరాలే ఉద్యోగం చేసినా నేటికీ మన స్నేహం చేరగా లేదు. ఆ చక్కని అనుభూతులను ఇక్కడ కథల రూపంలో వ్రాయడం ఆనంద దాయకం. ఉద్యోగం చేతప్పుడు ఉండే ఏ ఒక్క భావనను మర్చి పోలేదు.అభినందనలు.
    గొట్టుముక్కుల బ్రహ్మానందము~విశ్రాంత తెలుగు ఉపన్యాసకుడు~వ్యక్తిత్వ వికాస ప్రేరణాత్మక ఉపన్యాసకుడు.

    ReplyDelete

Pages