నల్లజర్ల రోడ్డు - అచ్చంగా తెలుగు

నల్లజర్ల రోడ్డు

Share This
నాకు నచ్చిన కథ- నల్లజర్ల రోడ్డు

కౌండిన్య


తిలక్ గా అందరికీ సుపరిచిమైన శ్రీ బాలగంగాధర తిలక్ గారు రాసిన ‘అమృతం కురిసిన రాత్రి’ వచనా కవితా సంపుటి ఆధునిక తెలుగు సాహితీ చరిత్రలో ఓ అద్భుతమైన రచనగా పేర్కొనవచ్చును. దీనిలోని కవితలు ఎందరో కవులకు  ప్రేరణ కలిగించడమే కాకుండా, ప్రతీ పాఠకుడి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తిలక్ గారు కవితలో పాటు కథలు, లేఖలు, నాటికలు, నాటకాలు, ఛందస్సు తో కూడిన పద్యాలు లాంటి వివిధ సాహితీ ప్రక్రియలలో రచనలు చేసారు. ఆయన రాసిన కథలు ‘తిలక్ కథలు’ అనే పేరుతో వెలువడింది. దీనిలో ప్రతీ కథ ఓ ఆణిముత్యం. ఈ కథలలో ప్రత్యేకంగా రెండు కథలు అత్యద్భుతమైనవి, ఆధునిక సాహిత్యంలో ఓ ప్రత్యేక స్థానానికి నోచుకున్నాయి. తిలక్ గారి రచనలు రమ్యమైన శైలితో కూడి, మంచితనం, మానవత్వం గుభాళిస్తూ, కథలలో ప్రతీ సన్నివేశము ఆసక్తిగా, కళ్ళకు కట్లినట్లుగా ఉంటాయి. ప్రతి కథలోని వాక్యాలు కవిత్వంతో మిళితమై పరిసరాలను, పాత్రధారుల వేషధారణను అద్భుతంగా వర్ణిస్తూ, పాఠకుల దృష్టిని కథాంశంపై సారిస్తూ, ఆలోచనలను ప్రేరేపిస్తూ, విభిన్న అంశాలతో చదువరులకు ఓ చక్కటి అనుభూతిని కలిగిస్తారు. తిలక్ గారి రచనలలో కారుణ్య భావానికి ఓ ప్రత్యేక స్థానం కలిగించారు అందుకే ఆయన తన ఓ కవితలలోని  అక్షరాలన్నీ దయాపారావతాలు గా వర్ణించారు. ఆయన రాసిన కథలలో నాకు నచ్చిన కథ - నల్లజర్ల రోడ్డు. ఇక్కడ ఈ కథను చదువరులకు క్లుప్తంగా పరిచయం చేయదలుచుకున్నాను.
ఈ కథ ఓ రాత్రి జరిగిన సంఘటన గురించి అవధాని అనే పాత్రధారుడు “నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు’  అంటూ కథకుడు, ఇంకో ఇద్దరితో చెప్పడంతో మొదలవుతుంది. ఈ అవధాని గారు పెద్దవయస్కుడు, సూటి మనిషి, బాగా డబ్బు, పరపతి ఉన్నవాడని కథకుడు మనకు తెలియజేస్తాడు. నలుగురి మధ్య సంభాషణల సన్నవేశం ఊరికి దూరంగా ఉన్న బంగళా లోని తోటలో కరెంటు పోయినపుడు కొవ్వొత్తి వెలుగులో జరుగుతుంది. ఆచారి అనే పాత్రధారునికి చీకటి అంటే భయం, నారాయణ అనే అతను అవధాని గారు బంగాళాలో ఏర్పాటు చేసిన విందుని పొగుడుతూ, సంభాషణ అవధాని గారు చెబుతున్న ఆ రాత్రి జరిగిన సంఘటనపై కేంద్రీకరించేలా ఆయన దృష్టిని మళ్ళనపుడుల్లా ఆ కథనం వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. అవధాని గారు చెబుతున్న సంఘటన ఆయనకు పద్దెమిది ఏళ్ళ వయసులో జరిగిన సంఘటన, ఇది నల్లజర్ల అడవిలో ఒక్క రాత్రిలో జరిగిన కథనంతో అసలు కథ మొదలవుతుంది. ఈ కథ గతంలోకి మరియు ప్రస్తుతం వారు ఆ తోటలో జరిగే సంభాషణలకు వెనక్కు, ముందుకు వస్తూ జరుగుతుంది. 
