పుష్యమిత్ర - 23 - అచ్చంగా తెలుగు
 పుష్యమిత్ర - 23
- టేకుమళ్ళ వెంకటప్పయ్య

జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు అగ్నిమిత్రునికి రాజ్యం కట్టబెట్టి హిమాలయాలలో జ్ఞాన సమాధిలో ఉన్నప్పుడు బాబాజీ ద్వారా తను కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీద సంచరించాలని  ఆదేశించడంతో ఆశ్చర్యపోతాడు.   శ్రీహరికోట(షార్) పై భారత అధికారులు ధృవపరచగా పాక్ అధ్యక్షుడు దాన్ని ఖండిస్తాడు. హిమాలయాలపై భయంకర మంచుతుఫాను రాబోతున్నదని జనం సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్ళే తరుణంలో పుష్యమిత్రుడు బాబాజీ ద్వారా ఉపదేశం పొంది మళ్ళీ జ్ఞాన సమాధిలోకి వెళ్తాడు.  ఒక రోజు బాబాజి ప్రత్యక్షమై ఆ రోజు సంధ్యాసమయం పుష్యమిత్రుని యాత్రకు సిద్ధం అవవలసిందని ఆ పరమేశ్వరుని ఆజ్ఞ అయిందని చెప్పి వెళ్తాడు. (ఇక చదవండి)
సమయం సాయంత్రం 6 గంటలు కావస్తోంది. పుష్యమిత్రునికి ఎంతో ఉత్కంఠగా ఉంది. ఏమి జరగబోతోందో తెలీడంలేదు. మళ్ళీ పరమేశ్వరుని ప్రార్ధనలో లీనమయ్యాడు.  మరో కొన్ని క్షణాలకు ఏవో నీలిరంగు కాంతులు అతని భృకుటిపై పడ్డాయి. సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు. ఆ పరమశివుని ప్రదోష నృత్య విలాసం ఒక్కసారి భ్రుకుటిపై గోచరించింది. "నటరాజ" భగవానుడైన శివుని తాండవ నృత్యంలో పాల్గొనడానికి రజతగిరి కైలాసపర్వతం మీద సమస్త దేవగణం హాజరయ్యింది. జగజ్జనని ఆదిశక్తి గౌరీమాత అక్కడి దివ్యరత్న సింహాసనం మీద ఆసీనురాలై తన అధ్యక్షతన శివతాండవాన్ని ప్రారంభింపజేయడానికి ఉపస్థితురాలై ఉంది. నారదమహర్షి కూడా ఆ నృత్య కార్యక్రమంలో పాల్గొనడానికి లోకాలన్నీ పరిభ్రమిస్తూ అక్కడికి చేరుకున్నాడు. కొద్ది క్షణాల్లోనే శివభగవానుడు భక్తి పారవశ్యంతో తాండవ నృత్యం ఆరంభించాడు. సమస్త దేవగణం, ఇంకా దేవతా స్త్రీలు కూడా ఆ నృత్యంలో సహాయకులై వివిధ వాద్యాలను వాయించసాగారు. పద్మాసనస్థయై సరస్వతీ మాత వీణను, విష్ణుభగవానుడు మృదంగాన్ని, దేవేంద్రుడు మురళిని, బ్రహ్మదేవుడు తాళాన్ని చేపట్టి వాద్య సహకారం అందిస్తూండగా లక్ష్మీదేవి గీతాలాపన చేయసాగింది. ఇంకా యక్ష, గంధర్వ, కిన్నెర, ఉరగ, పన్నగ, సిద్ధ, అప్సర, విద్యాధరాది అన్య దేవతాగణం భావ 'విహ్వలురై' శివభగవానునికి నలుదిక్కులా నిలబడి ఆయన్ని స్తుతించడంలో నిమగ్నమయ్యారు. శివభగవానుడు ఆ ప్రదోష కాలంలో సమస్త దివ్య శక్తుల సమక్షంలో అత్యంతాద్భుత లోక విస్మయకర తాండవ నృత్యాన్ని ప్రదర్శించారు. ఆయన ముద్రాలాఘవం చరణ, కటి, భుజ, గ్రీవాల కదలికతో ఉన్మత్తమైనప్పటికి సునిశ్చితమై సాగిన విలోలహిల్లోల ప్రాభవం అందరి మనస్సులను, నేత్రాలను-రెంటినీ ఒక్కసారిగా అచంచలంగా నిలబెట్టింది. అందరూ భూతభావనుడై శంకరభగవానుని నృత్యాన్ని వేనోళ్ళ కీర్తించారు. ఆదిపరాశక్తి  ఆయనపై అత్యంత ప్రసన్నురాలైంది. ఆమె శివునితో  "భగవాన్! నేటి  నీ నృత్యాన్ని చూశాక నాకు చాలా ఆనందం కలిగింది. నేను నీకు ఏదైనా వరాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను." అని పలికింది. ఆమె వచనాలను విని లోకహితంకరుడైన శంకరుడు నారద ప్రేరితుడై  " దేవీ! ఈ తాండవ నృత్యాన్ని చూసి నీవు, దేవగణం, ఇంకా అన్యదివ్యయోనిజన్య జీవులూ' విహ్వలురై పొందిన ఆనందం భూలోక జీవులకు లేకుండా పోతోంది. మన భక్తులు కూడా ఈ సుఖాన్ని పొందలేకపోతున్నారు.  కాబట్టి పృథ్వీ వాసులకు కూడా ఈ నృత్యం దర్శనభాగ్యం కలిగేలా అనుగ్రహించు, అయితే నేను మాత్రం తాండవం నుండి తప్పుకుని 'లాస్యం' చేయాలని అనుకొంటున్నాను" అని విన్నవించాడు. శివభగవానుని విన్నపాన్ని మన్నించి తక్షణమే ఆదిశక్తి, భువనేశ్వరి మహాకాళీమాత సమస్త దేవతలను విభిన్న రూపాలలో భూమండలం మీద అవతరించాల్సిందిగా ఆదేశించింది. స్వయంగా ఆమె శ్యామసుందరుడు శ్రీకృష్ణ భగవానునిగా అవతరించి బృందావన ధామానికి విచ్చేసింది. శివభగవానుడు మధురానగరిలో రాధగా అవతారమెత్తాడు. ఇక్కడ వారిరువురూ కలిసి దేవతలకు సైతం దుర్లభమైన అలౌకిక రాస నృత్యాన్ని ఆరంభించారు. శివభగవానుని "నటరాజ" నామం శ్రీకృష్ణ భగవానునికి లభించింది. భూమండలంలోని చరాచర జీవులన్నీ ఈ రాస నృత్యాన్ని తిలకించి పులకించిపోయాయి. పరమేశ్వరేచ్ఛ నెరవేరింది. పుష్యమిత్రునికి దివ్యనేత్రాలతో తిలకిస్తున్న ఈ దృశ్యం అదృశ్యమవగానే స్పృహలోకి వచ్చాడు.  ఆహా! ఎంత అదృష్టం? ప్రదోషవేళ ఇలాంటి తాండవనృత్యాన్ని ఆ దృశ్యాలను మళ్ళీ నాకు సాక్షాత్కరింపజేసిన భగవానుడు ఎంత దయాళువు  అని పరిపరి విధాల స్తుతిస్తూ ఉన్నాడు. ఆనంద భాష్పాలతో శివ ప్రదోష స్తోత్రం బిగ్గరగా పఠించసాగాడు.
“ కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం
గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే
నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ
దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే

వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః
తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా
విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా
సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య
విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ
యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః
ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః”
స్తోత్రం ముగిసి పుష్యమిత్రుడు కళ్ళు తెరచి చూసే సరికి ఎదురుగా బాబాజీ నిలబడి ఉన్నాడు.
బాబాజి చరణాలపై వాలి గట్టిగా పట్టుకుని తనకు కలిగిన దివ్యానుభూతిని, ప్రదోషనృత్యహేలను బాబాజీకి వివరించాడు. మహదానందం పొందిన బాబాజీ "నాయనా! పుష్యమిత్రా!  నీకు ఆ పరమశివుని అనుగ్రహం సంపూర్తిగా ఉంది అంటూ ఒక్క సారి ఛాతీ పై చేయి ఉంచుకుని ఏవో మంత్రాలు ఉఛ్చరించాడు. ఎదురుగా ఒక పేటిక ప్రత్యక్షమయింది. దానిపై "सत्यमेव जयते" అని లిఖించబడి ఉన్నది. పుష్యమిత్రుడు ఆ  పేటికను పరీక్షగా చూశాడు. అది 8 అడుగుల పొడవు..3 అడుగుల వ్యాసార్ధం ఉన్న రాగి లోహంతో చేయ బడ్డ ఓ గొట్టంలా ఉంది.  బాబాజీ! ఈ పేటిక ఎందుకు? అని ప్రశ్నించాడు. బాబాజీ చిరునవ్వు నవ్వి "నాయనా! బయట హిమవన్నగం మొత్తం ఉధృతంగా విరిగి పడుతోంది. ఈ పేటికలో నీవు భగవదాజ్ఞ అయ్యే వరకూ యోగనిద్రలో ఉంటావు. నీకు ఏ ఆపదా రాదు.  నీవు ఈ పేటికలో కొన్ని సంవత్సరాలో లేక శతాబ్దాలో ఉండి ఈశ్వరేఛ్చ ప్రకారం మళ్ళీ  పేటికలో నుండి లేచి హిందూ దేశం పై సంచరించి వారిని ఉద్ధరించ వలసి ఉంది. ఆ తరువాత నీ కోరిక మేరకు నీకు భగవంతుడు స్వచ్చంద మరణం ప్రసాదిస్తాడు" అన్నాడు. పుష్యమిత్రుడు సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యాడు. ఈ పేటిలలో నేను జీవసమాధిగా ఉండాలా? నాకు ఆహారం గాలి ఎక్కడనుండి లభిస్తాయి? నేను అన్ని రోజులు బ్రతుకగలనా? అని అలోచనలో ఉండగా బాబాజీ ఆ అనుమానాలను అర్ధం చేసుకుని "పుష్యమిత్రా! నీకు గాలి నీరు అవసరంలేని స్థితిని కల్పిస్తాను. ఎన్ని శతాబ్దాలకు కూడా నీ దేహం చెక్కు చెదరని వరం ఇస్తాను. సంశయం వీడు" అన్నాడు.

