శ్రీ దేవి దశమహావిద్యలు - 8 - అచ్చంగా తెలుగు

శ్రీ దేవి దశమహావిద్యలు - 8

Share This
శ్రీ దేవి దశమహావిద్యలు - 8
7. ధూమావతి దేవి.
శ్రీరామభట్ల ఆదిత్య 


శ్రీ దేవి దశమహావిద్యలలో ధూమావతి దేవి ఏడవ శక్తి. ఒకసారి కైలాసంలో శివపార్వతులు కొలువై ఉన్నారు. అంతలో శివుడు యోగసమాధిలోకి వెళ్ళాడు. అదే సమయంలో పార్వతి దేవి తనకు చాలా ఆకలిగా ఉందని శివుడితో తెలిపింది. కానీ యోగసమాధిలో ఉన్న శివుడు ఆ మాటలను పట్టించుకోలేదు. అలా ఎన్ని సార్లు తన క్షుద్బాధను తెలిపిన శివుడు పట్టించుకోకపోయేసరికి కోపంతో పార్వతిదేవి శివుడినే మింగివేసింది.
అప్పుడు ఆమె శిరస్సు నుండి పొగలు రావటం ప్రారంభం అయ్యాయి. అలా అవి శరీరం అంతా వ్యాపించాయి. అప్పుడు అమ్మవారి కడుపులో ఉన్న శివుడు పార్వతితో " నన్ను మింగివేసిన కారణంగా నీ శరీరం అంతా పొగలు వ్యాపించాయి. కాబట్టి ఇక నుండి నువ్వు ధూమావతి లేక ధూమ్రా అని పిలవబడతావు " అని అన్నాడు.
ఇక్కడ శివుని మింగడం అంటే తన స్వామిత్వాన్ని నిషేధించడం మాత్రమే. మళ్ళీ నారద పాంచరాత్రం ప్రకారం అసురయుద్ధంలో అమ్మవారు తన నుండి ఉగ్ర చండికను పుట్టించగా ఆమె అసురులను చంపి వారి రక్తమాంసాలను భుజించింది. దాని వలన ఆమెలో తమోగుణ ప్రవృత్తి అధాకం కాసొగింది, దానిని నియంత్రించడానికి అమ్మకు ఆకలి వేసింది.
ధూమావతి దేవి ఒక స్వతంత్ర శక్తి. ఎందుకంటే ఆమెతో పాటు స్వామి ఉండరు కాబట్టి. మళ్ళీ అమ్మవారు స్వయం నియంత్రిక శక్తి కూడా. తన భర్త అయిన శివుని మింగివేసిన కారణంగా ఆమెది విధవ రూపం కూడా. అందుకే అమ్మవారు తెల్లని చీరతో, నుదుటన బొట్టు లేకుండా, గుర్రంలేని రథం మీద, కాకిని ధ్వజంగా కలిగి, చేత ఖాళీ చాటతో, ఆకలితో ఉన్నదానివలె కనిపిస్తుంది.
స్వాతంత్ర తంత్రానుసారం చూస్తే దక్ష యజ్ఞంలో దూకిన సతీదేవి నుండి వ్యాపించిన పొగలో నుండి ధూమావతి దేవి జన్మించింది. ప్రమాద నివారణలకు, యుద్ధంలో విజయానికి మరియు రోగనివారణకు అమ్మవారి ఆరాధన తప్పనిసరి. శతపతబ్రాహ్మణంలో ధూమావతి దేవి మరియు నిఋ్రతీ దేవి ఒక్కరే. అమ్మవారి ఉపాసకుల మీద దుష్టాభిచారక ప్రభావం ఉండదంటారు. దుర్గా సప్తశతిలో అమ్మవారికి వాభ్రవి మరియు తామసి అనే పేర్లు కూడా ఉన్నాయి. అమ్మవారు స్థితప్రజ్ఞతకు ప్రతీక.
***

No comments:

Post a Comment

Pages