ఈ అసలు కథలో ఓ ఆరు పాత్రలు ఉన్నా, కథ మొదటి పేజీలో నాలుగు పాత్రలు పరిచయం  జరుగుతుంది. పద్దెనిమిది ఏళ్ళ వయస్కుడైన అవధాని తో పాటు, ఆయన వేలివిడిచిన మామగారైన నాగభూషణం మరియు ఆ ఊర్లో పెద్ద టెన్నిస్ ఛాంపియన్ రామచంద్రం అనే ముగ్గురు కలిసి ఏలూరులో పని చూసుకొని, ప్లీడర్లు గారు ఆ రాత్రికి పడుకోవటాని సౌకర్యాలు ఏర్పాటు చేస్తానన్నా వినకుండా, తరువాత రోజు తణుకు లో కలెక్టర్ గారి ఇంట్లో తెల్లవారుజామున శుభకార్యానికి చేరుకోవాలని రామచంద్రం ఫోర్డు కారులో బయలుదేరుతారు. ఓ ఆరు మైళ్ళు ప్రయాణించగానే కారు ఆగుతుంది. నాగభూషణం ఆగిన కారును ఆక్షేపిస్తుంటే, ఆ కారంటే రామచంద్రానికి  ఎంత అభిమానమో తెలియజేయటానికి తిలక్ గారి వాక్యాలను చదివితే తెలుస్తుంది “అర్జునుడు గాండీవాన్ని తిట్టినా సహిస్తాడేమో కానీ యీ కారును తిడితే మాత్రం నేనూరుకోను. అసలీ యింజనులాంటిది ఇండియాలోనే వుండదు” అంటాడు రామచంద్రం.
రామచంద్రం బలంగా, హుషారుగా ఉంటాడు. కాలువ ఒడ్డున ఓ పెద్దమేడలో భార్య, కుమారుడు తో నివసిస్తూ ఉంటాడు, డబ్బు మీద ప్రేమగలవాడు. పెద్ద చదువులు చదివిన నాగభూషణం ఊర్లో  కలప వ్యాపారస్థుడు, పరపతి కలవాడు . ఊళ్ళో కలెక్టరు వచ్చినా, మంత్రి వచ్చినా ఆయనింట్లోనే మకాం చేస్తారు. మళ్ళీ కథలోకి వస్తే ఆగిపోయిన కారు బోనెట్ తీసి రామచంద్రం రిపేరు చేసి మళ్ళీ బయలుదేరుతారు. ఆ ప్రయాణంలో టెన్నిస్ గురించి, అవధాని చదువుల గురించి సంభాషిస్తూ “దోబిచెర్ల” చేరుతున్నామని రామచంద్రం అంటాడు.
తిలక్ గారి ప్రత్యేకత ఏమిటంటే ప్రదేశాలని తన రమ్యమైన శైలితో , ప్రతీ వాక్యాంలో కవిత్వం అంతర్లీనం చేస్తూ, అద్భుతమైన వర్ణణతో , అక్కడ ఉన్న మనుషుల వేషధారణ చెబుతూ పాఠకులను ఆ సన్నివేశంలో భాగస్వాములయ్యేలా చేస్తారు. కారు ఆగిపోయిందని అక్కడికో అవధాని గారు ఆపి గతం గుర్తుకు తెచ్చుకుంటూ  దోబిచర్ల గూర్చి చెబుతున్నట్లు చెప్పిస్తూ తిలక్ గారు ఆ కాలం స్థితిగతులు,  మనకు తెలియజేయస్తారు.  