బాబాజీ ధ్యాన శక్తితో ఊదారంగు వాయువును సృష్టించి పేటికలోమాత్రమే తిరిగేట్టు చేశాడు. "ఈవాయువు ప్రాణవాయువు కన్నా వేయిరెట్లు శక్తివంతమైనది. నీవు పీల్చి విడిచినప్పటికీ ఈ వాయువు బొగ్గుపులుసువాయువుగా మారని శక్తి కలిగి ఉంటుంది. ఇక నీకు ఆకలిదప్పులు లేకుండా బల, అతిబల మంత్రోపదేశం చేస్తున్నాను. ఈ శక్తి నీకు పేటిక తెరిచినదాకా మాత్రమే ఉంటుంది. ఒకసారి పేటిక చెరిచాక నీవు మామూలు మానవులతో సమానం అన్నాడు. వెంటనే పుష్యమిత్రుడు ఆచమనం చేసి పవిత్రుడైనాడు.   ఆనందంతో, వికసించిన  ముఖారవిందంతో  బాబాజీ నుండి బల, అతిబల  విద్యలను  గ్రహించాడు. "బలాతిబలయోహ్ విరాట్పురుష ఋషిః |గాయత్రీ దేవతా |గాయత్రీ చ్ఛన్దః అకార  ఓకార  మకారా బీజాద్యాః క్షుధాది నిరసనే వినియోగః |" అంటూ కరన్యాస అంగన్యాస పూర్వకంగా విద్యలను గ్రహించాడు. ఒక్కసారి "అమృత  కర తలార్ద్రౌ   సర్వ  సంజీవనాఢ్యా  అవఘహరణ    శుద్క్షౌ  వేద సారే మయూఖే| ప్రణవమయ   వికారౌ    భాస్కరాకార    దేహౌ   సతతమనుభవేహం తౌ బలాతీబలేశౌ ||"అంటూ ధ్యాన శ్లోకం పఠించాక పుష్యమిత్రునికి ఏదో దివ్యశక్తి లభించినట్లైంది.
"నాయనా! పుష్యమిత్రా! దీనిలో పవళించు" అన్నాడు. పుష్యమిత్రుడు మంత్రముగ్ధుడై లోపల పవళించాడు. బాబాజీ ఏవో మంత్రాలు పఠించి దాన్ని మూసేశాడు. ఎక్కడనుండో ఒక మెరుపుతీగ వంటి కాంతి పుంజం దానిపైబడి పేటిక మొత్తం ఒక నాళికలా తయారయింది. బాబాజి మళ్ళీ ఏవో మంత్రాలు పఠించగా గుహకు అడ్డుగా ఉన్న బడరాయి తెరుచుకుంది. ఆ నాళిక గాలిలో తేలుతూ హిమాలయాలవేపుకు సాగిపోయింది.  (సశేషం).

No comments:

Post a Comment

Pages