Thursday, November 23, 2017

thumbnail

పురుషుండని శ్రుతి వొగడీనట

పురుషుండని శ్రుతి వొగడీనట 
డా.తాడేపల్లి పతంజలి


అర్థ తాత్పర్య విశేషాలు-
॥పల్లవి॥
పురుషుండని శ్రుతి వొగడీనట ఆ పురుషుడు నిరాకారమట
విరసవాక్యము లొండొంటికి నివి వింటే నసంబద్ధములు 
001.మొగమున బ్రహ్మలు మొలచిరట ఆ మూరితి అవయవరహితుడట
తగు బాహువులను రాజులట ఆ తత్వమే యెంచగ శూన్యమట
పగటున తొడలను వైశ్యులట ఆ బ్రహ్మము దేహము బయలట
అగపడి పాదాల శూద్రులట ఆతని రూపము లేదట ॥పురు॥
002.తన వందనమును గలదట దైవము తనుజూడగన్నులు లేవట
తన విన్నపమునుజేయునట ఆతనికిని వీనులు లేవట
తన యిచ్చినదే నైవేద్యంబట దైవము నోరే లేదట
తన యిచ్చేటి ధూపంబును గలదట దైవము ముక్కును లేదట ॥పురు॥
003.అంతాదానే దైవమటా యజ్ఞము లొరులకుజేయుటట
సంతతమునుదా స్వతంత్రుడటా జపముల వరముల చేకొంటట
చింతింపఁ దానే యోగియటా చేరువ మోక్షము లేదట
పంతపు శ్రీవేంకటపతిమాయలు పచారించిన వివియట ॥పురు॥
(తాళ్లపాక అన్నమాచార్య  అధ్యాత్మ సంకీర్తన రేకు: 154-1 సంపుటము: 2-252)
అర్థ తాత్పర్య విశేషాలు
॥పల్లవి॥
ఒక ఆకారము కలిగిన పరమాత్మ అని (పురుషుండని)  వేదము(శ్రుతి) పొగుడుతుందట.
కాని ఆ పరమాత్మ  ఆకారములేని వాడట( నిరాకారమట) 
ఇవి ఒకదానికొకటి విరుద్ధమైన వాక్యములు.
ఇవి వింటే  సంబంధములేని, పరస్పరాన్వయము లేని (అసంబద్ధములు) వాక్యములుగా అనిపిస్తాయి.
001.
ఆయన ముఖమనే అవయవములో   బ్రాహ్మణులు పుట్టారట.
కాని  ఆ  పరమాత్మ స్వరూపము(మూరితి) అవయవాలు లేనిది.
అతని ఒప్పయిన(తగు)  భుజములలో (బాహువులను) క్షత్రియులు పుట్టారట( రాజులట ) కాని అసలు ఆ పరమాత్మే(తత్వమే) చూడగా (ఎంచగ) ఏమి ఆకారములేనివాడట( శూన్యమట) ఆ పరమాత్మ ప్రకాశించే (పగటున )తొడలలో  వైశ్యులు పుట్టారట.
కాని  ఆ   పరమాత్మ (బ్రహ్మము) శరీరము ( దేహము)  శూన్యమట(బయలట) కనబడే (అగపడి)  పాదాలలో  శూద్రులు పుట్టారట. కాని  ఆతనికి  రూపమే  లేదట ఇవి వింటే  సంబంధములేని, పరస్పరాన్వయము లేని వాక్యములుగా అనిపిస్తాయి.