అవధాని గారు వారితో ఆ ప్రదేశానికి కాల పరిస్తితుల వ్యత్యాసం ఎలా జరిగిందో వివరిస్తూ “ఉమ్మడిగా భూస్వామ్య వ్యవస్థ మీదకు పారిశ్రామిక విప్లవమూ సైన్సు పరిణామ ప్రయోజనమూ దాడి చేసినపుడు పాతని విచ్ఛిన్నం చేస్తూ నవలోకం కఠోరంగా స్థిరపడుంది. ఈ తీవ్ర వేగానికి తట్టుకోలేక మనుష్యులు సమాజమూ తమ చుట్టూ గోడలను కట్టుకొని లోపల దాక్కుంటారు” అంటారు.  ఆ సంఘటన నుండి వేరే సబ్జెక్టు అవధానిగారు వెళ్ళినపుడు నారాయణ మళ్ళీ “మీరు కథను ఆపుచేసారు” అంటు ఉపన్యాస ధోరణిని ఆపించడంతో కథనం ముందుకు నడుస్తుంది.  ఆ తోటలో ఉన్న కొవ్వొత్తులలో ఒకటి అయిపోవడంతో ఆచారి గారు వణుకుతూ “నాకు చీకటంటే పడదు” అని చెప్పడం, మిగతా వారు హేళణ చేయడం లాంటి వాటితో రక్తికట్టిస్తూ మళ్ళీ అవధాని గారు చెప్పడం మొదలుపెట్టి ఆ కారు మళ్ళీ  దోబిచర్ల లో ఆగిపోయిందని చెబుతారు.
మళ్ళీ రామచంద్రం కారులోంచి దిగి నాగభూషణం అపశకునం వల్లే తన అభిమానవతి అయిన ఆ ఫోర్డు కారు మారం చేస్తోందంటూ, బోనెట్ తీసి సరిగా కనపడక అక్కడ చుట్టలు కాలుస్తూ కూర్చున్న ఆసామిలను పిలిచి అగ్గిపుల్ల అడిగి వెలిగించి మరమత్తు చేయడం మొదలు పట్టి బాగు చేసి బయలు దేరబోతారు. ఆసాములు దట్టమైన అడవిలో చిరుతపులి కనపడింది అంటూ జాగ్రత్త లు చెప్పి సాగనంపుతారు. అవధాని చిన్నవాడు కావడంతో ఆ అడవిలోని క్రూరమృగాలంటే భయం పట్టుకుంటుంది, “ఇక్కడ తిలక్ గారు రోడ్లు, టెలీగ్రాఫ్ తీగలు, పోలీసుల లాంటివి రావడం వల్ల అడవులలో క్రూృరమృగాలన్నీ ఎలా మాయం అవుతున్నాయో” వాటిని కాపాడుకోవాలన్న సందేశం కనిపిస్తుంది  . భయపడుతున్న అవధానితో అడవి వచ్చేసింది, ఇంకో పదిహేను మైళ్ళు దాటితే  తణుకు అని  రామచంద్రం అంటూ ఉండగానే టప్ అన్న శబ్ధంతో మళ్ళీ కారు కటికి చీకటిలో ఆగుతుంది. 
మళ్ళీ రామచంద్రం చీకటిలో సరిగా కనపడకపోయినా మరమ్మత్తు మొదలు పెడతాడు. అవధాని కి భయంతో నాగభూషణం అపశకునాలతో సంభాషణలు సాగిన తరువాత రామచంద్రం “ఇక కారు మరమ్మత్తు కుదరదు రాత్రంతా ఇక్కడే గడపాలి” అంటాడు. నాగభూషణం మళ్ళీ ప్లీడరు గారు రాత్రికి ఉండిపోమన్నా బయలుదేరిన సంగతి రామచంద్రానికి గుర్తుచేయడం తో విసుగొచ్చి ఓ ఆఖరి ప్రయత్నం చేస్తాను ఓ పెద్ద కర్ర కావలంటూ దగ్గర ఉన్న పొదల్లోకి వెళ్ళడం జరుగుతుంది. కారులో ఉన్న అవధాని లో నిస్సహాయత, అసహనం ఎక్కువ చూసి నాగభూషణం సర్ధిచెప్పేలోగా హఠాత్తుగా “భూషణం పాము పాము” అన్న విహ్యలమైన కేకతో నాగభూషణం పొదల దగ్గర రామచంద్రం కూలబడటం చూస్తాడు.రెండు చేతులతో పొదివి పట్టుకొని తనను పట్టుకున్న రామచంద్రాన్ని కారు వెనుక సీటులో పడుకోబెట్టి కండువా తీసి కాలి మీద బిగించి భయపడకు అని హెచ్చరిస్తాడు. రామచంద్రం పడే ప్రాణ భయం వివరిస్తూ తిలక్ గారు “రామచంద్రం కళ్ళలో భయం సుళ్ళు తిరిగింది. ప్రాణం స్వరక్షణార్థం వెర్రిగా అరుస్తూ నరనరాల్లో, కళ్ళల్లో, గుండెలో పరుగులెడుతోంది. ఆప్రాణం యొక్క ప్రథమ వివేకం “నేను” అన్న అహమిక నేను అనుకుంటే ఆ ప్రాణం ఏడుస్తుంది, మొరపెట్టుకుంటుంది” అంటారు. నాగభూషణం అటు ఇటూ చూసాడు ఎవరూ లేరు, రెండు చేతులూ పైకెత్త ప్రార్థిస్తూ జోడించాడు. రామచంద్రం నురగలు కక్కుతూ భార్యను గుర్తుచేసుకొని నిస్పృహలోకి జారి పోయాడు. అది చూసి అవధాని కూడా మూర్చపోతాడు. అక్కడున్న పరిస్థితిని వివరిస్తూ తిలక్ గారు ఇక్కడ “పట్టణంలో సుఖజీవితానికి, నౌకర్లకు, అబద్దాలకు, భేషజాలకు అలవాటైన కృత్రిమ సుకుమార జీవులకు యింతకన్నా ఆపద ఏముంది?” అంటారు
నాగభూషణం దుఃఖం  పొరలు పొరలుగా వస్తూ మాట పెగలక తేరుకున్న అవధాని తో “మనంకూడా చచ్చిపోతాం రా, దిక్కుమాలిన చావు చస్తాంరా. మనకెంత గతి పట్టిందిరా” అంటూ ఏడుస్తుంటే అవధాని” రామచంద్రాన్ని వదిలేద్దాం ఎలాగూ చచ్చిపోయాడుగా” అంటాడు. నాగభూషణం ఆలోచనలో పడి “అవునూ చచ్చే రామచంద్రం కోసం ఇద్దరు ఎందుకు చావాలి?” అంటూ మళ్ళీ  అన్ని మైళ్ళు పరిగెత్తగలమా? అంటుంటే అవధాని కి “ఆ నిమిషంలో స్వార్థంకన్నా గొప్పశక్తి ప్రపంచంలో లేదు” అని తొచుతుంది. తిలక్ గారు స్వార్థం గురించి ఎంత గొప్ప మాట అంటారు అది విని దానిలో ఆర్ధ్రత కనిపించి మన కంటితడి తెప్పిస్తాయి.
కొంతసేపటిలో మువ్వల చప్పుడు వినిపించడంతో దెయ్యాలేమో అన్న భయంతో ఉండగా “నేను సిద్దయ్యని బాబు. పామువాణ్ణి” అని పరిచయం చేసుకుంటాడు సిద్దయ్య. ఇది దైవ సంకల్పమేనని కారులోంచి దూకి సిద్దయ్య చేతులు పట్టుకొని “నీకు మంత్రం వచ్చునా? మా వాడికి పాము కరిచి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు” అంటాడు. చూసి “బ్రతికే ఉన్నాడు బాబయ్య” అంటాడు. “నువ్వే రక్షించాలి సిద్దయ్యా,  మంత్రం వేసి బ్రతికించావా నీకు సగం ఆస్తి రాసిస్తానంటాడు”. “నా పాకలోకి తీసుకురండి బాబు, మీరిద్దరూ మోయాలి” అంటూ పాకలోకి తీసుకెడతారు.