002.
ఆ  దైవానికి నమస్కారము కలదట. 
కాని అతనికి కన్నులు లేవు.
తను అందరి విన్నపములు వింటాడట
కాని అతనికి  చెవులు లేవట.
తనకు భక్తులు ఇచ్చినదానిని  నైవేద్యమంటారు.(నివేదింపదగిన వస్తువు)
కాని ఆ  దైవానికి  నోరే లేదట.
తనకు  ధూపాన్ని (వాసనల పొగ) ఆస్వాదించే శక్తి ఉన్నదట. 
కాని ఆ దైవానికి  ముక్కు లేదట ఇవి వింటే  సంబంధములేని, పరస్పరాన్వయము లేని వాక్యములుగా అనిపిస్తాయి.
003.
ప్రపంచములో అంతటా వ్యాపించిన దైవము తానే అట.
కాని  యజ్ఞములు ఇతరులకు చేస్తాడట. 
ఎప్పుడు (సంతతమును) తాను  స్వతంత్రుడట కాని  జపములు వరములు గ్రహిస్తాడట.  (వరముల చేకొంటట). ఆలోచింపగా (చింతింపన్) తానే యోగియట దగ్గరలో ( చేరువ)  మోక్షము లేదట.
శ్రీవేంకటపతి మాయలు ఇలా చిక్కుల  పంతముతో వ్యాపించిన (పచారించిన) స్వభావము కలిగినవి.  
విశేషాలు
యజ్ఞము
దేవతాప్రీతిగా చేయు అగ్నిహోత్ర కార్యం యజ్ఞము.
ఇది 21 రకాలు.
సప్త పాక యజ్ఞాలు, సప్త హరి యజ్ఞాలు, సప్త సోమసంస్థలు.
స్మార్తాగ్నిలో చేయు యజ్ఞములు పాక యజ్ఞములు.
స్మార్తాగ్ని, ఔపాసనాగ్ని కలిగినవి  హరి యజ్ఞాలు
సోమసంస్థలు శ్రౌతాగ్నిలో చేస్తారు.
సోమరహితములు హవిర్యజ్ఞాలు. ఈ యజ్ఞాలు నిత్యాలు. అశ్వమేధము, రాజసూయము, పౌండరీకము, బృహస్పతిసవము మొదలయినవి అభ్యుదయక యజ్ఞాలు  యజ్ఞవిధాన వివరణ ఆపస్తంబసూత్రములో ఉంది. 
తప్పనిసరిగా చేయవలసిన యజ్ఞాలు అయిదు అవి దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము, బ్రహ్మయజ్ఞము.
దేవయజ్ఞము అనగా ఔపాసనము. ఇందులో సూర్యాగ్నులను పూజిస్తారు.
పితృయజ్ఞము శ్రాద్ధతర్పణములు. ఇందులో  పితృదేవతలను పూజిస్తారు. 
భూతయజ్ఞము బలిరూపములో ఉంటుంది. 
మనుష్య యజ్ఞము అనగా ఎవ్వరికైనా భోజనము పెట్టుట. 
బ్రహ్మయజ్ఞము అనగా వేదాధ్యయనము. ఒక్క ఋక్కు అయినను ప్రతిదినము చదవాలి..
ఋగ్వేదదశమమండలములో ఈ సుప్రసిద్ధఋక్కు ఉంది.
బ్రాహ్మణోస్య ముఖమాసీత్‌/బాహూరాజన్యః కృతః/ఊరూతదస్య యద్వైశ్యః/సద్భ్యాం శూద్రో అజాయత(బ్రాహ్మణుడు పరమాత్మ  ముఖమయ్యాడు. క్షత్రియుడు  దేవుని బాహువు లయ్యాడు; వైశ్యుడు పరమాత్మ ఊరువులు. శూద్రుడు స్వామి పాదములనుండి పుట్టాడు.)
అన్నమయ్య దీనిని మొదటి చరణంలో ప్రశ్నించాడు. ఆకారమే లేని వాడని ఒక పక్క దేవుని గురించి చెబుతూ, ఇంకొక పక్క ఆయాయా అవయవాలనుండి  పేర్కొన్నవాళ్ళు ఎలా పుట్టారని కవి ప్రశ్న.దీనికి జవాబు కూడా అన్నమయ్యే “మాయ” అని చివరి  చరణంలో చెప్పాడు.
భగవంతుని మాయ ఉన్నంతవరకు ఈ సమన్వయాలు  కుదరవు. ఆయన అనుగ్రహంతో జ్ఞాన శిఖరాన్ని చేరినప్పుడు- మాయ తొలగినప్పుడు-  అంతా ఒకటే –- అను సమన్వయం బోధపడుతుంది.ఇదే ఈగీతంలోని ఆంతర్యం.స్వస్తి.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information