పాకలో మంచం మీద నిదురిస్తున్న యువతిని “సూరీడు లే లే” అంటూ తట్టి లేపి రామచంద్రాన్ని పడుకొపెడతారు. సిద్దయ్య కూతురు  “ఈ అయ్యకి పెదాలు నల్లబడి పోతున్నాయి బాబు” అనడంతో “సిద్దయ్య, త్వరగా మంత్రం వేయి ఆలశ్యం చేయకు” అంటూ కేకలు పెడతాడు నాగభూషణం. సిద్దయ్య నిరుత్సాహంతో “కావల్సిన వేరు ముక్క లేదు బాబు ఉందనుకున్నాను” అంటాడు. “యిప్పుడెలాగా?” అని ప్రశ్నిస్తాడు. “శానాదూరం రెండువందలు మూడువందల గజాల దూరంలో వెలగ చెట్టు దగ్గర వేరుగల మొక్కలు ఉన్నాయి కానీ పాము పుట్టలు ముళ్ళ పొదలు జాస్తిగా ఉంటాయి, పైగా నాకు చూపు ఆనదు బాబు” అంటాడు సిద్దయ్య. నాగభూషణం కాళ్ళు పట్టుకొని జేబులోంచి డబ్బులు తీసి ఎంతైనా తీసుకో నువ్వే ప్రాణభిక్ష పెట్టాలంటాడు. సిద్దయ్య కోపంతో “ముందు డబ్బు తీసి లోపల పెట్టుకో బాబు ఆశ పడ్డానా మంత్రం పనిచేయదు” అంటాడు. “పోనీ.. నేను తీసుకురానా బాబయ్య” అని సూరీడు అనడంతో “వద్దు ప్రమాదం సూరీడు. పాములు పుట్టలు అమ్మో” అంటాడు. “ఈ అయ్య చచ్చిపోతుంటే” అంటూ వెళ్ళొస్తాను జుట్టు ముడి వేసుకొని దూసిన బాణంలా వెడుతుంది. 
గుడిసెలో ఒక్కో నిమిషం బలవంతంగా గడుస్తోంది. “ఈ లోగా వట్టి మంతమైనా వేస్తాను బాబు” అంటూ సిద్దయ్య మంత్రం వేస్తుంటాడు ఇంతలో కొంతసేపటిక సూరీడు తలుపు తోసుకోని లోపలికి ప్రవేశిస్తుంది. మొహం మీద చేతుల మీద గీరుకుపోయి ఆయాసపడుతూ “బాబు తెచ్చాను” అంటుంది. మంత్రం వేస్తున్న. సిద్దయ్య సైగలతో సూరీడు అరగతీసి కంట్లో, నోట్లో పెట్టి అతని అరిపాదాల్ని ఒళ్ళో పెట్టుకొని రాస్తుంది. కొంత సేపటికి మంత్రం పనిచేసి “బాబు బతికాడు యీ అయ్య” అంటాడు సిద్దయ్య. “ఇదంతా నీ చలవ సూరీడు” అంటూ నాగభూషణం కాళ్ళ మీద పడతాడు. “తప్పండీ బాబు” దూరంగా లేచి వెడిపోతుంది. 
అడవిలో చచ్చిపోతారనుకున్న వారికి గుడిసెలో సుఖాంతం అవుతుంది. “బతికావురా రామచంద్రం. తెల్లవారే సరికే పెళ్ళికి వెళ్ళచ్చు నువ్వు లేక పోతే అక్కడ కథే లేదు” అంటాడు నాగభూషణం. తరువాత  సిద్దయ్య వాళ్ళని ఆ రాత్రికి ఆ గుడిసెలో పడుకోమని చెప్పడం, సూరీడు సంగతులు అడిగి తెలుసుకోవడం, తను నాలుగు నెలల గర్భిణి అని కూడా సిద్దయ్య చెప్పడం జరుగుతుంది సిద్దయ్య.  “మేము నడ్డి వాలుస్తాము, మీరు పడుకోండి బాబయ్య” అంటూ గుడిసె బయటకు వెడుతుంటే నాగభూషణం “నీ ఋణం ఎలా తీర్చుకుంటానో తెలియదు. డబ్బు తీసుకోనన్నావు”అంటాడు. “మీ దయ ఉంటే చాలు బాబు, నేను అవతల పడుకుంటాను” అంటాడు. “వద్దు బాబు చలి వేస్తది” అంటుంది సూరీడు. “కంబళి కప్పుకొని పడుకుంటాను. నువ్వు పడుకో” అంటాడు. నాగభూషణం ఆవలిస్తూ సిద్దయ్యను ఒకవేళ మెలుకువ రాకపోతే లేపమంటాడు. ఆ చిన్న గుడిసెలో సూరీడు రామచంద్రం పక్కనే పడుకుంటుంది, అది చూసి నాగభూషణం అవధానితో “చూసావా వీళ్ళకి నీతిలేదు ధర్మం లేదు” అంటాడు. ఇక్కడ నాగభూషణం ఆలోచనలు ఎంత వక్రంగా ఉన్నాయో తెలుస్తుంది. ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి త్యాగం చేసిన మనిషి, పైగా ఏ కల్మషము లేకుండా ఆ ఉన్న చిన్న ప్రదేశంలో పరాయ మగవాడి వద్ద పడుకోవడం చూసి, సంస్కారం మరిచి వక్రబుద్ది తో ఆలోచించేవారు లేకపోలేదన ఈ లోకంలో అంటూ చక్కగా చెప్పారు రచయిత.
అంతేకాకుండా సుమారు ఓ గంట తరువాత అవధాని కి ఎవరో కదిలిన చప్పుడు వినిపించి కళ్ళు తెరిచి చూస్తాడు. నాగభూషణం లేచి సూరీడు వంటి మీద చెయ్యి వేసి లేపి జేబులోంచి డబ్బు తీసి “నా మనసు తీర్చు - ఇదిగో డబ్బు” అంటాడు. సూరీడు చిన్నగా నవ్వి “ నేనలాంటిదాన్ని కాదు బాబు.  పోయి పడుకోఅయ్యా. నవ్వుతారు కూడా” అంటుంది. నాగభూషణం అవధాని వైపుకు విన్నడేమో నని అనుమానంగా చూస్తూ పక్కకి వచ్చి పడుకుంటాడు. అవధాని నవ్వాపుకుంటాడు. డబ్బుతో ఏమైనా కొనవచ్చు అన్న నాగభూషణం నీచపు బుద్దికి ఇది అద్దం పడుతుంది..
తెల్లవారు జామున లేచి “సిద్దయ్య నువ్వేమి తీసుకోవట్లేదు నాకు తృప్తిగా లేదు” అంటాడు నాగభూషణం. “మంత్రం బెడిసికొడుతుదయ్యా” అంటాడు. సిద్దయ్య , కూతురు సూరీడు నడుస్తుంటే వెనకాల వెడతారు. రోడ్డుమీదకి వచ్చి నిలుచుంటారు. సిద్దయ్య, కూతురు” ఇక మేము వెళ్ళివస్తాం బాబయ్య” అని సెలవు తీసుకొని బయలు దేరతారు. 
బస్సు కోసం వేచి చూస్తూ మాటలలో “బాబయ్యా” అంటూ కీచుగా కేక వినిపిస్తుంది. సూరీడు పరిగెత్తుకు వస్తూ “బాబూ మా అయ్యని పాము కరిచింది. ఒక్క సారి రండి బాబు” అంటూ వగరుస్తుంది సూరీడు. “వేరు ముక్క కోసం చెయ్యి పెట్టి పీకబోయాడు బాబు. బుస్సున లేచి కాటేసింది”దీనంగా రమ్మని అడుగుతుంది. 
“ఎలాగా! ఈ బస్సు దాటిపోతే కలెక్టర్ గారి పెళ్ళికి ఎలా వెళ్ళడం? పైగా రిసెప్షన్ అంతా నేనే చూసుకుంటానని చెప్పాను” అంటాడు రామచంద్రం. “అయినా వెళ్ళి మనమేం చేయగలం” అన్నాడు నాగభూషణం  “అదిగో బస్సు వస్తోంది” అనంటూ  భూషణం చెయ్యి ఎత్తి ఆపమని సంజ్ఞ చేస్తాడు రామచంద్రం. బస్సు ఆగుతుంది. “త్వరగా ఎక్కండి” అన్నాడు కండక్టర్. నోట్లు జేబులోంచి తీసి సూరీడు చేతిలో పెట్టి” మేవుండి మాత్రం ఏం చేయగలం సూరీడు. మంత్రం వచ్చునా తంత్రం వచ్చునా? అవతల కలెక్టర్ గారింట్లో పెళ్ళి. ఈ డబ్బుతో ఎక్కడికైనా వెళ్ళి చూపించు మీ బాబుని”  అని బస్సు ఎక్కాతాడు.. గుడ్లప్పగించి చూస్తూ నిలబడింది సూరీడు, చల్లగాలిలో పదిరూపాయల నోట్లు పావురాలలా పల్టీలు కొట్టాయి”
ఇదీ నల్లజర్ల అడవిలో ఆనాటి సంగతి అన్నాడు అవధాని గారు. “కొవ్వొత్తి ఆరిపోయింది. ఎలాగా?” అన్నాడు ఆచారి.  “సిద్దయ్య  చచ్చిపోయాడా?” అని అడుగుతాడు కథకుడు. 
“మనకేం తెలుసు” అన్నాడు అవధాని గారు “సూరీడు ఏమయిందో కూడా తెలీదు” అన్నాడు.
లైట్లు రావడంతో ఆచారి ఆనందంతో నవ్వాడు. “డ్రైవరు రాగానే వెడదాం” అన్నాడు నారాయణ. అవధాని గారు ఇంకా ఆలోచిస్తున్నారు.

ఇదండీ కథ. ఈ కథలో మంచి చెడు కలిపి చూపిస్తూ,డబ్బు, పరపతికి అలవాటై మానవత్వాన్ని మరిచిన మనుషులు, ఇలాంటి వారి మనస్తత్వం అర్థం కాక నిర్ఘాంతపోయే ఇంకో రకం మనుషులు గురించి చదువుతుంటే జాలి, ఆశ్చర్యం వేస్తుంది.. చావుబతుకులలో ఉన్న వారు తమకు సహాయం చేసి గట్టెక్కించిన వారు అదే పరిస్తితిలో ఉన్నారని తెలిసి కూడా వాళ్ళని పెడచెవినపెట్టడం చూస్తే గుండెతరుక్కుపోతుంది. అదే తిలక్ గారి ప్రత్యేకత. ప్రజాకవిగా అన్నీ భావనలను సమన్వయం చేస్తూ అద్భుతమైన కథలు రాసిన తిలక్ గారి కథలను మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది, కథలో చివరలో ఏమయ్యిమటుందో అని పాఠకులను ఊహల పల్లకీలో విహరింపజేస్తుంది.
ఈ కథ మొత్తం పది పన్నెండు పేజీల కథ కుదించి కొంత తిలక్ గారి మాటల్లోనే రాయల్సివచ్చింది. తప్పక చదివి తీరవలసిన కథ, మీరు తప్పక చదువుతారని ఆశిస్తున్నాను.
 ***
 

No comments:

Post a Comment

Pages